చంద్రబాబునాయుడు వంచనకు కేరాఫ్.. అని మరోసారి నిరూపితమైంది. అధికారంలో ఉన్నా.. లేకున్నా జనాన్ని బురిడీ హామీలతో వంచన చేయడం అలవాటై పోయింది. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు నేనున్నానంటూ బాధితులకు భరోసా ఇచ్చిన వాడే ప్రజానాయకుడు. కష్టంలో ఉన్న ప్రజలను ఆదుకునే మనస్సు ఉండాలి. ప్రజాక్షేత్రంలో ఇచ్చిన హామీని ఎంత కష్టమైనా నెరవేర్చే సత్తా ఉండాలి. అప్పుడే ప్రజలు ఆ ప్రజానాయకుడి చిత్తశుద్ధిని నమ్మి తమ హృదయాల్లో చోటు కల్పిస్తారు. కానీ చంద్రబాబులో ఏ కోశాన వెతికినా ఇలాంటి లక్షణాలు కనిపించవు. వరద బాధితులను ఆదుకుంటామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నెలన్నర అవుతున్నా.. పత్తాలేకుండాపోయారు.
వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఒక్కో గిరిజన కుటుంబానికి రూ.5 వేలు సాయం వెంటనే అందిస్తాం. ఈ ప్రభుత్వానికి పేదలపై ప్రేమ లేదు. నేనున్నాను ఆదుకుంటాను. – ఇది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతేడాది నవంబర్ 25న నెల్లూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ. సీన్ కట్ చేస్తే 43 రోజులు గడుస్తున్నా బాబు హామీ కార్యరూపంలోకి దాల్చలేదు. ఒక్క గిరిజన కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి రూపాయి సాయం అందలేదు.
సాక్షి, నెల్లూరు: జిల్లాలో గతేడాది నవంబర్‌లో అతి భారీ వర్షాలు కురిశాయి. వరదలు ఉప్పొంగాయి. పెన్నా పరీవాహక ప్రాంతాల్లో గతంలో మునుపెన్నడూ లేని విధంగా భారీ వరదలు వచ్చాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఎన్నో కుటుంబాలు కట్టుబట్టలతో ప్రాణాలతో బయట పడ్డాయి. తక్షణమే స్పందించిన ప్రభుత్వం బాధితులకు అండగా నిల్చింది. నిరాశ్రయులను పునరావాస కేంద్రాలకు తరలించి ఆదుకుంది. పునరావాస కేంద్రాల్లోనే తక్షణ సాయంగా ప్రభుత్వం రూ.2 వేలు వంతున ఆర్థిక సాయం అందజేసింది. నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆ«ధికార యంత్రాంగం రేయింబవుళ్లు కష్టపడి బాధితులకు బాసటగా నిలిచారు. ఇంత కష్టంలో ప్రభుత్వం స్పందించిన తీరుకు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి విపత్తులు ఎదురైనప్పుడు ఇంత వేగంగా స్పందించిన దాఖలాలు లేవని బాధితులే కాకుండా ప్రజానీకమంతా ముక్తకంఠంతో ప్రశంసలు కురిపించింది.
చదవండి: ('బావ మాట బంగారు బాట అన్నట్లు బాలకృష్ణ మాట్లాడుతున్నారు')
సాయమంటూ.. యూటర్న్
చంద్రబాబునాయుడు ఏనాడు ఇచ్చిన మాట మీద, చెప్పిన మాట మీద నిలబడిన దాఖలాలు లేవని జిల్లా పర్యటన తర్వాత మరోసారి రుజువువైంది. ఈ ఉదంతం తర్వాత యూటర్న్ తీసుకోవడంలో మరో మైలు రాయిని అధిగమించారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన కోసం చంద్రబాబు గతేడాది నవంబర్ 25న జిల్లాలో పర్యటించారు. నాయుడుపేట నుంచి నెల్లూరు, ఇందుకూరుపేట, భగత్‌సింగ్ కాలనీ ప్రాంతాల్లో పర్యటించారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో పర్యటించి స్థానిక గిరిజన కాలనీకి వెళ్లారు. అక్కడ గిరిజనులతో మాట్లాడుతూ స్థానికంగా ఉన్న 150 కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ప్రతి కుటుంబానికి రూ.5 వేలు చొప్పున రూ.7.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని మాట ఇచ్చారు.
ఆయన హామీ ఇచ్చి ఇప్పటికి దాదాపు 43 రోజులు గడిచింది. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఎలాంటి సాయం అందలేదు. సాక్షాత్తు చంద్రబాబు వచ్చి హామీ ఇచ్చాడు కదా? తప్పక సాయం అందుతుందని పాపం ఆ గిరిజనులు ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు. పలుమార్లు ఆ పార్టీ నేతలను కలిసి అయ్యా.. చంద్రబాబు ఇస్తామన్న రూ. 5 వేలు డబ్బులు రాలేదని చెప్పుకుని వాపోయారు. ఆ టీడీపీ నేతలు కూడా మా బాబుగారంతే? ఇచ్చిన మాట ఎప్పుడూ నెరవేర్చాడు? అలా చేస్తే ఆయన చంద్రబాబు ఎలా అవుతాడంటూ ఎదురు ప్రశ్నించడంతో గిరిజనులు మిన్నకుండిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment