జిల్లాపై వివక్ష | District of discrimination | Sakshi
Sakshi News home page

జిల్లాపై వివక్ష

Published Sat, Jan 10 2015 1:07 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

జిల్లాపై వివక్ష - Sakshi

జిల్లాపై వివక్ష

కడప ఎడ్యుకేషన్: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం పలు సమస్యలపై వాడివేడిగా సాగింది. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం జిల్లాపై వివక్ష చూపుతోందంటూ పలువురు ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం దాదాపు 7 గంటల వరకు కొనసాగింది. జిల్లాలో తాగునీరు, విద్యుత్, వ్యవసాయం, హార్టికల్చరల్, డ్వామా,ఎస్సీ ఎస్టీ బీసీ సబ్‌ప్లాన్, పంచాయతీరాజ్ సమస్యలపై చర్చ జరిగింది. సమావేశానికి జెడ్పీ చైర్మన్ గూడూరు రవి అధ్యక్షత వహించారు.

రైతులకు సంబంధించిన రుణమాఫీ ప్రకటించకుండానే ఇంత చేశాం అంతచేశాం అని చెప్పుకోవటం ఏమిటని సభలో వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్ ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించ కుండా ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రొద్దుటూరు నియోజక వర్గానికి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదన్నారు. పదివేలు పెట్టి మంచినీటి సమస్యను కూడా తీర్చలేదన్నారు.

అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తనపై కక్ష సాధింపులో భాగంగా తన స్వగ్రామమైన పైడిపాలెంలో రైతులు సాగు చేసిన భూములపై విచారణ మొదలు పెట్టించారన్నారు. ఈ విషయంలో రైతులకు అన్యాయం జరిగితే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. జిల్లాలో మంచినీటి సమస్య అధికంగా ఉందని పలువురు ఎమ్మెల్యేలు సభ దృష్టికి తెచ్చారు.  జిల్లాలో సుండుపల్లి, రాయచోటి, పులివెందులతోపాటు ఇంకా చాలా మండలాల్లో మంచినీటి సమస్య ఉందని పలువురు జెడ్పీటీసీ సభ్యులు సభ దృష్టికి తెచ్చారు.

వీటితోపాటు చాలా మండలాల్లో మంచినీటిని సరఫరాచేసినందుకు ఇంతవరకూ నిధులు రాలేదని పలువురు సభ్యలు సభలో ఆర్‌డబ్లూఎస్ ఆధికారులపై ధ్వజమెత్తారు. ఇలీవల మంచినీటి పథకాలకు విద్యుత్తును తొలిగించడం వల్ల జిల్లాలో ప్రజలు 48 గంటలపాటు మంచినీటికి ఇబ్బందులు పడ్డారని మైదుకూరు ఎమ్మెల్యే రఘరామిరెడ్డి విద్యుత్తు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంచినీటి పథకాలకు సంబంధించిన బిల్లులు గత ప్రభుత్వమే చెల్లిస్తే ఈప్రభుత్వం మాత్రం పంచాయితీ నిధుల నుంచి కట్టించుకోవాలనటం విడ్డూరంగా ఉందన్నారు. సంబంధిత బిల్లులు ప్రభుత్వమే చెల్లించే విధంగా సభ తీర్మానం చేయాలని కోరగా సభ్యులంతా బలపరిచారు.

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు విద్యుత్ సబ్‌స్టేషన్లు మంజూరు చేయాలని కోరగా, ఎస్‌ఈ స్పందిస్తూ నియోజకవర్గానికి ఒక సబ్‌స్టేషన్ చొప్పున మంజూరు కోసం ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి నిధులు ఇచ్చినా చాలా పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయలేదన్నారు.  
 
ఎన్‌టీఆర్ సుజల స్రవంతి ఏమైనట్లు?
చంద్రబాబు అన్ని గ్రామాలకు మినరల్ వాటర్ అందిస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘరామిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు చెప్పిన పథకంలో జిల్లాలో ఎన్ని గ్రామాలకు మినరల్ వాటర్ ఇస్తున్నారో చెప్పాలని ఆర్‌డబ్లూఎస్ ఆధికారులను నిలదీశారు.

దీనికి ఆర్‌డబ్ల్యుఎస్ అధికారి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 613 యూనిట్లు గుర్తించామని, 63 యూనిట్లు మంజూరయ్యారని, 44 పూర్తయి మినరల్ వాటర్‌ను అందిస్తున్నాయన్నారు. దాతల సహకారంతో వాటిని నిర్వహిస్తున్నారని చెప్పడంతో సొమ్ము ఒకరిది... సోకకరిది అన్న రీతిలో వీటి నిర్వహణలో ఉందిన ఎమ్మెల్మేలు విమర్శించారు.

మంచినీటి సమస్యపై ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో జరిగిన విజిలెన్స్ మానిటరింగ్ సమావేశంలో వేముల మండలంలో మంచినీటి సమస్య గురించి కలెక్టర్ దృష్టికి తెచ్చామని, ఇంతవరకు పరిష్కరించలేదని ఆయన అన్నారు. వీటితోపాటు సింహాద్రిపురం, లింగాల మండలంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపాలని చెప్పినా పట్టించుకోలేదన్నారు.
 
ఇసుక క్వారీలు రద్దు చేయాలి
కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలో ఇప్పటికే ఐదు ఇసుక క్వారీల మంజూరు చేసిందని, ఇది చాలదన్నట్లు మళ్లీ 15 క్వారీలకు అనుమతి ఇచ్చేందుకు సిద్ధమవుతోందన్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా జిల్లాలో తీవ్ర తాగునీటి సమస్య ఎదురవుతోందన్నారు.

దీంతోపాటు ఇసుకపై వచ్చే ఆదాయాన్ని జిల్లా అభివృద్ధికే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు బిల్లుల చెల్లింపు విషయంలో స్పష్టమైన హామి ఇవ్వాలన్నారు. గత ఏడాది గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేసిన బిల్లులు ఇంతవరకు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటన్నారు.  
 
ఆక్రమణ నుంచి దుంపలగట్టు చెరువును కాపాడండి
ఖాజీపేట మండలంలోని దుంపలగట్టు చెరువును కొంతమంది ఆక్రమించుకున్నారని, దీంతో 400 ఎకరాల ఆయకట్టు బీడుగా ఉందన్నారు. దీంతో రైతులు చాలామేర నష్టపోయారన్నారు. దుంపలగట్టుకు చెందిన ఓ రైతు చెరువు ఆక్రమణ భూమిలో బోరును వేసి అక్రమంగా విద్యుత్‌ను ఏర్పాటు చేసుకుని పంటలను సాగు చేసుకుంటున్నారన్నారు.

దీంతోపాటు చెరువు అలుగును ఎవరో ధ్వంసం చేశారని, దీనిపై కేసీ అధికారులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. అలాగే రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ బొజ్జవారిపల్లె చెరువులో కొంతమంది భూమిని ఆక్రమించుకున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత విషయం గురించి గతంలో ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు.  
 
స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేయాలి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కలలుగన్న స్టీల్ ప్లాంటు ఏర్పాటు త్వరగా జరిగేటట్లు చూడాలని ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి కోరారు. దీనిపై సభలో తీర్మానం చేయాలని కోరారు. అలాగే కౌలు రైతులకు కూడా రైతు రుణమాఫీ వర్తించేలా చూడాలని కోరారు. పలువురు జెడ్పీటీసీ సభ్యులు తమ ప్రాంతంలో నెలకొన్న మంచినీటి సమ్యను పరిష్కరించాలని సభ దృష్టికి తెచ్చారు.

మైదుకూరు జెడ్పీటీసీ తన మండలంలోని కొంతమంది పసుపు రైతులు కలుపు నివారణకు పిచికారి చేసిన మందుతో పంట మొత్తం దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వీరికి ప్రభుత్వమా లేక కంపెనీ ప్రతినిధులు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారో చెప్పాలని నిలదీశారు. అలాగే ఎరువుల మంజూరులో కూడా కొంత అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆరోపించారు.

గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, సుండుపల్లె జెడ్పీటీసీలు మాట్లాడుతూ తమ మండలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురయ్యాయని, వాటి స్థానంలో కొత్తవి మంజూరు చేయాలని విద్యుత్‌శాఖ ఎస్‌ఈని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎస్‌బి అంజాద్‌బాష, జయరాములు, ఎమ్మెల్సీలు బచ్చల పుల్లయ్య, బత్యాల చెంగల్రాయులు, జాయింట్ కలెక్టర్ రామారావు, జెడ్పీ సీఈఓ మాల్యాద్రి, వైస్ చైర్మన్ సుబ్బారెడ్దిలతోపాటు పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement