చంద్రబాబును ఇరకాటంలో పెట్టిన కోడలు | NTR Trust to offer coaching to poor students: Brahmani | Sakshi
Sakshi News home page

చంద్రబాబును ఇరకాటంలో పెట్టిన కోడలు

Published Mon, Nov 30 2015 3:32 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM

చంద్రబాబును ఇరకాటంలో పెట్టిన కోడలు - Sakshi

చంద్రబాబును ఇరకాటంలో పెట్టిన కోడలు

* తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అంటూ బ్రహ్మణి ప్రకటన
* దీంతో ఏపీలో ఉద్యోగ ప్రకటనలు లేవని చెప్పినట్లయిందని బాబు మథనం

హైదరాబాద్: తన కోడలు బ్రహ్మణి చేసిన ప్రకటనతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరకాటంలో పడ్డారని తెలిసింది. ఎలా ప్రతిస్పందించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారట కూడా. ఇంతలా చంద్రబాబును ఇబ్బందుల్లో పడేసే విధంగా ఆయన కోడలు బ్రహ్మణి చేసిన ప్రకటన ఏంటంటే...?

తెలంగాణలో గ్రూప్ 1, 2 వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో 60 మందికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తామని ఈ మధ్యనే విలేకరుల సమావేశంలో ప్రకటించారు.  శిక్షణ పొందాలనుకున్న వారు ట్రస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. బ్రహ్మణి ప్రకటనతో చంద్రబాబు సంకట పరిస్థితుల్లో పడ్డారు. ఎందుకంటే విభజన అనంతరం తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ శాఖల్లో ప్రస్తుతం 1.42 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

వాటిని భర్తీ చేయాలని నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డిమాండ్ వస్తున్నప్పటికీ ఆయనపట్టించుకోవడం లేదు. పైగా అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి ఏడాదిన్నర కావొస్తున్నా ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మరోపక్క కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు.

రాష్ట్రానికి కనీసం ప్రత్యేక హోదా దక్కినా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశించిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తామన్న బ్రహ్మణి ప్రకటనతో అటు తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టినట్లు.. మరోవైపు ఏపీలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేకపోతున్నట్లు ప్రజలకు తామే చెప్పినట్లయిందని చంద్రబాబు మథనపడ్డారట. బ్రహ్మణి ప్రకటనతో ఏపీ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయడం లేదన్న విషయాన్ని ఎత్తిచూపినట్టయిందని టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement