సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుతో కుటుంబసభ్యులు మంగళవారం సాయంత్రం ములాఖత్ అయ్యారు. బాబును కలిసేందుకు జైలు అధికారులు ముగ్గురికి అనుమతి ఇచ్చారు. దీంతో చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి తొలుత రాజమహేంద్రవరంవిద్యానగర్‌లో లోకేశ్ ఏర్పాటు చేసుకున్న క్యాంప్ వద్దకు చేరుకున్నారు.
అక్కడి నుంచి లోకేశ్‌తో కలిసి సాయంత్రం 4 గంటలకు సెంట్రల్ జైల్‌కు సొంత వాహనంలో చేరుకున్నారు. భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి 30నిమిషాలు బాబుతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, బెయిల్, కుటుంబ సభ్యుల యోగక్షేమాలపై మాట్లాడుకున్నట్లు తెలిసింది.
చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉంది : భువనేశ్వరి
చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని, ధైర్యంగా ఉన్నారని ఆయన భార్య నారా భువనేశ్వరి చెప్పారు. చంద్రబాబుతో ములాఖత్ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కట్టించిన బ్లాక్‌లోనే ఆయన్ని కట్టిపడేశారని అన్నారు. ఆయనకు నంబర్ వన్ సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా, ఆ పరిస్థితి అక్కడ లేదన్నారు. బాబు భద్రతపై ఆందోళన కలిగిస్తోందన్నారు. చన్నీళ్లతో స్నానం చేయాల్సి వస్తోందని చెప్పారు. ఆయన్ని విడిచి బయటకు వస్తుంటే తనలో ఏదో భాగం వదిలేసిన భావన కలుగుతోందని అన్నారు.
ప్రజలు, రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా ఉండాలని చంద్రబాబు నిరంతరం పనిచేశారన్నారు. అలాంటి వ్యక్తిని జైల్లో చూసి బాధేసిందని, అక్కడ కూడా ప్రజల గురించే ఆలోచిస్తున్నారని అన్నారు. ప్రజల స్వేచ్ఛ, హక్కుల కోసం ఆలోచించే బాబు కోసం పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అని, తమ కుటుంబం ఎల్లప్పుడూ ప్రజలు, కేడర్ కోసం నిలడుతుందని అన్నారు. మీడియా సమావేశంలో భువనేశ్వరితో పాటు లోకేశ్, బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు.
చంద్రబాబుతో హైకోర్టు న్యాయవాది భేటీ
చంద్రబాబును హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ మంగళవారం మధ్యాహ్నం సెంట్రల్ జైలులో కలిశారు. ఇద్దరూ కేసుకు సంబంధించిన విషయాలు చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు తరఫున బెయిల్ పిటిషన్ వేయడం, సీఐడీ కస్టడీ కోరిన నేపథ్యంలో న్యాయపరంగా ఏ విధంగా వ్యవహరించాలన్న విషయమై వారు చర్చించినట్లు తెలిసింది.
రెండో రోజు జైలులో ఇలా..
చంద్రబాబు జైలు జీవితం మంగళవారం రెండో రోజుకు చేరింది. తొలి రోజులాగే రెండో రోజు సైతం వీఐపీ ఖైదీకి అందించే సదుపాయాలన్నీ అందించారు. చంద్రబాబు తొలి రోజు యోగా మాత్రమే చేశారు. మంగళవారం ఉదయం 4 గంటలకే నిద్ర లేచి యోగాతోపాటు వాకింగ్ కూడా చేసినట్లు సమాచారం. అనంతరం మూడు ప్రధాన పత్రికలు తెప్పించుకుని క్షుణ్ణంగా చదివారు. ఆ తర్వాత ఆల్పాహారం, టీ తాగారు. మధ్నాహ్నం, సాయంత్రం పుల్కా, కర్డ్ రైస్ తీసుకున్నట్లు తెలిసింది.
స్నేహ బ్లాక్‌కు అదనపు సీసీ కెమెరాల నిఘా
బాబుకు రాజమండ్రి కేంద్ర కారాగారంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆయన ఉన్న స్నేహ బ్యారక్ వద్ద ప్రస్తుతం ఉన్న వాటితోపాటు అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెంచారు. 1 + 4 భద్రత ఇస్తున్నారు. ఇతర ఖైదీలు ఎవరూ అటు వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
జైలు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో అధికారులు అక్కడ వాలిపోయేలా ఏర్పాట్లు చేశారు. స్నేహ బ్యారక్ ఎదురుగానే 24 గంటలూ వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు వైద్య సిబ్బందికి విధులు కేటాయించారు. జైలు లోపలే కాదు.. ఎలాంటి ఆందోళనలు, హింసాత్మక ఘటనలు జరగకుండా జైలు బయట కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment