NTR Trust
-
చంద్రబాబు లాంటి నీచుడు ఎక్కడా ఉండడు: లక్ష్మీపార్వతి
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్‌ను చంపిన దుర్మార్గుడు చంద్రబాబు అని నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు చేస్తే ఆయన ఆత్మ క్షోభిస్తోందని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ పేరు ఎత్తడానికి కూడా చంద్రబాబుకు అర్హత లేదు.. చివరికి ఆయన కుటుంబాన్ని కూడా దూరం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు, రామోజీరావు కలిసి పార్టీని కూలదోశారు.. వైస్రాయ్ హోటల్ వద్ద చెప్పులు వేయించి ఎన్టీఆర్‌ను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెట్టిన మనసున్న వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. ఆస్తులు పంచుకున్న కొడుకులు, పార్టీని లాక్కున్న చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు వారసులు కాదని.. ఎన్టీఆర్ పేరు ఎత్తడానికి వీళ్లకున్న అర్హత ఏంటని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు వాడటానికి కొడుకులకు కూడా నైతిక హక్కు లేదని.. ఎన్నికలొచ్చే సరికి కొడుకులకు తండ్రి గుర్తుకువచ్చాడా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న కావాలని చంద్రబాబు ఏరోజూ అడగలేదని నాటి ప్రధాని వాజ్‌పేయి తనతో స్వయంగా చెప్పారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిజమైన వారసుడు సీఎం జగన్: దేవినేని అవినాష్ ఎన్టీఆర్ ఆశయాలకు నిజమైన వారసుడు సీఎం జగన్ అని దేవినేని అవినాష్ అన్నారు. కేవలం ఓట్ల కోసమే టీడీపీ ఎన్టీఆర్ పేరును వాడుకుంటోందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గుర్తుకురారు.. ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ఎన్టీఆర్ గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. చదవండి: టీడీపీ మహానాడులో లోకేష్‌కు షాకిచ్చిన కార్యకర్త -
ఫీజులు గుంజేసి.. బకాయిలు మింగేసి! హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్టు నిర్వాకాలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కరోనా విపత్తులోనూ విద్యార్థుల నుంచి ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేసిన ఎన్టీఆర్ ట్రస్టు యాజమాన్యం అధ్యాపకులకు మాత్రం బకాయిలు చెల్లించకుండా ఎగ్గొట్టడంపై ప్రధాని కార్యాలయంతోపాటు తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. మరోవైపు దీనిపై న్యాయ పోరాటానికి కూడా దిగారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గండిపేట సమీపంలో హైస్కూలు, జూనియర్, డిగ్రీ కాలేజీలు నడుస్తున్నాయి. కాలేజీల్లో 900 మందికి పైగా, హైసూ్కల్లో 500 మంది వరకు విద్యార్థులున్నారు. విద్యార్థుల నుంచి ఏటా రూ.1.50 లక్షల నుంచి రూ.1.75 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో జీతాల్లో 50 శాతం తాత్కాలికంగా కోత విధిస్తున్నామని, ఫీజులు వసూలయ్యాక మినహాయించిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని 2020 మే 20వ తేదీన జూమ్ మీటింగ్‌లో ఎనీ్టఆర్ ట్రస్టు సీఈవో రాజేంద్రకుమార్ సిబ్బందికి హామీ ఇచ్చారు. వంద మంది బోధనా సిబ్బంది, 20 మందికి పైగా బోధనేతర సిబ్బంది ఇక్కడ పని చేస్తుండగా రూ.పది వేలకు మించి జీతాలు చెల్లిస్తున్న వారికి 16 నెలలు కోత విధించారు. పలువురు అధ్యాపకులకు రూ.2 లక్షల నుంచి రూ.5.25 లక్షల వరకు జీతాల బకాయిలను ట్రస్టు చెల్లించాల్సి ఉంది. కరోనా కష్టకాలంలోనూ కళాశాల నుంచే ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించిన తమకు కనీసం హెల్త్‌కార్డులు ఇవ్వలేదని, గ్రాట్యుటీ ఊసే లేదని ఉద్యోగులు వాపోతున్నారు. వసూలు చేసుకుని.. సిబ్బందికి చెల్లించలేదు.. కరోనా సమయంలో ఫీజులు రాలేదని పేర్కొన్న యాజమాన్యం ఆ తర్వాత విద్యార్థుల నుంచి వసూలు చేసుకున్నా.. సిబ్బందికి మాత్రం బకాయిలు చెల్లించలేదు.. ట్రస్టు సీఈవో, డీన్, ప్రిన్సిపాల్, ట్రస్టీలకు మొరపెట్టుకున్నా స్పందన శూన్యం.. చివరకు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్‌కు తెలియజేసినా కూడా పట్టించుకోలేదు.. అంటూ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని నిర్వాహకులను కోరినందుకు ఓ లెక్చరర్‌ను రెండు గంటల్లో ఇంటికి సాగనంపారు. మరో లెక్చరర్ నుంచి క్షమాపణ లేఖ తీసుకుని హెచ్చరించారు. 9 మందికి లీగల్ నోటీసులు బకాయిల గురించి యాజమాన్యం స్పందించకపోవడంతో తొమ్మిది మంది లెక్చరర్లు ట్రస్టు సీఈవోతో సహా నిర్వాహకులకు లీగల్ నోటీసులు పంపారు. ఏ నెల జీతంలో ఎంత కోత విధించారనే వివరాలను నోటీసుల్లో పొందుపరిచారు. చదవండి: ‘డెక్కన్’లో అగమ్యగోచరం! నాలుగో రోజూ లభించని ఆ ఇద్దరి అవశేషాలు -
బురిడీ బాబు.. నెలన్నర అవుతున్నా పత్తాలేరు..
చంద్రబాబునాయుడు వంచనకు కేరాఫ్.. అని మరోసారి నిరూపితమైంది. అధికారంలో ఉన్నా.. లేకున్నా జనాన్ని బురిడీ హామీలతో వంచన చేయడం అలవాటై పోయింది. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు నేనున్నానంటూ బాధితులకు భరోసా ఇచ్చిన వాడే ప్రజానాయకుడు. కష్టంలో ఉన్న ప్రజలను ఆదుకునే మనస్సు ఉండాలి. ప్రజాక్షేత్రంలో ఇచ్చిన హామీని ఎంత కష్టమైనా నెరవేర్చే సత్తా ఉండాలి. అప్పుడే ప్రజలు ఆ ప్రజానాయకుడి చిత్తశుద్ధిని నమ్మి తమ హృదయాల్లో చోటు కల్పిస్తారు. కానీ చంద్రబాబులో ఏ కోశాన వెతికినా ఇలాంటి లక్షణాలు కనిపించవు. వరద బాధితులను ఆదుకుంటామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నెలన్నర అవుతున్నా.. పత్తాలేకుండాపోయారు. వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఒక్కో గిరిజన కుటుంబానికి రూ.5 వేలు సాయం వెంటనే అందిస్తాం. ఈ ప్రభుత్వానికి పేదలపై ప్రేమ లేదు. నేనున్నాను ఆదుకుంటాను. – ఇది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతేడాది నవంబర్ 25న నెల్లూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ. సీన్ కట్ చేస్తే 43 రోజులు గడుస్తున్నా బాబు హామీ కార్యరూపంలోకి దాల్చలేదు. ఒక్క గిరిజన కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి రూపాయి సాయం అందలేదు. సాక్షి, నెల్లూరు: జిల్లాలో గతేడాది నవంబర్‌లో అతి భారీ వర్షాలు కురిశాయి. వరదలు ఉప్పొంగాయి. పెన్నా పరీవాహక ప్రాంతాల్లో గతంలో మునుపెన్నడూ లేని విధంగా భారీ వరదలు వచ్చాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఎన్నో కుటుంబాలు కట్టుబట్టలతో ప్రాణాలతో బయట పడ్డాయి. తక్షణమే స్పందించిన ప్రభుత్వం బాధితులకు అండగా నిల్చింది. నిరాశ్రయులను పునరావాస కేంద్రాలకు తరలించి ఆదుకుంది. పునరావాస కేంద్రాల్లోనే తక్షణ సాయంగా ప్రభుత్వం రూ.2 వేలు వంతున ఆర్థిక సాయం అందజేసింది. నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆ«ధికార యంత్రాంగం రేయింబవుళ్లు కష్టపడి బాధితులకు బాసటగా నిలిచారు. ఇంత కష్టంలో ప్రభుత్వం స్పందించిన తీరుకు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి విపత్తులు ఎదురైనప్పుడు ఇంత వేగంగా స్పందించిన దాఖలాలు లేవని బాధితులే కాకుండా ప్రజానీకమంతా ముక్తకంఠంతో ప్రశంసలు కురిపించింది. చదవండి: ('బావ మాట బంగారు బాట అన్నట్లు బాలకృష్ణ మాట్లాడుతున్నారు') సాయమంటూ.. యూటర్న్ చంద్రబాబునాయుడు ఏనాడు ఇచ్చిన మాట మీద, చెప్పిన మాట మీద నిలబడిన దాఖలాలు లేవని జిల్లా పర్యటన తర్వాత మరోసారి రుజువువైంది. ఈ ఉదంతం తర్వాత యూటర్న్ తీసుకోవడంలో మరో మైలు రాయిని అధిగమించారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన కోసం చంద్రబాబు గతేడాది నవంబర్ 25న జిల్లాలో పర్యటించారు. నాయుడుపేట నుంచి నెల్లూరు, ఇందుకూరుపేట, భగత్‌సింగ్ కాలనీ ప్రాంతాల్లో పర్యటించారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో పర్యటించి స్థానిక గిరిజన కాలనీకి వెళ్లారు. అక్కడ గిరిజనులతో మాట్లాడుతూ స్థానికంగా ఉన్న 150 కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ప్రతి కుటుంబానికి రూ.5 వేలు చొప్పున రూ.7.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని మాట ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చి ఇప్పటికి దాదాపు 43 రోజులు గడిచింది. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఎలాంటి సాయం అందలేదు. సాక్షాత్తు చంద్రబాబు వచ్చి హామీ ఇచ్చాడు కదా? తప్పక సాయం అందుతుందని పాపం ఆ గిరిజనులు ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు. పలుమార్లు ఆ పార్టీ నేతలను కలిసి అయ్యా.. చంద్రబాబు ఇస్తామన్న రూ. 5 వేలు డబ్బులు రాలేదని చెప్పుకుని వాపోయారు. ఆ టీడీపీ నేతలు కూడా మా బాబుగారంతే? ఇచ్చిన మాట ఎప్పుడూ నెరవేర్చాడు? అలా చేస్తే ఆయన చంద్రబాబు ఎలా అవుతాడంటూ ఎదురు ప్రశ్నించడంతో గిరిజనులు మిన్నకుండిపోయారు. -
‘కరోనా’ సేవ చేద్దాం!
సాక్షి, అమరావతి: కోవిడ్ కష్టకాలంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కలిసి పనిచేద్దామని నటుడు సోనూసూద్‌ను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కోరారు. ఐక్యకార్యాచరణ రూపొందించుకుని ప్రజాసేవ చేద్దామన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్, పలువురు నిపుణులతో ఆయన ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సోనూసూద్ పాల్గొనగా తమతో కలిసి పనిచేయాలని ఆయన్ను చంద్రబాబు కోరారు. సోనూసూద్ ఒక ఐకాన్ అని.. ఆయన్ను తాను స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆరు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటుచేస్తోందని చెప్పారు. మూడో వేవ్ కూడా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారని.. దీనికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమన్నారు. అలాగే, ఆస్పత్రుల్లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించలేకపోయారని ఆరోపించారు. కరోనా బారినపడి నష్టపోయిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తమవంతు కర్తవ్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పనిచేశామన్నారు. సోనూసూద్ మాట్లాడుతూ.. తన సతీమణి ఆంధ్రాకు చెందిన వారేనని, ఏపీతో తనకు ఎప్పటినుంచో అవినాభావ సంబంధం ఉందన్నారు. కోవిడ్ సంక్షోభం అందరికీ గుణపాఠమని చెప్పారు. బాధితులకు మానవత్వంతో తనకు చేతనైన సాయం అందించానని తెలిపారు. -
నేడు ఎన్టీఆర్ పురస్కారాల ప్రదానోత్సవం
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ 22వ వర్ధంతిని పురస్కరించుకొని నేడు (18న) ఎన్టీఆర్ లలితకళా పురస్కారాల ప్రదానోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ గవర్నర్ కె.రోశయ్య హాజరవుతారన్నారు. బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ప్రముఖ సినీనటుడు టి.చలపతిరావు, ప్రముఖ రచయిత్రి డాక్టర్ వాసా ప్రభావతి, ప్రవాసాంధ్రులు సిడ్నీ బుజ్జిలకు ఈ పురస్కారాలను అందజేయనున్నట్లు తెలిపారు. డి.సురేఖా మూర్తి, శశికళా స్వామి తదితరులతో ఎన్టీఆర్ చలనచిత్ర సంగీత విభావరిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతుందని, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. -
సంగీతం, సాహిత్యం పూర్వజన్మ సుకృతం
- హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు - ప్రముఖ గుజరాతీ రచయిత రఘువీర్ చౌదరికి ఎన్టీఆర్ సాహితీ పురస్కారం హైదరాబాద్: సాహిత్యం లేనిదే సంగీతం లేదని, ఈ రెండూ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు చెప్పారు. పూర్వజన్మ సుకృతంవల్లే సాహిత్యం, సంగీతం అబ్బుతాయన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో ప్రఖ్యాత గుజరాతీ రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ రఘువీర్‌చౌదరికి ఎన్టీఆర్ జాతీయ సాహితీ అవార్డును ప్రదానం చేశారు. ఎన్టీరామారావు జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ట్రస్టు నిర్వహించిన ఈ ప్రదానోత్సవంలో జస్టిస్ శివశంకరరావు మాట్లాడుతూ... దేశ సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యాన్ని మనం గుర్తించలేకపోతున్నామని, వాటిని విదేశీయులు దోచుకొంటున్నారని అన్నారు. పౌరాణిక, జానపద చిత్రాలతో ఎన్టీఆర్, ఎస్వీఆర్ వంటి మహానటులు మన సంస్కృతికి పెద్దపీట వేశారన్నారు. బిహార్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి మాట్లాడుతూ... తెలుగు జాతి పట్ల భక్తిభావం, గౌరవం పెరగాలంటే ఎన్టీఆర్ చిత్రాలు చూడాలన్నారు. నేడు సమాజంలో విలువలు ఉన్నాయంటే ఎన్టీఆర్ చిత్రాలే కారణమన్నారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ... తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ‘సాక్షి’ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ... నిస్వార్థం, చిత్తశుద్ధితో సామాన్యుల బాగోగులు తెలుసుకున్న రాజకీయ నాయకులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనన్నారు. 21 ఏళ్లుగా సాహితీ కార్యక్రమాల్ని సంకల్పం, ఆత్మవిశ్వాసంతో నిర్వహిస్తూ, ప్రతిభావంతులకు అవార్డులు ఇవ్వడం ఆనందంగా ఉందని ఎన్టీఆర్ ట్రస్టు చైర్పర్సన్ లక్ష్మీపార్వతి చెప్పారు. నటి గీతాంజలి, అవార్డు కమిటీ సభ్యులు ఓల్గా, సి.మృణాళిని, మాణిక్యాంబ పాల్గొన్నారు. ఈ అవార్డు ప్రత్యేకం: రఘువీర్‌చౌదరి ఎన్ని అవార్డులు వచ్చినా... ఎన్టీఆర్ సాహితీ పురస్కారాన్ని అందుకోవడం ప్రత్యేకమని, ఆనం దంగా ఉందని అవార్డు గ్రహీత రఘువీర్‌చౌదరి చెప్పారు. సినిమాలు, రాజకీయాల్లో సామాన్య ప్రజలకు దగ్గరగా ఉన్నది ఎన్టీఆర్ ఒక్కరేనన్నారు. -
ప్రతి జిల్లాలోనూ పుస్తక ప్రదర్శనలు
విజయవాడ పుస్తకమహోత్సవం ప్రారంభంలో సీఎం వెల్లడి సాక్షి, విజయవాడ: ప్రతి జిల్లాలోనూ పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, భాషా, సాంస్కృతికశాఖ, ఎన్టీఆర్ ట్రస్టులు సంయుక్తంగా నిర్వహిస్తున్న 28వ పుస్తకమహోత్సవాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో చంద్రబాబు మాట్లాడుతూ.. ఇప్పటికే అనంతపురం, తిరుపతి, రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, సమాజం నాలెడ్జ్ సొసైటీగా మారడానికి ఇటువంటి పుస్తకప్రదర్శనలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ విషయాల్లో మీడియా సానుకూల దృక్పథాలతో రాయడం నేర్చుకోవా లని సూచించారు. మంచి సంఘటనలు బాగా పబ్లిష్ చేయాలని పేర్కొన్నారు. ఆన్లైన్లో సమాచారమంతా అందుబాటులో ఉంటున్నప్పటికీ, పుస్తకం చదువుతుంటే పొందే అనుభూతి వేరుగా ఉంటుందన్నారు. పుస్తకం చదవడం ఒక అలవాటుగా పెట్టుకోవాలన్నారు. -
ఇదో అధికార కబ్జా!
-
ఇదో అధికార కబ్జా!
♦ పార్టీ ముసుగులో ఖరీదైన భూములు కాజేసేందుకు సీఎం వ్యూహం ♦ శ్రీకాకుళం, కాకినాడల్లో ఇప్పటికే విలువైన భూములు ఎన్టీఆర్ ట్రస్టుకు సంతర్పణ ♦ రాజధానితో పాటూ జిల్లా కేంద్రాల్లోనూ భూములు కొట్టేయడానికి వీలుగా ఉత్తర్వులు ♦ శాసనసభలో బలం ఆధారంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలకు భూములు కేటాయింపు సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికార దుర్వినియోగానికి ఇదో పరాకాష్ట! టీడీపీ కార్యాలయం ముసుగులో శ్రీకాకుళంలో రూ.30 కోట్ల విలువైన రెండెకరాలు, కాకినాడలో రూ.25 కోట్ల విలువైన రెండువేల చదరపు గజాల భూమిని ఇప్పటికే కాజేశారు. తాజాగా రాజధానితో పాటూ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ రెండు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల దాకా అత్యంత ఖరీదైన భూములను కొట్టేయడానికి ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగానే జాతీయ, ప్రాంతీయ పార్టీలకు రాజధానిలోనూ, జిల్లా కేంద్రాల్లోనూ కార్యాలయాల నిర్మాణానికి భూములను నామమాత్రపు ధరకు 99 ఏళ్లకు లీజులకు కేటాయించేందుకు వీలుగా గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలుగా ఎన్నికల సంఘం గుర్తించిన పార్టీలకు కార్యాలయాల నిర్మాణానికి భూములు కేటాయిస్తారు. కానీ అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగానే భూములు కేటాయించాలనే మెలిక పెట్టడం వెనుక టీడీపీకి భారీ ఎత్తున భూములు దోచిపెట్టడానికే అన్నది స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు శ్రీకాకుళం, కాకినాడల్లో కాజేసిన తరహాలోనే మిగతా జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ఖరీదైన భూములను గుర్తించి, వాటిని కేటాయించాలని కోరుతూ ఆపార్టీ జిల్లాల అధ్యక్షుల ద్వారా ఇప్పటికే సర్కారుకు ప్రతిపాదనలు పంపారు. వ్యూహాత్మకంగా ఉత్తర్వులు.. రాజకీయ పార్టీలకు రాజధాని, జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ఎకరం లోపు భూమిని 30 ఏళ్లకు లీజు పద్ధతిలో కేటాయించేలా ఆగస్టు 31, 1987లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిలో నాలుగు, జిల్లా కేంద్రాల్లో రెండెకరాలకు పైగా ఉన్న అత్యంత ఖరీదైన భూములను పార్టీ కార్యాలయాల ముసుగులో కాజేయడానికి ప్రతిపాదనలు తెప్పించుకున్న సీఎం చంద్రబాబు.. ఆ మేరకు ఉత్తర్వుల్లో సవరణ చేయాలని నిర్ణయించారు. టీడీపీ మినహా మరే ఇతర పార్టీకి భారీ ఎత్తున భూములు దక్కకుండా నిబంధనలు పెట్టాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేసీ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం.. * శాసనసభలో 50 శాతం కన్నా ఎక్కువ స్థానాలు దక్కిన పార్టీకి రాజధానిలో నాలుగు ఎకరాలు, జిల్లా కేంద్రాల్లో రెండు ఎకరాల చొప్పున కేటాయించవచ్చు. * అసెంబ్లీలో 25 శాతం నుంచి 50 శాతం లోపు స్థానాలు దక్కిన పార్టీకి రాజధానిలో అరెకరం వరకూ.. జిల్లా కేంద్రాల్లో వెయ్యి చదరపు గజాల వరకూ కేటాయించవచ్చు. * శాసనసభలో 25 శాతం లోపు స్థానాలుగానీ.. కనీసం ఒక్క స్థానంగానీ దక్కిన పార్టీకి రాజధానిలో వెయ్యి, జిల్లా కేంద్రాల్లో 300 చదరపు గజాల భూమిని కేటాయించవచ్చు. * తొలుత 33 ఏళ్లకు లీజుకు ఇస్తారు.. ఆ తర్వాత 99 ఏళ్ల వరకూ లీజును రెన్యూవల్ చేసుకోవచ్చు. * ఏడాదికి ఎకరానికి గరిష్ఠంగా రూ.వెయ్యి చొప్పున లీజుగా చెల్లించాలి. * కేటాయించిన ఏడాదిలోగా పార్టీ కార్యాలయ నిర్మాణం ప్రారంభించకపోతే ఆ భూమిని వెనక్కి తీసుకునే అధికారం కలెక్టర్‌కు ఉంటుంది. ఆ భూమిని వాణిజ్యపరమైన అవసరాలకు వినియోగించకూడదు. * ఈ నిబంధనల వల్ల రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మినహా తక్కిన విపక్ష పార్టీలకు భూములు దక్కవు. శాసనసభలో 67 మంది సభ్యుల బలం ఉన్న వైఎస్సార్సీపీకి రాజధానిలో గరిష్ఠంగా అరెకరం, జిల్లా కేంద్రాల్లో వెయ్యి చదరపు గజాల భూమిని మాత్రమే లీజుకు పొందే అవకాశం ఉంది. టీడీపీ మిత్రపక్షమైన బీజేపీకి రాజధానిలో వెయ్యి, జిల్లా కేంద్రాల్లో 300 చదరపు గజాల భూమి కేటాయించే అవకాశం ఉంది. సంఖ్యా బలం ఆధారంగా భూములు కేటాయించడంపై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. -
పెదబాబు ప్లాన్ వేస్తే లోకేష్ స్కెచ్ వేసేశారు
ప్రజాప్రయోజనాల్ని తెలుగుదేశం పార్టీ నేతలు మంటగలిపేస్తున్నారు. రాజధాని ఒక చోట వస్తుందని ప్రచారం చేసి వాళ్లకు కావాల్సిన చోట భూముల్ని తక్కువ ధరలకు కొనుగోలు చేసేసి, డీ పట్టాల్నీ వదలకుండా, భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడి తరువాత తాము కోరుకున్న చోటే రాజధాని ప్రాంతాన్నిప్రకటించిన ఘనులు టీడీపీలో ఉన్నారు. ఇప్పుడు జిల్లా నేతలూ అదే పని చేస్తున్నారు. ప్రజాప్రయోజనాల పేరిట ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిలో పార్టీ కార్యాలయ నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టి జిల్లాలో బలహీనవర్గాలను ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ప్రజాప్రయోజనాల పేరిట సాంఘిక సంక్షేమశాఖ 1984లో శ్రీకాకుళంలో కొద్ది స్థలాన్ని భూ సేకరణ చేసింది. టీడీపీ హయాంలో నిర్మాణాలేవీ జరగలేదు. పేదలకు ఇళ్లు నిర్మించేందుకు కాంగ్రెస్ హయాంలో అక్కడ వాంబేకాలనీ నిర్మించారు. పట్టణ ప్రాంతంలో ఉన్న స్థలంలో ఇళ్ల నిర్మాణం అనంతరం మిగిలిన కొద్ది స్థలాన్ని స్థానిక అవసరాల కోసం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మునిసిపాలిటీకీ అధికారం అప్పగించారు. ఇప్పుడదే స్థలంలో ఎన్టీఆర్ ట్రస్ట్ పేరిట క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని పార్టీ కార్యాలయం నిర్మించేందుకు పనులు జరిపిస్తున్నారు. 99యేళ్లకు ప్రభుత్వం నుంచి ఏడాదికి రూ.25వేలకు లీజుగా తీసుకుని మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.25కోట్ల విలువ చేసే స్థలంలో సుమారు 2ఎకరాల స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించే ప్రయత్నం జిల్లా ప్రజలకు రుచించడం లేదు. వాస్తవానికి 80అడుగులో రోడ్డులో 1.50ఎకరాల స్థలంలో పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటే జిల్లా యంత్రాంగం నాయకుల అడుగులకు మడుగులెత్తేలా రెండెకరాల స్థలాన్నీ చూపించేసింది. అద్దె కార్యాలయాన్ని కొన్నాళ్లపాటు నడిపి వాస్తు బాగోలేదంటూ మరోచోటకు మార్చి నిర్వహణ ఖర్చుల్నీ ఎవరు భరిస్తారంటూ వాదులాడుకుంటున్న తమ్ముళ్లు హైటెక్ హంగులతో కొత్తగా కార్యాలయం నిర్మించేందుకు సిద్ధమైపోతున్నారు. పదేళ్లపాటు పదవులకు దూరమైన నాయకులు జీవితాంతం పార్టీ పేరిట కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్‌కు దఖలు పడేలా స్థలాన్ని దక్కించేపనిలో ఉన్నారు. ఉన్న స్థలం వ్యాపారానికి.. బలగ ప్రాంతంలో ఎన్టీఆర్ అభిమాని ఒకరు పార్టీ ప్రయోజనాలకు స్థలం అప్పగిస్తే ఆయన తదనంతరం ఆ స్థలాన్ని టీడీపీ నాయకులు మార్కెట్లో అమ్మకాలకు పెట్టారు. బహిరంగ మార్కెట్లో ఆ స్థలానికి భారీ ధర పలుకుతుండడంతో ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగారు. వచ్చే డబ్బుతో మరోచోట పార్టీ కార్యాలయానికి స్థలం కొనుగోలు చేసే ఆలోచన కాకుండా ప్రభుత్వం తమదే కనుక ప్రజాప్రయోజనాల్ని మంటగలిపైనా స్థలం దక్కించుకోవాలని భావించి 80అడుగుల రోడ్డులో పార్టీ కార్యాలయ పనులకు సిద్ధమైపోయారు. అదే రోడ్డులో ఎంపీ కూడా ఓ భవన నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. ఆ నిర్మాణానికి అధికారిక ప్లాన్ లేకపోయినా, విశాఖ ఉడా అధికారులకు దరఖాస్తు చేసుకున్నామంటూ భారీ హంగులతో నిర్మించేస్తుండడంపై ఆక్షేపణలున్నాయి. సాధారణ ప్రజలు ఓ ఇల్లు నిర్మాణం చేస్తే నానా యాగీ చేసే మునిసిపల్ అధికారులు..నేతల ఒత్తిళ్లకు మిన్నకుండిపోయారు. హంగామా గుర్తురాలేదా? పార్టీ కార్యాలయం కోసం ప్రభుత్వం భూములు కేటాయించడం సహజమే. కాంగ్రెస్ హయాంలో స్థానిక ఇందిరాభవన్ పనులు జరుగుతున్న సమయంలో టీడీపీ నేతలు నానా హంగామా చేశారు. అప్పటి మంత్రి ధర్మానకు వ్యతిరేకంగా హడావుడి సృష్టించారు. అనంతర కాలంలో ట్రస్ట్‌పేరిట నడుస్తున్న టౌన్హాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయం కోసం లీజుకు తీసుకుంటే పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ప్రచారం చేశారు. సాక్ష్యాత్తూ ట్రస్ట్ చైర్మన్ అంగీకారం మేరకు పక్కాగా లీజుకు తీసుకున్న స్థలంపైనే యాగీ చేసిన టీడీపీ నేతలు..ఇప్పుడు ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మించేందుకు ముందుకు వెళ్తుండడాన్ని ఆ పార్టీలో ద్వితీయ శ్రేణీ తప్పుపడుతోంది. సొంతగూడు కోసం జిల్లా జనాన్ని ఏప్రిల్ ఫూల్ చేస్తోందని అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చినబాబు స్కెచ్ పెదబాబు పార్టీ కార్యాలయ కోసం ప్లాన్ వేస్తే చినబాబు లోకేష్ స్కెచ్ వేసేశారు. పార్టీ కార్యాలయం ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ ఏ విధంగా గదుల నిర్మాణం సాగాలి, ముహూర్తం ఎలా అన్న విషయాలన్నీ సీఎం తనయుడి ఆధ్వర్యంలోనే సాగినట్టు తెలుస్తోంది. శుక్రవారం, ఏప్రిల్ 1న ఉదయం 10గంటలకు పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేసేశారు. ఈ మేరకు రెండు రోజుల నుంచి స్థలాన్ని చదును చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కళా వెంకట్రావు, జిల్లా ఇన్చార్జి మంత్రి సునీత, జిల్లా మంత్రి, ఎంపీ సహా పార్టీ క్యాడర్‌కు ఆహ్వానాలు పంపినట్టు తెలిసింది. తొలుత చినబాబును కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిద్దామని భావించారు. అదే రోజు సీఎం మనుమడి పుట్టినరోజు కావడంతో, పార్టీ కార్యాయ నిర్మాణం పూర్తయితే ప్రారంభోత్సవానికి వస్తానని చినబాబు హామీ ఇచ్చినట్టు తెలిసింది. -
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉపకార వేతనాలు
ఎంపికకు 31న పరీక్ష సాక్షి, హైదరాబాద్: ఇంటర్ చదివే 25 మంది విద్యార్థినులకు నెలకు ఐదు వేల వంతున ఉపకారవేతనాలు ఇవ్వనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో విష్ణువర్ధన్, సీవోవో మోహన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికకు ఈనెల 31న గండిపేటలోని ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్లో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆబ్జెక్టివ్ పద్ధతిలో 100 మార్కులకు నిర్వహించే పరీక్షలో లెక్కలు, సైన్సు, ఇంగ్లీషు, సాంఘిక శాస్త్రం, కరెంటు అఫైర్స్, జనరల్ నాలెడ్జి, రీజనింగ్ ప్రశ్నలుంటాయి. విద్యార్థినులు www.ntrtrust.org ఎడ్యుకేషన్ విభాగంలో దరఖాస్తు నింపి, ఈ నెల 24 ఉదయం 10 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు రిజిష్టర్ చేసుకోవాలన్నారు. -
నేడు లెజండరీ బ్లడ్ డొనేషన్: ఎన్టీఆర్ ట్రస్ట్
సాక్షి,హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు 20వ వర్ధంతి సందర్భంగా సోమవారం ‘లెజండరీ బ్లడ్ డొనేషన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో టి.విష్ణువర్ధన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగే ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ సభ్యులు నారా భువనేశ్వరి, లోకేష్, బ్రహ్మణి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అలాగే ‘తెలుగు వారి జ్ఞాపకం’ పేరుతో నిర్వహించే ఎన్టీఆర్ సినీ, రాజకీయ విశేషాలకు సంబంధించిన ప్రదర్శన కార్యక్రమంలో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. -
ఎన్టీఆర్ ట్రస్టు విరాళాల ఖర్చు చెప్పాలి: లక్ష్మీపార్వతి
ఎన్టీఆర్ లలిత కళా అవార్డుకు హాస్య నటి శ్రీలక్ష్మి ఎంపిక సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో వసూలు చేసిన కోట్లాది రూపాయాల విరాళాలను ఎన్టీఆర్ ట్రస్టు దేనికి ఖర్చు పెడుతుందో ప్రజలకు లెక్క చెప్పాలని ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీ పార్వతి డిమాండ్ చేశారు. ఆమె బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఇటీవల కాలంలో టస్ట్రు విరాళాలను సేకరించేందుకు ప్రత్యేకంగా నారా లోకేష్ విదేశీ పర్యటన చేసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ పేరుతో వసూలు చేసిన విరాళాలు పేదవాళ్లకే ఉపయోగించాలన్నారు. వాటిని టీడీపీ కార్యకర్తలకు వినియోగించడం సమంజసం కాదని చెప్పారు. ఎన్టీఆర్‌ను మోసం చేసినవాళ్లు, కుటుంబసభ్యులు ఇప్పుడు ఆయన పేరు చెప్పుకుని బతుకుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ వర్ధంతిన రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు భువనేశ్వరి ప్రకటించడంపై ఆమె స్పందిస్తూ... ఆ సేకరించిన రక్తాన్ని ఏం చేస్తారో చెప్పాలన్నారు. రాజకీయ మోసానికి గురై గుండెపోటుతో మరణించిన ఎన్.టి.రామారావు సార్మకార్థం ఆయనిచ్చిన డబ్బులతోనే ఏటా తాను అవార్డులను ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఎన్టీఆర్ లలిత కళా అవార్డుకి సినీ రంగం నుంచి హాస్య నటి శ్రీలక్ష్మిని ఎంపిక చేసినట్లు చెప్పారు. సాహిత్య రంగం నుంచి రచయిత్రి డి. కామేశ్వరి, శ్రీరామారావులను ఎంపిక చేసినట్లు ఆమె తెలిపారు. -
చంద్రబాబును ఇరకాటంలో పెట్టిన కోడలు
* తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అంటూ బ్రహ్మణి ప్రకటన * దీంతో ఏపీలో ఉద్యోగ ప్రకటనలు లేవని చెప్పినట్లయిందని బాబు మథనం హైదరాబాద్: తన కోడలు బ్రహ్మణి చేసిన ప్రకటనతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరకాటంలో పడ్డారని తెలిసింది. ఎలా ప్రతిస్పందించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారట కూడా. ఇంతలా చంద్రబాబును ఇబ్బందుల్లో పడేసే విధంగా ఆయన కోడలు బ్రహ్మణి చేసిన ప్రకటన ఏంటంటే...? తెలంగాణలో గ్రూప్ 1, 2 వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో 60 మందికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తామని ఈ మధ్యనే విలేకరుల సమావేశంలో ప్రకటించారు. శిక్షణ పొందాలనుకున్న వారు ట్రస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. బ్రహ్మణి ప్రకటనతో చంద్రబాబు సంకట పరిస్థితుల్లో పడ్డారు. ఎందుకంటే విభజన అనంతరం తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ శాఖల్లో ప్రస్తుతం 1.42 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డిమాండ్ వస్తున్నప్పటికీ ఆయనపట్టించుకోవడం లేదు. పైగా అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి ఏడాదిన్నర కావొస్తున్నా ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మరోపక్క కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. రాష్ట్రానికి కనీసం ప్రత్యేక హోదా దక్కినా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశించిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తామన్న బ్రహ్మణి ప్రకటనతో అటు తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టినట్లు.. మరోవైపు ఏపీలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేకపోతున్నట్లు ప్రజలకు తామే చెప్పినట్లయిందని చంద్రబాబు మథనపడ్డారట. బ్రహ్మణి ప్రకటనతో ఏపీ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయడం లేదన్న విషయాన్ని ఎత్తిచూపినట్టయిందని టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారు. -
చంద్రబాబును ఇరకాటంలో పెట్టిన కోడలు బ్రహ్మిణి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కోడలు బ్రహ్మిణి చేసిన ప్రకటనతో ఇరకాటంలో పడ్డారట. ఆ ప్రకటనపై ఎలా ప్రతిస్పందించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారట కూడా. ఇంతకు చంద్రబాబు ఇబ్బందుల్లో పడేసే విధంగా ఆయన కోడలు బ్రహ్మిణి చేసిన ప్రకటన ఏంటంటే...? గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, యువకుల్లో ఓ 60 మందికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తామంటూ ప్రకటించారు. అలా శిక్షణ పొందాలనుకున్న వారు బుధవారంలోగా ట్రస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణలోని పలు జిల్లా కేంద్రాల్లో ప్రాథమిక స్థాయి పరీక్షలు నిర్వహించి ఎంపికైన వారికి శిక్షణ ఇస్తామని వెల్లడించారు. బ్రహ్మిణి ఈ ప్రకటన చేయడం వల్ల చంద్రబాబుకు వచ్చిన ఇబ్బందేమంటే...? ఉద్యోగాల భర్తీ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో వేలాది సంఖ్యలో నిరుద్యోగులు ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ శాఖల్లో ప్రస్తుతం 1.43 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డిమాండ్ వస్తున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుపై నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెంచుకున్నారు. అధికారం చేపట్టి ఏడాదిన్నర పూర్తి కావొస్తున్నా ఇప్పటివరకు ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకపోగా ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టారు. ఎప్పుడు తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తారోనని నిత్యం ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రానికి కనీసం ప్రత్యేక హోదా దక్కినా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశించిన వారికి అది కూడా దక్కకపోవడం నిరుద్యోగుల్లో ఆందోళన మరింత పెరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తామన్న బ్రహ్మిణి ప్రకటన వల్ల అటు తెలంగాణలో ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టినట్టు... మరోవైపు ఏపీలో ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేకపోతోందని ప్రజలకు తెలియజేసినట్లు అయిందని చంద్రబాబు మథనపడ్డారట. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు కోడలు బ్రహ్మిణి ఉచితంగా శిక్షణ ఇస్తామని చెబుతూ ఏపీలో ఖాళీగా ఉన్న 1.43 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం లేదన్న విషయాన్ని ఎత్తి చూపినట్టయిందని టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారు. -
సమాజ పరిశీలనతోనే పట్టు సాధిస్తాం
{పముఖ కథకుడు కాళీపట్నం రామారావు కాళీపట్నంకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ప్రదానం హైదరాబాద్ : సమాజాన్ని సునిశిత అధ్యయనం చేయడం వల్లనే విషయసమగ్రత, వివిధ అంశాలపై పట్టు సాధించగలమని ప్రముఖ కథకుడు, శ్రీకాకుళం కథానిలయం నిర్వాహకుడు కాళీపట్నం రామారావు అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో కాళీపట్నంకు ‘ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారాన్ని అందజేశారు. ఈ సభలో రామారావు మాట్లాడుతూ పెద్దలు చెప్పిన విషయాలను తెలుసుకోవడంతో పాటు, స్వీయ అధ్యయనమే తనను కథకునిగా సాహితీ రంగంలో నిలుచోబెట్టిందన్నారు. ఇది రచయితలకు ఎంతో అవసరమన్నారు. తనకు అవార్డు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ మండలి చైర్మన్ ఎ.చక్రపాణి మాట్లాడుతూ రాజకీయాల్లో సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసి ఎన్టీఆర్ పేదల గుండెల్లో నిలిచిపోయారన్నారు. తెలుగుజాతి చరిత్రలో ఆయనది విశిష్ట స్థానమన్నారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎన్. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు సంబంధించిన సమస్తం వారి కుమారులు, బంధువులు తీసుకెళ్లారన్నారు. తనకు మాత్రం ఆయనకు సేవ చేసే అవకాశం మిగిల్చారన్నారు. ఆ సేవాదృక్పథంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పారు. ఎన్టీఆర్‌కు సేవ, సాహిత్యం అంటే ఇష్టమన్నారు. అందుకే తెలుగువారికే కాకుండా అంతర్జాతీయంగా ఇతర భాషల్లోని సాహితీవేత్తలను సత్కరిస్తున్నామన్నారు. తన ఇల్లే కథా నిలయంగా భావించి సాహిత్యానికి సేవ చేస్తున్న డాక్టర్ కాళీపట్నం రామారావుకు ‘ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారం’తో సత్కరించి, రూ. లక్ష నగదు పురస్కారం అందజేస్తున్నామన్నారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి తన ప్రసంగంలో ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ కె.ఐ. వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ తమిళనాడులో ఎంజీఆర్ పేరుతో మ్యూజియం ఉన్నట్లుగా ఇక్కడ ఎన్టీఆర్‌కు మ్యూజియం ఏర్పాటు చేయాలన్నారు. ‘యజ్ఞం’ కథ కాళీపట్నంకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిందని తెలిపారు. ఈ సందర్భంగా వరప్రసాదరెడ్డి తనవంతుగా రూ.లక్ష (రూపాయి తక్కువ) చెక్కును కాళీపట్నంకు అందజేశారు. ఆయన నిర్వహిస్తున్న కథా నిలయానికి దీన్ని విరాళంగా ప్రకటించారు. అనంతరం కాళీపట్నం రామారావుకు పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రణతి ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకొంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, ఎన్ఆర్ఐ డాక్టర్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి, సినీనటుడు కోటా శ్రీనివాసరావు, సాహితీ వేత్తలు రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, సాహితీ వేత్త ఎ.ఎన్. జగన్నాథశర్మ తదితరులు పాల్గొన్నారు. -
నోటీసులు నిజమే
* ఎన్టీఆర్ ట్రస్ట్ అంగీకారం * సర్వీస్ ట్యాక్స్ విభాగాన్ని సంప్రదిస్తున్నామన్న సీఈవో సాక్షి, హైదరాబాద్: సేవా పన్ను చెల్లింపులకు సంబంధించి సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగం నోటీసులు జారీ చేసిన మాట వాస్తవమేనని ఎన్టీఆర్ ట్రస్ట్ అంగీకరించింది. ‘సేవా పన్నుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎగనామం’ పేరుతో గురువారం ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ట్రస్ట్ సీఈవో చుక్కా కొండయ్య వివరణ ఇచ్చారు. నోటీసులపై ఆ విభాగంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రస్టీ పదవికి రాజీనామా చేసి ఏడాది దాటిందని, ప్రస్తుతం ట్రస్ట్‌కు చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ 1997లో ఆదాయపు పన్ను చట్టం-1961లోని 12 (ఎ) సెక్షన్ ప్రకారం రిజిస్టర్ అయ్యిందని, 80 (జి) సెక్షన్ ప్రకారం మినహాయింపులు పొందుతోందని కొండయ్య పేర్కొన్నారు. సేవా పన్ను బకాయిలపై సర్వీస్ ట్యాక్స్ విభాగానికి ఈడీ లేఖ రాసిన విషయం తమకు తెలియదన్నారు. తాము 2014 సెప్టెంబర్‌లో సేవా పన్ను విభాగంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని, 2012 జూలై నుంచి పన్ను చెల్లించామని పేర్కొన్నారు. ట్రస్ట్ సర్వీసు ట్యాక్స్ విభాగానికి రూ.70 లక్షలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రూ.50 లక్షల కంటే ఎక్కువ బకాయి ఉన్న వారిపై నాన్-బెయిలబుల్ వారంట్ తీసుకునే అవకాశం అధికారులకు లేదని పేర్కొన్నారు. వీటికి సమాధానం ఏది? * ఎన్టీఆర్ ట్రస్ట్-తెలుగుదేశం పార్టీల మధ్య అద్దె ఒప్పందం 2009 నవంబర్ 11న జరిగింది. ఒప్పందం జరిగిన సమయంలో చంద్రబాబు ట్రస్ట్‌లో మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. ఆ విషయాన్ని కొండయ్య తన వివరణలో చెప్పలేదు. * సేవా పన్ను మినహాయింపు పొందాలంటే ఆదాయపుపన్ను చట్టంలోని 12(ఎ) (ఎ) కింద రిజిస్టరై ఉండాలని నిబంధనలు చెప్తున్నాయి. * ‘ఎన్టీఆర్ ట్రస్ట్-సేవా పన్ను’పై 2014 సెప్టెంబర్ 23న ఈడీ సంయుక్త డెరైక్టర్ కేఎస్‌వీవీ ప్రసాద్ సర్వీస్ ట్యాక్స్ విభాగానికి (ఎఫ్.నం.టీ-3/44/హెచ్‌జెడ్0/2011/2350) లేఖ రాశారు. * ఈ లేఖ సర్వీస్ ట్యాక్స్ అధికారులకు చేరిన వారం రోజులకు 2014 సెప్టెంబర్ 30న ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా పన్ను విభాగంలో ఫామ్ ఎస్టీ-2 ప్రకారం రిజిస్టర్ చేయించుకుంది. ఈ విషయాన్ని ట్రస్ట్ తన వివరణలో ఎక్కడా ప్రస్తావించలేదు. * సేవా పన్ను ఎంత చెల్లించాల్సి ఉందన్న విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదు. 2012లో నెగటివ్ లిస్ట్ వెలువడగా... 26 నెలల తర్వాత 2014లో రిజిస్టర్ చేయించుకున్న ట్రస్ట్.. ఆ మరుసటి రోజే (2014 అక్టోబర్ 1) ఆన్లైన్ ద్వారా రూ.31,68,518 చెల్లించింది. అప్పటికే ట్రస్ట్ రూ.64,61,149 బకాయి ఉన్నట్లుగా అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని ప్రస్తావించలేదు. * 1994 నాటి ఆర్థిక చట్టానికి చేసిన సవరణ 2013 మే 10 నుంచి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం రూ.50 లక్షలకు మించి బకాయిలు ఉండి, ఉద్దేశపూర్వకంగా ట్యాక్స్ చెల్లించని వారిని కమిషనర్ అనుమతితో సూపరింటెండెంట్ స్థాయి అధికారి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించే అవకాశంఉంది. -
సేవా పన్నుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎగనామం
-
సేవా పన్నుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎగనామం
ఈ సంస్థకు ట్రస్టీలు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్ నాలుగేళ్లకు పైగా సేవా పన్ను చెల్లించని వైనం ...........శ్రీరంగం కామేష్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతృత్వంలో పనిచేస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) కన్నేసింది. ఆ ట్రస్ట్ పన్ను ఎగవేసినట్టుగా గుర్తిం చింది. నాలుగేళ్ళకు పైగా సెంట్రల్ ఎకై్సజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగానికి సేవల పన్ను చెల్లించకుండా వ్యవహారాలు నడిపిన వైనంపై సదరు విభాగానికి ఉప్పందించింది. తాజాగా సెంట్రల్ ఎకై్సజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగం.. ఆ ట్రస్ట్‌కు తుది తాఖీదులు జారీ చేసింది. టీడీపీ నుంచి అద్దె వసూలు చేస్తున్న ట్రస్ట్ 1997లో ఏర్పాటైన ఈ ట్రస్ట్‌కు సీఎం చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, వారి కుమారుడు లోకే శ్తో పాటు డాక్టర్ వి.జయరామిరెడ్డి ట్రస్టీలుగా ఉన్నారు. ట్రస్ట్ ఆధీనంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ (బంజారాహిల్స్)ను వీరే నిర్వహిస్తున్నారు. ఇందులోని 35 వేల చదరపు అడుగుల స్థలాన్ని 2009లో నెలకు రూ.10.5 లక్షల చొప్పున టీడీపీకి అద్దెకు ఇచ్చారు. వాణిజ్య అవసరాలకు తమ స్థలాలు, భవనాలను అద్దెకు ఇచ్చే వ్యక్తులు, సంస్థలు.. అద్దెకు ఉంటున్న వారి నుంచి నిర్ణీత అద్దెతో పాటు అదనంగా 12.36 శాతం (ఈ బడ్జెట్లో దీన్ని 14 శాతానికి పెంచారు) చొప్పున సర్వీసు ట్యాక్స్‌ను వసూలు చేసి.. ఆ మొత్తాన్ని సెంట్రల్ ఎకై్సజ్‌కు చెల్లించాలి. కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అలా చేయకుండా 2014 వరకు కార్యకలాపాలు సాగించింది. ఈడీ దర్యాప్తులో వెలుగులోకి: గత సాధారణ ఎన్నికల అనంతరం.. టీడీపీకి వచ్చిన విరాళాలు, ఆ పార్టీ చేసిన ఖర్చులపై ఈడీ దర్యాప్తు చేసింది. ఈ క్రమంలో టీడీపీ-ఎన్టీఆర్ ట్రస్ట్ మధ్య ఉన్న అద్దె చెల్లింపు ఒప్పందం, ట్రస్ట్ సేవా పన్ను చెల్లించకపోవడం వెలుగులోకి వచ్చా యి. ఈ విషయాన్ని ఈడీ జాయింట్ డెరైక్టర్ కేఎస్‌వీవీ ప్రసాద్ గత ఏడాది సెప్టెంబర్ 23న సర్వీస్ ట్యాక్స్ విభాగానికి రహస్య లేఖ (ఎఫ్ నెం. టి-3/44/హెచ్‌జెడ్0/2011/2350) ద్వారా తెలియజేశారు. దీం తో సర్వీస్ ట్యాక్స్ విభాగం గత ఏడాది అక్టోబర్‌లో ట్రస్టీలకు నోటీసు జారీ చేసింది. దీంతో.. అద్దె స్వీకరిస్తున్నప్పటికీ అప్పటివరకు సర్వీస్ ట్యాక్స్ విభాగంలో రిజిస్టర్ చేసుకోని ట్రస్ట్.. వెనువెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేసింది. అరెస్టు తప్పించుకునేందుకు ట్రస్ట్ ప్రతినిధులు సదరు డిపార్ట్మెంట్ను సంప్రదించినప్పుడు అద్దె ఒప్పంద పత్రం లో ఎక్కడా సర్వీస్ ట్యాక్స్ ప్రస్తావన లేకపోవడం, ఒప్పందం కమ్ వాల్యూ (చెల్లించిన అద్దెలోనే సేవల పన్ను కూడా కలిపి ఉండటం) విధానంలో ఉందని నిర్ధారించిన అధికారులు.. అద్దె ద్వారా వచ్చే ఆదాయం లో 10.3 శాతం (కమ్ వాల్యూ విధానంలో 12.36% కాకుండా 10.3% వసూలు చేస్తారు) చొప్పున సేవా పన్ను చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఆ విధంగా 2009 అక్టోబర్ నుంచి 2014 మార్చి వరకు రూ.70 లక్షల వరకు కట్టాలని మరో నోటీసు జారీ చేశారు. రూ.50 లక్షలకు మించి సేవల పన్ను బకాయిపడిన వారిపై నాన్-బెయిలబుల్ వారెంట్ తీసుకుని అరెస్టు చేసే అధికారం ఉంటుందని తెలుసుకున్న ట్రస్టీలు.. వెంటనే రూ.30 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత ట్రస్ట్ నుంచి స్పందన లేకపోవడంతో సర్వీస్ ట్యా క్స్ అధికారులు.. ఇటీవల తుది తాఖీదులు సైతం జారీ చేశారు. సరైన స్పందన రానిపక్షంలో ట్రస్ట్ భవన్‌పై దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
పరిషత్ జాగాలో ‘పచ్చ’పాగాకు సై
సాక్షి ప్రతినిధి, కాకినాడ : నిరుపేదలు భయపడినట్టే కోట్ల విలువైన జెడ్పీ స్థలాన్ని తెలుగుదేశం పరం చేసేందుకు జిల్లా పరిషత్ ‘పచ్చ’జెండా ఊపింది. ‘పరిషత్ జాగాలో పచ్చపాగా’ అంటూ జెడ్పీ స్థలంపై అధికార పార్టీ కన్నేసిన వైనాన్ని ‘సాక్షి’ ఈ నెల 21నే వెలుగులోకి తెచ్చినసంగతి తెలిసిందే. టీడీపీ జిల్లా కార్యాలయం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో 99 ఏళ్లు లీజుకు ఇచ్చే ప్రతిపాదనకు ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా.. ఆమోదిస్తూ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. కాకినాడ పాతబస్టాండ్ సమీపంలో జెడ్పీకి చెందిన ఆ భూమి లీజు అంశాన్ని జెడ్పీ చైర్పర్సన్ నామన రాంబాబు సభ దృష్టికి తీసుకువచ్చారు. కోట్ల విలువైన భూమిని ఒక పార్టీకి ఏ విధంగా ధారాదత్తం చేస్తారని కిర్లంపూడి జెడ్పీటీసీ సభ్యుడు వీరంరెడ్డి రామలింగేశ్వరరావు(కాశీ బాబు) అభ్యంతరం వ్యక్తం చేశారు. జెడ్పీ ఉద్యోగులకు జి ప్లస్ 2 ప్లాట్ల నిర్మాణానికి గత జెడ్పీలో తీర్మానం చేయగా, పార్టీకి ఎలా లీజుకిస్తారని ప్రతిపక్ష నాయకుడు జ్యోతుల నవీన్‌కుమార్ ప్రశ్నించారు. ‘ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం తీర్మానం చేస్తున్నారు.. కానీ టీడీపీ కార్యాలయం కోసమే అంటున్నారు. ఇందులో ఏది వాస్తవమో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ట్రస్ట్ అంటే ఒక చైర్మన్, డెరైక్టర్లు, అడిగేందుకు ఒక పద్ధతి ఉండదా అని రావులపాలెం జెడ్పీటీసీ సాకా ప్రసన్న కుమార్ ప్రశ్నించారు. మెజార్టీ ఉంది కదా అని అడ్డగోలు తీర్మానాలు చేస్తూ కోట్ల విలువైన భూములు ఎవరికి పడితే వారికి ధారాదత్తం చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ‘ఇక్కడ తీర్మానం చేసినంత మాత్రాన భూమిని ఇచ్చేసినట్టు కాదని, ప్రభుత్వానికి వెళ్లాలి, కేబినెట్లో తీర్మానం కావాలి అప్పుడు కానీ అవదు..ఇదంతా జరగాలంటే చాలా సమయం పడుతుం’దంటూ చైర్పర్సన్ నామన తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.26.18 కోట్లను ప్రతిపాదిత 38 మంచినీటి పథకాల నిర్వహణ, మరమ్మతులకు ఖర్చు చేసేందుకు, జెడ్పీ చైర్‌పర్సన్‌కు కొత్తగా ఇన్నోవా కారు కొనుగోలుకు అనుమతిస్తూ తీర్మానాలను ఆమోదించారు. ఏడు స్థాయీ సంఘాలు ఏకగ్రీవం ప్రణాళిక ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య వైద్య సేవలు, మహిళా, సాంఘిక సంక్షేమం, పనుల నిర్వహణ స్థాయా సంఘాలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీటిలో వ్యవసాయం, సాంఘిక సంక్షేమం స్థాయా సంఘాలు మినహా ఐదింటికీ జెడ్పీ చైర్‌పర్సనే చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. వ్యవసాయ స్థాయా సంఘానికి వైస్ చైర్మన్ పెండ్యాల నళినీకాంత్, సాంఘిక సంక్షేమానికి పాలపర్తి రోజా ఎన్నికయ్యారు. ఒక్కో సంఘంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీ సభ్యులతో కలిసి 15 మంది సభ్యులున్నారు. -
నేతలపై తెలుగు తమ్ముళ్ల గుర్రు
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : పార్టీ కోసం అహర్నిశలు కష్టించి సేవలందిస్తే తీరా ఎన్నికల తరుణంలో తమను విస్మరిస్తున్నారని పట్టణంలోని తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ జెండాలను మోస్తూ ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొన్న తమను నాయకులు చిన్నచూపు చూస్తున్నారని ఆవేదనకు గురవుతున్నారు. ఇప్పటివరకు పార్టీలో లేని వ్యక్తికి, పార్టీలోకి వస్తారనుకున్న వారికి మునిసిపల్ ఎన్నికల్లో చైర్మన్‌గిరీ అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టనున్నారనే వార్తల నేపథ్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు నేతల తీరుతో మండిపడుతున్నారు. కేవలం క్యాష్, క్యాస్ట్ లెక్కలతో ఇప్పటివరకు పార్టీకి సేవలందించిన వారిని పట్టించుకోకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మునిసిపల్ చైర్మన్ పదవి బీసీ మహిళలకు రిజర్వ్ అవుతుందని తొలుత అందరూ భావించారు. ఈ క్రమంలో పార్టీలో ఉంటున్న ఈ సామాజిక వర్గాలకు చెందిన నేతలు తమ కుటుంబాలలోని మహిళలను రంగంలోకి దింపాలని నిర్ణయించి, ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఆయా ప్రాంతాలలోని ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. వార్డు కౌన్సిలర్ స్థాయి నుంచి చైర్మన్ పదవి వరకు పోటీలో నిలపడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్న తరుణంలో అనుకోని రీతిలో అన్రిజర్వ్డ్ వర్గాలకు మునిసిపల్ చైర్మన్ పదవిని కేటాయించడంతో బీసీ వర్గాల నాయకుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. అయినా ఆర్థిక, అంగబలం ఉన్న బీసీ వర్గాల నాయకులు బరిలోకి చైర్మన్‌గా దిగాలని భావించారు. ఈ లోగా త్వరలో టీడీపీలోకి ఎమ్మెల్యే, అతని అనుచర వర్గం చేరవచ్చనే ప్రచారం మొదలైంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్యాకే జీలో గూడెం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇక్కడి నేతకు అత్యంత దగ్గరగా ఉండే అనుచరుల్లో ఒక్కరుగా ఉన్న మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బొలిశెట్టి శ్రీను టీడీపీ తరపున బరిలోకి దిగుతారని ప్రచారం ఒక్కపారిగా ఊపందుకుంది. ఇక్కడి కీలకనేత ద్వారా మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్టు వర్గాలను ఆయన కలసి సీటు విషయంలో హామీ పొందారని చర్చించుకుంటున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు పార్టీ కీలక నేతల తీరుపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. పార్టీకి విశేష సేవలందిస్తున్నవారికి ఇస్తున్న గుర్తింపు ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాలను పార్టీ అధినేత బాబుకు లేఖల రూపంలో పంపడానికి సన్నద్ధమవుతున్నారు.