namana rambabu
-
వీడని జెడ్పీట ముడి
- చేతులెత్తేసిన ‘దేశం’ - చతికిలపడ్డ నేతలు - పార్టీ జిల్లా పగ్గాలపై వెనకడుగు - భంగపడిన పార్టీ పెద్దలు - నిరాశలో జ్యోతుల వర్గం. సాక్షి ప్రతినిధి, కాకినాడ : క్రమశిక్షణ ... ఓ పద్ధతి ప్రకారం నడిచే పార్టీ ... మాట మీద నిలబడే కార్యకర్తల శ్రేణి తమకే సొంతమనే టీ డీపీలో క్రమ ‘శిక్ష’ గానే మారుతోంది. తాజాగా పార్టీ జిల్లా పగ్గాలను కార్యకర్తల సమక్షంలో ప్రకటించినప్పటికీ అప్పగించలేక చేతెలెత్తేసి చతికిలపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు గుండెపోటుతో మృతి చెంది దాదాపు 14 నెలలైంది. అప్పటి నుంచి ఖాళీగానే ఉన్న ఆ పోస్టును కోనసీమకు చెందిన జెడ్పీ చైర్మన్ నామన రాంబాబుకు అప్పగించేందుకు రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ప్రకటించడం తెలిసిందే. జిల్లా పగ్గాలు అప్పగించి చైర్మన్ పీఠం వదులుకోమంటే ససేమిరా అంటూ చైర్మన్ నామన రాంబాబు ధిక్కార స్వరం వినిపించారు. వాస్తవానికి మంగళవారం ప్రత్తిపాడులో జరిగిన పార్టీ మినీ మహానాడు వేదికగా పార్టీ అధ్యక్షుడిగా రాంబాబును ప్రకటించాలి. కానీ మనస్తాపంతో అలక వహించిన నామన ధిక్కార స్వరం వినిపించడమే కాకుండా అన్న మాట ప్రకారమే మినీ మహానాడుకు రాకుండా జెడ్పీ బంగ్లాకే పరిమితమయ్యారు. . కాళ్లా వేళ్లా పడి... ఆయన మినీ మహానాడుకు రాకపోతే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రోడ్డునపడ్డాయంటూ పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కి అధిష్టానం నుంచి అక్షింతలు పడతాయనే భయం నేతలను వెంటాడింది. జిల్లా టీడీపీలో అంతర్గతంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు ‘సాక్షి’ బయటపెట్టిన విషయం పాఠకులకు విదితమే. వరుస కథనాల్లో బయటపడిన లుకలుకలు మాదిరిగానే అగ్రనేతలు కూడా పార్టీ పగ్గాల విషయంలో ఎటూ తేల్చుకోలేక తలలుపట్టుకున్నారు. ఆ క్రమంలోనే ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, పెందుర్తి వెంకటేష్, వర్మను నామన వద్దకు రాయబారానికి పంపించగా సుమారు గంటపాటు సమాలోచనలు జరిగాయి. పార్టీ జిల్లా పగ్గాలను జెడ్పీ చైర్మన్‌కు అప్పగించాలని ఉప ముఖ్యమంత్రి చినరాజప్పే స్వీయ నిర్ణయం తీసుకున్నారని, అందులో మెజార్టీ అభిప్రాయం లేదని పలువురు నేతలు నామన దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. . మౌన ముద్రలోనే నామన... చివరకు నామన మినీ మహానాడుకు రావడం వరకు ఒప్పించగలిగారుగానీ వేదికపైకి వచ్చిన దగ్గర నుంచి వేదిక దిగిపోయే వరకు నామన మౌనముద్రలోనే గడిపారు. వేదికపై ఉన్న ఎవరితోను కనీస పలకరింపు కూడా లేకుండా ముభావంగా కనిపించారు. జెడ్పీ చైర్మన్ మాట ఎలా ఉన్నా పార్టీ జిల్లా పగ్గాలు మినీ మహానాడు వేదికగా ప్రకటించాలనుకున్న చినరాజప్ప, కళావెంకట్రావు వంటి అగ్రనేతలకు భంగపాటు తప్పలేదు. . జిల్లా అధ్యక్ష బాధ్యతలు వాయిదా... మినీ మహానాడుకు నామనను తీసుకు రావడంతో కొంతవరకు పరువు దక్కిందనుకున్నా జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని నేతలు గుసగుసలాడుకోవడం వినిపించింది. నామన అలకబూనడం, పార్టీ జెడ్పీటీసీలు చైర్మన్ పీఠం మార్చవద్దని, అలా మారిస్తే రోడ్డెక్కాల్సి వస్తుందని హెచ్చరికల నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు వెనక్కు తగ్గక తప్పింది కాదు. మినీ మహానాడు వేదికపై తమ పార్టీ క్రమ శిక్షణకు మారుపేరంటూ మంత్రి యనమల గొప్పలకు పోతూనే జెడ్పీ చైర్మన్ మార్పు, పార్టీ జిల్లా పగ్గాలు వ్యవహారంలో అసమ్మతులను పరోక్షంగా ప్రస్తావిస్తూ పార్టీ అంతర్గత విషయాల్లో రోడ్డెక్క వద్దని నేతలకు సూక్తులు వినిపించారు. కానీ మినీ మహానాడు వేదికపై ప్రకటించాల్సిన పార్టీ జిల్లా పగ్గాలు విషయంలో వెనుకడుగు వేయక తప్పలేదు. యనమల ప్రసంగాన్ని ముగించి భోజన విరామ సమయంలో నామనను వేదికకు దిగువన ఒకపక్కకు తీసుకువెళ్లి పార్టీ పగ్గాలపై ఒప్పించేందుకు యనమల చేసిన చివరి ప్రయత్నం కూడా బెడిసికొట్టడంతో పార్టీ నేతలంతా కుదేలయ్యారు. ఇక చేసేదేమీ లేక పార్టీ జిల్లా పగ్గాలు, జెడ్పీ చైర్మన్ మార్పు వ్యవహారంపై ఒకరకంగా ‘స్టే’ విధించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మునుపెన్నడూ ఎదురుకాని పరిస్థితి పార్టీలో తలెత్తడంతో పార్టీ అగ్రనేతలు ఎటూ నిర్ణయం తీసుకోలేక తలలుపట్టుకుంటున్నారు. . పాపం జ్యోతుల... మరోపక్క పార్టీ జిల్లా పగ్గాలు నామనకు అప్పగించేలా ఒప్పించే ప్రక్రియ పూర్తయితే జెడ్పీ చైర్మన్ వ్యవహారంలో స్పష్టత వస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వర్గం ఎదురుచూసింది. ఆ దిశగా కొందరు అగ్రనేతలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడం ఆ వర్గానికి నిరాశను మిగిల్చాయి. ప్రస్తుతం అనవసర రాద్ధాంతం ఉండకూడదని పార్టీ పగ్గాలు వ్యవహారాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టారంటున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి నిర్ణయం అక్కడే జరిగేలా నేతల వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తంమీద పార్టీ ముఖ్యనేతలంతా ఉండి కూడా జిల్లా స్థాయిలో సమస్యను పరిష్కరించ లేక చేతులెత్తేయడం కేడర్‌కు ఏమాత్రం రుచించడం లేదు. - zp chairman, tdp, namana rambabu -
పరిషత్ జాగాలో ‘పచ్చ’పాగాకు సై
సాక్షి ప్రతినిధి, కాకినాడ : నిరుపేదలు భయపడినట్టే కోట్ల విలువైన జెడ్పీ స్థలాన్ని తెలుగుదేశం పరం చేసేందుకు జిల్లా పరిషత్ ‘పచ్చ’జెండా ఊపింది. ‘పరిషత్ జాగాలో పచ్చపాగా’ అంటూ జెడ్పీ స్థలంపై అధికార పార్టీ కన్నేసిన వైనాన్ని ‘సాక్షి’ ఈ నెల 21నే వెలుగులోకి తెచ్చినసంగతి తెలిసిందే. టీడీపీ జిల్లా కార్యాలయం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో 99 ఏళ్లు లీజుకు ఇచ్చే ప్రతిపాదనకు ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా.. ఆమోదిస్తూ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. కాకినాడ పాతబస్టాండ్ సమీపంలో జెడ్పీకి చెందిన ఆ భూమి లీజు అంశాన్ని జెడ్పీ చైర్పర్సన్ నామన రాంబాబు సభ దృష్టికి తీసుకువచ్చారు. కోట్ల విలువైన భూమిని ఒక పార్టీకి ఏ విధంగా ధారాదత్తం చేస్తారని కిర్లంపూడి జెడ్పీటీసీ సభ్యుడు వీరంరెడ్డి రామలింగేశ్వరరావు(కాశీ బాబు) అభ్యంతరం వ్యక్తం చేశారు. జెడ్పీ ఉద్యోగులకు జి ప్లస్ 2 ప్లాట్ల నిర్మాణానికి గత జెడ్పీలో తీర్మానం చేయగా, పార్టీకి ఎలా లీజుకిస్తారని ప్రతిపక్ష నాయకుడు జ్యోతుల నవీన్‌కుమార్ ప్రశ్నించారు. ‘ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం తీర్మానం చేస్తున్నారు.. కానీ టీడీపీ కార్యాలయం కోసమే అంటున్నారు. ఇందులో ఏది వాస్తవమో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ట్రస్ట్ అంటే ఒక చైర్మన్, డెరైక్టర్లు, అడిగేందుకు ఒక పద్ధతి ఉండదా అని రావులపాలెం జెడ్పీటీసీ సాకా ప్రసన్న కుమార్ ప్రశ్నించారు. మెజార్టీ ఉంది కదా అని అడ్డగోలు తీర్మానాలు చేస్తూ కోట్ల విలువైన భూములు ఎవరికి పడితే వారికి ధారాదత్తం చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ‘ఇక్కడ తీర్మానం చేసినంత మాత్రాన భూమిని ఇచ్చేసినట్టు కాదని, ప్రభుత్వానికి వెళ్లాలి, కేబినెట్లో తీర్మానం కావాలి అప్పుడు కానీ అవదు..ఇదంతా జరగాలంటే చాలా సమయం పడుతుం’దంటూ చైర్పర్సన్ నామన తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.26.18 కోట్లను ప్రతిపాదిత 38 మంచినీటి పథకాల నిర్వహణ, మరమ్మతులకు ఖర్చు చేసేందుకు, జెడ్పీ చైర్‌పర్సన్‌కు కొత్తగా ఇన్నోవా కారు కొనుగోలుకు అనుమతిస్తూ తీర్మానాలను ఆమోదించారు. ఏడు స్థాయీ సంఘాలు ఏకగ్రీవం ప్రణాళిక ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య వైద్య సేవలు, మహిళా, సాంఘిక సంక్షేమం, పనుల నిర్వహణ స్థాయా సంఘాలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీటిలో వ్యవసాయం, సాంఘిక సంక్షేమం స్థాయా సంఘాలు మినహా ఐదింటికీ జెడ్పీ చైర్‌పర్సనే చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. వ్యవసాయ స్థాయా సంఘానికి వైస్ చైర్మన్ పెండ్యాల నళినీకాంత్, సాంఘిక సంక్షేమానికి పాలపర్తి రోజా ఎన్నికయ్యారు. ఒక్కో సంఘంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీ సభ్యులతో కలిసి 15 మంది సభ్యులున్నారు. -
ఆద్యంతం..జనపక్షం
సాక్షి ప్రతినిధి, కాకినాడ :జిల్లా పరిషత్ కొత్త పాలకవర్గ తొలి సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ నామన రాంబాబు అధ్యక్షతన ఆదివారం జరిగింది. అనుభవజ్ఞులైన సభ్యులతో సమానంగా కొత్త సభ్యులు, మహిళా జెడ్పీటీసీలు పోటాపోటీగా కురిపించిన ప్రశ్నల వర్షంతో అధికారులు ఉక్కిరిబిక్కిర య్యారు. కొందరైతే సమాధానాలు చెప్పలేక నీళ్లునమలాల్సి వచ్చింది. సమావేశంలో అధికారపక్షమే విపక్షపాత్ర పోషించడం కొసమెరుపు. స్థాయీ సంఘాల ఎన్నికలతో ఉదయం 11 గంటలకు మొదలైన సమావేశం మధ్యాహ్నం గంటపాటు భోజన విరామం మినహా రాత్రి ఏడు గంటల వరకు సాగింది. తొలి సమావేశాన్ని సమన్వయంతో నిర్వహించడంలో నామన కొంత తత్తరపడడం కనిపించింది. తెలంగాణ నుంచి విలీనమైన పోలవరం ముంపు మండలాల జెడ్పీటీసీ సభ్యులు సోయపు అరుణ (చింతూరు), ముత్యాల కుసుమాంబ (వరరామచంద్రపురం), ఎడవల్లి కన్యకాపరమేశ్వరి (కూనవరం) సభలో ప్రమాణం చేశారు. వీరి చేరికతో జెడ్పీటీసీ సభ్యుల సంఖ్య 61కి, మహిళల ప్రాతినిధ్యం 32కి పెరిగాయి. స్థాయీ సంఘాలకు నియమితులైన సభ్యులను సీఈఓ ఎం.సూర్యభగవాన్ ప్రకటించాక అజెండాను చేపట్టారు. నగరం పేలుడుపై విస్తృతచర్చ దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనానికి కారణమైన నగరం గ్యాస్ పైపులైన్ పేలుడులో బాధితులను విస్మరించిన విషయాన్ని ఐ.పోలవరం జెడ్పీటీసీ సభ్యుడు పేరాబత్తుల రాజశేఖర్ సభ దృష్టికి తీసుకువెళ్లాక రెండు నిమిషాలు మౌనం పాటించారు. గెయిల్, ఓఎన్జీసీ, జీఎస్పీసీ వంటి చమురు సంస్థల పైపులైన్లతో కోనసీమ ప్రజలకు భద్రత లేని విషయంపై అధికార, ప్రతిపక్షాలు విస్తృత చర్చ చేపట్టారు. భద్రతపై భరోసా ఇవ్వడం, చమురు సంస్థలతో ఇక ముందు నిర్వహించే భేటీలో పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులందరికీ భాగస్వామ్యం కల్పించడం, దీనిపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ తీర్మానించాలని కోనసీమ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు పట్టుబట్టారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు చొరవతో ఆర్థిక సాయం అందిందని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ తోట నరసింహం చెపుతున్నప్పుడు, ప్రతిపక్ష నేతగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పార్టీ తరఫున కుటుంబానికి లక్ష ఇచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. పూడ్చలేని నష్టం జరిగిందంటూ ప్రతిపక్షంతో పాటు అధికార పక్షం కూడా గొంతు కలిపింది. విపక్షనేతగా ఆకట్టుకున్న నవీన్ జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్ పదునైన పదాలతో తొలి ప్రసంగంతోనే సభ దృష్టిని ఆకర్షించగలిగారు. సమయస్ఫూర్తితో స్పందించారు. సమావేశమందిరంలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని తొలగించేందుకు తీర్మానం చేయాలని ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పట్టుబట్టినప్పుడు ‘వైఎస్ ప్రజానాయకుడు. ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేశారు. అలాంటి నేత ఫొటో తీసేయమంటారా, కావాలంటే తీర్మానం చేసుకోండి’ అంటూ నవీన్ తీవ్రంగా స్పందించడంతో.. చైర్పర్సన్ ఇది సమయం కాదంటూ చర్చకు అవకాశం ఇవ్వలేదు. నీలం పరిహారం, ఎస్సీ రుణాలకు బ్యాంకుల నిరాకరణ తదితర అంశాలపై అధికారపార్టీ సభ్యులు విపక్ష పాత్ర పోషించడంతో చైర్పర్సన్ నామన సమాధానం చెప్పలేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. ‘చూస్తాం, చేస్తా’మంటున్న ఆయనను ‘అలా అనవద్దు, కనీసం వచ్చే సర్వసభ్య సమావేశానికైనా పరిష్కారాలు చూపిస్తారని అధికారుల నుంచి భరోసా కల్పించాలి’ అని అధికారపక్షానికే చెందిన ఎమ్మెల్యే పులపర్తి, జెడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్ సూటిగా అడగడంతో అధికారులతో సమాధానం చెప్పించడానికి తడబడాల్సి వచ్చింది. నెహ్రూకు అధికారపక్ష సభ్యుల మద్దతు వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యాల సాధనలో వైఫల్యాన్ని దాదాపు నేతలంతా ఎండగట్టారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వినిపించిన పిట్టకథ సభలో నవ్వులు కురిపించింది. అవసరమైన అందరికీ మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ నీతూకుమారి అభ్యర్థించారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యమవుతుందనే సాకుతో గోదావరిపై రెండు లిఫ్టుల ఏర్పాటు ప్రతిపాదనకు వ్యతిరేకంగా తీర్మానం కోసం పట్టుబట్టిన వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు అధికారపక్ష సభ్యులు మద్దతు ఇచ్చారు. ఇందుకు మరోసారి సమావేశమవుదామంటూ చైర్పర్సన్ దాటవేయడంపై సభ్యులు గుసగుసలాడుకోవడం వినిపించింది. తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం అజెండాలో లేకపోవడంతో ఎంపీ తోట నరసింహం ఇరిగేషన్ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పింఛన్లకు ఆధార్ అనుసంధానంతో అనర్హులకు చోటు లేకుండా పోయిందంటూ చెప్పిందే చెపుతున్న డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రాజుపై జ్యోతుల నెహ్రూ అసహనం వ్యక్తం చేశారు. ‘రాజకీయ ఉపన్యాసాలు వద్దు. సమగ్ర సమాచారం ఉంటే చెప్పండి’ హితవు చెప్పారు. ఉపాధి హామీ పథకం ప్రగతిని ఇన్చార్జి పీడీ భవాని చెపుతుండగా అధికారపక్షం నుంచే ప్రతిఘటన ఎదురుకావడంతో వేదికపై ఉన్న ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కలెక్టర్ సర్దిచెప్పేందుకు తంటాలు పడాల్సి వచ్చింది. అధికారులను నిలదీసిన మహిళా సభ్యులు కొత్తగా ఎన్నికైనా ఏ మాత్రం తటపటాయింపు లేకుండా ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జెడ్పీటీసీ సభ్యులు చిన్నం అపర్ణాదేవి, అధికారి వెంకటలక్ష్మి, సోయపు అరుణ, కోసూరి బుజ్జి చిన్నాలమ్మ తదితరులు వివిధ సమస్యలపై అధికారులను నిలదీశారు. కాగా, జెడ్పీటీసీ సభ్యులు ప్రజా సమస్యలతో పాటు తమ సొంత కోర్కెల చిట్టా కూడా విప్పారు. వారి డిమాండ్లకు ప్రతిపక్ష నేత నవీన్ మద్దతు పలికారు. మండల పరిషత్‌లలో ప్రత్యేక గది, టోల్గేట్లలో ఉచిత ప్రవేశం, జెడ్పీ సమావేశంలో మాట్లాడేందుకు అవకాశం కావాలన్న సభ్యులు అందుకోసం పట్టుబట్టి మరీ అవుననిపించుకున్నారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, ముమ్మిడివరం, కాకినాడ రూరల్ ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు, పిల్లి అనంతలక్ష్మి సభలో ఒక్క మాట మాట్లాడకుండా మధ్యలోనే వెళ్లిపోయారు. -
చినరాజప్ప సమక్షంలో తమ్ముళ్ల బాహాబాహీ
-
చినరాజప్ప సమక్షంలో తమ్ముళ్ల బాహాబాహీ
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లాలో జెడ్పీ పదవి ....తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణకు దారితీసింది. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సమక్షంలోనే తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. పరస్పర దూషణలతో హోరెత్తించారు. జెడ్పీ చెర్మన్ పదవికి పేరాబత్తుల రాజశేఖర్ పేరు కాకుండా నామన రాంబాబు పేరు ఖరారు చేయటంతో తమ్ముళ్లు మండిపడ్డారు. జిల్లాలో 57 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా 43 చోట్ల టీడీపీ, 14 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించాయి. అయితే పూర్తిస్థాయి మెజారిటీ దక్కినా చైర్మన్ అభ్యర్థి ఎంపికపై టీడీపీ తొలి నుంచీ పిల్లిమొగ్గలు వేస్తూనే ఉంది. తొలుత పి.గన్నవరం జెడ్పీటీసీ అభ్యర్థి నామన రాంబాబు పేరు ప్రచారంలోకి వచ్చింది. ఎన్నికల వ్యయం మూడు కోట్ల వరకు నామన భరించేలా ముఖ్యనేతలు ఒప్పందం కుదిర్చారని పార్టీలో చర్చ నడిచింది. అయితే నామన పేరు తెరపైకి వచ్చేసరికి ఐ.పోలవరం జెడ్పీటీసీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ వైపు పార్టీలో మెజార్టీ నేతలు మొగ్గుచూపారు. అయితే అనూహ్యంగా శనివారం నామన పేరును ప్రకటించటంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.