అఫిడవిట్ల సాక్షిగా చంద్రబాబు, లోకేశ్ అబద్ధాలు
2019లో హెరిటేజ్ షేరు వాస్తవ విలువ రూ.260.81
కానీ అమాంతం పెంచేసి రూ.511.90గా పేర్కొన్న బాబు
రూ.267 కోట్ల విలువైన షేర్లను రూ.545 కోట్లుగా పేర్కొన్న వైనం
అధికారంలో ఉండగా సంపాదించిన డబ్బుకు ఈ రకమైన ముసుగు
ఆ సమయంలోని అక్రమార్జనపై ఇప్పటికే ఐటీ నోటీసులు జారీ
నేరుగా బాబు ఖాతాల్లోకే స్కిల్ స్కామ్ డబ్బులొచ్చాయన్న సీఐడీ
తండ్రి బాటలోనే తనయుడు లోకేశ్.. షేరు విలువ పెంచి అఫిడవిట్
2024 అఫిడవిట్లో దాన్ని కవర్ చేయడానికి షేర్ల సంఖ్య పెంపు
రెట్టింపు చేసిన చంద్రబాబు...25 రెట్లు పెంచిన చినబాబు
అప్పటికన్నా తక్కువ మొత్తం చూపిస్తే ఇబ్బంది అని కొత్త ఎత్తుగడ
అఫిడవిట్లలో అబద్ధాలు చెబితే చట్టప్రకారం విచారణ; చర్యలు
ఈ తండ్రీకొడుకుల చరిత్ర మొత్తం ఇంతేనంటున్న ఆర్థిక నిపుణులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎందుకిన్ని మోసాలు? బతుకంతా అబద్ధాలేనా? మేనిఫెస్టో సరే.. అఫిడవిట్లో కూడా అబద్ధాలేనా? తరచి చూస్తే తండ్రీ కొడుకులు చంద్రబాబు నాయుడు... లోకేశ్ నాయుడు ఇద్దరూ ఇప్పుడే కాదు... 2019లోనూ అబద్ధాల అఫిడవిట్లే వేశారు. 2019లో హెరిటేజ్ షేర్ విలువ రూ.260.81 ఉండగా... అఫిడవిట్లో మాత్రం ఏకంగా రూ.511.90 ఉన్నట్టుగా చూపించారు. పైపెచ్చు వీళ్లకు ఉన్నవి ఒకటీరెండూ షేర్లు కాదు. 2019లో చంద్రబాబుకు 1,06,61,652 షేర్లు... లోకేశ్ నాయుడికి 4,73,800 షేర్లు ఉన్నాయి.
అప్పట్లో వీటి వాస్తవ విలువ చంద్రబాబుది రూ.278 కోట్ల పైచిలుకు కాగా... లోకేశ్‌ది రూ.12.40 కోట్లు. కానీ చంద్రబాబు తన షేర్ల విలువను ఏకంగా రూ.545 కోట్లుగా చూపించారు. తానేమీ తక్కువ తినలేదన్నట్లు లోకేశ్ కూడా తన షేర్ల విలువను రూ.24.25 కోట్లుగా చూపించారు. అంటే ఇద్దరూ కలిసి తమ హెరిటేజ్ షేర్ల విలువను దాదాపు రూ.279 కోట్లు ఎక్కువగా చూపించారు. ఇదంతా ఎందుకో తెలుసా?
ఐటీ కళ్లు కప్పడానికి ముసుగు...
నిజానికి 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం సహా పలు కుంభకోణాలకు తెరతీశారు. ఈ స్కాముల్లో చాలా నిధులు రకరకాల మార్గాల్లో మళ్లీ తన దగ్గరికే రప్పించుకున్నారు. ఈ సొమ్ముతో ఆస్తులు పెంచుకున్నా... అవేవీ రికార్డుల్లో కనపడకుండా జాగ్రత్త పడ్డారు. చాలా ఆస్తుల్ని బినామీల పేరిట పెట్టారు. అయితే షాపుర్జీ పల్లోంజీ సహా కొన్ని కంపెనీల నుంచి తీసుకున్న డబ్బులు నేరుగా చంద్రబాబు ఖాతాల్లోకే రావటంతో దానికి ఐటీ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది.
ఆ నోటీసులకు జవాబిచ్చేటపుడు కూడా... నాకు నోటీసులిచ్చే అధికారం మీకు లేదంటూ బుకాయించడం... అదే కారణంతో కోర్టులో సవాల్ చేయటం తప్ప ఆదాయానికి సంబంధించిన సమాధానాలేవీ ఇవ్వలేదు. అయితే ఆ డబ్బులు పెరిగిన ఆస్తుల్లో, తన బ్యాంకు ఖాతాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో వాటికి ఈ హెరిటేజ్ ముసుగు వేసినట్లుగా నిపుణులు చెబుతున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో అధికారికంగా అన్ని ఆస్తులు ఎలా పెరిగాయనే ప్రశ్న వస్తుంది కాబట్టి... హెరిటేజ్ షేర్లకు అంత విలువ లేకపోయినా వాటి పేరిట చూపిస్తే సరిపోతుందని ఈ పన్నాగం పన్నినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఈ సారి అఫిడవిట్లో షేర్ల సంఖ్య పెంచేసి మరో అక్రమం...
ఇలాంటి తప్పుల్ని, మోసాల్ని సహించలేమంటూ 2019 ఎన్నికల్లో జనం బాబుకు బుద్ధి చెప్పి ఓడించటం అందరికీ తెలిసిందే. కాకపోతే మళ్లీ ఈ సారి ఎన్నికల్లో మునుపటిలాగే షేరు విలువను ఎక్కువ చేసి చూపిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అనుకున్నారో ఏమో... షేర్ల సంఖ్యను పెంచి చూపించారు. అప్పట్లో ఉన్న షేర్ల సంఖ్య 1,06,61,652 కాగా... ఇపుడా షేర్ల సంఖ్య ఏకంగా 2,26,11,525కు పెరిగినట్లు చంద్రబాబు చూపించారు.
అంటే రెట్టింపుకన్నా ఎక్కువన్న మాట. అప్పట్లో వీటి మొత్తం విలువను రూ.545 కోట్లుగా చూపించిన చంద్రబాబు... ఇప్పుడు 2,26,11,525 షేర్లను ఒక్కొక్కటీ రూ.337.85గా చూపిస్తూ... హెరిటేజ్‌లోని తన షేర్ల విలువ రూ.. 767.44 కోట్లుగా పేర్కొన్నారు. లోకేశ్ కూడా తన షేర్లు 4,73,800 నుంచి 1,00,37,453కు పెరిగినట్లుగా... వాటి విలువ రూ.337.85 చొప్పున రూ.339 కోట్లుగా చూపించారు.
బోనస్, స్ప్లిట్.. ఏమీ లేకుండానే
నిజానికి 2019 తరువాత హెరిటేజ్ షేర్ల విభజన జరగలేదు. అంటే ఒక షేరును విభజించి రెండుగా చేయటమో ఏదో జరిగితే తప్ప చంద్రబాబు నాయుడి షేర్లు అలా రెట్టింపయ్యే అవకాశం లేదు. పోనీ బోనస్ షేర్లను జారీ చేశారా అంటే... అది కూడా లేదు. ఈ రెండూ కాకుండా ఈ మధ్యలో చంద్రబాబు ఎవరి వద్దనుంచైనా హెరిటేజ్ షేర్లను కొనుగోలు చేశారా అంటే... అది కూడా లేదు. మరి ఎలా పెరిగాయి? 2019లో హెరిటేజ్ షేర్లకు లేని విలువను ఉన్నట్టుగా చూపించి వాటిని ఏకంగా రూ.545 కోట్లుగా పేర్కొన్న చంద్రబాబు... ఇప్పుడు వాటి విలువ రూ.337 ప్రకారం కోటి షేర్లుగా చూపిస్తే మొత్తం విలువను రూ.337 కోట్లుగా చూపించాలి.
అంటే ఐదేళ్లలో హెరిటేజ్ షేర్ల విలువను తగ్గినట్లు చూపించాలి. ఇది కంపెనీకి కూడా ఇబ్బందికరంగా మారవచ్చని, తన 2019 అఫిడవిట్ బాగోతం బయటపడే అవకాశం ఉందని భావించి... ఈ సారి కూడా అబద్ధం చెప్పి ఉండొచ్చనేది ఆర్థిక నిపుణుల అంచనా. తండ్రి బాటలోనే లోకేశ్ కూడా తన షేర్ల సంఖ్యను అమాంతం పెంచేసి... 4 లక్షల షేర్లను కోటి షేర్లుగా చూపించారని, ఇదంతా అవినీతి సొమ్ముకు అధికారిక ముసుగు వేయటానికేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎందుకంటే కంపెనీలో ప్రమోటర్ల వాటా అప్పుడు ఎంత ఉందో ఇప్పుడూ అంతే ఉంది. మరి వాటా పెరగకుండా షేర్ల సంఖ్య పెరగటం ఎలా సాధ్యం? నిజానికి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్లను సమర్పించడం చట్టరీత్యా నేరం. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తే.... సెక్షన్ 125 ఏ ప్రకారం... అభ్యర్థిపై విచారణ జరపవచ్చని కొన్ని కేసుల్లో కోర్టులు స్పష్టంగా తీర్పునిచ్చాయి కూడా.
Comments
Please login to add a commentAdd a comment