బాబుకు టవర్‌ ఏసీ ఏర్పాటు చేయండి | ACB court Permission to install AC in Chandrababu room in Jail | Sakshi
Sakshi News home page

బాబుకు టవర్‌ ఏసీ ఏర్పాటు చేయండి

Published Sun, Oct 15 2023 5:17 AM | Last Updated on Sun, Oct 15 2023 10:50 AM

ACB court Permission to install AC in Chandrababu room in Jail - Sakshi

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకో­ణంలో అరెస్టయి ప్రస్తుతం రాజమహేంద్రవరం సెం­ట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబుకు టవర్‌ ఏసీ సదుపాయం కల్పించాలని జైలు అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు బాబు ఉంటున్న బ్యారెక్‌లో చల్లదనం ఉండేలా ఏర్పాట్లు చేయా­­లని సూచించింది. అందులో భాగంగా ఆయన గదిలో టవర్‌ ఏసీ ఏర్పాటు చేయాలని అధి­కారులకు స్పష్టం చేసింది. వాతావరణం కారణంగా బ్యారెక్‌లో ఉక్కపోతగా ఉండటంతో ఇప్పటికే తనకున్న చర్మ సమస్యల కారణంగా చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు.

అయితే జైలులో ఏసీ ఏర్పాటు చేసేందుకు జైలు నిబంధనలు అనుమతించకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. వైద్యుల సూచనల మేరకు తన బ్యారెక్‌లో చల్లదనం ఉండేలా ఏర్పాటు చేయాలని జైలు అధికారులను ఆదేశించాలని కోరుతూ శనివారం రాత్రి ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఏసీబీ న్యాయస్థానం ఆన్‌లైన్‌లో విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏసీబీ కోర్టు న్యాయాధికారి రాజమండ్రి జైలు అధికారులు, వైద్యులతో కూడా మాట్లా­డారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు స్కిన్‌ అలర్జీ ఉందని వైద్యులు కోర్టుకు తెలిపారు.

ఇది కాకుండా చంద్రబాబుకు మరేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అని వైద్యులను కోర్టు ప్రశ్నించింది. మరే ఆరోగ్య సమస్యలు లేవని, కేవలం స్కిన్‌ అల­ర్జీతో మాత్రమే ఆయన బాధపడుతున్నారని వైద్యులు వివరించారు. చంద్రబాబు తరఫున సుప్రీం­కోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున స్పెషల్‌ పీపీ యడవల్లి నాగ వివేకానంద వాదనలు వినిపించారు. చంద్రబాబు­కున్న స్కిన్‌ అలర్జీ సమ­స్యను లూథ్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చల్లని వాతావరణంలో ఆయన ఉండాలని వైద్యులు సిఫారసు చేశారని కోర్టుకు వివరించారు.

న్యాయా­ధి­కారి స్పందిస్తూ.. చంద్రబాబు అభ్యర్థనపై మీరే­మంటారని వివేకానందను ప్రశ్నించారు. నిర్ణ­యాన్ని కోర్టు విచక్షణకే వదిలేస్తున్నామని వివేకా­నంద చెప్పారు. దీంతో న్యాయాధికారి రాజమండ్రి జైలులో చంద్రబాబు ఉంటున్న బ్యారెక్‌­లో టవర్‌ ఏసీ ఏర్పాటు చేయాలని జైలు అధికా­రులను ఆదేశించారు. ఎంత సేపట్లో ఏసీ సదుపా­యం ఏర్పాటు చేయగలరని ప్రశ్నించారు. వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని జైలు అధికారులు తెలిపారు. దీన్ని న్యాయాధికారి రికార్డ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement