తిరుపతి సిటీ: తిరుమల వచ్చే శ్రీవారి భక్తుల ప్రాణరక్షణే తమ ప్రధాన ధ్యేయమని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ.. చిరుత దాడిలో గతంలో కౌషిక్ గాయపడటం, ఇటీవల చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ అప్రమత్తమై అటవీ శాఖ అధికారులు, పోలీసులతో కలసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో 12 ఏళ్ల వయసులోపు పిల్లలతో వచ్చే భక్తులకు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.
పెద్దలను మాత్రం రాత్రి 10 వరకు అనుమతిస్తామని తెలిపారు. నడక దారిలో వెళ్లే ప్రతి భక్తునికి సహకారం కోసం ఊత కర్ర అందిస్తామన్నారు. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. భక్తులను గుంపులుగా వెళ్లేందుకు అనుమతిస్తూ.. ముందు వెనుక అటవీశాఖ సెక్యూరిటీతో భద్రత కల్పిస్తామన్నారు.. అటవీశాఖ అధికారులు నిపుణులైన భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని సూచించామని.. వారి వేతనాలు టీటీడీయే భరిస్తుందన్నారు.
జంతువులకు ఆహారం అందించడం నిషేధం
నడక దారిలో వెళ్లే భక్తులు సాధు జంతువులకు ఆహారం అందించడం నిషేదించామని, అలా అందించే వారిపై చర్యలు తప్పవని కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. నడక దారిలోని దుకాణదారులు, హాటళ్ల యజమానులు వ్యర్థాలను బయట వేయరాదని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి నుంచి తిరుమల వరకు నడకమార్గంలో సుమారు 500 కెమెరాలను అమర్చనున్నామని, అవసరమైతే డ్రోన్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొన్నారు.
వైల్డ్‌లైఫ్ అవుట్ పోస్టులు 24 గంటలు పనిచేస్తాయని, డాక్టర్లు సైతం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దారి పొడవునా సుమారు 30 అడుగుల వరకు వెలుతురు ఉండేలా ఫోకస్ లైట్లు అమర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్టు వద్ద 15వేల దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని, మధ్యలో వీటిని తనిఖీ చేయాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. టోకెన్లు పొందిన భక్తులు రోడ్డు మార్గాన సైతం వెళ్లేందుకు అనుమతిస్తామని తెలిపారు. ఫెన్సింగ్ ఏర్పాటుపై అటవీ అధికారులతో చర్చించామని.. కేంద్ర అటవీశాఖ ఉన్నత స్థాయి కమిటీ వేసి అధ్యయం చేసిన తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment