
'లోకేశ్, చినరాజప్ప ఫొటోపై చర్చ'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో పాలన అస్తవ్యస్తంగా తయారైందని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. స్విస్ చాలెంజ్ పై కోర్టు ప్రశ్నిస్తే చంద్రబాబు ఏకంగా చట్టాలను మారుస్తున్నారని ఆరోపించారు. చట్టాలను మార్చుకుని ఏం చేసినా చెల్లిపోతుందనుకుంటున్నారా అని ప్రశ్నించారు. శుక్రవారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఏ చట్టమైనా లోబడి ఉండాలని తెలియదా అని అడిగారు.
విదేశీ కంపెనీల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో డబ్బు సంచులు పంచిన వారికి ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారని ధ్వజమెత్తారు. అన్ని శాఖలను అవినీతిలో ముంచేశారని దుయ్యబట్టారు. ఇంత అవినీతి చేసినా ధనదాహం తీరలేదా అని సూటిగా ప్రశ్నించారు. రెండున్నరేళ్లలో ఒక ఇల్లు కూడా కట్టలేదని అన్నారు. భారీ వర్షాలు వస్తే మంత్రులు కనీసం పర్యటించలేదని విమర్శించారు.
సీఎం తనయుడు నారా లోకేశ్ ప్రభుత్వాన్ని శాసిస్తూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లోకేశ్ ముందు డిప్యూటీ సీఎం చినరాజప్ప వణికిపోతూ మాట్లాడుతున్నారని, ఇక ఆయన మాటలు పోలీసులు ఏం వింటారని అన్నారు. లోకేశ్, చినరాజప్ప ఫొటోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో పాలన ఎటుపోతోందని బొత్స సత్యనారాయణ పశ్నించారు.