ఎన్టీఆర్ ట్రస్టు విరాళాల ఖర్చు చెప్పాలి: లక్ష్మీపార్వతి
ఎన్టీఆర్ లలిత కళా అవార్డుకు హాస్య నటి శ్రీలక్ష్మి ఎంపిక
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో వసూలు చేసిన కోట్లాది రూపాయాల విరాళాలను ఎన్టీఆర్ ట్రస్టు దేనికి ఖర్చు పెడుతుందో ప్రజలకు లెక్క చెప్పాలని ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీ పార్వతి డిమాండ్ చేశారు. ఆమె బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఇటీవల కాలంలో టస్ట్రు విరాళాలను సేకరించేందుకు ప్రత్యేకంగా నారా లోకేష్ విదేశీ పర్యటన చేసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ పేరుతో వసూలు చేసిన విరాళాలు పేదవాళ్లకే ఉపయోగించాలన్నారు. వాటిని టీడీపీ కార్యకర్తలకు వినియోగించడం సమంజసం కాదని చెప్పారు.
ఎన్టీఆర్‌ను మోసం చేసినవాళ్లు, కుటుంబసభ్యులు ఇప్పుడు ఆయన పేరు చెప్పుకుని బతుకుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ వర్ధంతిన రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు భువనేశ్వరి ప్రకటించడంపై ఆమె స్పందిస్తూ... ఆ సేకరించిన రక్తాన్ని ఏం చేస్తారో చెప్పాలన్నారు. రాజకీయ మోసానికి గురై గుండెపోటుతో మరణించిన ఎన్.టి.రామారావు సార్మకార్థం ఆయనిచ్చిన డబ్బులతోనే ఏటా తాను అవార్డులను ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఎన్టీఆర్ లలిత కళా అవార్డుకి సినీ రంగం నుంచి హాస్య నటి శ్రీలక్ష్మిని ఎంపిక చేసినట్లు చెప్పారు. సాహిత్య రంగం నుంచి రచయిత్రి డి. కామేశ్వరి, శ్రీరామారావులను ఎంపిక చేసినట్లు ఆమె తెలిపారు.