కాకినాడ : తూర్పు గోదావరి జిల్లాలో జెడ్పీ పదవి ....తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణకు దారితీసింది. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సమక్షంలోనే తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. పరస్పర దూషణలతో హోరెత్తించారు. జెడ్పీ చెర్మన్ పదవికి పేరాబత్తుల రాజశేఖర్ పేరు కాకుండా నామన రాంబాబు పేరు ఖరారు చేయటంతో తమ్ముళ్లు మండిపడ్డారు.
జిల్లాలో 57 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా 43 చోట్ల టీడీపీ, 14 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించాయి. అయితే పూర్తిస్థాయి మెజారిటీ దక్కినా చైర్మన్ అభ్యర్థి ఎంపికపై టీడీపీ తొలి నుంచీ పిల్లిమొగ్గలు వేస్తూనే ఉంది. తొలుత పి.గన్నవరం జెడ్పీటీసీ అభ్యర్థి నామన రాంబాబు పేరు ప్రచారంలోకి వచ్చింది.
ఎన్నికల వ్యయం మూడు కోట్ల వరకు నామన భరించేలా ముఖ్యనేతలు ఒప్పందం కుదిర్చారని పార్టీలో చర్చ నడిచింది. అయితే నామన పేరు తెరపైకి వచ్చేసరికి ఐ.పోలవరం జెడ్పీటీసీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ వైపు పార్టీలో మెజార్టీ నేతలు మొగ్గుచూపారు. అయితే అనూహ్యంగా శనివారం నామన పేరును ప్రకటించటంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.