మంగళగిరి మరో మాదాపూర్ అంటూ రామోజీ గ్రాఫిక్స్ రాతలు
జగన్ రాగానే ఆకాశహర్మ్యాలు మాయమైపోయాయట..
ఐటీ పార్కుల పేరుతో మంగళగిరిలో చినబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం
డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కులపేరుతో ప్రజాధనం దోపిడీ
మార్కెట్ ధర కంటే అధిక అద్దెతో ఒప్పందాలు
కనీసం ఒక్క ఐటీ కంపెనీ పేరు రాయలేని పిరికి రాతలు
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో మాటల మరాఠి చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ పాలనను ప్రజలు ఛీకొట్టారు. అరచేతిలో స్వర్గం చూపిస్తే.. జనం తమ ఓటుతో అసలు వాస్తవం చూపించారు. మన మందళగిరి చినబాబు అయితే ఏకంగా ఐటీ పేరుతో మంగళగిరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీస్తే.. గోబెల్స్‌కు రాజగురువు రామోజీ మాత్రం మంగళగిరిని ఏకంగా మాదాపూర్‌లా మార్చేయడానికి మా మాలోకం కష్టపడ్డాడని జాకీలతో పైకెత్తడానికి తెగ ఆరాటపడుతున్నారు.
‘మంగళగిరి ఐటీపై జగన్ వేటు’అంటూ ఈనాడులో విషపు రాతలు రాశారు. చంద్రబాబు హయాంలో మంగళగిరి సింగపూర్‌ను తలదన్నేలా బహుళ అంతస్తుల భవనాల ఐటీ కంపెనీలతో కళకళలాడేదట. కనకదుర్గ వారధి నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వరకు ఆకాశహర్మ్యాలతో హైదరాబాద్‌లోని మాదాపూర్‌ను తలపించేదట. యువత ఆనందంతో ఉద్యోగాలు చేసుకునేవారట. జగన్ వచ్చాక ఇవన్నీ మాయమయ్యాయట.
ఇదీ అసలు నిజం..
ఐటీ కంపెనీలకు ప్రోత్సాహం అంటూ చంద్రబాబు పుత్రరత్నం ఇక్కడ ఐటీ మంత్రిగా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడ్డారు. ఐటీ పార్కుల పేరుతో బిల్డింగ్‌లు నిర్మించేసి.. ఐటీ కంపెనీలు రాకపోతే ఖాళీగా ఉన్న స్థలానికి ప్రభుత్వమే అద్దె చెల్లించేలా ప్రణాళిక వేశారు. ఇందుకోసం డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కుల పేరుతో ప్రత్యేక పాలసీ రూపొందించారు.
ఈ పాలసీ ముసుగులో బాబు అనుయాయులు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ భవనాలు నిర్మించి భారీ ఎత్తున ప్రభుత్వ సొమ్మును కాజేశారు. ఈ విధంగా నిరుపయోగంగా ఉన్న భవనాలకు భారీగా అద్దెను చెల్లించాల్సి వస్తుండటంతో ఈ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. నిజంగా మంగళగిరిలో ఐటీ కంపెనీలు వచ్చి ఉంటే ఆ కంపెనీల పేర్లు రాయొచ్చు కదా రామోజీ..? ఒక్క కంపెనీ పేరు రాసే ధైర్యం లేదు.
ఐటీ, ఎల్రక్టానిక్స్ రంగాల్లో మూడు లక్షల ఉద్యోగాలంటూ లోకేశ్ ప్రచారంలోని డొల్లతనం 2019 జనవరిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లోనే బయట పడింది. చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటే 2018 అక్టోబర్ నాటికి కేవలం 8,768 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో 47,908 మందికి ఐటీ రంగంలో ఉపాధి కల్పించినా అవేవీ మీకు పట్టవా రామోజీ?
Comments
Please login to add a commentAdd a comment