
క్లీవ్(అమెరికా): ఆదివారంతో వారాంతం ముగిశాక అందరూ సోమవారం కొత్త వారాన్ని మొదలుపెడతారు. కానీ అమెరికాకు చెందిన మాజీ మెకానిక్ ఏకంగా కొత్త జీవితాన్నే మొదలుపెట్టారు. 40 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.328 కోట్ల) లాటరీ రూపంలో ఆయనను ధనలక్ష్మి వరించింది. చిరకాల మిత్రుడొచ్చి లాటరీ గెలుపు సంగతి చెబితే ‘ఏప్రిల్ ఫూల్’ చేస్తున్నాడని భావించాడు ఎర్ల్ లాపే. ఎందుకంటే ఏప్రిల్ ఒకటో తేదీన ఆయన ఆ టికెట్ కొన్నాడు మరి.
అమెరికాలోని అయోవా రాష్ట్రంలోని డబ్యూక్ సిటీలో ఉండే 61 ఏళ్ల లాపే మెకానిక్‌గా చేసి రిటైర్ అయ్యారు. ఇటీవల ఆయన కొన్న ‘లోట్టో అమెరికా’ లాటరీ టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది. దీంతో ఆయన ఆనందానికి అవధుల్లేవు. సోమవారం లాటరీ ప్రధాన కార్యాలయానికి వచ్చి టికెట్‌ను క్లెయిమ్ చేశాడు. విడతలవారీగా అయితే రూ.328 కోట్లను 29సంవత్సరాల కాలంలో ఇస్తారు. కానీ విడతలవారీగా కాకుండా ఒకేసారి ఏకమొత్తంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆయనకు రూ.175 కోట్ల నగదు బహుమతి దక్కనుంది.
Comments
Please login to add a commentAdd a comment