Walking Track
-
చిరుత కోసం గాలింపు
సాక్షి, తిరుపతి: తిరుమల నడక మార్గంలో ఆరేళ్ల చిన్నారి లక్షితను ఈడ్చుకెళ్లి ప్రాణాలు తీసిన చిరుతను పట్టుకునేందుకు తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అటవీ, టీటీడీ, పోలీస్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి అడవిని జల్లెడ పడుతున్నారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు, 35వ మలుపు వద్ద చిరుత కదలికలను గుర్తించినట్టు అధికారులు చెబుతున్నారు. వాహనం శబ్దం వినడంతో చిరుత అడవిలోకి పారిపోయినట్టు తెలిసింది. చిరుత దాడి చేసిన అటవీ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. పండ్లు.. కూరగాయల కోసమే! కాలినడక మార్గంలో వ్యాపారులు పండ్లు, కూరగాయలు విక్రయిస్తున్నారు. కొందరు భక్తులు నడిచి వెళ్తున్నప్పుడు తినడానికి పండ్లు వెంట తెచ్చుకుంటున్నారు. ఆ పండ్లు, కూరగాయలను కొందరు భక్తులు నడక మార్గంలో కనిపించే దుప్పి, జింకలకు తినిపిస్తుంటారు. భక్తులు ఇచ్చే వాటి కోసం అవి కాలినడక మార్గానికి చేరుకుంటున్నాయి. దీంతో దుప్పి, జింకల కోసం చిరుతలు ఆ ప్రాంతానికి వస్తున్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. అక్కడికి వచ్చే చిరుతలు దుప్పి, జింకలు దొరకని సమయంలో చిన్నారులపై దాడికి పాల్పడుతున్నాయంటున్నారు. కాగా, చిన్నారి లక్షిత బంతితో ఆడుకుంటుండగా.. గాలి వాటానికి ఆ బంతి దూరంగా పడటంతో దానిని తీసుకునేందుకు మెట్లు దాటి అడవిలోకి వెళ్లిందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిరుత అమాంతం లక్షిత గొంతు పట్టుకుని అడవిలోకి లాక్కెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆపదను తప్పించే ‘ఆలోచన’ తిరుమల అలిపిరి నడక మార్గంలో ఓ భక్తుడు ఆదివారం అందరినీ ఆకట్టుకున్నాడు. నడక మార్గంలో వన్య ప్రాణులు సంచరిస్తోన్న నేపథ్యంలో విజయవాడకు చెందిన ఓ భక్తుడు తన కుమారుడి చేతికి రబ్బర్ ఎలాస్టిక్ తాడు తగిలించి..ఆ తాడును ఆయన చేతికి ఇలా కట్టుకున్నాడు. దీనిపై ఆ భక్తుడిని ప్రశ్నించగా తమ జాగ్రత్త కోసమే తాడు కట్టినట్లు చెప్పాడు. – తిరుమల ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రావాలి ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకే లక్షిత మరణంపై కారణాలు తెలుస్తాయి. చిరుత కోసం గాలిస్తున్నాం. బోన్లు, కెమెరాలు ఏర్పాటు చేశాం. కాలినడకన వెళ్లే భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లడం మంచిది. పండ్లు, కాయగూరలు ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఉంటే బాగుంటుంది. – సతీష్‌రెడ్డి, డీఎఫ్ఓ, తిరుపతి -
హైదరాబాద్: పంచతత్వ పార్క్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
పంచతత్వ పార్క్ ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : నగర ప్రజలకు పంచతత్వ పార్క్ అందుబాటులోకి వచ్చింది. ఇందిరా పార్క్‌లో నిర్మించిన ఆక్యుప్రెజర్ వాకింగ్ ట్రాక్‌ను మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఎనిమిది అంశాలతో ఎకరం విస్తీర్ణంలో ఈ ట్రాక్‌ను నిర్మించారు. కంకర రాళ్లు, నల్లరేగడి మట్టి, నీరు, ఇసుక, చెక్కపొట్టు, గులకరాళ్లతో నిర్మించిన ఈ ట్రాక్ మీద నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలోని నరాలపై ఒత్తిడి పడుతుంది. అంతేకాకుండా ట్రాక్ సర్కిల్లో వివిధ రకాల ఔషధ మొక్కలను పెంచారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, నగర మేయర్ బొంతు రామ్మెహన్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు. -
ఉప్పల్ జంక్షన్లో ‘ఐకానిక్ బోర్డు వాక్’
సాక్షి, సిటీబ్యూరో: వరంగల్ జాతీయరహదారివైపు రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో ఉప్పల్ జంక్షన్ వద్దరోడ్డు దాటేందుకు నానా కష్టాలు పడుతున్న పాదచారుల కోసం ‘ఐకానిక్ బోర్డు వాక్’ను ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏభావిస్తోంది. ఇందుకోసం ప్రణాళికను వేగిరం చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)ఇంజనీరింగ్ విభాగాధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు మొదలెట్టారు. ఇప్పటివరకు నగరంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక హంగులతో పాదచారుల భద్రతకు పెద్దపీట వేస్తూ డిజైన్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ బాధ్యతను ఇప్పటికే ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీకి అప్పగించారు. ఈ ఐకానిక్ బోర్డు వాక్ (స్కైవాక్) డిజైన్లు పూర్తవగానే టెండర్లు పిలిచి సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకితీసుకురావాలని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. పాదచారుల భద్రత కోసమే... వాహనదారులు మితిమీరిన వేగంతో దూసుకెళ్లడంతో పాటు సిగ్నల్ జంప్ చేసి వెళ్లడం వల్ల పాదచారులు ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం లుక్ ఈస్ట్‌లో భాగంగా ఫ్లైఓవర్ల నిర్మాణానికి పెద్దపీట వేయడం, మెట్రో కూడా అందుబాటులోకి రావడంతో వాహనాలతో పాటు జనాల రద్దీ కూడా పెరిగింది. అటు వాహనదారులు నిర్లక్ష్యంగా ఉన్నా, ఇటు పాదచారుడు గమనించకుండా ఉన్నా...ఇలా ఇద్దరిలో ఏ ఒక్కరూ అజాగ్రత్తగా ఉన్నా రోడ్డు ప్రమాదాలు జరిగితే పాదచారులే బలవుతున్నారు. ఇలా ఉప్పల్ జంక్షన్లో 2019లో దాదాపు 15 మంది వరకు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన హెచ్ఎండీఏ అధికారులు స్కైవాక్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. అంతా సవ్యంగా ఉంటే మరో నెల రోజుల్లోనే టెండర్లు పిలిచి నిర్మాణం దిశగా అడుగులు పడతాయని హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఐకానిక్ బోర్డు వాక్ డిజైన్ తయారుచేస్తున్నామని, త్వరలోనే పూర్తవుతుందని ఆయన చెప్పారు. దీని నిర్మాణానికి రూ.ఐదు కోట్లు వ్యయం కావచ్చని తెలిపారు. ఐకానిక్ బోర్డు వాక్ అంటే... ఎక్కువ సంఖ్యలో ప్రజల సంచారం ఉండే ప్రాంతాల్లో సౌలభ్యం కోసం ఐకానిక్ బోర్డు వాక్‌లు ఏర్పాటుచేస్తారు. ఇప్పటివరకు మన నగరంలో రోడ్డు ఒకవైపు నుంచి మరోవైపునకు పాదచారులు వెళ్లేలా స్కై వాక్‌లు, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు నిర్మించారు. అయితే ఉప్పల్ జంక్షన్లో నిర్మించాలనుకుంటున్న ఐకానిక్ బోర్డు వాక్ మాత్రం దీనికి భిన్నం. ఈ వంతెన నాలుగైదు వైపులా పాదచారులు వారి గమ్యాలకు వెళ్లేలా డిజైన్ ఉంటుంది. ఉదాహరణకు ఉప్పల్ జంక్షన్ నుంచి మెట్రో స్టేషన్‌కు చేరుకోవాలనుకునే వారి సౌలభ్యం కోసం, అక్కడే ఉన్న పాఠశాలకు విద్యార్థులు వెళ్లేలా, నేరుగా బస్టాండ్‌కు చేరుకునేలా, రోడ్డు ఓవైపు నుంచి మరో రోడ్డు వైపునకు వెళ్లేలా ఈ ‘ఐకానిక్ బోర్డు వాక్’ను నిర్మిస్తారు. -
పోలేపల్లి సెజ్‌లో ఎఫ్‌బీఓల ఎంపిక పరీక్షలు
జడ్చర్ల : మండల పరిధిలోని పోలేపల్లి సెజ్‌లో ఫారెస్ట్ బీట్‌ఆఫీసర్ల ఎంపికకు సంబందించి నడక పరీక్షలు సోమవారం నిర్వహించారు. పోలేపల్లి సెజ్ రహదారులపై 4గంటలలో 25 కిమీల దూరానికి సంబందించి నడక, దేహదారుఢ్య ఇతర పరీక్షలు ఫారెస్ట్ అధికారులు నిర్వహించారు. మొత్తం 64మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలకు పది మంది గైర్హాజరయ్యారు. మొత్తం 48మంది అభ్యర్థులు ఈ పోటీల్లో అర్హత సాధించారు. టీఎస్పీఎస్సీ నిబంధనల మేరకు ఎంపిక కొనసాగే అవకాశం ఉంది. కలెక్టర్ పరిశీలన ఎంపిక పరీక్షలను కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పరిశీలించారు. అభ్యర్థుల వివరాలను, పరీక్ష తీరును అడిగి తెలుసుకున్నారు. అవకతవకలు చోటుచేసుకోకుండా పారదర్శకత పాటించాలని ఆదేశించారు. నేడు పరీక్షలు మంగళవారం నడక పరీక్షలు కొనసాగు తాయని ఫారెస్ట్‌రేంజ్ ఆఫీసర్ చంద్రయ్య తెలిపారు. 63మంది పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. బుధవారం మహిళా అభ్యర్థులకు పరీక్షలు ఉంటాయని డీఎఫ్ఓ గంగారెడ్డి తెలిపారు. -
అమరావతిలో సైకిల్, వాకింగ్ ట్రాక్
డిప్యూటీ సీఎం చినరాజప్ప వెల్లడి తిరుపతి గాంధీ రోడ్డు: ఆంధ్రప్రదేశ్ రాజ ధాని అమరావతిలో సైకిల్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం చినరాజప్ప తెలిపారు. తిరుపతిలో ఆదివారం డిప్ (డిసీజ్ ఎరాడికేషన్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ ప్రివెన్షన్) సంస్థ.. తిరుపతి కార్పొరేషన్, సుధారాణి పౌండేషన్, టీటీడీ సహకారంతో నిర్వహించిన సెవెన్ హిల్స్ మారథాన్ 21కె, 10కె, 5కె, 3కె రన్ ముగింపు సభలో ఆయన పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ప్రతిరోజు సైకిల్ తొక్కడాన్ని, వాకింగ్‌ను ప్రోత్సహించేందుకు అమరావతి, తిరుపతిలో వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రులు నారాయణ, దేవినేని మాట్లాడుతూ రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో కూడా మారథాన్ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, మంత్రులందరూ తమ ఆస్తుల వివరాలను స్పీకర్‌కు అందజేస్తామని డిప్యూటీ సీఎం చిన రాజప్ప ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానంగా మీడియాకు తెలిపారు. -
క్రీడా మైదానం మిత్రుడికి అంకితం..!
తిరుపతి నగరంలో 45 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన శ్రీపండిట్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాల (ఎస్పీజేఎన్ఎం)లోని క్రీడామైదానం మొదటిదిగా గుర్తింపు పొందింది. ఈ క్రీడా మైదానంలో జాతీయ స్థాయి ఉత్తమ క్రీడాకారులు కూడా ఎదిగారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ పాఠశాల క్రీడామైదానంలోకి ప్రస్తుతం క్రీడాకారులకు ప్రవేశం నిషిద్ధం. ఎందుకంటే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయించిన ఓ మున్సిపల్ అధికారి స్నేహితుడు వాకింగ్ చేయడానికి అంకితం ఇచ్చారు. క్రీడాకారులు ఎవరూ ప్రవేశించకుండా గేటుకు తాళం కూడా వేశారు. తిరుపతి స్పోర్ట్స్ : తిరుపతి నగర కార్పొరేషన్‌లోని ఓ ఉన్నతాధికారి స్నేహితుడి వాకింగ్ చేయాలనే కోర్కె తీర్చేందుకు శ్రీపండిట్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని మైదానంలో లక్షలు ఖర్చుపెట్టి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. ఆ ట్రాక్ దెబ్బతినకుండా, వాకింగ్ సమయంలో స్నేహితుడికి అసౌకర్యం లేకుండా ప్రహరీ నిర్మించి దానికి ఇనుప గేట్లు వేయించారు. ఈ గేటుకు తాళం వేసి, తాళాలను తన స్నేహితుడికి అందించినట్టు సమాచారం. దీంతో మైదానంలోకి విద్యార్థులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పాఠశాలకు సెలవు ఇచ్చిన రోజు ల్లో కూడా పాఠశాల విద్యార్థులు, క్రీడాకారు లు మైదానంలోకి వెళ్లలేక పోతున్నారు. ఇదే మైదానంలో చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉన్నప్పటికీ క్రికెట్ స్వేచ్ఛగా ఆడలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు క్రీడాకారులు ఎతైన ప్రహరీ గోడ, ఇనుప గేటు దూకి, కిందపడి గాయపడ్డారు. ఎవరైనా సా హసించి మైదానంలో ఆడుతుంటే బలవంతంగా వెళ్లగొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం క్రీడాకారుల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. క్రీడాకారులకు ఇబ్బందనీ... విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండాలనే తాళాలు వేశాం. రోజూ సాయంత్రం కొంత సేపు విద్యార్థులకు క్రీడలను నేర్పించి తిరిగి తాళాలు వేస్తున్నాం. ఇతరులు లోనికి రాకుండా కట్టడి చేయచ్చు. ఇక మైదానంలో వాకింగ్ ట్రాక్ ఎవరి కోసం వేశారో నాకు తెలియదు. -రెడ్డెప్పరెడ్డి, ఇన్చార్జ్ హెచ్ఎం,ఎస్పీజేఎన్ఎం పాఠశాల. తిరుపతి -
రెండు నెలల్లో గృహ ప్రవేశం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సొంతిల్లు అంటే ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పదు. కానీ, రెండు నెలల్లో గృహ ప్రవేశం చేసేందుకు మూడు ప్రాజెక్ట్‌లను సిద్ధం చేస్తున్నామంటున్నారు ఎస్వీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్టనర్ సంజీవ్‌రెడ్డి. ఇంకాఏమన్నారంటే.. మూడు ప్రాజెక్ట్‌లు రెండు నెలల్లో నిర్మాణం కానున్నాయి. బోడుప్పల్లో 5 వేల గజాల్లో ‘ఎస్వీ ప్రైడ్’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఫ్లాట్ల సంఖ్య 80. కెనరా నగర్లో 1,700 గజాల్లో ‘ఎస్వీ హార్మొనీ’నూ నిర్మిస్తున్నాం. మొత్తం 30 ఫ్లాట్లు. ఈ రెండు ప్రాజెక్టుల్లో చ.అ. ధర రూ. రూ.2,500. తార్నాకలో 600 గజాల్లో ‘ఎస్వీ నెస్ట్’ను నిర్మిస్తున్నాం. మొత్తం 8 ఫ్లాట్లు. అన్నీ 3 బీహెచ్‌కే సూపర్ డీలక్స్ ఫ్లాట్లే. ఇందులో చ.అ. ధర రూ.4 వేలుగా ఉంది. మరో రెండు ప్రాజెక్టుల నిర్మాణం 8 నెలల్లో పూర్తికానుంది. బుద్ధ నగర్లో 800 గజాల్లో ‘ఎస్వీ ఫ్లోరా’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 20 ఫ్లాట్లు. బండి సత్తయ్య కాలనీలో 1,600 గజాల్లో ‘ఎస్వీ స్ప్లెండర్’ను నిర్మిస్తున్నాం. మొత్తం ఫ్లాట్లు 30. ఈ రెండు ప్రాజెక్టుల్లోనూ చ.అ. ధర రూ.2,500. ఈ నెలాఖరులోగా బోడుప్పల్లో 5 వేల గజాల్లో ‘ఎస్వీ బృందావన్’ పేరుతో మరో ప్రాజెక్టును ప్రారంభించనున్నాం. ఇందులో మొత్తం 80 ఫ్లాట్లొస్తాయి. ఇందులోనూ చ.అ. ధర రూ.2,500గా చెబుతున్నాము. ఇక వసతుల విషయాని కొస్తే.. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఆర్వో సిస్టం, ఆధునిక రక్షణ ఏర్పాట్లు వంటి అన్ని రకాల వసతులూ ఏర్పాటు చేస్తున్నాం.