ఆద్యంతం..జనపక్షం
సాక్షి ప్రతినిధి, కాకినాడ :జిల్లా పరిషత్ కొత్త పాలకవర్గ తొలి సర్వసభ్య సమావేశం చైర్‌పర్సన్ నామన రాంబాబు అధ్యక్షతన ఆదివారం జరిగింది. అనుభవజ్ఞులైన సభ్యులతో సమానంగా కొత్త సభ్యులు, మహిళా జెడ్పీటీసీలు పోటాపోటీగా కురిపించిన ప్రశ్నల వర్షంతో అధికారులు ఉక్కిరిబిక్కిర య్యారు. కొందరైతే సమాధానాలు చెప్పలేక నీళ్లునమలాల్సి వచ్చింది. సమావేశంలో అధికారపక్షమే విపక్షపాత్ర పోషించడం కొసమెరుపు. స్థాయీ సంఘాల ఎన్నికలతో ఉదయం 11 గంటలకు మొదలైన సమావేశం మధ్యాహ్నం గంటపాటు భోజన విరామం మినహా రాత్రి ఏడు గంటల వరకు సాగింది. తొలి సమావేశాన్ని సమన్వయంతో నిర్వహించడంలో నామన కొంత తత్తరపడడం కనిపించింది. తెలంగాణ నుంచి విలీనమైన పోలవరం ముంపు మండలాల జెడ్పీటీసీ సభ్యులు సోయపు అరుణ (చింతూరు), ముత్యాల కుసుమాంబ (వరరామచంద్రపురం), ఎడవల్లి కన్యకాపరమేశ్వరి (కూనవరం) సభలో ప్రమాణం చేశారు. వీరి చేరికతో జెడ్పీటీసీ సభ్యుల సంఖ్య 61కి, మహిళల ప్రాతినిధ్యం 32కి పెరిగాయి. స్థాయీ సంఘాలకు నియమితులైన సభ్యులను సీఈఓ ఎం.సూర్యభగవాన్ ప్రకటించాక అజెండాను చేపట్టారు.
నగరం పేలుడుపై విస్తృతచర్చ
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనానికి కారణమైన నగరం గ్యాస్ పైపులైన్ పేలుడులో బాధితులను విస్మరించిన విషయాన్ని ఐ.పోలవరం జెడ్పీటీసీ సభ్యుడు పేరాబత్తుల రాజశేఖర్ సభ దృష్టికి తీసుకువెళ్లాక రెండు నిమిషాలు మౌనం పాటించారు. గెయిల్, ఓఎన్‌జీసీ, జీఎస్‌పీసీ వంటి చమురు సంస్థల పైపులైన్‌లతో కోనసీమ ప్రజలకు భద్రత లేని విషయంపై అధికార, ప్రతిపక్షాలు విస్తృత చర్చ చేపట్టారు. భద్రతపై భరోసా ఇవ్వడం, చమురు సంస్థలతో ఇక ముందు నిర్వహించే భేటీలో పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులందరికీ భాగస్వామ్యం కల్పించడం, దీనిపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ తీర్మానించాలని కోనసీమ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు పట్టుబట్టారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు చొరవతో ఆర్థిక సాయం అందిందని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ తోట నరసింహం చెపుతున్నప్పుడు, ప్రతిపక్ష నేతగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ తరఫున కుటుంబానికి లక్ష ఇచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. పూడ్చలేని నష్టం జరిగిందంటూ ప్రతిపక్షంతో పాటు అధికార పక్షం కూడా గొంతు కలిపింది.
విపక్షనేతగా ఆకట్టుకున్న నవీన్
జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్ పదునైన పదాలతో తొలి ప్రసంగంతోనే సభ దృష్టిని ఆకర్షించగలిగారు. సమయస్ఫూర్తితో స్పందించారు. సమావేశమందిరంలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని తొలగించేందుకు తీర్మానం చేయాలని ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పట్టుబట్టినప్పుడు ‘వైఎస్ ప్రజానాయకుడు. ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేశారు. అలాంటి నేత ఫొటో తీసేయమంటారా, కావాలంటే తీర్మానం చేసుకోండి’ అంటూ నవీన్ తీవ్రంగా స్పందించడంతో.. చైర్‌పర్సన్ ఇది సమయం కాదంటూ చర్చకు అవకాశం ఇవ్వలేదు. నీలం పరిహారం, ఎస్సీ రుణాలకు బ్యాంకుల నిరాకరణ తదితర అంశాలపై అధికారపార్టీ సభ్యులు విపక్ష పాత్ర పోషించడంతో చైర్‌పర్సన్ నామన సమాధానం చెప్పలేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. ‘చూస్తాం, చేస్తా’మంటున్న ఆయనను ‘అలా అనవద్దు, కనీసం వచ్చే సర్వసభ్య సమావేశానికైనా పరిష్కారాలు చూపిస్తారని అధికారుల నుంచి భరోసా కల్పించాలి’ అని అధికారపక్షానికే చెందిన ఎమ్మెల్యే పులపర్తి, జెడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్ సూటిగా అడగడంతో అధికారులతో సమాధానం చెప్పించడానికి తడబడాల్సి వచ్చింది.
నెహ్రూకు అధికారపక్ష సభ్యుల మద్దతు
వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యాల సాధనలో వైఫల్యాన్ని దాదాపు నేతలంతా ఎండగట్టారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వినిపించిన పిట్టకథ సభలో నవ్వులు కురిపించింది. అవసరమైన అందరికీ మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ నీతూకుమారి అభ్యర్థించారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యమవుతుందనే సాకుతో గోదావరిపై రెండు లిఫ్టుల ఏర్పాటు ప్రతిపాదనకు వ్యతిరేకంగా తీర్మానం కోసం పట్టుబట్టిన వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు అధికారపక్ష సభ్యులు మద్దతు ఇచ్చారు.
ఇందుకు మరోసారి సమావేశమవుదామంటూ చైర్‌పర్సన్ దాటవేయడంపై సభ్యులు గుసగుసలాడుకోవడం వినిపించింది. తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం అజెండాలో లేకపోవడంతో ఎంపీ తోట నరసింహం ఇరిగేషన్ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పింఛన్‌లకు ఆధార్ అనుసంధానంతో అనర్హులకు చోటు లేకుండా పోయిందంటూ చెప్పిందే చెపుతున్న డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రాజుపై జ్యోతుల నెహ్రూ అసహనం వ్యక్తం చేశారు. ‘రాజకీయ ఉపన్యాసాలు వద్దు. సమగ్ర సమాచారం ఉంటే చెప్పండి’ హితవు చెప్పారు. ఉపాధి హామీ పథకం ప్రగతిని ఇన్‌చార్జి పీడీ భవాని చెపుతుండగా అధికారపక్షం నుంచే ప్రతిఘటన ఎదురుకావడంతో వేదికపై ఉన్న ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కలెక్టర్ సర్దిచెప్పేందుకు తంటాలు పడాల్సి వచ్చింది.
అధికారులను నిలదీసిన మహిళా సభ్యులు
కొత్తగా ఎన్నికైనా ఏ మాత్రం తటపటాయింపు లేకుండా ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జెడ్పీటీసీ సభ్యులు చిన్నం అపర్ణాదేవి, అధికారి వెంకటలక్ష్మి, సోయపు అరుణ, కోసూరి బుజ్జి చిన్నాలమ్మ తదితరులు వివిధ సమస్యలపై అధికారులను నిలదీశారు. కాగా, జెడ్పీటీసీ సభ్యులు ప్రజా సమస్యలతో పాటు తమ సొంత కోర్కెల చిట్టా కూడా విప్పారు. వారి డిమాండ్‌లకు ప్రతిపక్ష నేత నవీన్ మద్దతు పలికారు. మండల పరిషత్‌లలో ప్రత్యేక గది, టోల్‌గేట్‌లలో ఉచిత ప్రవేశం, జెడ్పీ సమావేశంలో మాట్లాడేందుకు అవకాశం కావాలన్న సభ్యులు అందుకోసం పట్టుబట్టి మరీ అవుననిపించుకున్నారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, ముమ్మిడివరం, కాకినాడ రూరల్ ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు, పిల్లి అనంతలక్ష్మి సభలో ఒక్క మాట మాట్లాడకుండా మధ్యలోనే వెళ్లిపోయారు.