పెదబాబు ప్లాన్ వేస్తే లోకేష్ స్కెచ్ వేసేశారు | TDP leaders April Fool on NTR Trust | Sakshi
Sakshi News home page

పెదబాబు ప్లాన్ వేస్తే లోకేష్ స్కెచ్ వేసేశారు

Published Fri, Apr 1 2016 12:16 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

పెదబాబు ప్లాన్ వేస్తే లోకేష్ స్కెచ్ వేసేశారు - Sakshi

పెదబాబు ప్లాన్ వేస్తే లోకేష్ స్కెచ్ వేసేశారు

ప్రజాప్రయోజనాల్ని తెలుగుదేశం పార్టీ నేతలు మంటగలిపేస్తున్నారు. రాజధాని ఒక చోట వస్తుందని ప్రచారం చేసి వాళ్లకు కావాల్సిన చోట భూముల్ని తక్కువ ధరలకు కొనుగోలు చేసేసి, డీ పట్టాల్నీ వదలకుండా, భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడి తరువాత తాము  కోరుకున్న చోటే రాజధాని ప్రాంతాన్నిప్రకటించిన ఘనులు టీడీపీలో ఉన్నారు. ఇప్పుడు జిల్లా నేతలూ అదే పని చేస్తున్నారు. ప్రజాప్రయోజనాల పేరిట ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిలో పార్టీ కార్యాలయ నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టి జిల్లాలో బలహీనవర్గాలను ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారు.  
 
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :  ప్రజాప్రయోజనాల పేరిట సాంఘిక సంక్షేమశాఖ 1984లో శ్రీకాకుళంలో కొద్ది స్థలాన్ని భూ సేకరణ చేసింది. టీడీపీ హయాంలో నిర్మాణాలేవీ జరగలేదు. పేదలకు ఇళ్లు నిర్మించేందుకు కాంగ్రెస్ హయాంలో అక్కడ వాంబేకాలనీ నిర్మించారు. పట్టణ ప్రాంతంలో ఉన్న స్థలంలో ఇళ్ల నిర్మాణం అనంతరం మిగిలిన కొద్ది స్థలాన్ని స్థానిక అవసరాల కోసం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మునిసిపాలిటీకీ అధికారం అప్పగించారు.
 
  ఇప్పుడదే స్థలంలో ఎన్టీఆర్ ట్రస్ట్ పేరిట క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుని పార్టీ కార్యాలయం నిర్మించేందుకు పనులు జరిపిస్తున్నారు. 99యేళ్లకు ప్రభుత్వం నుంచి ఏడాదికి రూ.25వేలకు లీజుగా తీసుకుని మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.25కోట్ల విలువ చేసే స్థలంలో సుమారు 2ఎకరాల స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించే ప్రయత్నం జిల్లా ప్రజలకు రుచించడం లేదు. వాస్తవానికి 80అడుగులో రోడ్డులో 1.50ఎకరాల స్థలంలో పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటే జిల్లా యంత్రాంగం నాయకుల అడుగులకు మడుగులెత్తేలా రెండెకరాల స్థలాన్నీ చూపించేసింది. 
 
 అద్దె కార్యాలయాన్ని కొన్నాళ్లపాటు నడిపి వాస్తు బాగోలేదంటూ మరోచోటకు మార్చి నిర్వహణ ఖర్చుల్నీ ఎవరు భరిస్తారంటూ వాదులాడుకుంటున్న తమ్ముళ్లు హైటెక్ హంగులతో కొత్తగా కార్యాలయం నిర్మించేందుకు సిద్ధమైపోతున్నారు. పదేళ్లపాటు పదవులకు దూరమైన నాయకులు జీవితాంతం పార్టీ పేరిట కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్‌కు దఖలు పడేలా స్థలాన్ని దక్కించేపనిలో ఉన్నారు. 
 
 ఉన్న స్థలం వ్యాపారానికి..
 బలగ ప్రాంతంలో ఎన్టీఆర్ అభిమాని ఒకరు పార్టీ ప్రయోజనాలకు స్థలం అప్పగిస్తే ఆయన తదనంతరం ఆ స్థలాన్ని టీడీపీ నాయకులు మార్కెట్లో అమ్మకాలకు పెట్టారు. బహిరంగ మార్కెట్‌లో ఆ స్థలానికి భారీ ధర పలుకుతుండడంతో ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగారు. వచ్చే డబ్బుతో మరోచోట పార్టీ కార్యాలయానికి స్థలం కొనుగోలు చేసే ఆలోచన కాకుండా ప్రభుత్వం తమదే కనుక ప్రజాప్రయోజనాల్ని మంటగలిపైనా స్థలం దక్కించుకోవాలని భావించి 80అడుగుల రోడ్డులో పార్టీ కార్యాలయ పనులకు సిద్ధమైపోయారు. అదే రోడ్డులో ఎంపీ కూడా ఓ భవన నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. ఆ నిర్మాణానికి అధికారిక ప్లాన్ లేకపోయినా, విశాఖ ఉడా అధికారులకు దరఖాస్తు చేసుకున్నామంటూ భారీ హంగులతో నిర్మించేస్తుండడంపై ఆక్షేపణలున్నాయి. సాధారణ ప్రజలు ఓ ఇల్లు నిర్మాణం చేస్తే నానా యాగీ చేసే మునిసిపల్ అధికారులు..నేతల ఒత్తిళ్లకు మిన్నకుండిపోయారు. 
 
 హంగామా గుర్తురాలేదా?
 పార్టీ కార్యాలయం కోసం ప్రభుత్వం భూములు కేటాయించడం సహజమే. కాంగ్రెస్ హయాంలో స్థానిక ఇందిరాభవన్ పనులు జరుగుతున్న సమయంలో టీడీపీ నేతలు నానా హంగామా చేశారు. అప్పటి మంత్రి ధర్మానకు వ్యతిరేకంగా హడావుడి సృష్టించారు. అనంతర కాలంలో ట్రస్ట్‌పేరిట నడుస్తున్న టౌన్‌హాల్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయం కోసం లీజుకు తీసుకుంటే పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ప్రచారం చేశారు. సాక్ష్యాత్తూ ట్రస్ట్ చైర్మన్ అంగీకారం మేరకు పక్కాగా లీజుకు తీసుకున్న స్థలంపైనే యాగీ చేసిన టీడీపీ నేతలు..ఇప్పుడు ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మించేందుకు ముందుకు వెళ్తుండడాన్ని ఆ పార్టీలో ద్వితీయ శ్రేణీ తప్పుపడుతోంది. సొంతగూడు కోసం జిల్లా జనాన్ని ఏప్రిల్ ఫూల్ చేస్తోందని అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
 
 చినబాబు స్కెచ్
 పెదబాబు పార్టీ కార్యాలయ కోసం ప్లాన్ వేస్తే చినబాబు లోకేష్ స్కెచ్ వేసేశారు. పార్టీ కార్యాలయం ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ ఏ విధంగా గదుల నిర్మాణం సాగాలి, ముహూర్తం ఎలా అన్న విషయాలన్నీ సీఎం తనయుడి ఆధ్వర్యంలోనే సాగినట్టు తెలుస్తోంది. శుక్రవారం, ఏప్రిల్ 1న ఉదయం 10గంటలకు పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేసేశారు. ఈ మేరకు రెండు రోజుల నుంచి స్థలాన్ని చదును చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కళా వెంకట్రావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సునీత, జిల్లా మంత్రి, ఎంపీ సహా పార్టీ క్యాడర్‌కు ఆహ్వానాలు పంపినట్టు తెలిసింది. తొలుత చినబాబును కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిద్దామని భావించారు. అదే రోజు సీఎం మనుమడి పుట్టినరోజు కావడంతో, పార్టీ కార్యాయ నిర్మాణం పూర్తయితే ప్రారంభోత్సవానికి వస్తానని చినబాబు హామీ ఇచ్చినట్టు తెలిసింది. 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement