కౌన్సిల్ రగడ | Corporation of the new ruling class... | Sakshi
Sakshi News home page

కౌన్సిల్ రగడ

Published Tue, Aug 26 2014 3:10 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

Corporation of the new ruling class...

- సమావేశం కోసం వైఎస్సార్‌సీపీ పట్టు
- ససేమిరా అంటున్న అధికార పార్టీ
- కమిషనర్ మౌనముద్ర
- టీడీపీలో సర్దుబాట్ల కోసమేనా?
సాక్షి, నెల్లూరు : కార్పొరేషన్ నూతన పాలకవర్గం ఏర్పడినా ఇంత వరకూ సర్వసభ్య సమావేశం నిర్వహించకపోవడం వివాదాస్పదంగా మారుతోంది. సమావేశం నిర్వహించాలని వైఎస్సార్‌సీపీకి చెందిన డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్‌తో పాటు 13 మంది సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వీరికి మేయర్ అజీజ్‌ను వ్యతిరేకిస్తున్న అధికారటీడీపీ సభ్యులు మద్దతు పలుకుతుండటం విశేషం. కార్పొరేషన్ సమావేశం నిర్వహించాలని కమిషనర్ జాన్‌శ్యాంసన్‌పై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. అయినా కమిషనర్ శ్యాంసన్ తనకేమీ పట్టనట్టు మౌనం పాటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు ఎలాగైనా సమావేశాన్ని వాయిదా వేసుకుంటూ నెట్టుకురావాలని మేయర్ అబ్దుల్‌అజీజ్ ఆధ్వర్యంలో అధికార పార్టీ నానా తంటాలు పడుతోంది.  నిబంధనల మేరకు  సెప్టెంబర్ 3 లోపు కార్పొరేషన్ సమావేశమై కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. ఆ తర్వాత  మూడునెలల్లో జనరల్ బాడీ సమావేశం జరిగాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రతి పదిమందికి ఒకరు చొప్పున  స్టాండింగ్ కమిటీ సభ్యులను సైతం ఎన్నుకోవాల్సి ఉంది.

ఏ ఒక్క సమావేశం నిర్వహించకపోవడంపై ఎన్నికైన సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్‌కు సాధారణ ఎన్నికలు జరిగినా  జనరల్ బాడీ సమావేశం జరగక పోవడంతో అభివృద్ధి పనులు జరిగే అవకాశం కూడా  లేదని సభ్యులు వాదిస్తున్నారు. ఏదీ జరపనప్పుడు ఎన్నికలు ఎందుకు  నిర్వహించారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సమావేశాలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా  మేయర్‌గా ఎన్నికైన అబ్దుల్‌అజీజ్  ఆ తర్వాత అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. మేయర్‌తో పాటు 12 మంది కార్పొరేటర్లు పార్టీ మారినా అధికార పార్టీ  నుంచి ఎన్నికైన కార్పొరేటర్లు అజీజ్ ఏకపక్షంగా టీడీపీ తీర్థం పుచ్చుకోవడాన్ని బహిరంగంగానే  వ్యతిరేకిస్తున్నారు.

ఇది మరింత ముదిరి జిల్లా టీడీపీలో వర్గవిభేదాలకు దారితీసింది.  దీని నుంచి బయటపడలేక అజీజ్ సతమతమవుతున్నారు. మరోవైపు డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్‌తో కలిపి వైఎ్ససార్‌సీపీకి 13 మంది సభ్యులున్నారు. వీరికి అజీజ్‌ను వ్యతిరేకిస్తున్న టీడీపీ సభ్యుల మద్దతు ఉంది. సమావేశం కోసం వారు పట్టుబడుతున్నారు. ఈ సమయంలో సర్వసభ్య సమావేశం జరిగితే  పరిస్థితి  తమకు వ్యతిరేకంగా ఉంటుందని అధికార పార్టీకి చెందిన ఓ వర్గం  ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలో తమవారికి నచ్చ చెప్పుకునేందుకు సమావేశం జరగకుండా వాయిదా వేసుకుం టూ వస్తున్నట్టు సమాచారం. మరోవైపు కార్పొరేషన్ సమావేశం నిర్వహించకపోవడంపై కార్పొరేటర్లు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు రోజులు చూసి ఆందోళనకు దిగాలని కార్పొరేటర్లు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement