సమస్యల తోరణాలు | General Meeting in Amalapuram | Sakshi
Sakshi News home page

సమస్యల తోరణాలు

Published Sun, Dec 7 2014 12:07 AM | Last Updated on Tue, May 29 2018 4:15 PM

సమస్యల తోరణాలు - Sakshi

సమస్యల తోరణాలు

 కాకినాడ సిటీ/అమలాపురం :జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు అధ్యక్షతన శనివారం కాకినాడలోని జెడ్పీ సమావేశమందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశం ఆద్యంతం వాడిగా, వేడిగా సాగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వివాదాలు, వైఎస్సార్ సీపీ ప్రతినిధుల వాకౌట్ వంటి పరిణామాలు  వాతావరణాన్ని వేడెక్కించాయి. విలీన మండలాల్లో సమస్యలు సహా పెక్కు ఇక్కట్లను ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు ఏకరువు పెట్టారు.  పురుషుల కన్నా మహిళా సభ్యులు తమ ప్రాంత సమస్యలపై ఎలుగెత్తడం విశేషం.
 
 ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి యనమల రామకృష్ణుడు ముఖ్యఅతిథులుగా హాజరైన సమావేశానికి తొలిసారి హాజరైన భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సమావేశంలో తొలుత యనమల మాట్లాడుతూ జెడ్పీకి మరో పోటీ కేంద్రం ఉండకూడదనే ఉద్దేశంతోనే డీఆర్సీని తమ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.   రాజప్ప మాట్లాడుతూ నీటి ఎద్దడి దృష్ట్యా ముందస్తు సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయశాఖతోపాటు ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. అనంతరం జెడ్పీ చైర్మన్ నామన శాఖల వారీగా సమీక్షను చేపట్టారు. సుమారు 20 ఏళ్ల తరువాత సమావేశానికి వచ్చానన్న యనమల 20 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్లిపోవడం గమనార్హం.
 
 నకిలీ విత్తనాలు, నీలం పరిహారం ఆలస్యం, హుద్‌హుద్ తుపాను నష్టం అంచనాలపై ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, తోట త్రిమూర్తులు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుళ్ల జోగేశ్వరరావు వ్యవసాయశాఖ జేడీ విజయకుమార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. రైతు రుణమాఫీపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అధికారుల తీరును తప్పుబట్టారు. జిల్లాలో ఎందరు రైతులు రుణమాఫీకి అర్హులన్న సమాచారం కూడా లేదంటే మాఫీ అమలు ఏ విధంగా ఉందో తేటతెల్లమవుతోందన్నారు. తన ప్రాంతంలో రాజకీయ కక్షలతో ఆరుగురి పింఛన్లు రద్దు చేశారని జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు జ్యోతుల నవీన్ అధికారులపై మండిపడ్డారు.
 
 ఎందుకు నిలిపివేశారో చెప్పాలని పట్టుబట్టారు. ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు పాల్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు డ్వామా పీడీ నాగేశ్వరరావును నిలదీశారు. ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని పలువురు సభ్యులు కోరారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పలుచోట్ల నిలిచిపోవడం దారుణమని సభ్యులు మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన వారికి అవార్డులు ఇవ్వడం ఏమిటని ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, వేగుళ్ల అధికారులను తప్పుబట్టారు.
 
 కొనసాగుతున్న ఇసుక మాఫియా ఆగడాలు
 ప్రభుత్వం ఇసుక తవ్వకాలు పాలసీ మార్చినా మాఫియా ఆగడాలు తగ్గలేదని వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రాజు, జేసీ ముత్యాలరాజులకు ఫిర్యాదు చేశారు. ఇసుక రీచ్‌లను ఉదయం డ్వాక్రా సంఘాలు నిర్వహిస్తుంటే సాయంత్రం మాఫియాలు రంగప్రవేశం చేసి వందల లారీల ఇసుకను దొంగ బిల్లులు చూపి కొల్లగొట్టుకుపోతున్నారన్నారు. రావులపాలెం జెడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్ ‘సాక్షి’తోపాటు వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలు చూపుతూ వాటిపై ఎందుకు విచారణ చేయలేదని నిలదీశారు. పీడీ మాట్లాడుతూ జిల్లాలో 23 రీచ్‌ల ద్వారా ఇప్పటి వరకు రూ.15 కోట్ల ఆదాయం వచ్చిందని, దానిలో స్థానిక సంస్థలకు వచ్చేది రూ.90 లక్షలేననడంతో జెడ్పీటీసీలు మండిపడ్డారు. ప్రభుత్వ విధానాల వల్ల స్థానిక సంస్థల ఆదాయానికి గండి పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 ప్రతిపక్ష నేత గొంతు నొక్కుతారా?
 జెడ్పీ ప్రతిపక్ష నేత గొంతు నొక్కే యత్నాలను నిరసిస్తూ సమావేశం నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు వాకౌట్ చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి ఎన్నికైనందున సమావేశంలో తనకు మాట్లాడేందుకు అవకాశం కల్పించకపోవడం లేదని జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రతిపక్ష నేత గొంతు నొక్కుతారా? మీ ఇసుక మాఫియా బాగోతాలు బయట పెడతానని భయపడుతున్నారా?’ అని మండిపడ్డారు. జెడ్పీ చైర్మన్ నామనతో వాగ్వివాదానికి దిగారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు అధికారపార్టీ నాయకుల తీరుపై విరుచుకుపడ్డారు. సమావేశం నుంచి వాకౌట్ చేశారు. జరిగిన దానికి విచారణ వ్యక్తం చేస్తున్నానని నామన నచ్చజెప్పడంతో తిరిగి సమావేశానికి హాజరయ్యారు. మహిళా జెడ్పీటీసీలు తమ ప్రాంత సమస్యలుపై గళమెత్తడం సమావేశానికి హైలెట్‌గా నిలిచింది. అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని చెప్పడమే కాక, పరిపాలనాపరంగా ఎదురైన ఇబ్బందుల్ని అధికారులకు వివరించి వారి నుంచి  హామీలను పొందారు.  
 
 అంబేద్కర్‌కు నివాళి
 తొలుత అంబేద్కర్‌కు నివాళులర్పించిన సభ్యులు తరువాత దివంగత ఎన్టీఆర్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. వాకతిప్ప బాణా సంచా విస్ఫోటంలో, హుద్‌హుద్ తుపానులో మరణించిన వారి ఆత్మల శాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, బలశాలి ఇందిర, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, పిల్లి అనంతలక్ష్మి, అదనపు జేసీ మార్కండేయులు, జెడ్పీ సీఈఓ పద్మలు పాల్గొన్నారు.
 
 దమ్ముంటే సెజ్ భూములను పంచండి : జ్యోతుల
 సమావేశంలో రుణమాఫీపై అధికార, ప్రతిపక్ష  ఎమ్మెల్యేల మధ్య వాగ్వివాదం జరిగింది. రైతులకు మేలు చేసింది చంద్రబాబేనని పిఠాపురం ఎమ్మెల్యే వర్మ అనగా, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అభ్యంతరం తెలిపారు. అధికారంలోకి రాగానే కేఎస్‌ఈజెడ్  భూముల్ని రైతులకు పంచుతానన్న బాబు ఇంత వరకూ పట్టించుకోలేదన్నారు. దీనిపై వర్మ ఆ భూములు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరులవన్నట్టు మాట్లాడగా, జ్యోతులతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్మేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, దాడి శెట్టి రాజా విరుచుకుపడ్డారు. ‘దమ్ముంటే ఆ భూములు స్వాధీనం చేసుకుని రైతులకు పంచండి’ అని సవాల్ విసిరారు. సవాల్‌కు స్పందించకుండా అధికార పార్టీ నాయకులు మూకుమ్మడిగా ఎదురుదాడికి యత్నించారు. ‘చాగల్నాడు ఎత్తిపోతలకు అనుమతి ఇవ్వనన్నందుకు ఎన్టీఆర్‌పై తిరుబాటు చేశాను. చంద్రబాబు ముఖంపై రాజీనామా పత్రం విసిరివచ్చాను. మీ పార్టీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులే సాక్షి. మీకు రైతులకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే మీరు రాజీనామకు సిద్ధపడండి’ అని జ్యోతుల అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement