
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ 22వ వర్ధంతిని పురస్కరించుకొని నేడు (18న) ఎన్టీఆర్ లలితకళా పురస్కారాల ప్రదానోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్‌పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు.
ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ గవర్నర్ కె.రోశయ్య హాజరవుతారన్నారు. బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ప్రముఖ సినీనటుడు టి.చలపతిరావు, ప్రముఖ రచయిత్రి డాక్టర్ వాసా ప్రభావతి, ప్రవాసాంధ్రులు సిడ్నీ బుజ్జిలకు ఈ పురస్కారాలను అందజేయనున్నట్లు తెలిపారు. డి.సురేఖా మూర్తి, శశికళా స్వామి తదితరులతో ఎన్టీఆర్ చలనచిత్ర సంగీత విభావరిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతుందని, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.