ఉద్యోగ, ఉపాధి, క్రీడా రంగాల సమీక్షలో సీఎం చంద్రబాబు
పారిశ్రామిక అవసరాలు తీర్చేలా నైపుణ్య శిక్షణ ఇవ్వాలంటూ పాతపాట
బాధ్యత అంతా అధికారులదే అన్నట్టు దిశానిర్దేశం
సాక్షి, అమరావతి: ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నేరేవేర్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో నైపుణ్య శిక్షణ శాఖ, ఎంఎస్‌ఎంఈ, పరిశ్రమలు, సెర్ప్ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు సమకూర్చాలని సూచించారు.
నైపుణ్యాలను పెంచడం ద్వారా పెద్దఎత్తున అవకాశాలు పొందే అవకాశం ఉందని, హైబ్రిడ్ విధానంలో ఇంటినుంచే పనిచేసే కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బహుళజాతి కంపెనీలతో శిక్షణ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ చేపట్టాలన్నారు. విజయవాడ వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులు ఉపాధి చూపించాలని కోరారని, వారికి ఎటువంటి ఉపాధి కల్పన చేపట్టవచ్చనే అంశంపై పరిశీలన జరిపి కార్యాచరణ అమలు చేయాలన్నారు. వివిధ కారణాలతో గ్రామాల్లో ఉండిపోయిన వారికి పనిచేసే అవకాశాలు కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని, ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు కలిసి ఈ పని చేయాలని కోరారు.
క్రీడా హబ్‌లుగా తిరుపతి, అమరావతి, విశాఖ
మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడా రంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను కోరారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సమీక్షిస్తూ.. గతంలో నిలిచిపోయిన 35 క్రీడా వికాస కేంద్రాలను పూర్తి చేసేందుకు రూ.23 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం తెలిపారు.
గ్రామాల్లో కబడ్డీ వంటి ఆటలకు క్రీడా మైదానాలు అందుబాటులోకి తేవాలని సూచించారు. తిరుపతి, అమరావతి, విశాఖ నగరాలను క్రీడా హబ్‌లుగా మార్చాల్సిన అవసరం ఉందని, ఆ మూడు ప్రాంతాల్లో అన్ని క్రీడల నిర్వహణకు సకల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. క్రీడా నగరంగా అమరావతిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ఇక్కడ అతిపెద్ద స్టేడియం నిర్మాణం చేపడతామని చెప్పారు.
2027లో జాతీయ క్రీడా పోటీలను మన రాష్ట్రంలో నిర్వహించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర సచివాలయం, కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్పోర్ట్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో
మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment