Female members
-
దేశభక్తి మహిళాశక్తి
‘దేశమంటే మట్టికాదోయ్! దేశమంటే మనుషులోయ్!’ గురజాడ అప్పారావుగారు ఎంత చక్కగా చెప్పారు. కానీ ఆ కాలానికీ ఈ కాలానికి కాస్త మార్పు వచ్చింది. దేశమంటే ఇప్పుడు మనుషులు కాదు. మహిళా శక్తులు. ఏ ఉద్యమమైనా చూడండి... ఏ ఉద్యోగమైనా చూడండి. మహిళలే ముందుంటున్నారు. ఏం ఉంటున్నారూ.. పర్సెంటేజ్ చూడండి. ఆఫీస్‌లలో మగవాళ్లే ఉంటున్నారు. ఆర్మీలలో మగవాళ్లే ఉంటున్నారు. ఉండటం ముఖ్యం కాదు. ముందుండటం ముఖ్యం. పౌరసత్వ చట్టంపై నిరసన. ఎవరు ముందుంటున్నారు? మహిళలు! పర్యావరణ పరిరక్షణ. ఎవరు ముందుంటున్నారు? మహిళలు! ఢిల్లీలో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎంత కాలుష్యం అయినా ఉండనివ్వండి. గాలిలో ప్రస్తుతం స్వచ్ఛమైన దేశభక్తి గుండెల్ని తాకుతోంది. నిన్న.. నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతి. రెండు రోజులు గడిస్తే గణతంత్ర దినోత్సవం. నేడు.. అమెజాన్ ప్రైమ్ వీడియో.. ‘ది ఫర్గాటెన్ ఆర్మీ.. ఆజాదీ కె లియే’ వెబ్ సిరీస్ ప్రారంభం! మహిళా శక్తికి.. ఈ మూడు సందర్భాలకు సంబంధం ఏమిటి? యుద్ధంలోకి మొదటిసారిగా మహిళల్ని తెచ్చింది నేతాజీ! స్వాతంత్య్ర సంగ్రామంలో మహిళా సైనిక దళాన్ని ఏర్పాటు చేసి, వాళ్ల చేతికి తుపాకులిచ్చారు నేతాజీ. సరిగ్గా శత్రువుల గుండెల్లోకి పేల్చేలా వారికి శిక్షణ ఇచ్చారు. కదన రంగంలో ముందుకు కదలడానికి ఆ మహిళలకు.. కట్టుకున్న చీరలు అడ్డుపడలేదు కానీ... ఆరంభంలోనే.. యుద్ధంలోకి స్త్రీలెందుకు, స్త్రీల చేతులకు తుపాకులెందుకు అని మగాళ్లు ముఖం చిట్లిస్తూ అడ్డొచ్చారు. నేతాజీ వినలేదు. ఆజాద్ హింద్ ఫౌజ్ (నేతాజీ సారథ్యం వహించిన సైన్యం)కి ప్రత్యేకమైన పోరాట వ్యూహాలు ఉన్నప్పటికీ.. భారీ బలగాల్లేవు. మహిళాశక్తిపై నమ్మకంతో, విశ్వాసంతో వారిని సంగ్రామంలోకి ఆహ్వానించారు.నేతాజీ. అందుకోసం 1943 జూలై 9న సింగపూర్‌లో సమావేశం జరిగింది. ‘‘ఏం చేస్తారు బోస్.. ఆడవాళ్లు సైన్యంలోకి వచ్చి?’’ మగవాళ్లెవరో లేచి అడిగారు నేతాజీని. ‘‘ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేసిందో అదే చేస్తారు’’ అన్నారు నేతాజీ! ‘‘తిరుగుబాటుకు, స్వాతంత్య్ర సంగ్రామానికి అప్పుడున్నది ఒక్క లక్ష్మీబాయే. ఇప్పుడు ప్రతి మహిళా ఒక లక్ష్మీబాయి. నేను నమ్ముతున్నాను.. మహిళలూ కదిలొస్తే మనకు స్వాతంత్య్రం సిద్ధిస్తుంది. మహిళలూ యుద్ధరంగంలోకి దుమికితే.. భారతదేశం అణువణువునా స్వాతంత్య్ర కాంక్ష రగులుతోందన్న సంకేతం బ్రిటన్‌కు అందుతుంది’’.. అన్నారు నేతాజీ. ఆ వెంటనే.. చెయ్యి ముందుకు చాస్తూ.. ప్రమాణం చేస్తున్నట్లుగా.. ‘‘మన మహిళా దళం పేరు.. ‘రాణీ ఝాన్సీ రెజిమెంట్’. మరణ ధిక్కార మహిళా దళం మనది’’ అన్నారు. ‘ది ఫర్గాటెన్ ఆర్మీ.. ఆజాదీ కె లియే’లో ఓ సన్నివేశం ఎల్లుండి.. జనవరి 26. గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే). భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఈ ఏడాదికి మన గణతంత్రానికి డెబ్భై యేళ్లు పూర్తవుతాయి. రాజ్యాంగం 1950లో అమలులోకి వచ్చినప్పటికీ రాజ్యాంగ రచనా సమాలోచనలు ప్రారంభమైంది మాత్రం దేశానికి స్వాతంత్య్రం రాకముందే! 1946 డిసెంబర్ 9, ఉదయం 10.45 గంటలకు న్యూఢిల్లీలోని రఫీమార్గ్‌లో ఉన్న కాన్స్టిట్యూషన్ హాల్లో (ఇప్పటి పార్లమెంట్ హౌస్‌లోని సెంట్రల్ హాల్) తొలి రాజ్యాంగ సమావేశం జరిగింది. రాజనీతిజ్ఞులు, ఆలోచనాపరులు, మేధావులు.. మొత్తం 207 మంది ఆ కీలకమైన చర్చా సమావేశానికి హాజరయ్యారు. వారిలో 15 మంది మహిళలే! అప్పట్లో అదేమీ తక్కువ సంఖ్య కాదు. ఆ పదిహేను మందిలో కూడా ఒకరు ముస్లిం. ఇంకొకరు దళిత వర్గం. బేగమ్ అజీజ్ రసూల్, దాక్షాయణి వేలాయుధన్. మిగతా పదమూడు మందీ.. రేణుకా రాయ్, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, హంసా మెహ్తా, పూర్ణిమా బెనర్జీ, రాజ్‌కుమారి అమృత్‌కౌర్, మాలతీ చౌదరి, లీలా రాయ్, సుచేత కృపలాని, సరోజినీ నాయుడు, విజయలక్ష్మీ పండిట్, అమ్ము స్వామినాథన్, యానీ మాస్కరీన్, కమలా చౌదరి. ఒక్కో మహిళదీ ఒక్కో సామాజిక, రాజకీయ నేపథ్యం. రాజ్యాంగ రచనలో వీరి సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, ఉద్దేశాలు, అభ్యంతరాలు, సందేహాలు, సంశయాలకు... వీటన్నిటికీ ప్రాధాన్యం లభించింది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో మహిళ సామాజిక హక్కులు ఇప్పుడొక ప్రత్యేక అధ్యాయంగా ఉండటానికి కారణం ఆనాటి ఈ పదిహేను మంది మహిళా సభ్యుల మాటకు లభించిన విలువేనంటారు జె.ఎన్.యు. ప్రొఫెసర్ నీరజా గోపాల్ జయాల్. పాలనకు రాజ్యాంగం శక్తి అయితే ఆ శక్తికి స్త్రీ స్వరూపం ఈ పదిహేను మందీ! రాణీ ఝాన్సీ రెజిమెంట్లా.. వీరి రాజ్యాంగ మహిళా సైనిక దళం. తొలి రాజ్యాంగ సమావేశంలోని 15 మంది మహిళా సభ్యులలో పదకొండు మంది 24 జనవరి 2020. ఈ రోజే! అమెజాన్ ప్రైమ్ వీడియోలో.. ‘ది ఫర్గాటెన్ ఆర్మీ.. ఆజాదీ కె లియే’ మినీ వెబ్ సిరీస్ మొదలవుతున్నాయి. అమెజాన్ అనగానే ఇవేవో నాటకీయ మహిళా దేశభక్తి ప్రసారాలని అనుకోకండి. సుభాస్ చంద్రబోస్ నడిపించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌లోని సైనికుల వాస్తవ గాథలతో పాటు.. ఆయన స్థాపించిన రాణీ ఝాన్సీ రెజిమెంట్‌లోని మహిళా సైనికుల వీరగాథల్నీ అమెజాన్ చూపించబోతోంది. వీటికి దర్శకత్వం వహిస్తున్నది కబీర్ ఖాన్. కాబూల్ ఎక్స్‌ప్రెస్, న్యూయార్క్, ఏక్ థా టైగర్, బజ్రంగి భాయ్‌జాన్, ఫాంటమ్, ట్యూబ్‌లైట్ వంటి విభిన్న కథా చిత్రాలను తీసిన కబీర్ ఖాన్.. ఇరవై ఏళ్ల క్రితమే దూరదర్శన్ కోసం ఇదే థీమ్‌తో ‘ది ఫర్గాటెన్ ఆర్మీ’ అనే డాక్యుమెంటరీ చేశారు. తాజా.. ఫర్గాటెన్ ఆర్మీ’లో.. ప్రధానంగా మహిళా యోధుల స్ఫూర్తిదాయకమైన పోరాట అనుభవాలను శార్వరీ వాగ్ (సిరీస్‌లో మాయ) ప్రధాన కథానాయికగా చిత్రీకరిస్తున్నారు. ఒకప్పుడు సమాజంలోని అన్ని వర్గాలూ కలిస్తే ఒక ఉద్యమం అయ్యేది. ఇప్పుడు ఏ ఉద్యమానికైనా మహిళా వర్గమే ముందుంటోంది. ముందుండే వారెప్పుడూ యోధులే. శక్తులే. ఇప్పుడిక ‘దేశమంటే మహిళలోయ్’ అనాలా? అనకపోయినా, అంటే ఒప్పుకోడానికి ఎవరూ ఇబ్బంది పడక్కర్లేదు. నేతాజీ ‘రాణీ ఝాన్సీ రెజిమెంట్’లో కొందరు -
ఒక మహిళ తప్ప సభ్యులంతా నేరస్థులే
హైదరాబాద్: జాతీయ బీసీ కమిషన్‌లో ఒక మహిళా సభ్యురాలు తప్ప మిగతా వారంతా నేరస్థులేనని బీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్యగౌడ్ ఆరోపించారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన క్రాంతి మోర్చా తెలంగాణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పరివర్తన యాత్ర ముగింపు సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. బీసీ కమిషన్‌లో ఉన్న సభ్యుల వల్ల హక్కులు రక్షించబడతాయనే నమ్మకం లేకుండా పోయిందని చెప్పారు. బీసీ కమిషన్‌ను నిర్వీర్యం చేసి ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలకు ఉపాధి కల్పిస్తున్నారని విమర్శించారు. విద్య, ఆరోగ్యం ప్రైవేటు సంస్థల చేతుల్లో మగ్గుతున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 4 శాతం ఉన్న అగ్రకులాల వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని.. దీని వల్ల బలహీన వర్గాల వారికి పూర్తిగా అన్యా యం జరుగుతుందని మండిపడ్డారు. మెడికల్ సీట్లలో బీసీలకు 13 శాతం రిజర్వేషన్లు కూడా అమలు కావడం లేదన్నారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ఎన్నికలు చట్టబద్ధంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసు యంత్రాంగమే ప్రభుత్వానికి అనుకూలంగా డబ్బులు పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. బహుజన క్రాంతి మోర్చా జాతీయ కోఆర్డినేటర్ వామన్ మేస్రామ్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బొమ్మకు మురళి తదితరులు పాల్గొన్నారు. -
అతివలే ఆలయ పెద్దలు
ఏపీలో తొలిసారి ఒక గుడికి మహిళా సభ్యులతోనే పాలకమండలి ఏర్పాటు ఇదో నూతన అధ్యాయం: ఏపీ అర్చక సమాఖ్య సింగుపాలెం గ్రామంలోని శ్రీ సీతారామ స్వామి దేవస్థానం ట్రస్టుబోర్డులో అందరినీ మహిళలనే నియమించడం ద్వారా కమిషనర్ అనురాధ కొత్త ఒరవడి సృష్టించారని ఏపీ అర్చక సమాఖ్య ఒక ప్రకటనలో కొనియాడింది. సాక్షి, హైదరాబాద్: ఏపీలో తొలిసారి ఓ గుడికి మొత్తం మహిళలతోనే పాలక మండలి ఏర్పాటైంది. ఆ గుడి అభివృద్ధికి మహిళలు పడుతున్న శ్రమను చూసి ఊరు ఊరంతా మంత్ర ముగ్ధులైంది. ఈసారి గుడి పాలకమండలిని ఆ మహిళలతోనే ఏర్పాటు చేయాలని ఆ ఊరి ప్రజలు తీర్మానించుకున్నారు. గ్రామ సర్పంచ్ ద్వారా స్థానిక ఎమ్మెల్యేకు ఆ విషయాన్ని తెలియజేశారు. ఆయన దేవాదాయ శాఖకు సిఫార్సు చేశారు. దీంతో మొత్తం ఆరుగురు మహిళా సభ్యులతో ఆ గుడికి పాలక మండలిని నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ జనవరి 22న ఉత్తర్వులు జారీ చేశారు. అతివలే ఏలే ఆ ఆలయం.. గుంటూరు జిల్లా రేపల్లె మండలం, సింగుపాలెం గ్రామంలోని శ్రీ సీతారామ స్వామి దేవాలయం. కొత్తగా నియమితులైన పాలకమండలి బుధవారం ఉదయం 10:30 గంటలకు ఆ గుడిలోనే ప్రమాణ స్వీకారం చేయబోతోందని ఆలయ ఈవో సాంబశివరావు ‘సాక్షి’కి తెలిపారు. బాగోగులన్నీ వాళ్లే.. ఏటా రూ. 2 లక్షలు ఆదాయం ఉండే ఆ గుడికి మరమ్మతులు కోసం నిధులు సరిపోకపోతే.. ఆ మహిళలే ఊరి ప్రజల నుంచి రూ. 8.5 లక్షల విరాళాలు సేకరించి మరమ్మతులు చేయించారు. అర్చకుడి కోసం ప్రత్యేకంగా ఒక ఇల్లు కట్టించారు. గుడికి కొత్తగా విద్యుదీకరణ చేయించారు. దేవుడి రథానికి కొత్త షెడ్ కట్టించారు. ఇలా మహిళలు పడుతున్న శ్రమ చూసి గ్రామస్తులందరి సూచనతో సర్పంచి ప్రేమాజీ ఆ మహిళలతోనే గుడి పాలకమండలి ఏర్పాటు చేయాలని గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ను కోరారు. ఆ విజ్ఞప్తిని ఆయన దేవాదాయ శాఖ కమిషనర్‌కు విన్నవించారు. -
సమస్యల తోరణాలు
కాకినాడ సిటీ/అమలాపురం :జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు అధ్యక్షతన శనివారం కాకినాడలోని జెడ్పీ సమావేశమందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశం ఆద్యంతం వాడిగా, వేడిగా సాగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వివాదాలు, వైఎస్సార్ సీపీ ప్రతినిధుల వాకౌట్ వంటి పరిణామాలు వాతావరణాన్ని వేడెక్కించాయి. విలీన మండలాల్లో సమస్యలు సహా పెక్కు ఇక్కట్లను ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు ఏకరువు పెట్టారు. పురుషుల కన్నా మహిళా సభ్యులు తమ ప్రాంత సమస్యలపై ఎలుగెత్తడం విశేషం. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి యనమల రామకృష్ణుడు ముఖ్యఅతిథులుగా హాజరైన సమావేశానికి తొలిసారి హాజరైన భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సమావేశంలో తొలుత యనమల మాట్లాడుతూ జెడ్పీకి మరో పోటీ కేంద్రం ఉండకూడదనే ఉద్దేశంతోనే డీఆర్సీని తమ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. రాజప్ప మాట్లాడుతూ నీటి ఎద్దడి దృష్ట్యా ముందస్తు సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయశాఖతోపాటు ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. అనంతరం జెడ్పీ చైర్మన్ నామన శాఖల వారీగా సమీక్షను చేపట్టారు. సుమారు 20 ఏళ్ల తరువాత సమావేశానికి వచ్చానన్న యనమల 20 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్లిపోవడం గమనార్హం. నకిలీ విత్తనాలు, నీలం పరిహారం ఆలస్యం, హుద్‌హుద్ తుపాను నష్టం అంచనాలపై ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, తోట త్రిమూర్తులు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుళ్ల జోగేశ్వరరావు వ్యవసాయశాఖ జేడీ విజయకుమార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. రైతు రుణమాఫీపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అధికారుల తీరును తప్పుబట్టారు. జిల్లాలో ఎందరు రైతులు రుణమాఫీకి అర్హులన్న సమాచారం కూడా లేదంటే మాఫీ అమలు ఏ విధంగా ఉందో తేటతెల్లమవుతోందన్నారు. తన ప్రాంతంలో రాజకీయ కక్షలతో ఆరుగురి పింఛన్లు రద్దు చేశారని జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు జ్యోతుల నవీన్ అధికారులపై మండిపడ్డారు. ఎందుకు నిలిపివేశారో చెప్పాలని పట్టుబట్టారు. ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు పాల్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు డ్వామా పీడీ నాగేశ్వరరావును నిలదీశారు. ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని పలువురు సభ్యులు కోరారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పలుచోట్ల నిలిచిపోవడం దారుణమని సభ్యులు మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన వారికి అవార్డులు ఇవ్వడం ఏమిటని ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, వేగుళ్ల అధికారులను తప్పుబట్టారు. కొనసాగుతున్న ఇసుక మాఫియా ఆగడాలు ప్రభుత్వం ఇసుక తవ్వకాలు పాలసీ మార్చినా మాఫియా ఆగడాలు తగ్గలేదని వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రాజు, జేసీ ముత్యాలరాజులకు ఫిర్యాదు చేశారు. ఇసుక రీచ్‌లను ఉదయం డ్వాక్రా సంఘాలు నిర్వహిస్తుంటే సాయంత్రం మాఫియాలు రంగప్రవేశం చేసి వందల లారీల ఇసుకను దొంగ బిల్లులు చూపి కొల్లగొట్టుకుపోతున్నారన్నారు. రావులపాలెం జెడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్ ‘సాక్షి’తోపాటు వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలు చూపుతూ వాటిపై ఎందుకు విచారణ చేయలేదని నిలదీశారు. పీడీ మాట్లాడుతూ జిల్లాలో 23 రీచ్‌ల ద్వారా ఇప్పటి వరకు రూ.15 కోట్ల ఆదాయం వచ్చిందని, దానిలో స్థానిక సంస్థలకు వచ్చేది రూ.90 లక్షలేననడంతో జెడ్పీటీసీలు మండిపడ్డారు. ప్రభుత్వ విధానాల వల్ల స్థానిక సంస్థల ఆదాయానికి గండి పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత గొంతు నొక్కుతారా? జెడ్పీ ప్రతిపక్ష నేత గొంతు నొక్కే యత్నాలను నిరసిస్తూ సమావేశం నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు వాకౌట్ చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి ఎన్నికైనందున సమావేశంలో తనకు మాట్లాడేందుకు అవకాశం కల్పించకపోవడం లేదని జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రతిపక్ష నేత గొంతు నొక్కుతారా? మీ ఇసుక మాఫియా బాగోతాలు బయట పెడతానని భయపడుతున్నారా?’ అని మండిపడ్డారు. జెడ్పీ చైర్మన్ నామనతో వాగ్వివాదానికి దిగారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు అధికారపార్టీ నాయకుల తీరుపై విరుచుకుపడ్డారు. సమావేశం నుంచి వాకౌట్ చేశారు. జరిగిన దానికి విచారణ వ్యక్తం చేస్తున్నానని నామన నచ్చజెప్పడంతో తిరిగి సమావేశానికి హాజరయ్యారు. మహిళా జెడ్పీటీసీలు తమ ప్రాంత సమస్యలుపై గళమెత్తడం సమావేశానికి హైలెట్‌గా నిలిచింది. అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని చెప్పడమే కాక, పరిపాలనాపరంగా ఎదురైన ఇబ్బందుల్ని అధికారులకు వివరించి వారి నుంచి హామీలను పొందారు. అంబేద్కర్‌కు నివాళి తొలుత అంబేద్కర్‌కు నివాళులర్పించిన సభ్యులు తరువాత దివంగత ఎన్టీఆర్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. వాకతిప్ప బాణా సంచా విస్ఫోటంలో, హుద్‌హుద్ తుపానులో మరణించిన వారి ఆత్మల శాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, బలశాలి ఇందిర, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, పిల్లి అనంతలక్ష్మి, అదనపు జేసీ మార్కండేయులు, జెడ్పీ సీఈఓ పద్మలు పాల్గొన్నారు. దమ్ముంటే సెజ్ భూములను పంచండి : జ్యోతుల సమావేశంలో రుణమాఫీపై అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య వాగ్వివాదం జరిగింది. రైతులకు మేలు చేసింది చంద్రబాబేనని పిఠాపురం ఎమ్మెల్యే వర్మ అనగా, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అభ్యంతరం తెలిపారు. అధికారంలోకి రాగానే కేఎస్ఈజెడ్ భూముల్ని రైతులకు పంచుతానన్న బాబు ఇంత వరకూ పట్టించుకోలేదన్నారు. దీనిపై వర్మ ఆ భూములు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరులవన్నట్టు మాట్లాడగా, జ్యోతులతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్మేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, దాడి శెట్టి రాజా విరుచుకుపడ్డారు. ‘దమ్ముంటే ఆ భూములు స్వాధీనం చేసుకుని రైతులకు పంచండి’ అని సవాల్ విసిరారు. సవాల్‌కు స్పందించకుండా అధికార పార్టీ నాయకులు మూకుమ్మడిగా ఎదురుదాడికి యత్నించారు. ‘చాగల్నాడు ఎత్తిపోతలకు అనుమతి ఇవ్వనన్నందుకు ఎన్టీఆర్‌పై తిరుబాటు చేశాను. చంద్రబాబు ముఖంపై రాజీనామా పత్రం విసిరివచ్చాను. మీ పార్టీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులే సాక్షి. మీకు రైతులకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే మీరు రాజీనామకు సిద్ధపడండి’ అని జ్యోతుల అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు.