April fool
-
ప్రాణాలు తీసిన ప్రాంక్.. ఫ్రెండ్‌ను ఫూల్ చేయబోయి విద్యార్ధి మృతి
సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ప్రాంక్‌ల హవా బాగా నడుస్తోంది. కుటుంబ సభ్యులు, తెలిసిన వారికి ఏదైనా విషయం గురించి చెప్పి భయపెట్టడం.. తరువాత అదంతా ప్రాంక్ అని చెప్పడం ఫ్యాషన్‌గా మారింది. అయితే కొన్ని సార్లు ఈ చర్యలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ప్రాంక్ మోజులో పడి అనేక మంది యువత తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఏప్రిల్ ఫూల్స్ డే రోజు చేసిన తన స్నేహితుడిని ప్రాంక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఇండోర్‌లోని మల్హర్గంజ్లో 11వ తరగతి చదువుతున్న అభిషేక్ అనే విద్యార్ధి సోమవారం ఏప్రిల్స్ ఫూల్స్డే రోజు తన స్నేహితుడిని ప్రాంక్ చేయాలని ప్రయత్నించాడు. ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నటించాడు. స్టూల్‌పై నిల్చొని మెడకు తాడు బిగించి తను చనిపోతున్నట్లు స్నేహితుడిని నమ్మించాడు. ఈ క్రమంలో అనుకోకుండా స్టూల్ జారిపోవడంతో మెడకు తాడు బిగుసుకుపోయి మృతి చెందాడు. ఈ సంఘటనను చూసిన వెంటనే స్నేహితుడు.. అభిషేక్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అదనపు డీసీపీ రాజేష్ దండోటియా తెలిపారు. చదవండి: విషాదం: ఫార్చ్యూనర్ కోసం ‘కరిష్మా’కు భవిష్యత్తే లేకుండా చేశారు గమనిక: దయచేసి ఎవరూ ఇలాంటి ప్రాంక్‌లు ప్రయత్నించవద్దు. చిన్న చిన్న సరదాలకు పోయి.. నిండు ప్రాణాలను బలితీసుకోవద్దు -
రూ.328 కోట్ల లాటరీ బ్రో అంటే.. ‘ఏప్రిల్ ఫూల్’ అనుకున్నాడు.. తీరా చూస్తే షాక్!
క్లీవ్(అమెరికా): ఆదివారంతో వారాంతం ముగిశాక అందరూ సోమవారం కొత్త వారాన్ని మొదలుపెడతారు. కానీ అమెరికాకు చెందిన మాజీ మెకానిక్ ఏకంగా కొత్త జీవితాన్నే మొదలుపెట్టారు. 40 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.328 కోట్ల) లాటరీ రూపంలో ఆయనను ధనలక్ష్మి వరించింది. చిరకాల మిత్రుడొచ్చి లాటరీ గెలుపు సంగతి చెబితే ‘ఏప్రిల్ ఫూల్’ చేస్తున్నాడని భావించాడు ఎర్ల్ లాపే. ఎందుకంటే ఏప్రిల్ ఒకటో తేదీన ఆయన ఆ టికెట్ కొన్నాడు మరి. అమెరికాలోని అయోవా రాష్ట్రంలోని డబ్యూక్ సిటీలో ఉండే 61 ఏళ్ల లాపే మెకానిక్‌గా చేసి రిటైర్ అయ్యారు. ఇటీవల ఆయన కొన్న ‘లోట్టో అమెరికా’ లాటరీ టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది. దీంతో ఆయన ఆనందానికి అవధుల్లేవు. సోమవారం లాటరీ ప్రధాన కార్యాలయానికి వచ్చి టికెట్‌ను క్లెయిమ్ చేశాడు. విడతలవారీగా అయితే రూ.328 కోట్లను 29సంవత్సరాల కాలంలో ఇస్తారు. కానీ విడతలవారీగా కాకుండా ఒకేసారి ఏకమొత్తంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆయనకు రూ.175 కోట్ల నగదు బహుమతి దక్కనుంది. -
ఏప్రిల్ ఫూలదండ.. మార్చి 32..!
‘ఏప్రిల్ ఫూల్’ ‘ఏప్రిల్ కూల్’ గా మారాలంటే ఇవ్వాళే ఒక మొక్క నాటండి. చెబ్బాష్! మీరు ఈ రోజు ‘ఫూల్’ అయ్యారా? అయితే కచ్చితంగా గర్వపడండి. ఎందుకంటే మహారచయిత షేక్స్పియర్ ఇలా అన్నారు: ‘ఫూల్ తనను తాను మేధావి అనుకుంటాడు. మేధావి తనను తాను ఫూల్ అనుకుంటాడు’ ఏప్రిల్ ‘ఫుల్లు’ డే! ఏప్రిల్ ‘ఫుల్లు డే’ అనుకొని బార్లు కిటకిటలాడుతున్నాయి. ఎవరైనా చెప్పండి... ఈరోజు ‘ఏప్రిల్ ఫూల్ డే’ అని. మీకు తెలుసా? అలనాడు దుర్యోధనుడు మయసభలో ‘ఏప్రిల్ 1’ నే ఫూల్ అయ్యాడు. దేవదాసు తెలివి ‘ఎవరో నన్ను ఫూల్ చేయడం ఏమిటి పారూ...నన్ను నేనే చేసుకుంటాను’ అని దేవదాసు ఇలా చేశాడు... ఖాళీ బాటిల్ ఎత్తి ఖాళీ గ్లాసులో పోశాడు. తాగుతున్నట్లు నటిస్తూ ‘అబ్బా! ఈరోజు ఫుల్లు అయిపోయాను’ అన్నాడు. తమిళనాడు ఎన్నికల వాక్దానం మా పార్టీని గెలిపిస్తే ‘ఏప్రిల్ ఫూల్ డే’ మాత్రమే కాదు ‘మే ఫూల్ డే’ ‘జూన్ ఫూల్ డేలు’ కూడా ప్రత్యేకంగా మన రాష్ట్రానికి తెస్తామని హామీ ఇస్తున్నాం. ఎవరికి ‘చెప్పు’కోవాలి! ఆనంద్ ఈరోజు చెరువులో గాలం వేశాడు. కొద్దిసేపటి తరువాత చాలా బరువుగా ఏదో తాకింది. ‘పే...ద్ద చేప పడిందోచ్’ అని గాలం లాగాడు. రెండు పాత చెప్పులు వచ్చాయి. వాటి మీద ‘ఏప్రిల్ ఫూల్’ అనే స్టిక్కర్లు అంటించి ఉన్నాయి. ఈ రోజు అయితే బెస్ట్... ఎవరికైనా లవ్‌ప్రపోజ్ చేయడానికి ఈరోజు అయితే బెస్ట్. పాస్ అయితే సంతోషం. ఫెయిల్ అయితే ‘నిన్ను ఫూల్ చేయడానికి అలా అన్నానంతే. నాకు అంత సీన్ లేదని నీకు తెలి యదా!’ అని మెల్లగా జారుకోవచ్చు. ఒకరినొకరు... అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్, ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్‌ను ‘ఫూల్’ చేయాలనుకున్నాడు. కిమ్‌కు ఫోన్ చేసి ‘హాలో నేను అమెరికా నుంచి కిమ్‌ను మాట్లాడుతున్నాను. బాగున్నారా’ అన్నాడు. కిమ్ ఏమన్నా తక్కువ తిన్నాడా? ఫోన్ పెట్టేసి వెంటనే ట్రంప్‌కు ఫోన్ చేసి ‘నేను కొరియా నుంచి ట్రంప్‌ను మాట్లాడుతున్నాను బాగున్నారా’ అని అడిగాడు. మార్చి 32 కరోనా కారణంగా ఈరోజు ‘ఏప్రిల్ఫుల్ డే’ను రద్దు చేయడమైనది. ఈరోజును ‘మార్చి 32’గా మాత్రమే పరిగణించాలని మనవి. -
శిఖర్ను యూవీ ఎలా ఫూల్ చేశాడో చూడండి!
మైదానంలో చెలరేగి ఆడటమే కాదు.. తోటి ఆటగాళ్లను సరదాగా ఆటపట్టించడంలోనూ టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ ముందుంటాడు. ఏప్రిల్ 1 ’ఫూల్స్ డే’ కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సహచర ఆటగాడైన శిఖర్ ధావన్‌ను యూవీ ఫూల్ చేశాడు. జట్టుకు కేటాయించిన హోటల్లో శిఖర్ స్నానం చేసేందుకు స్మిమ్మింగ్పూల్లో దిగిన వెంటనే అతని భార్య ఆయేషా ముఖర్జీకి ఫోన్చేయమంటూ యూవీ తెలివిగా ఆటపట్టించాడు. ’అత్యవసర పరిస్థితి వచ్చి పడింది. నువ్వు వెంటనే నీ భార్యకు ఫోన్ చేయ్’మంటూ యూవీ శిఖర్‌కు చెప్పాడు. దీంతో గాబరా పడిపోయిన శిఖర్ వెంటనే స్మిమ్మింగ్‌ఫూల్ నుంచి బయటకు వచ్చి.. తన బ్యాగులో ఫోన్ కోసం ఆదరాబాదరాగా వెతికాడు. ఈ ఘటనను అంతా గుట్టుగా రికార్డు చేసిన యూవీ.. ఇదిగో శిఖర్ను ఇలా ఏప్పిల్ పూల్ చేశానంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. ఏప్రిల్ ఫూల్ చేసిన విషయాన్ని శిఖర్‌కు సైతం యూవీ చెప్పాడు. శిఖర్ సరదాగా తీసుకొని.. నిజంగా ఫూల్ అయ్యానంటూ నవ్వుతూ చెప్పాడు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
పెదబాబు ప్లాన్ వేస్తే లోకేష్ స్కెచ్ వేసేశారు
ప్రజాప్రయోజనాల్ని తెలుగుదేశం పార్టీ నేతలు మంటగలిపేస్తున్నారు. రాజధాని ఒక చోట వస్తుందని ప్రచారం చేసి వాళ్లకు కావాల్సిన చోట భూముల్ని తక్కువ ధరలకు కొనుగోలు చేసేసి, డీ పట్టాల్నీ వదలకుండా, భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడి తరువాత తాము కోరుకున్న చోటే రాజధాని ప్రాంతాన్నిప్రకటించిన ఘనులు టీడీపీలో ఉన్నారు. ఇప్పుడు జిల్లా నేతలూ అదే పని చేస్తున్నారు. ప్రజాప్రయోజనాల పేరిట ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిలో పార్టీ కార్యాలయ నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టి జిల్లాలో బలహీనవర్గాలను ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ప్రజాప్రయోజనాల పేరిట సాంఘిక సంక్షేమశాఖ 1984లో శ్రీకాకుళంలో కొద్ది స్థలాన్ని భూ సేకరణ చేసింది. టీడీపీ హయాంలో నిర్మాణాలేవీ జరగలేదు. పేదలకు ఇళ్లు నిర్మించేందుకు కాంగ్రెస్ హయాంలో అక్కడ వాంబేకాలనీ నిర్మించారు. పట్టణ ప్రాంతంలో ఉన్న స్థలంలో ఇళ్ల నిర్మాణం అనంతరం మిగిలిన కొద్ది స్థలాన్ని స్థానిక అవసరాల కోసం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మునిసిపాలిటీకీ అధికారం అప్పగించారు. ఇప్పుడదే స్థలంలో ఎన్టీఆర్ ట్రస్ట్ పేరిట క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని పార్టీ కార్యాలయం నిర్మించేందుకు పనులు జరిపిస్తున్నారు. 99యేళ్లకు ప్రభుత్వం నుంచి ఏడాదికి రూ.25వేలకు లీజుగా తీసుకుని మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.25కోట్ల విలువ చేసే స్థలంలో సుమారు 2ఎకరాల స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించే ప్రయత్నం జిల్లా ప్రజలకు రుచించడం లేదు. వాస్తవానికి 80అడుగులో రోడ్డులో 1.50ఎకరాల స్థలంలో పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటే జిల్లా యంత్రాంగం నాయకుల అడుగులకు మడుగులెత్తేలా రెండెకరాల స్థలాన్నీ చూపించేసింది. అద్దె కార్యాలయాన్ని కొన్నాళ్లపాటు నడిపి వాస్తు బాగోలేదంటూ మరోచోటకు మార్చి నిర్వహణ ఖర్చుల్నీ ఎవరు భరిస్తారంటూ వాదులాడుకుంటున్న తమ్ముళ్లు హైటెక్ హంగులతో కొత్తగా కార్యాలయం నిర్మించేందుకు సిద్ధమైపోతున్నారు. పదేళ్లపాటు పదవులకు దూరమైన నాయకులు జీవితాంతం పార్టీ పేరిట కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్‌కు దఖలు పడేలా స్థలాన్ని దక్కించేపనిలో ఉన్నారు. ఉన్న స్థలం వ్యాపారానికి.. బలగ ప్రాంతంలో ఎన్టీఆర్ అభిమాని ఒకరు పార్టీ ప్రయోజనాలకు స్థలం అప్పగిస్తే ఆయన తదనంతరం ఆ స్థలాన్ని టీడీపీ నాయకులు మార్కెట్లో అమ్మకాలకు పెట్టారు. బహిరంగ మార్కెట్లో ఆ స్థలానికి భారీ ధర పలుకుతుండడంతో ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగారు. వచ్చే డబ్బుతో మరోచోట పార్టీ కార్యాలయానికి స్థలం కొనుగోలు చేసే ఆలోచన కాకుండా ప్రభుత్వం తమదే కనుక ప్రజాప్రయోజనాల్ని మంటగలిపైనా స్థలం దక్కించుకోవాలని భావించి 80అడుగుల రోడ్డులో పార్టీ కార్యాలయ పనులకు సిద్ధమైపోయారు. అదే రోడ్డులో ఎంపీ కూడా ఓ భవన నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. ఆ నిర్మాణానికి అధికారిక ప్లాన్ లేకపోయినా, విశాఖ ఉడా అధికారులకు దరఖాస్తు చేసుకున్నామంటూ భారీ హంగులతో నిర్మించేస్తుండడంపై ఆక్షేపణలున్నాయి. సాధారణ ప్రజలు ఓ ఇల్లు నిర్మాణం చేస్తే నానా యాగీ చేసే మునిసిపల్ అధికారులు..నేతల ఒత్తిళ్లకు మిన్నకుండిపోయారు. హంగామా గుర్తురాలేదా? పార్టీ కార్యాలయం కోసం ప్రభుత్వం భూములు కేటాయించడం సహజమే. కాంగ్రెస్ హయాంలో స్థానిక ఇందిరాభవన్ పనులు జరుగుతున్న సమయంలో టీడీపీ నేతలు నానా హంగామా చేశారు. అప్పటి మంత్రి ధర్మానకు వ్యతిరేకంగా హడావుడి సృష్టించారు. అనంతర కాలంలో ట్రస్ట్‌పేరిట నడుస్తున్న టౌన్హాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయం కోసం లీజుకు తీసుకుంటే పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ప్రచారం చేశారు. సాక్ష్యాత్తూ ట్రస్ట్ చైర్మన్ అంగీకారం మేరకు పక్కాగా లీజుకు తీసుకున్న స్థలంపైనే యాగీ చేసిన టీడీపీ నేతలు..ఇప్పుడు ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మించేందుకు ముందుకు వెళ్తుండడాన్ని ఆ పార్టీలో ద్వితీయ శ్రేణీ తప్పుపడుతోంది. సొంతగూడు కోసం జిల్లా జనాన్ని ఏప్రిల్ ఫూల్ చేస్తోందని అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చినబాబు స్కెచ్ పెదబాబు పార్టీ కార్యాలయ కోసం ప్లాన్ వేస్తే చినబాబు లోకేష్ స్కెచ్ వేసేశారు. పార్టీ కార్యాలయం ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ ఏ విధంగా గదుల నిర్మాణం సాగాలి, ముహూర్తం ఎలా అన్న విషయాలన్నీ సీఎం తనయుడి ఆధ్వర్యంలోనే సాగినట్టు తెలుస్తోంది. శుక్రవారం, ఏప్రిల్ 1న ఉదయం 10గంటలకు పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేసేశారు. ఈ మేరకు రెండు రోజుల నుంచి స్థలాన్ని చదును చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కళా వెంకట్రావు, జిల్లా ఇన్చార్జి మంత్రి సునీత, జిల్లా మంత్రి, ఎంపీ సహా పార్టీ క్యాడర్‌కు ఆహ్వానాలు పంపినట్టు తెలిసింది. తొలుత చినబాబును కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిద్దామని భావించారు. అదే రోజు సీఎం మనుమడి పుట్టినరోజు కావడంతో, పార్టీ కార్యాయ నిర్మాణం పూర్తయితే ప్రారంభోత్సవానికి వస్తానని చినబాబు హామీ ఇచ్చినట్టు తెలిసింది. -
జాక్‌పాట్.. రూ. 490 కోట్లు!
లండన్: బ్రిటన్ యూరోమిలియన్స్ లాటరీలో అదృష్ట దేవత జాక్‌పాట్ రూపంలో వీరి తలుపుతట్టింది. ఇంగ్లండ్‌లోని లింకన్‌షైర్‌కు చెందిన వీరిపై లక్ష, కోటి, పది కోట్లు కాదు.. ఏకంగా రూ.490 కోట్లతో కాసుల వర్షం కురిపించింది! రిచర్డ్ మాక్స్వెల్ అనే ఈ లక్కువీరుడు పౌల్ట్రీ ఇండస్ట్రీకి కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం వెబ్సైట్లో లాటరీ ఫలితాలు చూసి మొదట వీరు నమ్మలేకపోయారు. ఏప్రిల్‌ఫూల్ చేస్తున్నారేమోనని అనుమానించారు. వీరిద్దరి కూతుళ్ల పరిస్థితీ అంతే! అన్నిరకాలుగా చెక్‌చేసుకున్న తర్వాతే ఎట్టకేలకు తమకే జాక్‌పాట్ తగిలిందని నమ్మగలిగారు. ఒక్కసారిగా ఇంత డబ్బు వచ్చిపడేసరికి ఏం చేయాలో తెలియడం లేదని ఉబ్బితబ్బిబ్బు అవుతున్న రిచర్డ్.. మొదట కుటుంబంతో కలసి న్యూజిలాండ్ టూర్‌కు వెళ్లి, ఆ తర్వాత తీరిగ్గా ఆలోచించాలని అనుకుంటున్నారు. అన్నట్టూ.. బ్రిటన్‌లో యూరోమిలియన్స్ లాటరీ చరిత్రలోనే అత్యధిక మొత్తం జాక్‌పాట్ తగిలిన పదో వ్యక్తి రిచర్డే కావడం విశేషం. -
లాయర్, జర్నలిస్ట్ ప్రేమకథ!
సినిమా తీయడం సులువే కానీ.. విడుదల చేయడమే కష్టం అంటున్నారు కె.ఎస్.ఐ. ఆయన దర్శకత్వంలో జగపతిబాబు, భూమిక, రణధీర్, సష్టి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఏప్రిల్ ఫూల్’. సుధా ఎంటర్టైన్మెంట్, కర్తాళ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. పాటలు విజయం సాధించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిపారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఓ లాయర్, ఓ జర్నలిస్ట్‌కి మధ్య సాగే ప్రేమకథే ఈ చిత్రం. సహజత్వానికి దగ్గరగా ఉండే ఈ సినిమాకి జగపతిబాబు, భూమికల నటన ప్రధానాకర్షణగా నిలుస్తుంది. బంటి స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. సెన్సార్ పూర్తయ్యిందని, అన్ని వర్గాలవారూ చూడదగ్గ విధంగా ఈ సినిమా ఉంటుందని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సురేష్‌బాబు అన్నారు. పాటల్లానే సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నానని బంటి చెప్పారు. సృష్టి, బలభద్రపాత్రుని రమణి తదితరులు ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో అతిథులుగా పాల్గొన్న రమేశ్ పుప్పాల, స్వామి చిత్ర బృందానికి ప్లాటినమ్ డిస్క్‌లను ప్రదానం చేసి, శుభాకాంక్షలు అందజేశారు.