సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయి రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సచ్చీలుడని చెప్పేందుకు ఎల్లో మీడియా నానాపాట్లు పడుతోంది. ఇందుకోసం నిత్యం టన్నుల కొద్దీ అసత్య కథనాలు, అభూత కల్పనలను వండివారుస్తూ పాఠకుల మెదళ్లను కలుషితం చేస్తోంది.
రాజకీయ కక్ష్యతోనే అరెస్టులు జరిగాయని, సీమెన్స్‌తో ఒప్పందం జరిగిందని, ఇందుకోసం రూ.వేల కోట్లు ఖర్చు పెట్టింది నిజమని నమ్మించేందుకు తెగ ప్రయాసపడుతోంది. ఈ కుంభకోణానికి చంద్రబాబుకు ఏమిటి సంబంధం?.. ఆయన ఎక్కడైనా సంతకం చేశారా? ఈ ల్యాబ్‌లు పరికరాలు అన్నీ ఉత్తివేనా అంటూ శుద్ధపూసలా ప్రశ్నిస్తూ తమ బాబు అమాయకుడంటూ ప్రజలను నమ్మించేలా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు తనయుడు లోకేశ్, ఈనాడు చేస్తున్న ఆరోపణలు, వాదనల్లోని నిజాలు ఏమిటంటే..
ఆరోపణ: రాజకీయ ప్రతీకారంతోనే చంద్రబాబును జైలుకు పంపించారు..
వాస్తవం: చంద్రబాబును జైలుకు పంపింది ప్రభుత్వం కాదు.. కోర్టు. చంద్రబాబు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని కూడా కోర్టు విశ్వసించింది. అలాగే, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు ఎదుర్కొంటున్న అభియోగాల మీద కోర్టులో సీఐడీ సమర్పించిన రిమాండ్ రిపోర్టుపై దాదాపు 10 గంటలసేపు వాదోపవాదాలు జరిగాయి. చంద్రబాబు తరఫున ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లు వచ్చి వాదించారు. వారి వాదనలకు గౌరవ న్యాయస్థానం సంతృప్తికర స్థాయిలో సమయం ఇచ్చింది.
ఇంతటి న్యాయ ప్రక్రియ తర్వాతే కోర్టు చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని జైలుకు తరలించాల్సి వచ్చింది. ఇందులో రాజకీయ కక్షకు, ప్రతీకారానికి ఆస్కారం ఎక్కడ? పైగా కక్ష ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అరెస్టు చేసేది. నాలుగేళ్లపాటు సుదీర్ఘ విచారణలో చంద్రబాబు ప్రమేయంపై ఆధారాలను కోర్టుకు సమర్పించాకే ఆయనకు రిమాండ్ విధించారు.
ఆరోపణ: రూ.371 కోట్లు ఖర్చుచేశారు కదా? పరికరాలు ఏర్పాటుచేశారు కదా? ఇకఅవినీతి ఆరోపణలకు ఆస్కారం ఎక్కడుంది?
వాస్తవం: ఎలాంటి టెండర్లు లేకుండా కేవలం నామినేషన్ పద్ధతిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని డిజైన్‌టెక్ కంపెనీకి అప్పనంగా ఐదు విడతల్లో రూ.371 కోట్లు విడుదల చేశారు. ఇందులో రూ.241 కోట్లను హవాలా మార్గంలో తరలించారు. ఆ డబ్బు తిరిగి చంద్రబాబు మనుషులకే చేరిందని ఐటీ, ఈడీ విచారణలో తేలింది. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ పాత్రపైనా ఆధారాలు ఉండడంతో ఐటీ శాఖ నోటీసులిచ్చింది. అందుకే డిజైన్‌టెక్, షెల్ కంపెనీల వ్యవహారాలపై జీఎస్టీ, ఈడీ అధికారులు అప్పటి టీడీపీ ప్రభుత్వానికి సమాచారమిచ్చినా చంద్రబాబు మౌనం దాల్చడం, చంద్రబాబే సూత్రధారి అనేందుకు నిదర్శనం.
ఆరోపణ: ఏపీతో ఒప్పందానికి సీమెన్స్ ఆసక్తి అంటూ ప్రచారం. గతంలో డిజైన్‌టెక్‌కు పంపిన ఈ–మెయిల్స్‌లో సీమెన్స్ వైస్ ప్రెసిడెంట్ పెట్ క్యారియర్ వెల్లడి అంటూ ఈనాడు రాతలు..
వాస్తవం: తమకు తెలియకుండానే భారత్‌లో తమ కంపెనీ ప్రతినిధి కొందరితో కుమ్మక్కై ఈ ప్రాజెక్టును చేపట్టారని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే 2018లో సీమెన్స్ సంస్థ తన ఇంటర్నల్ ఆడిట్ రిపోర్టులో తేల్చిచెప్పింది. సీమెన్స్ విచారణాధికారులు మూస్మా యెర్ క్లాస్, ఎస్. రాబర్ట్ ఈ నివేదిక ఇచ్చారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వలేదని కూడా విచారణాధికారికి స్పష్టంచేశారు. అలాగే, సీమెన్స్ ఇంటర్నల్ ఆడిట్ చేస్తున్న సమయంలోనే ప్రభుత్వానికి ఈ స్కాంపై ఓ సామాజిక కార్యకర్త సమాచారమిస్తే దాన్ని పక్కనపెట్టేశారు. ఇదంతా దురుద్దేశపూరితం కాదా?
ఆరోపణ: ఈ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు సంతకాలు ఎక్కడైనా పెట్టారా? పెడితే చూపించండి అంటూ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో లోకేశ్ సవాల్..
వాస్తవం: ఒకచోట కాదు.. మొత్తం 13 చోట్ల చంద్రబాబు సంతకాలు పెట్టారు. రూ.371 కోట్ల విడుదల దగ్గర నుంచి ప్రతిచోటా కూడా సంతకాలు పెట్టారు. ఉదా.. ఆర్థిక శాఖ ఫైలులోని ఎనెగ్జర్–1 పేజి నంబర్ ౖ42లో చంద్రబాబు సంతకం చేశారు. సాధారణ పరిపాలన శాఖ ఎనెగ్జర్ పేజ్ నంబర్–15లో గంటా సుబ్బారావును స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ కార్యదర్శిగా నియమిస్తూ సంతకం చేశారు. సాధారణ పరిపాలన శాఖ ఎనెగ్జర్–1, పేజి–11లో డిప్యూటీ సీఈఓగా అపర్ణను నియమించారు. సీమెన్స్ స్కాంలో కీలకంగా వ్యవహరించిన జీవీఎస్ భాస్కర్ భార్యే అపర్ణ.
ఆరోపణ: పరికరాలు, ఫలితాలు అన్నీ అబద్ధాలేనా అన్న లోకేశ్..
వాస్తవం: రూ.371 కోట్లలో రూ.241 కోట్లు తినేసి, మిగతా డబ్బుతో మమ అనిపించేసి, వీటికి రూ.3,300 కోట్లు ఖర్చుచేశారంటే నమ్మాలా? అందులోనూ తప్పుడు బిల్లులు, రశీదులు ఉన్నాయి. వాడిన సాఫ్ట్‌వేర్ విలువకు నిర్ధారణే లేదు. వాటి విలువను నిర్ధారించే సామర్థ్యం తమకులేదని సీఐటీడీ విచారణలో చెప్పింది కూడా. మరి పరికరాలున్నాయి? ఫలితాలు వచ్చేశాయి? అని మాయమాటలు చెప్పడం దేనికి?
ఆరోపణ: 2.13 లక్షల మందికి శిక్షణ ఇచ్చాం.. ఇందులో 80 వేల మందికి ఉద్యోగాలిచ్చామంటూ లోకేశ్, ఈనాడు బాకా..
వాస్తవం: లక్షల మందికి శిక్షణ ఇచ్చామంటూ ఈనాడు, లోకేశ్, టీడీపీ చెప్తున్న మాటల్లో అంతా డొల్లతనమే. విహార యాత్ర పేరుతో బీసీ వెల్ఫేర్ స్కూళ్ల విద్యార్థులను తరలించి, వారికి శిక్షణ ఇచ్చామని చెప్పుకున్నారు. శిక్షణ ఇచ్చామన్న వారిలో 70,000 మంది స్కూల్ పిల్లలున్నారు. శిక్షణ ఇచ్చినట్లు రికార్డులు తయారుచేసి నిధులు స్వాహా చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.200 ఇచ్చినట్లు సంతకాలు పెట్టించారు. ఆరు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల్లో సగానికి పైగా ల్యాబ్‌లు ఏర్పాటుకాలేదు. దీన్నిబట్టి స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఎంత బూటకమో అర్థమవుతోంది.
ఆరోపణ: ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థ సీఐటీడీ కన్నా ప్రైవేటు సంస్థే ముద్దా? అంటూ ఈనాడు కథనం. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు మదింపులో సీఐటీడీ నివేదికను పరిగణలోకి తీసుకోరా? ఒక్కో క్లస్టర్‌కు రూ.559 కోట్లుగా సీఐటీడీ నివేదికను ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఈనాడు ప్రశ్నలు..
వాస్తవం: ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్టుపై తాము ఇండిపెండెంట్ మదింపు చేయలేదని సీఐటీడీ స్పష్టంచేసింది. ఒక్కో కోర్సుకు, ఒక్కో స్టూడెంటుకు ఎంత ఖర్చవుతుందో సీమెన్స్ చెప్పిన వివరాల ఆధారంగా యథాతథంగా సంతకం చేశామని విచారణలో స్పష్టంచేసింది. సాఫ్ట్‌వేర్ విలువను మదింపు చేసే సామర్థ్యం తమకులేదని కూడా చెప్పింది. స్కిల్ డెవలప్‌మెంట్ క్లస్టర్లను స్వయంగా పరిశీలించి అక్కడి సాఫ్ట్‌వేర్, మౌలిక వసతులను పరిశీలించి ప్రాజెక్టు వ్యయాన్ని అంచనా వేయాల్సి ఉంటుందని.. కానీ, తమను ఆ విధంగా మదింపు నివేదిక ఇవ్వాలని ఏపీఎస్‌ఎస్‌డీసీ కోరనేలేదని సీఐటీడీ విచారణలో వెల్లడించింది.
మదింపు నివేదిక ఇవ్వాలంటూ సీఐడీటీని ఏపీఎస్‌ఎస్‌డీసీ అధికారులు, డిజైన్ టెక్ ప్రతినిధులు 2015 డిసెంబర్ 5న కోరగా 2016 మార్చి 22న నివేదిక ఇచ్చింది. కానీ, ఆ నివేదికతో నిమిత్తం లేకుండానే, అంతకంటే ముందే డిజైన్ టెక్‌కు టీడీపీ సర్కారు 2015 డిసెంబర్ 5న రూ.185 కోట్లు, 2016 జనవరి 29న రూ.85 కోట్లు, మార్చి 11న రూ.67 కోట్లు విడుదల చేశారు. ఈ విధంగా రూ.337 కోట్లు డిజైన్‌టెక్ కంపెనీకి అప్పనంగా ఇచ్చేశారు. చివరగా.. 2016 మార్చి 31న మిగిలిన రూ.34 కోట్లు కూడా విడుదల చేశారు. ఇలా డబ్బులన్నీ ఇచ్చేశాక మదింపు నివేదిక కోరడం ఏమిటి? కోరిన రోజే రూ.185 కోట్లు విడుదల చేయడం ఏంటి? ఇదంతా నిబంధనలకు విరుద్ధం కాదా?
ఆరోపణ: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు లాంటిదే గుజరాత్‌లోనూ, తమిళనాడులోనూ కూడా చేశారు కదా? అక్కడలేని తప్పు ఇక్కడేముంది?
వాస్తవం: ఏపీలో ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు రూ.546.84 కోట్లు, ఇందులో ప్రభుత్వ వాటా రూ.55 కోట్లు. టెక్ కంపెనీల నుంచి ఒక్క రూపాయి కూడా రాకుండానే రూ.371 కోట్లు విడుదల చేశారు. అదే గుజరాత్‌లో ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు రూ.17.1 కోట్లు, ప్రభుత్వ వాటాగా సుమారు రూ.188 కోట్లు విడుదల చేశారు. తమిళనాడులో ఒకే ఒక్క యూనివర్సిటీలో మాత్రమే చేశారు.
ఆరోపణ: సీమెన్స్ ప్రాజెక్టు నిజం.. సాఫ్ట్‌వేర్ హార్డ్‌వేర్ ఇచ్చింది వాస్తవం.. ఆరు క్లస్టర్లకు వాటా విలువ రూ.3,356 కోట్లపైనే. ఒక్కో క్లస్టర్‌లో పరికరాల విలువ రూ.559 కోట్లు.. అయినా నిధులు మళ్లించారంటూ అడ్డగోలుగా రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది..
వాస్తవం: సీమెన్స్ ప్రాజెక్టు పక్కా అబద్ధం. అసలు ఈ ప్రాజెక్టుతో సంబంధం లేదని సీమెన్స్ తన ఇంటర్నల్ రిపోర్టులోనూ, విచారణాధికారితోనూ స్పష్టంచేసింది. రూ. 3,300 కోట్ల ప్రాజెక్టు అని, 90% సీమెన్స్ గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా, 10% ఏపీ ప్రభుత్వం ఇస్తుందని జీఓలో రాశారు. కానీ, దీనికి భిన్నంగా ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే వాటాను ఆర్థిక సహాయంగా పేర్కొన్నారు. ఒప్పందంలో ఎక్కడా కూడా ఏ లెటర్ ఆధారంగా చేస్తున్నారో, తేదీ ఏంటో కూడా పేర్కొనలేదు. ఒప్పందంలో భాగస్వాములైన సీమెన్స్, డిజైన్‌టెక్ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తంచేసినా, నిబంధనలను బేఖాతరు చేస్తూ చంద్రబాబు నిధులు విడుదల చేశారు.
అంతేకాక.. తాను ఎంపిక చేసుకున్న గంటా సుబ్బారావు అనే ప్రైవేటు వ్యక్తికి కీలక హోదాలను కట్టబెట్టారు. పరికరాల కొనుగోలు కోసం రూ.58 కోట్లు తప్ప ఒక్క రూపాయి కూడా అందలేదని, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్న స్కీమే తమ వద్దలేదని సీమెన్స్ సంస్థ స్పష్టంచేసింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతిలో ఏ రాష్ట్రంలో కూడా తాము ఎలాంటి కార్యక్రమాలు చేయలేదని చెప్పింది. అలాంటప్పుడు సీమెన్స్ ప్రస్తావన
ఎందుకొస్తుంది?
Comments
Please login to add a commentAdd a comment