నేడు తొలిదశ పరిషత్తు పోరు
సాక్షి, గుంటూరు : జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు తొలిదశ ఎన్నిక ఆదివారం జరగనుంది. ఈ విడతగా తెనాలి, నరసరావుపేట డివిజన్లలోని 29 మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఎంపీటీసీ అభ్యర్థులకు గులాబీ రంగు, జడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు బ్యాలెట్ పేపరు వినియోగించనున్నారు.
జిల్లాలో తొలి దశ ఎన్నికల్లో 29 జడ్పీటీసీ స్థానాలకు 103 మంది, 455 ఎంపీటీసీ స్థానాలకు 1,192 మంది బరిలో ఉన్నారు. రెండు డివిజన్లలో 1,618 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 12,02,929 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలి దశ ఎన్నికలు జరిగే డివిజన్లలో మహిళల ఓట్లే అధికంగా ఉండటంతో వారి తీర్పు కీలకం కానుంది.
మోహరించిన పోలీసు బలగాలు.. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పోలింగ్ స్టేషన్ల వద్ద అదనపు పోలీసు బలగాలు మోహరించాయి. పోలింగ్ ముగియగానే తెనాలి డివిజన్‌కు సంబంధించిన బ్యాలెట్ బాక్స్‌లు తెనాలి మార్కెట్ యార్డు గోడౌన్‌లో, నరసరావుపేట డివిజన్‌లోని బాక్స్‌లు నరసరావుపేటలోని ఎస్‌ఎస్‌ఎన్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిషత్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌లో 0863-2234756, 2234082 నంబర్లు అందుబాటులో ఉంచారు.
డబ్బు పంచుతూ పట్టుబడిన టీడీపీ శ్రేణులు.. పల్లెల్లో తమకు అసలు పట్టు లేదని గ్రహించిన టీడీపీ నేతలు తొలి దశ ఎన్నికల్లో బరితెగించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా నూజెండ్లలో జంగాలపల్లిలో ఎంపీటీసీ స్థానానికి వేలంపాట తరహాలో ఓట్లు కొనుగోలు చేశారు. చేబ్రోలు మండలంలో నారాకోడూరులోను ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి డబ్బు పంపిణీ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఎలాగైనా ఓటర్లను ప్రలోభ పెట్టో.. లేక భయపెట్టో ఓటింగ్‌కు రానీయకుండా అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నట్లు సమాచారం.
వైఎస్సార్ సీపీ, టీడీపీ నడుమే ప్రధాన పోటీ.. ఈ ఎన్నికల్లో ప్రధానంగా వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యనే పోటీ నెలకొంది. నరసరావుపేట డివిజన్‌లోని చిలకలూరిపేట నియోజకవర్గంలో చిలకలూరిపేట, యడ్లపాడు మండలాల్లో త్రిముఖ పోటీ ఉంది. యడ్లపాడులో కాంగ్రెస్ అభ్యర్థి బరిలో లేరు. నాదెండ్ల మండలంలో వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్ధులే పోటీ పడుతున్నారు. నరసరావుపేట నియోజకవర్గంలోని నరసరావుపేటలో బహుముఖ పోటీ నెలకొనగా, రొంపిచర్లలో కాంగ్రెస్ అభ్యర్ధి పోటీలో లేకున్నా, ఇండిపెండెంట్ రంగంలో ఉండటంతో త్రిముఖ పోటీ ఉంది. వినుకొండ నియోజకవర్గం డీసీసీ అధ్యక్షుడు సొంత నియోజకవర్గం కావడంతో ఐదు మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని రంగంలో ఉంచారు. వినుకొండ, శావల్యాపురంలో త్రిముఖ పోటీ నెలకొనగా, బొల్లాపల్లి, ఈపూరు, నూజెండ్ల మండలాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ మంది పోటీలో ఉన్నారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలో నకరికల్లు మండలం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో లేకపోవడంతో ఇక్కడ్నుంచి వైఎస్సార్ సీపీ, సీపీఐ, టీడీపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు.తెనాలి డివిజన్‌లో... తెనాలి నియోజకవర్గంలో తెనాలి, కొల్లిపర మండలాల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉండగా, బాపట్ల, కర్లపాలెంలో బహుముఖ, పిట్టలవానిపాలెంలో త్రిముఖ పోటీ నెలకొంది.
రేపల్లె నియోజకవర్గం రేపల్లెలో త్రిముఖ, నగరం, నిజాంపట్నంలో బహుముఖ పోటీ ఉంది. చెరుకుపల్లిలో కాంగ్రెస్ పోటీలో లేకపోవడంతో వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థులే పోటీ పడుతున్నారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి బరిలో లేకపోవడంతో వైఎస్సార్ సీపీ, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వేమూరు నియోజకవర్గంలో అన్ని చోట్లా కాంగ్రెస్ పోటీలో ఉండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.
కొల్లూరు, భట్టిప్రోలులో మాత్రం సీపీఐ కూడా బరిలో నిలిచింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను మండలానికి ఎన్నిక జరుగుతోంది. ఇక్కడ వైఎస్సార్ సీపీ, టీడీపీ నడుమే పోరు సాగుతోంది. పొన్నూరు నియోజకవర్గం పొన్నూరులో త్రిముఖ పోటీ నెలకొంది. బీఎస్పీ, స్వతంత్ర, టీడీపీ అభ్యర్థులు ఇక్కడ పోటీ పడుతున్నారు. పెదకాకాని, చేబ్రోలు మండలాల్లో త్రిముఖ పోటీతో వైఎస్సార్ సీపీ, టీడీపీ, బీఎస్పీ అభ్యర్థులు రంగంలో ఉన్నారు.