ప్రకాశంలో రాజకీయ మలుపులు | many changes occurred in ongole politics | Sakshi
Sakshi News home page

ప్రకాశంలో రాజకీయ మలుపులు

Published Tue, Dec 30 2014 1:49 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM

many changes occurred in ongole politics

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కాల చక్రం గిర్రున తిరిగిపోతోంది. ఈ ఏడాది రాజకీయ చక్రంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మున్సిపల్, స్థానిక సంస్థలు, జెడ్పీ, సాధారణ ఎన్నికల్లో జిల్లా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపించారు. దీంతో తమ ఆధిపత్యం చాటుకునేందుకు తెలుగుదేశం నాయకులు అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు.
 
ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టినా జిల్లాలో అత్యధిక స్థానాలు మాత్రం  వైఎస్సార్ సీపీకే దక్కాయి. ఒంగోలు ఎంపీ స్థానంతోపాటు ఆరు స్థానాలను వైఎస్సార్ సీపీ గెలుచుకోగా, ఐదు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, ఒక స్థానంలో నవోదయ పార్టీ తరపున గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ గెలుపొందారు. తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన జిల్లాలో సీనియర్ నాయకుడు కావడంతో దర్శి శాసనసభ్యుడు శిద్దా రాఘవరావుకు రవాణాశాఖ మంత్రి పదవి దక్కింది.

తక్కువ స్థానాలు రావడంతో ముఖ్యమంత్రి ప్రకాశంపై శీతకన్ను వేశారు. ఒక్క జాతీయ స్థాయి విద్యాసంస్థను కూడా జిల్లాకు కేటాయించలేదు. శివరామకృష్ణన్ కమిటీ రాజధానిని వినుకొండ - మార్టూరు - దొనకొండ మధ్య ఏర్పాటు చేయాలని సూచించినా దాన్ని తుళ్లూరుకు తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేవలం రెండుసార్లే జిల్లా పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంలో కూడా తమకు జిల్లా ప్రజలు మద్దతు పలుకలేదంటూ అక్కసు వెళ్లగక్కారు.

రోడ్డున పడిన జెడ్పీ ప్రతిష్ట
రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినా ఇక్కడ మెజారిటీ రాకపోవడంతో తెలుగుదేశం నాయకులు అడ్డదారులు తొక్కారు. ప్రలోభాలకు గురిచేసి ఎంపీపీ పదవులు చేజిక్కించుకునే ప్రయత్నం చేశారు. జిల్లా పరిషత్ పీఠం దక్కించుకునేందుకు వారు ఎంతకైనా తెగించారు. అయితే అదృష్టం కలిసి రాలేదు. 59 జెడ్పీ స్థానాల్లో 31 స్థానాలు వైఎస్సార్ సీపీ దక్కించుకున్నా ముగ్గురిని ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకున్నారు.

మెజారిటీ కోసం ఒక సభ్యునిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి నెగ్గుదామనుకున్నా సొంత పార్టీ సభ్యుడైన ఈదర హరిబాబు ఝలక్ ఇవ్వడంతో కంగుతిన్నారు. పార్టీకి వ్యతిరేకంగా జెడ్పీ పీఠం దక్కించుకున్న ఈదర హరిబాబుపై అనర్హత వేటు పడే వరకూ వారు నిద్రపోలేదు. ఆరు మాసాలుగా జెడ్పీ వ్యవహారంలో సాగిన రాజకీయ హైడ్రామాతో  జిల్లా పరిషత్ ప్రతిష్ట రోడ్డున పడింది.

ఉనికి కోసం కాంగ్రెస్...
మరోవైపు కాంగ్రెస్ పార్టీ నిస్తేజంగా మారింది. ఈ ఎన్నికల్లో అడ్రస్ గల్లంతు కావడంతో వారు తమ ఉనికి కోసం పాట్లు పడుతున్నారు. రైతు రుణమాఫీపై జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించగా, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి హాజరయ్యారు. వామపక్షాలు, రైతు సంఘాలు పలు సమస్యలపై ఆందోళనలకు పరిమితం కాగా, బీజేపీ సభ్యత్వ నమోదు పెంచుకోవడంపై దృష్టి పెట్టింది.

ఉవ్వెత్తున సమైక్యపోరు
రాష్ట్రం కలిసి ఉండాలంటూ జిల్లాలో సమైక్యపోరు ఉవ్వెత్తున సాగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు ఉద్యోగులు, సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో జిల్లాలో ఉద్యమం ఉధృతంగా సాగింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఒంగోలుతో పాటు జిల్లాలోని అన్ని కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, వినూత్న రీతుల్లో నిరసనలు కొనసాగాయి.

ఉద్యోగులు రెండోదఫా సమ్మెకు దిగారు.  పాఠశాలల నుంచి విద్యార్థులు,  గృహిణిలు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు   చేసిన ఆందోళనలు వృధాగా మారాయి. సోనియాగాంధీ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి తన పంతం సాధించగా, చంద్రబాబు నోట సమైక్యం అనే మాట కూడా రాలేదు. సమైక్యవాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగింది.  
 
దాడులకు తెగబడిన తమ్ముళ్లు

మరోవైపు ఎన్నికల్లో తమ పార్టీ గెలవడంతో ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. జిల్లాలో ఎన్నికల తర్వాత జరిగిన అధికార పక్షం చేసిన దాడుల్లో ఇద్దరు, అధికార పక్షానికి కొమ్ము కాస్తూ పోలీసులు చేసిన దాడిలో ఒకరు మృతి చెందారు. మొత్తం 40 మందికిపైగా గాయపడ్డారు.  హత్యకు గురైన గోగాడి సింగయ్య, తేలుకుంట్ల వెంకయ్య కుటుంబ సభ్యులను తెలుగుదేశం నేతలు బెదిరిస్తున్నారు.

కేసు వాపసు తీసుకోకపోతే మీకు ఇదే పరిస్థితి తప్పదని బెదిరింపులకు దిగుతున్నారు. గిద్దలూరులోని ఒక అపార్టుమెంటులో రెండు ప్లాట్ల ఓనర్ల మధ్య జరిగిన వివాదాన్ని ఎస్సై వై.శ్రీనివాసరావు పెద్దది చేయగా, అపార్టుమెంటు ఓనరుగా వైఎస్సార్ సీపీ నేత  వైజా భాస్కర్‌రెడ్డి వారిని విడిపించేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, తెలుగుదేశం పార్టీ తొత్తుగా వ్యవహరించిన ఎస్సై దౌర్జన్యానికి దిగడంతో గుండెపోటుకు గురై ఓజా భాస్కరరెడ్డి మరణించారు.  

పోలీస్ స్టేషన్‌లో ఒక ప్రజాప్రతినిధి మరణిస్తే, అందుకు కారణమైన ఎస్సైపై చర్య లు తీసుకోవాలని కోరిన వైఎస్సార్‌సీపీ ఎమ్మె ల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలపై లేనిపోని కేసులు పెట్టి ఇరికించారు. తమకు వ్యతిరేకంగా నిలబడి గెలిచిన చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌ను కూడా వదలలేదు. ఆఖరికి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రయత్నించిన వ్యక్తిపై కూడా ఎస్సీఎస్టీ కేసు పెట్టి తమ ప్రతాపం చూపించారు.
 
పచ్చ కమిటీలు...
అన్ని కమిటీలలో తమ పట్టు నిరూపించుకునేందుకు తెలుగుదేశం నాయకులు ప్రయత్నించారు. అర్హతల పరిశీలన పేరుతో వేసిన ప్రత్యేక కమిటీలు పసుపుమయంగా మారాయి. ప్రతి కమిటీలోనూ తమ పార్టీ సభ్యులను నియమించుకున్నారు. ప్రభుత్వ జీవోలో స్థానిక ప్రజాప్రతినిధులకు చోటుకల్పించాలని స్పష్టంగా ఉన్నా మంత్రి నిర్ణయం పేరుతో పలుచోట్ల ప్రజాప్రతినిధులకు ఆ కమిటీల్లో స్థానం కల్పించకపోవడం వివాదాస్పదంగా మారింది.

పింఛన్ తీసుకుంటున్న వారి అర్హతల పరిశీలనతోపాటు ఆధార్‌కార్డుల సీడింగ్ ప్రక్రియ వివరాలతో సరిపోల్చేందుకు ఇంటింటికీ ప్రత్యేక కమిటీలను పంపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలనే రుణమాఫీ అర్హులను తేల్చేందుకు ఉపయోగించారు. సామాజిక కార్యకర్తల పేరుతో ఓడిపోయిన నాయకులను కమిటీలలో వేశారు. ఈ కమిటీల నిర్వాకం కారణంగా జిల్లాలో కనీసం 50 వేల మంది ముసలివారు పింఛన్ కోల్పోయారు. దీంతో అద్దంకిలో ఒక వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement