
నోటీసులు నిజమే
* ఎన్టీఆర్ ట్రస్ట్ అంగీకారం
* సర్వీస్ ట్యాక్స్ విభాగాన్ని సంప్రదిస్తున్నామన్న సీఈవో
సాక్షి, హైదరాబాద్: సేవా పన్ను చెల్లింపులకు సంబంధించి సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగం నోటీసులు జారీ చేసిన మాట వాస్తవమేనని ఎన్టీఆర్ ట్రస్ట్ అంగీకరించింది. ‘సేవా పన్నుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎగనామం’ పేరుతో గురువారం ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ట్రస్ట్ సీఈవో చుక్కా కొండయ్య వివరణ ఇచ్చారు. నోటీసులపై ఆ విభాగంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రస్టీ పదవికి రాజీనామా చేసి ఏడాది దాటిందని, ప్రస్తుతం ట్రస్ట్‌కు చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ 1997లో ఆదాయపు పన్ను చట్టం-1961లోని 12 (ఎ) సెక్షన్ ప్రకారం రిజిస్టర్ అయ్యిందని, 80 (జి) సెక్షన్ ప్రకారం మినహాయింపులు పొందుతోందని కొండయ్య పేర్కొన్నారు. సేవా పన్ను బకాయిలపై సర్వీస్ ట్యాక్స్ విభాగానికి ఈడీ లేఖ రాసిన విషయం తమకు తెలియదన్నారు. తాము 2014 సెప్టెంబర్‌లో సేవా పన్ను విభాగంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని, 2012 జూలై నుంచి పన్ను చెల్లించామని పేర్కొన్నారు. ట్రస్ట్ సర్వీసు ట్యాక్స్ విభాగానికి రూ.70 లక్షలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రూ.50 లక్షల కంటే ఎక్కువ బకాయి ఉన్న వారిపై నాన్-బెయిలబుల్ వారంట్ తీసుకునే అవకాశం అధికారులకు లేదని పేర్కొన్నారు.
వీటికి సమాధానం ఏది?
* ఎన్టీఆర్ ట్రస్ట్-తెలుగుదేశం పార్టీల మధ్య అద్దె ఒప్పందం 2009 నవంబర్ 11న జరిగింది. ఒప్పందం జరిగిన సమయంలో చంద్రబాబు ట్రస్ట్‌లో మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. ఆ విషయాన్ని కొండయ్య తన వివరణలో చెప్పలేదు.
* సేవా పన్ను మినహాయింపు పొందాలంటే ఆదాయపుపన్ను చట్టంలోని 12(ఎ) (ఎ) కింద రిజిస్టరై ఉండాలని నిబంధనలు చెప్తున్నాయి.
* ‘ఎన్టీఆర్ ట్రస్ట్-సేవా పన్ను’పై 2014 సెప్టెంబర్ 23న ఈడీ సంయుక్త డెరైక్టర్ కేఎస్‌వీవీ ప్రసాద్ సర్వీస్ ట్యాక్స్ విభాగానికి (ఎఫ్.నం.టీ-3/44/హెచ్‌జెడ్0/2011/2350) లేఖ రాశారు.
* ఈ లేఖ సర్వీస్ ట్యాక్స్ అధికారులకు చేరిన వారం రోజులకు 2014 సెప్టెంబర్ 30న ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా పన్ను విభాగంలో ఫామ్ ఎస్‌టీ-2 ప్రకారం రిజిస్టర్ చేయించుకుంది. ఈ విషయాన్ని ట్రస్ట్ తన వివరణలో ఎక్కడా ప్రస్తావించలేదు.
* సేవా పన్ను ఎంత చెల్లించాల్సి ఉందన్న విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదు. 2012లో నెగటివ్ లిస్ట్ వెలువడగా... 26 నెలల తర్వాత 2014లో రిజిస్టర్ చేయించుకున్న ట్రస్ట్.. ఆ మరుసటి రోజే (2014 అక్టోబర్ 1) ఆన్‌లైన్ ద్వారా రూ.31,68,518 చెల్లించింది. అప్పటికే ట్రస్ట్ రూ.64,61,149 బకాయి ఉన్నట్లుగా అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని ప్రస్తావించలేదు.
* 1994 నాటి ఆర్థిక చట్టానికి చేసిన సవరణ 2013 మే 10 నుంచి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం రూ.50 లక్షలకు మించి బకాయిలు ఉండి, ఉద్దేశపూర్వకంగా ట్యాక్స్ చెల్లించని వారిని కమిషనర్ అనుమతితో సూపరింటెండెంట్ స్థాయి అధికారి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించే అవకాశంఉంది.