చంద్రబాబును ఇరకాటంలో పెట్టిన కోడలు బ్రహ్మిణి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కోడలు బ్రహ్మిణి చేసిన ప్రకటనతో ఇరకాటంలో పడ్డారట. ఆ ప్రకటనపై ఎలా ప్రతిస్పందించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారట కూడా. ఇంతకు చంద్రబాబు ఇబ్బందుల్లో పడేసే విధంగా ఆయన కోడలు బ్రహ్మిణి చేసిన ప్రకటన ఏంటంటే...? గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, యువకుల్లో ఓ 60 మందికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తామంటూ ప్రకటించారు. అలా శిక్షణ పొందాలనుకున్న వారు బుధవారంలోగా ట్రస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణలోని పలు జిల్లా కేంద్రాల్లో ప్రాథమిక స్థాయి పరీక్షలు నిర్వహించి ఎంపికైన వారికి శిక్షణ ఇస్తామని వెల్లడించారు. బ్రహ్మిణి ఈ ప్రకటన చేయడం వల్ల చంద్రబాబుకు వచ్చిన ఇబ్బందేమంటే...? ఉద్యోగాల భర్తీ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే.
విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో వేలాది సంఖ్యలో నిరుద్యోగులు ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ శాఖల్లో ప్రస్తుతం 1.43 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డిమాండ్ వస్తున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుపై నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెంచుకున్నారు. అధికారం చేపట్టి ఏడాదిన్నర పూర్తి కావొస్తున్నా ఇప్పటివరకు ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకపోగా ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టారు. ఎప్పుడు తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తారోనని నిత్యం ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రానికి కనీసం ప్రత్యేక హోదా దక్కినా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశించిన వారికి అది కూడా దక్కకపోవడం నిరుద్యోగుల్లో ఆందోళన మరింత పెరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తామన్న బ్రహ్మిణి ప్రకటన వల్ల అటు తెలంగాణలో ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టినట్టు... మరోవైపు ఏపీలో ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేకపోతోందని ప్రజలకు తెలియజేసినట్లు అయిందని చంద్రబాబు మథనపడ్డారట. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు కోడలు బ్రహ్మిణి ఉచితంగా శిక్షణ ఇస్తామని చెబుతూ ఏపీలో ఖాళీగా ఉన్న 1.43 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం లేదన్న విషయాన్ని ఎత్తి చూపినట్టయిందని టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారు.