సాక్షి, తిరుపతి: తిరుమల నడక మార్గంలో ఆరేళ్ల చిన్నారి లక్షితను ఈడ్చుకెళ్లి ప్రాణాలు తీసిన చిరుతను పట్టుకునేందుకు తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అటవీ, టీటీడీ, పోలీస్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి అడవిని జల్లెడ పడుతున్నారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు, 35వ మలుపు వద్ద చిరుత కదలికలను గుర్తించినట్టు అధికారులు చెబుతున్నారు. వాహనం శబ్దం వినడంతో చిరుత అడవిలోకి పారిపోయినట్టు తెలిసింది. చిరుత దాడి చేసిన అటవీ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు.
పండ్లు.. కూరగాయల కోసమే!
కాలినడక మార్గంలో వ్యాపారులు పండ్లు, కూరగాయలు విక్రయిస్తున్నారు. కొందరు భక్తులు నడిచి వెళ్తున్నప్పుడు తినడానికి పండ్లు వెంట తెచ్చుకుంటున్నారు. ఆ పండ్లు, కూరగాయలను కొందరు భక్తులు నడక మార్గంలో కనిపించే దుప్పి, జింకలకు తినిపిస్తుంటారు. భక్తులు ఇచ్చే వాటి కోసం అవి కాలినడక మార్గానికి చేరుకుంటున్నాయి. దీంతో దుప్పి, జింకల కోసం చిరుతలు ఆ ప్రాంతానికి వస్తున్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు.
అక్కడికి వచ్చే చిరుతలు దుప్పి, జింకలు దొరకని సమయంలో చిన్నారులపై దాడికి పాల్పడుతున్నాయంటున్నారు. కాగా, చిన్నారి లక్షిత బంతితో ఆడుకుంటుండగా.. గాలి వాటానికి ఆ బంతి దూరంగా పడటంతో దానిని తీసుకునేందుకు మెట్లు దాటి అడవిలోకి వెళ్లిందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిరుత అమాంతం లక్షిత గొంతు పట్టుకుని అడవిలోకి లాక్కెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆపదను తప్పించే ‘ఆలోచన’
తిరుమల అలిపిరి నడక మార్గంలో ఓ భక్తుడు ఆదివారం అందరినీ ఆకట్టుకున్నాడు. నడక మార్గంలో వన్య ప్రాణులు సంచరిస్తోన్న నేపథ్యంలో విజయవాడకు చెందిన ఓ భక్తుడు తన కుమారుడి చేతికి రబ్బర్ ఎలాస్టిక్ తాడు తగిలించి..ఆ తాడును ఆయన చేతికి ఇలా కట్టుకున్నాడు. దీనిపై ఆ భక్తుడిని ప్రశ్నించగా తమ జాగ్రత్త కోసమే తాడు కట్టినట్లు చెప్పాడు. – తిరుమల
ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రావాలి
ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకే లక్షిత మరణంపై కారణాలు తెలుస్తాయి. చిరుత కోసం గాలిస్తున్నాం. బోన్లు, కెమెరాలు ఏర్పాటు చేశాం. కాలినడకన వెళ్లే భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లడం మంచిది. పండ్లు, కాయగూరలు ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఉంటే బాగుంటుంది. – సతీష్‌రెడ్డి, డీఎఫ్‌ఓ, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment