
సాక్షి, అమరావతి: గవర్నర్ ప్రసంగంపై చర్చలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఎమ్మెల్సీ వరుద కళ్యాణి ప్రసంగాన్నిఅడ్డుకునేందుకు మంత్రులు ప్రయత్నించారు. ఆమె ప్రసంగాన్ని మంత్రి నారా లోకేష్ అడ్డుకున్నారు. నాలుగు లక్షల ఉద్యోగాలు చెప్పలేదంటూ మంత్రి నారా లోకేష్ వాదించారు. గవర్నర్ ప్రసంగంలో కల్పించినట్టు రాశారని వరుదు కళ్యాణి అన్నారు. తాము ఇంగ్లీష్ స్పీచ్‌లో ఉన్నదే చెప్తామంటూ మంత్రి లోకేష్ వితండ వాదం చేశారు.
మంత్రులు మాటిమాటికీ అడ్డు తగలడంపై విపక్ష నేత బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రుల తీరుపై బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఉద్యోగాలు ఇచ్చేశాం అని ఎలా చెప్తారంటూ బొత్స అభ్యంతరం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం టీడీపీ, జనసేన పై ఆధారపడి ఉన్నా ప్రత్యేక హోదా సాధించలేదన్న వరుదు కళ్యాణి వ్యాఖ్యల పట్ల మంత్రి నారా లోకేష్ మళ్లీ అభ్యంతరం తెలిపారు.
మేం కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇచ్చాం.. మా మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడిందని ఏనాడూ అనలేదంటూ మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కేంద్రంలో ఉన్నది వీళ్ల ఉమ్మడి ప్రభుత్వం కాదా..?. మా మీద ఆధారపడలేదని చెప్తారా..?. రాష్ట్ర ప్రయోజనాల కోసమన్నారు. అదే మా సభ్యురాలు చెప్తున్నది. 2014 నుండి 2019 మధ్యలో ప్యాకేజీ కోసం హోదాను వదిలేయలేదా..?’’ అంటూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. ‘‘చంద్రబాబు పాలన గొప్పలు చెప్పుకుంటున్నారు.. కానీ ఓటేసిన జనం చెప్పులతో కొట్టుకుంటున్నారు. తొమ్మిది నెలల్లో రైతులు, మహిళలు, పేదల జీవితాలు తలకిందులైపోయాయి. సూపర్ 6 పథకాలకు ఎగనామం పెట్టడం సుపరిపాలనా..?. ఉద్యోగులకు డీఏ, ఐ ఆర్, పీ ఆర్ సీ ఇవ్వకపోవడమే సుపరిపాలనా..?. అమ్మ ఒడి, రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన అవుతుందా.?’’ అంటూ వరుదు కల్యాణి నిలదీశారు.
‘‘రూ.15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారు. 60 శాతం నిత్యవసర వస్తువులు ధరలు పెంచారు. 4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చేశాం అని చెప్పారు..ఎక్కడ ఇచ్చారు..? చూపించండి. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ జగన్ 6 నెలల్లో లక్షా 25 వేల ఉద్యోగాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం.. తొలి సంతకం పెట్టిన మెగా డీఎస్సీని కూడా పూర్తి చేయలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని కూడా ఇవ్వకుండా మోసం చేశారు. టీడీపీ పై ఆధారపడ్డ కేంద్ర ప్రభుత్వం ఉన్నా ప్రత్యేక హోదాను సాధించలేదు’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు.
గవర్నర్ ప్రసంగంలో దశ లేదు, దిశలేదు .. మీడియాతో బొత్స
గవర్నర్ ప్రసంగంలో దశ లేదు.. దిశలేదు.. ఓ క్లారిటీ లేదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. శాసనమండలి మీడియా పాయింట్‌లో బొత్స మీడియాతో మాట్లాడారు. గవర్నర్ చాలా శ్రమించి ప్రసంగం కొనసాగించారు. ఆయన ప్రసంగంలో దశలేదు.. దిశలేదు. ఓ క్లారిటీ లేదు. సుప్రీంకోర్టు జడ్జీగా పనిచేసిన వ్యక్తితో అబద్దాలు, అసత్యాలు చెప్పించారు.
19 మంది వీసీలతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. వీసీలు తమ రాజీనామాల లేఖలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ నుండి ఫోన్స్ వచ్చాయని, అందుకే రాజీనామా చేశామని పేర్కొన్నారు. వీసీలు రాజీనామాలపై కమిటీ వేయాలని డిమాండ్ చేశాం.. వేస్తామన్నారు. తర్వాత మాట మార్చారు. 19 మంది వీసీల రాజీనామా లేఖల్ని బయట పెట్టాలి. ఒకేసారి అంతమంది వీసీలు ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలి. ప్రభుత్వాలు వస్తుంటాయి.. మారుతుంటాయి. అది వ్యవస్థ.. దాన్ని మార్చితే ఎలా?
ప్రజా వ్యతిరేక, ప్రజలకు మేలు చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. సందర్భం, సమయం కానీ అంశాలు సభలో మాట్లాడం సమంజసం కాదు. విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుతున్నారు. మంత్రి లోకేష్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. గ్రూప్ 2 మెయిన్స్‌పై లోకేష్ ట్వీట్ చేశారు.. మేం మా అభిప్రాయం చెప్పాం.
వాకౌట్ చేయడానికి రెండు కారణాలు.ప్రసంగంలో దశ ,దిశ లేదు. గవర్నర్‌తో విధ్వంసం అనే మాట మాట్లాడించొచ్చా? మాట్లాడిన దాంట్లో కూడా అద్భుతాలు ఉన్నాయా అంటే అది లేదు.2047కి సూపర్ టెండర్ అంట..అంటే సూపర్ సిక్స్ పోయిందా?’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment