అమరావతిలో సైకిల్, వాకింగ్ ట్రాక్
డిప్యూటీ సీఎం చినరాజప్ప వెల్లడి
తిరుపతి గాంధీ రోడ్డు: ఆంధ్రప్రదేశ్ రాజ ధాని అమరావతిలో సైకిల్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం చినరాజప్ప తెలిపారు. తిరుపతిలో ఆదివారం డిప్ (డిసీజ్ ఎరాడికేషన్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ ప్రివెన్షన్) సంస్థ.. తిరుపతి కార్పొరేషన్, సుధారాణి పౌండేషన్, టీటీడీ సహకారంతో నిర్వహించిన సెవెన్ హిల్స్ మారథాన్ 21కె, 10కె, 5కె, 3కె రన్ ముగింపు సభలో ఆయన పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ప్రతిరోజు సైకిల్ తొక్కడాన్ని, వాకింగ్‌ను ప్రోత్సహించేందుకు అమరావతి, తిరుపతిలో వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
మంత్రులు నారాయణ, దేవినేని మాట్లాడుతూ రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో కూడా మారథాన్ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, మంత్రులందరూ తమ ఆస్తుల వివరాలను స్పీకర్‌కు అందజేస్తామని డిప్యూటీ సీఎం చిన రాజప్ప ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానంగా మీడియాకు తెలిపారు.