సాక్షి, విజయనగరం: రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల జెడ్పీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. సీఎం వైఎస్ జగన్ నాయకత్వాన్ని ఓటర్లందరూ సమర్థించారు. మాపై పూర్తి విశ్వాసాన్ని ఉంచారు. ఈ పదవుల వలన మరింత బాధ్యత పెరిగింది. మేము ఇంకా కష్టపడి పనిచేయాలని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న జెడ్పీటీసీ అభ్యర్థులు వందకి వంద శాతం గెలుపొందారు. అందరికీ పార్టీ తరపున, వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అందరూ కష్టపడి పనిచేయాలని కోరుతున్నా. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన మజ్జి శ్రీనివాస్‌రావుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చదవండి: ('భారత్ బంద్‌కు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు')
జిల్లా ప్రజలకు మాట ఇస్తున్నాం. గెలిపించిన ప్రజల ఆశయాలను వమ్ము చేయకుండా ప్రజల కోసం పాలన చేపడతాం. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకున్నారు. టీడీపీ ఒకవైపు పోటీ చేసి మరోవైపు ఎన్నికకు దూరంగా ఉన్నాం అంటూ కుంటి సాకులు చెప్పింది. రెండేళ్ల పాలనకు నిదర్శనమే ఈ ప్రజా తీర్పు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీయే విజయం సాధిస్తుందిని మంత్రి అన్నారు.
సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు: జెడ్పీ చైర్మన్
చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సీఎం జగన్ పరిపాలన, సంక్షేమం వలనే ప్రజా విజయం సాధించాం. ప్రతి ఒక్కరి ఆలోచన తీసుకొని, గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడతా. సీఎంకు పేరు, గౌరవం తెచ్చే విధంగా బాధ్యతలను నిర్వహిస్తాను. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటా. పదవి ఉన్నా.. లేకున్నా ఒకేలా ఉంటా అని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్‌రావు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment