నేతలపై తెలుగు తమ్ముళ్ల గుర్రు | telugu desam leaders fire higher authorities | Sakshi
Sakshi News home page

నేతలపై తెలుగు తమ్ముళ్ల గుర్రు

Published Wed, Mar 5 2014 2:59 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM

telugu desam leaders fire higher authorities

 తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : పార్టీ కోసం అహర్నిశలు కష్టించి సేవలందిస్తే తీరా ఎన్నికల తరుణంలో తమను విస్మరిస్తున్నారని పట్టణంలోని తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ జెండాలను మోస్తూ ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొన్న తమను నాయకులు చిన్నచూపు చూస్తున్నారని ఆవేదనకు గురవుతున్నారు. ఇప్పటివరకు పార్టీలో లేని వ్యక్తికి, పార్టీలోకి వస్తారనుకున్న వారికి మునిసిపల్ ఎన్నికల్లో చైర్మన్‌గిరీ అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టనున్నారనే వార్తల నేపథ్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు నేతల తీరుతో మండిపడుతున్నారు. కేవలం క్యాష్, క్యాస్ట్ లెక్కలతో ఇప్పటివరకు పార్టీకి సేవలందించిన వారిని పట్టించుకోకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
 
  మునిసిపల్ చైర్మన్ పదవి బీసీ మహిళలకు రిజర్వ్ అవుతుందని తొలుత అందరూ భావించారు. ఈ క్రమంలో పార్టీలో ఉంటున్న ఈ సామాజిక వర్గాలకు చెందిన నేతలు తమ కుటుంబాలలోని మహిళలను రంగంలోకి దింపాలని నిర్ణయించి, ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఆయా ప్రాంతాలలోని ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. వార్డు కౌన్సిలర్ స్థాయి నుంచి చైర్మన్ పదవి వరకు పోటీలో నిలపడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్న తరుణంలో అనుకోని రీతిలో అన్‌రిజర్వ్‌డ్ వర్గాలకు మునిసిపల్ చైర్మన్ పదవిని కేటాయించడంతో బీసీ వర్గాల నాయకుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. అయినా ఆర్థిక, అంగబలం ఉన్న బీసీ వర్గాల నాయకులు బరిలోకి చైర్మన్‌గా దిగాలని భావించారు. ఈ లోగా త్వరలో టీడీపీలోకి ఎమ్మెల్యే, అతని అనుచర వర్గం చేరవచ్చనే ప్రచారం మొదలైంది.
 
  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్యాకే జీలో గూడెం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇక్కడి నేతకు అత్యంత దగ్గరగా ఉండే అనుచరుల్లో ఒక్కరుగా ఉన్న మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బొలిశెట్టి శ్రీను టీడీపీ తరపున బరిలోకి దిగుతారని ప్రచారం ఒక్కపారిగా ఊపందుకుంది. ఇక్కడి కీలకనేత ద్వారా మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్టు వర్గాలను ఆయన కలసి సీటు విషయంలో హామీ పొందారని చర్చించుకుంటున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు పార్టీ కీలక నేతల తీరుపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. పార్టీకి విశేష సేవలందిస్తున్నవారికి ఇస్తున్న గుర్తింపు ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాలను పార్టీ అధినేత బాబుకు లేఖల రూపంలో పంపడానికి సన్నద్ధమవుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement