సాక్షి ప్రతినిధి, కాకినాడ : నిరుపేదలు భయపడినట్టే కోట్ల విలువైన జెడ్పీ స్థలాన్ని తెలుగుదేశం పరం చేసేందుకు జిల్లా పరిషత్ ‘పచ్చ’జెండా ఊపింది. ‘పరిషత్ జాగాలో పచ్చపాగా’ అంటూ జెడ్పీ స్థలంపై అధికార పార్టీ కన్నేసిన వైనాన్ని ‘సాక్షి’ ఈ నెల 21నే వెలుగులోకి తెచ్చినసంగతి తెలిసిందే. టీడీపీ జిల్లా కార్యాలయం కోసం ఎన్‌టీఆర్ ట్రస్ట్ పేరుతో 99 ఏళ్లు లీజుకు ఇచ్చే ప్రతిపాదనకు ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా.. ఆమోదిస్తూ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. కాకినాడ పాతబస్టాండ్ సమీపంలో జెడ్పీకి చెందిన ఆ భూమి లీజు అంశాన్ని జెడ్పీ చైర్‌పర్సన్ నామన రాంబాబు సభ దృష్టికి తీసుకువచ్చారు.
కోట్ల విలువైన భూమిని ఒక పార్టీకి ఏ విధంగా ధారాదత్తం చేస్తారని కిర్లంపూడి జెడ్పీటీసీ సభ్యుడు వీరంరెడ్డి రామలింగేశ్వరరావు(కాశీ బాబు) అభ్యంతరం వ్యక్తం చేశారు. జెడ్పీ ఉద్యోగులకు జి ప్లస్ 2 ప్లాట్ల నిర్మాణానికి గత జెడ్పీలో తీర్మానం చేయగా, పార్టీకి ఎలా లీజుకిస్తారని ప్రతిపక్ష నాయకుడు జ్యోతుల నవీన్‌కుమార్ ప్రశ్నించారు. ‘ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం తీర్మానం చేస్తున్నారు.. కానీ టీడీపీ కార్యాలయం కోసమే అంటున్నారు. ఇందులో ఏది వాస్తవమో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ట్రస్ట్ అంటే ఒక చైర్మన్, డెరైక్టర్లు, అడిగేందుకు ఒక పద్ధతి ఉండదా అని రావులపాలెం జెడ్పీటీసీ సాకా ప్రసన్న కుమార్ ప్రశ్నించారు.
మెజార్టీ ఉంది కదా అని అడ్డగోలు తీర్మానాలు చేస్తూ కోట్ల విలువైన భూములు ఎవరికి పడితే వారికి ధారాదత్తం చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ‘ఇక్కడ తీర్మానం చేసినంత మాత్రాన భూమిని ఇచ్చేసినట్టు కాదని, ప్రభుత్వానికి వెళ్లాలి, కేబినెట్‌లో తీర్మానం కావాలి అప్పుడు కానీ అవదు..ఇదంతా జరగాలంటే చాలా సమయం పడుతుం’దంటూ చైర్‌పర్సన్ నామన తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.26.18 కోట్లను ప్రతిపాదిత 38 మంచినీటి పథకాల నిర్వహణ, మరమ్మతులకు ఖర్చు చేసేందుకు, జెడ్పీ చైర్‌పర్సన్‌కు కొత్తగా ఇన్నోవా కారు కొనుగోలుకు అనుమతిస్తూ తీర్మానాలను ఆమోదించారు.
ఏడు స్థాయీ సంఘాలు ఏకగ్రీవం
ప్రణాళిక ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య వైద్య సేవలు, మహిళా, సాంఘిక సంక్షేమం, పనుల నిర్వహణ స్థాయా సంఘాలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీటిలో వ్యవసాయం, సాంఘిక సంక్షేమం స్థాయా సంఘాలు మినహా ఐదింటికీ జెడ్పీ చైర్‌పర్సనే చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. వ్యవసాయ స్థాయా సంఘానికి వైస్ చైర్మన్ పెండ్యాల నళినీకాంత్, సాంఘిక సంక్షేమానికి పాలపర్తి రోజా ఎన్నికయ్యారు. ఒక్కో సంఘంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీ సభ్యులతో కలిసి 15 మంది సభ్యులున్నారు.
పరిషత్ జాగాలో ‘పచ్చ’పాగాకు సై
Published Mon, Aug 25 2014 12:39 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement