సాక్షి, రామచంద్రపురం : తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో సొంత ఇంట్లోనే దారుణహత్యకు గురైన జయదీపిక(20) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కన్నకూతుర్ని టీడీపీ పట్టణ అధ్యక్షుడు నందుల సూర్యనారాయణ(రాజు) హత్యచేశాడని గుర్తించిన పోలీసులు ఆయనను శుక్రవారం అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. కవల సోదరుడు జయప్రకాశ్ నాయుడే ఆమెను హత్య చేశాడంటూ తండ్రి రాజు ఆడిన నాటకం చివరికి బట్టబయలైంది.
అసలేమైందంటే..
టీడీపీ నేత రాజుకు జయదీపిక(20), జయప్రకాశ్ నాయుడు అను ఇద్దరు కవల పిల్లలున్నారు. జయదీపిక ఎ.అగ్రహారం కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో గత సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బార్‌లో పనిచేసే ఓ వ్యక్తి నందుల రాజు ఇంటికి వెళ్లగా.. ఇంటిలో తీవ్రగాయాలతో జయదీపిక అపస్మారక స్థితిలో ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దీపికను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
తండ్రి మాస్టర్ ప్లాన్
కూతురు ఇటీవల ఓ యువకుడితో ప్రేమలో పడిందని, తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే పరిస్థితి వస్తుందని జయదీపిక తండ్రి రాజు భావించారు. ఈ నెల 16న రాత్రి కూతుర్ని చిత్రహింసలకు గురిచేసి తీవ్రంగా గాయపర్చడంతో ఆమె మృతిచెందింది. అయితే, తన కుమార్తె ఇటీవల ప్రేమ వ్యవహారం నడుపుతోందని కొడుకు జయప్రకాశ్‌నాయుడు తన దృష్టికి తీసుకువచ్చాడని, ఈ నేపథ్యంలో దీపికను అతడే హత్య చేసి ఉంటాడని దీపిక తండ్రి రాజు పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఐ శ్రీధర్‌కుమార్ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీతో ఆశ్చర్యకర నిజాలు తెలుసుకున్న పోలీసులు టీడీపీ నేత రాజును అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment