Mandal Parishad
-
4న రెండో ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా మండల పరిషత్ రెండో ఉపాధ్యక్ష పదవులకు ఈ నెల 4వ తేదీ మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి మండలాల వారీగా ప్రత్యేక సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫున ఎంపీడీఓలు ఇప్పటికే ఎంపీటీసీలకు సమాచారం ఇచ్చారు. ఈ ప్రక్రియ శుక్రవారం సాయంత్రానికే పూర్తయిందని కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణలో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మండల పరిషత్‌లో రెండో ఉపాధ్యక్ష పదవిని ఏర్పాటుచేస్తూ ఇటీవలే అసెంబ్లీలో చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. దీనికి ముందే గుంటూరు జిల్లా దుగ్గిరాల మినహా మిగిలిన 649 మండలాల్లో మండల పరిషత్ అధ్యక్ష, ఒక ఉపాధ్యక్ష పదవులతో పాటు కోఆప్టెడ్ సభ్యుని ఎన్నిక జరిగింది. ప్రభుత్వ చట్ట సవరణ నేపథ్యంలో ఈ 649 మండలాల్లో రెండో ఉపాధ్యక్ష పదవికి కూడా ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని డిసెంబరు 28న నోటిఫికేషన్ జారీచేశారు. దీంతో నాలుగో తేదీ ఉ.11 గంటలకు అన్నిచోట్లా మండల పరిషత్ ప్రతేక సమావేశాలు మొదలై, ఎంపీటీసీ సభ్యులు రెండో ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మరోవైపు.. విశాఖ జిల్లా మాకవరం ఎంపీపీ రాజీనామాతో ఆ స్థానానికి కూడా అదే రోజున ఎన్నిక నిర్వహిస్తారు. అలాగే, చిత్తూరు జిల్లా రామకుప్పం, గుర్రంకొండలో మండలాధ్యక్ష పదవులకు, కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలో మొదటి ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరుగుతుంది. రాజీనామా కారణంగా ఖాళీగా ఉన్న కర్నూలు జెడ్పీ చైర్మన్ ఎన్నిక కూడా మంగళవారం జరుగుతుంది. కోరం ఉంటేనే ఎన్నిక మండల పరిషత్ రెండో ఉపాధ్యక్ష ఎన్నికవిధివిధానాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. రెండో ఉపాధ్యక్ష ఎన్నిక నిమిత్తం జరిగే ప్రత్యేక సమావేశానికి కనీస కోరంగా మండల పరిషత్‌లో ఉండే మొత్తంలో ఎంపీటీసీ సభ్యుల సంఖ్యలో సగానికి పైగా సభ్యులు హాజరు తప్పనిసరని కమిషన్ స్పష్టంచేసింది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి పరిధిలోని మండల పరిషత్ సమావేశాల్లో పాల్గొనవచ్చని, అయితే, వారికి ఎన్నికలో ఓటు హక్కు ఉండదని తెలిపింది. -
జిల్లా పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణ
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జెడ్పీపీలు, ఎంపీపీలకు పోస్టులు, సిబ్బంది కేటాయింపునకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల మొదటివారంలో కొత్త జెడ్పీపీలు, మండల పరిషత్‌ల నూతన పాలకమండళ్లు ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వీటికి అనుగుణంగా మొత్తం 32 జెడ్పీపీలు, 539 మండలాల్లో సిబ్బంది కేటాయింపు, సర్దుబాటు, ఇతర అంశాలకు సంబంధించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు. గతంలోని ఉమ్మడి తొమ్మిది జిల్లా పరిషత్‌లలోని పోస్టులను కొత్తగా ఏర్పడిన 32 జిల్లా పరిషత్‌లలో సర్దుబా టు చేస్తారు. ప్రస్తుతం 9 జిల్లా పరిషత్‌లలో 9 మంది జెడ్పీ సీఈవోలు, 9 మంది డిప్యూటీ సీఈవోలు పనిచేస్తున్నారు. తొమ్మిది మంది డిప్యూటీ సీఈవోలను మరో 9 జిల్లాలకు సీఈవోలుగా, మిగిలిన 14 జిల్లాల్లో ఇదివరకే డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతి పొందిన వారిని సీఈవోలుగా నియమించాలని ప్రభుత్వం సూచించింది. తొమ్మిది జెడ్పీలలో 9 మంది అకౌంట్స్ ఆఫీసర్లు (ఏవో) పనిచేస్తున్నందున, మిగిలిన 23 జిల్లాల్లో డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతులు పొందిన వారిని ఏవోలుగా నియమిస్తారు. పాత జెడ్పీపీలకు మంజూరైన పోస్టులన్నీ (రీ అలొకేట్ చేయాల్సిన మినహాయించి) కొత్త జెడ్పీపీలకు కేటాయిస్తారు. పని ఒత్తిడి ప్రాతిపదికన... కొత్త జిల్లాల్లో పని ఒత్తిడి, ఇతర అంశాల ప్రాతిపదికన సిబ్బంది సరళిని అనుసరించి పోస్టులను జెడ్పీపీలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్దేశించింది. దీనికి అనుగుణంగా రీ అలొకేట్ కాని పోస్టుల్లోని ఉద్యోగులంతా కూడా కొత్త జెడ్పీపీల ప్రారంభం నుంచి తమ తమ పోస్టుల్లో ఆయా జెడ్పీ కార్యాలయాల్లో కొనసాగుతారు. వారిని కొత్త జెడ్పీపీలకు ముందస్తు(ప్రొవిజనల్)గా కేటాయించినట్టుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో కొత్త పరిషత్‌లకు కేటాయించాల్సిన మేరకు సాధారణ బదిలీలపై నిషేధాన్ని సడలిస్తారు. కొత్త జెడ్పీపీలకు కేటాయించిన వారు, ఆర్డర్ టు సర్వ్ కింద నియమితులైన (పైన పేర్కొన్న విధంగా) ఉద్యోగులు సీనియారిటీ, పదోన్నతులు, సర్వీసు అంశాల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత ఉమ్మడి జిల్లా/జోనల్/మల్టీ జోనల్ కేడర్లలో పరిపాలనా అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా కొనసాగుతారు. సిబ్బంది విభజన... మునుపటి జెడ్పీపీ హెడ్‌క్వార్టర్‌గా ఉన్న జిల్లాల కలెక్టర్లు, వాటి పరిధిలో కొత్తగా ఏర్పడిన జిల్లాల కలెక్టర్లను సంప్రదించి సొంత ప్రాంతం, మండలం, సీనియారిటీ ప్రాతిపదికన సిబ్బందిని సర్దుబాటు చేస్తారు. జెడ్పీపీల్లోని మండలాల సంఖ్య నిష్పత్తికి అనుగుణంగా సిబ్బంది సర్దుబాటు ఉంటుంది. జిల్లా పరిషత్‌లలో అందుబాటులో ఉన్న వాహనాలు, ఫర్నిచర్, మౌలిక వసతులు తదితరాలను కొత్త జెడ్పీపీలకు పాత జిల్లా కేంద్రాల కలెక్టర్లు పంపిణీ చేస్తారు. కొత్త జెడ్పీపీల కోసం భవనాలను (వీలైనంత మేరకు ప్రభుత్వ భవనాల్లోనే) జిల్లా కలెక్టర్లు గుర్తిస్తారు. పాత జెడ్పీపీల్లోని వాహనాలను కూడా కొత్తగా ఏర్పడిన జెడ్పీపీలకు మండలాల సంఖ్య ఆధారంగా కేటాయిస్తారు. మండల పరిషత్‌లలో... కొత్తగా ఏర్పడిన 112 మండలాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 539 మండలాలుగా పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో గత మండల ›ప్రజాపరిషత్(ఎంపీపీ) కార్యాలయాల్లోని పోస్టులను కొత్తగా ఏర్పడిన ఎంపీపీల్లో సర్దుబాటు చేస్తారు. కొత్త మండలాల్లో పనిఒత్తిడి, ఇతర అంశాల ప్రాతిపదికన సిబ్బంది సరళిని అనుసరించి కొత్త పోస్టులను కొత్త ఎంపీపీలకు కేటాయిస్తారు. దీనికి అనుగుణంగా రీ అలొకేట్ కాని పోస్టుల్లోని ఉద్యోగులంతా కూడా కొత్త ఎంపీపీల ప్రారంభం నుంచి తమ తమ పోస్టుల్లో ఆయా ఎంపీపీ కార్యాలయాల్లో కొనసాగుతారు. వారిని కొత్త ఎంపీపీలకు ముందస్తు(ప్రొవిజనల్)గా కేటాయించినట్టుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో కొత్త మండల పరిషత్‌ల అవసరాల మేరకు సాధారణ బదిలీలపై నిషేధాన్ని సడలిస్తారు. కొత్త పరిషత్‌లకు కేటాయించినవారు, ఆర్డర్ టు సర్వ్ కింద నియమితులైన (పైన పేర్కొన్న విధంగా) ఉద్యోగులు సీనియారిటీ, పదోన్నతులు, సర్వీసు అంశాల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత ఉమ్మడి జిల్లా/జోనల్/మల్టీజోనల్ కేడర్లలో పరిపాలనా అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా కొనసాగుతారు. రద్దయిన మండలాల్లో పనిచేస్తున్న సిబ్బందిని సమీప మండలాలు లేదా కొత్తగా ఏర్పడిన మండలాల్లో సర్దుబాటు చేస్తారు. కొత్తగా ఏర్పడిన ఎంపీపీల్లో సీనియారిటీ అధారంగా ఈవోపీఆర్డీ, సూపరింటెండెంట్లను ఇన్చార్జి ఎంపీడీవోలుగా జిల్లా కలెక్టర్లు నియమిస్తారు. 32 జెడ్పీపీ చైర్పర్సన్లు, సీఈవోలు, ఇతర సిబ్బంది, 112 ఎంపీపీ అధ్యక్షులు, ఎంపీడీవోలు, ఇతర సిబ్బంది అవసరాలకు తగ్గట్టుగా ఫర్నిచర్‌ను కేటాయిస్తారు. -
క్యాంపునకు పోదాం... చలో చలో!
సాక్షి, హైదరాబాద్: పరిషత్ రాజకీయం మరింత రసవత్తరమైంది. ఇన్నాళ్లూ ఫలితాల కోసం ఎదురు చూసిన అభ్యర్థులంతా ఇప్పుడు క్యాంపు రాజకీయాల్లో బిజీ అయ్యారు. అధ్యక్ష ఎన్నిక గడువు ముంచుకొస్తుండడంతో ఆశావహులంతా ప్రాదేశిక సభ్యులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల రేసులో ఉన్న అభ్యర్థులు సంప్రదింపుల్లో తలమునకలయ్యారు. తమకు మద్దతివ్వాలని ప్రాధేయపడుతున్నారు. కీలక సభ్యులతో క్యాంపు రాజకీయాలు సైతం మొదలుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని 538 మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికలు, 534 మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. ఈనెల 7వ తేదీన మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా ఈనెల 8న జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. గులాబీదే ఆధిక్యమైనా... జిల్లా పరిషత్ ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటింది. మెజార్టీ సభ్యులు అధికారపార్టీకి చెందిన వారే గెలుపొందడంతో 32 జిల్లాల్లో జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పీఠాలను ఆ పార్టే కైవసం చేసుకోనుంది. పార్టీ ఆదేశానుసారం ఖరారైన అభ్యర్థులకే టీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యులు మద్దతు పలికే అవకాశం ఉండడంతో జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో పెద్దగా ఇబ్బంది లేదు. అయినప్పటికీ సభ్యులంతా అందుబాటులో ఉండేలా ఆ పార్టీ ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా మండల పరిషత్ స్థానాల్లోనూ అధికార పార్టీనే మెజార్టీ సీట్లు దక్కించుకుంది. కొన్ని మండలాల్లో మాత్రం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బలాన్ని ప్రదర్శించింది. దీంతో హస్తం పార్టీ సభ్యులు ఎక్కువగా ఉన్న మండలాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పీఠాలను దక్కించుకోవాలని కాంగ్రెస్ సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. 534 మండలాల్లో 437 మండల పరిషత్ పీఠాలు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయి. మరో 67 మండలాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. మిగతా 30 స్థానాల్లో ఏ పార్టీకీ మెజార్టీ రాకపోవడంతో అక్కడ హంగ్ వాతావరణం కనిపిస్తోంది. ఈ మండలాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రెబెల్స్, స్వతంత్రులు, టీడీపీ, సీపీఐ, సీపీఎం, బీజేపీ పార్టీలకు చెందిన సభ్యుల మద్దతు కీలకం కానుంది. దీంతో వీరిని బుట్టలో వేసుకునేందుకు అన్ని పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజధాని సమీపంలో.. పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. ఈ నెల 7, 8వ తేదీల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ల ఎన్నిక ఉండడంతో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మండలాల్లో స్పష్టమైన ఆధిక్యం ఉన్న చోట్ల కూడా క్యాంపులకు ఆస్కారమవుతోంది. సభ్యులు అందుబాటులో ఉండేలా, ఎన్నిక సమయానికి నేరుగా అక్కడికి చేరుకునేలా అభ్యర్థులు ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా నగరానికి సమీపంలో ఉన్న రిసార్టులు, హోటళ్లలో క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు రెండ్రోజులే గడువు ఉండటంతో ఆర్థిక భారం పెద్దగా ఉండదని భావించిన అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ తరహా క్యాంపులకు తెరలేపాయి. మరోవైపు హంగ్ ఉన్న మండలాల్లో అధికారపార్టీ తన బలాన్ని ప్రదర్శించేందుకు కృషి చేస్తోంది. సంబంధిత ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కీలక అభ్యర్థులతో చర్చలు జరుపుతోంది. స్వతంత్ర, ఇతర పార్టీకి చెందిన వారిని తమవైపునకు తిప్పుకునేందుకు భారీ మొత్తంలో తాయిలాలు ప్రకటిస్తున్నా రు. రిజర్వ్ స్థానాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవినే కట్టబెడతామని ప్రలోభ పెడుతుండటంతో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మొత్తంగా అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ముగిసే దాకా ఈ క్యాంపు రాజకీయాలు జోరుగా సాగనున్నాయి. -
కారులోకి కాంగ్రెస్!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో పూర్తి ఆధిపత్యం లక్ష్యంగా టీఆర్ఎస్ వేగం పెంచింది. టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేసే ప్రక్రియ చివరి దశకు చేరింది. మరో ముగ్గురు ఎమ్మెల్యేల చేరికకు సైతం రంగం సిద్ధమైంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోపే కాంగ్రెస్‌కు చెందిన మరో ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిసింది. గతంలో టీఆర్ఎస్లో క్రియాశీలకంగా పనిచేసిన ఈ ఎమ్మెల్యే త్వరలోనే పార్టీలో చేరే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక కోసం 2 రోజుల క్రితం ఈ ఎమ్మెల్యే నియోజకవర్గ సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఆ సమావేశాన్ని రద్దు చేశారు. పార్టీ మార్పు అంశం కారణంగానే సమావేశం రద్దయినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. రెండుమూడు రోజుల్లోనే ఈ ఎమ్మెల్యే చేరికపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని ఒక్కరు చొప్పున ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం త్వరలోనే అధికార పార్టీలోకి మారే అవకాశం ఉందని టీఆర్ఎస్ ముఖ్యనేతలు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోపే మరో ముగ్గురు ఎమ్మెల్యేల చేరిక ఉంటుందని అంటున్నారు. మున్సిపల్, రెవెన్యూ కొత్త చట్టాలను ఆమోదించేందుకు ప్రత్యేకంగా నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లోపే టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష విలీనం ప్రక్రియ ముగుస్తుందని అధికార పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. శాసనసభాపక్షం విలీనం... అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 స్థానాల్లో విజయం సాధించింది. వీరిలో 13 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరితే కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనమైనట్లుగా గుర్తిస్తారు. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావు, చిరుమర్తి లింగయ్య, పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి, బానోతు హరిప్రియ నాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, వనమా వెంకటేశ్వర్రావు, జాజుల సురేందర్‌లు టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నామని, కాంగ్రెస్‌ను వీడితున్నామని తెలిపారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇదే బాటలో నడిస్తే టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం అమలు వ్యూహం పూర్తికానుంది. అసెంబ్లీ సమావేశాల్లోపే ఈ ప్రక్రియ పూర్తవుతుందనే ధీమాతో టీఆర్ఎస్ ఉంది. ఒకవేళ ఏమైనా కారణాలతో అప్పటికీ పూర్తికాకపోతే.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పూర్తవుతుందని టీఆర్ఎస్ ముఖ్యనేతలు అంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఏమాత్రం లేవని.. ఫలితాల్లో ఈ విషయం స్పష్టత వచ్చి మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. -
అన్ని జెడ్పీ పీఠాల కైవసమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరిగే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో మరోసారి ఘనవిజయం సాధిస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 32 జిల్లాలకు 32 జిల్లాపరిషత్ అధ్యక్ష పీఠాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయ మని స్పష్టం చేశారు. వీటితో పాటు ఎన్నికలు జరుగనున్న 530కి పైగా మండల పరిషత్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్నికల్లో అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు రానున్న ఎన్నికల్లోనూ నిరాశ తప్పదన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ భవన్లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో ఆయన ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమని ఎన్నికల కమిషన్‌ను కోరిన నేపథ్యంలో రానున్న వారం పది రోజుల్లో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లాలవారీగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కేటీఆర్ ప్రధాన కార్యదర్శులతో చర్చించారు. గత నెల రోజులుగా పార్లమెంట్ అభ్యర్థుల గెలుపుకోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించామని, ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి మరోసారి బ్రహ్మరథం పట్టనున్నారని కేటీఆర్ తెలిపారు. ఇదే తరహాలో వచ్చే స్థానికసంస్థల ఎన్నికల్లో పనిచేయాలన్నారు. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకుల సేవలను వినియోగించుకొనేలా ముందుకు పోతామన్నారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో సమావేశం జరిపి మార్గదర్శనం చేస్తారని కేటీఆర్ తెలిపారు. -
25లోగా ‘పరిషత్’ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 20–25 తేదీల మధ్య పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో తొలి విడత లోక్‌సభ ఎన్నికలు ముగిసిన కొన్ని రోజులకే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ జారీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ఎస్ఈసీ ఇప్పటికే ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు వేగవంతం చేసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాల్సిందిగా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, సీఈవోలు, డీపీవోలు, ఎండీపీవోలకు ఎస్ఈసీ ఆదేశాలిచ్చింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాలను ఆదివారం సిద్ధం చేయాలని సూచించింది. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి ఏవైనా మార్పుచేర్పులు, అభ్యంతరాలు ఇతర అంశాలు పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఈ నెల 20న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించాక ఆ వెంటనే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎస్ఈసీ విడుదల చేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పూర్తయిన ప్రక్రియలు... మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలకమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను ముందుగానే పూర్తి చేశారు. రాష్ట్రంలోని 32 జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పీపీ) చైర్మన్లు, మిగతా మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ) అధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేసి ప్రకటించింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కేటాయించింది. ఈ జాబితాను ఎస్ఈసీకి కూడా పీఆర్‌శాఖ అందజేసింది. దీంతో పరిషత్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తిచేయడంపై ఎస్ఈసీ దృష్టి పెట్టింది. జిల్లాలు, మండలాలవారీగా ఎన్నికలకు అవసరమైన సిబ్బంది కేటాయింపును పూర్తి చేశారు. ఈ నెల 15–20లోగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ప్రక్రియను పూర్తి చేసేందుకు కలెక్టర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గత జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో అదే తరహాలో ఈ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, అవసరమైన అధికారులు, సిబ్బంది నియామకం, ఇతరత్రా కసరత్తు పూర్తి చేసేందుకు ఎస్ఈసీ సిద్ధమవుతోంది. పేపర్ బ్యాలెట్‌తోనే ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)తో నిర్వహించాలని ఎస్ఈసీ తొలుత భావించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు కూడా పంపించింది. అయితే పలు విడతలుగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఈవీఎంలు తగిన సంఖ్యలో అందుబాటులో లేక పరిషత్ ఎన్నికల నిర్వహణను గతంలో నిర్వహించినట్లుగా పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 20 తర్వాత నోటిఫికేషన్ వెలువడితే మే 8వ తేదీలోగా మొదటి విడత, మే 16లోగా రెండో విడత ఎన్నికలు జరుగుతాయి. మే 27 వరకు ఎన్నికల కోడ్ లోక్‌సభ ఎన్నికల కోడ్ వచ్చే నెల 27 వరకు ఉండటంతో ఆ లోగానే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 11న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తయినా వచ్చే నెల 23నే ఫలితాలు వెలువడనున్నాయి. స్థానిక సంస్థలకు మరో కోడ్ అడ్డంకి లేకుండా ఉండేందుకే ప్రభుత్వం వెంటనే ఈ ఎన్నికలు నిర్వహించనుంది. జూలై 3, 4 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీపీ, ఎంపీపీల పదవీకాలం ముగిసిన వెంటనే కొత్త జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీ అధ్యక్షులతో కూడిన పాలకవర్గాలు జిల్లాలు, మండలస్థాయిల్లో పగ్గాలు చేపట్టనున్నాయి. -
ఎన్నికల ప్రకటనే మిగిలింది..
సాక్షి, చందంపేట : ఈనెల 11న లోక్‌సభ ఎన్నికలకు నిర్వాహణకు ఈసీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు మండల పరిషత్ ఎన్నికల పక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఉమ్మడి చందంపేట మండలంలోని నేరెడుగొమ్ము మండల కేంద్రంగా కొత్త మండల పరిషత్ ఏర్పాటుకు ప్రకటన విడుదలైన విషయం తెలిసింది. దీంతో చందంపేట, నేరెడుగొమ్ము మండలాల్లోని 47 పంచాయతీల్లో ఎక్కడ చూసినా లోక్‌సభతో పాటు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల చర్చే గ్రామాల్లో సాగుతోంది. చందంపేట మండల పరిషత్ పరిధిలో రిజర్వేషన్ల పక్రియ ఇప్పటికే పూర్తయింది. కాగా మండలంలో 9 ఎంపీటీసీల పరిధిలో తుది జాబితాను అధికారులు ప్రకటించారు. చందంపేట మండలంలో 43 పోలింగ్ కేంద్రాలు ఉండగా 14,454 మంది పురుషులు, 13,517 మంది స్త్రీలు మొత్తం 27,971 మంది ఓటర్లు ఉన్నారు. నేరెడుగొమ్ము మండలంలో 6 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 25 పోలింగ్ కేంద్రాలు, 9077 మంది పురుషులు 8,717 మంది మంది మహిళలు ఉన్నారు. మొత్తం 17,794 మంది ఓటర్లున్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు.. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం సన్నాహాలు చేస్తున్న అధికారులు తదనుగుణంగా ప్రతిపాదనలు సైతం సిద్ధం చేస్తున్నారు. ప్రతి పంచాయతీలో కనీసం ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఒక్కో బూత్‌లో 600 మంది ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని, ప్రత్యేక అధికారి ఖాసీం వెల్లడించారు. చందంపేట మండలంలో 43, నేరెడుగొమ్ము మండలంలో 25 పోలింగ్ కేంద్రాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఉన్నతాధికారులు సమీక్షించి ఫైనల్ చేయడమే మిగిలింది. -
బీసీ కోటా 24 శాతం లోపే!
సాక్షి. హైదరాబాద్: త్వరలో జరగనున్న పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 23–24 శాతానికి మధ్య పరిమితం కానున్నా యి. ఎట్టి పరిస్థితిలో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఈ ఎన్నికల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. సుప్రీం కోర్టు తీర్పు మేరకు 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాష్ట్ర న్యాయ శాఖ శనివారం రాత్రి అత్యవసర ఉత్తర్వులు (ఆర్డినెన్స్) జారీ చేసిం ది. కొత్తగా అమల్లోకి వచ్చిన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని, బీసీలకు 34 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం పొందుపరిచింది. ఎన్నికల్లో 2011 జనా భా లెక్కల ఆధారంగా పంచాయతీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉండగా, ఎస్సీలకు 20.46 శాతం, ఎస్టీలకు 5.73 శాతం రిజర్వేషన్లను కేటాయించాల్సి ఉంది. దీనికి తోడు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం బీసీలకు 34 శాతం కోటా అమలు చేస్తే మొత్తం రిజర్వేషన్లు 60.19 శాతానికి పెరిగిపోనున్నాయి. పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోటా అమలు చేసేందుకు సుప్రీం కోర్టు తీర్పు అడ్డంకిగా మారింది. జనవరి 10లోగా పంచాయతీ ఎన్నికలను నిర్వహిం చాలని హైకోర్టు విధించిన గడువు ముంచుకొస్తోంది. దీంతో ప్రభుత్వం ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయడం ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు జరిపింది. సర్పంచ్ పదవుల కోసం జనాభా దామాషా ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఎస్టీ, ఎస్సీలకు వరుసగా 5.73 శాతం, 20.46 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో బీసీలకు 23.81 శాతం కోటా మాత్రమే లభించే అవకాశముంది. గత జూన్ 12న పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 12,751 సర్పంచ్ స్థానాలుం డగా, షెడ్యూల్ ప్రాంతంలోని 1,308 పంచాయతీల తో పాటు 100 శాతం ఎస్టీల జనాభా కలిగిన 1,326 పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు అవనున్నాయి. దీనికి తోడు 5.73 శాతం ఎస్టీ కోటా కింద రానున్న 580 స్థానాలకు కలిపి ఎస్టీలకు మొత్తం 3,214 సర్పంచ్ పదవులు రిజర్వు అవుతాయి. ఎస్సీలకు 20.46 శాతం కోటా కింద 2,070 స్థానాలు రిజర్వు కానున్నాయి. 34 శాతం కోటా కింద అప్పట్లో బీసీలకు 3,440 స్థానాలకు కేటాయించారు. తాజాగా ఆర్డినెన్స్ మేరకు బీసీ కోటాను 24 శాతానికి లోపు తగ్గించనుండటంతో ప్రాథమిక అంచనాల ప్రకారం బీసీలకు కేటాయించే సర్పంచ్ స్థానాల సంఖ్య 2,784 కు తగ్గే అవకాశముంది. రిజర్వేషన్ల కేటాయింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే ఈ అంశంపై స్పష్టత రానుంది. చివరిసారిగా 2013–14లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమ లు చేయగా, ఒక్కసారి 10 శాతానికి పైగా రిజర్వేషన్లు తగ్గిపోనుండటంతో బీసీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసినట్లు శనివారం వార్తలు వచ్చాయి. అయితే సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కోటా 24 శాతం లోపే పరిమితం కానుంది. -
అందని ‘మధ్యాహ్న’ బిల్లులు
సాక్షి, గుర్రంపోడు : మధ్యాహ్న భోజన ఏజెన్సీ మహిళలకు బిల్లులు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నాలుగు నెలలుగా బిల్లులు అందక పోవడంతో అప్పులు చేసి వంట సామగ్రి తేవాల్సి వస్తుందని ఏజెన్సీ మహిళలు వాపోతున్నారు. మండలంలో 58 పాఠశాలలకుగాను 58 భోజన ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఒకటవ తరగతి నుంచి ఐదవతరగతి వరకు వంట వండినందుకుగాను ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.4.13, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.6.18 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. వంట చెరుకుతో పాటు కూరగాయలు, నూనె, పప్పు, ఉప్పు ఇతర వంట సామగ్రిని ఏజెన్సీలు సమకూర్చుకోవాలి. బియ్యం మాత్రం ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రోజుకు వంద గ్రాములు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రోజుకు 150 గ్రాముల చొప్పున ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఈ పరిమాణం కూడా సరిపోక తాము నింద మోయాల్సి వస్తుందని వంట ఏజెన్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం సోమవారం గుడ్డు, అన్నం, కూరగాయల కర్రీ, మంగళవారం అన్నం, ఆకుకూరల పప్పు, బుధవారం గుడ్డు, అన్నం, కూరగాయల కర్రీ, గురువారం అన్నం, సాంబారు, కూరగాయల కర్రీ, శుక్రవారం గుడ్డు, అన్నం, పప్పు కూర, శనివారం బఠానీ, ఆలు, క్యారెట్లతో వెజ్ బిర్యాణీ లేదా బగార అన్నం వండాల్సి ఉంది. ఏజెన్సీలు తప్పనిసరిగా ఈ మెనూ ప్రకారమే వండాల్సి ఉంటుంది. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ తదితర అధికారులు తరుచూ ఆకస్మిక తనిఖీలతో మధ్యాహ్న భోజన మెనూను పరిశీలిస్తారు. వారానికి మూడు గుడ్ల చొప్పున తప్పనిసరిగా అందించాల్సి ఉంది. గుడ్డుకు నాలుగు రూపాయలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుండగా ఒక్కోసారి ఐదు రూపాయల వరకు గుడ్డు ధర ఉండి నష్టపోవాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. వంట సామగ్రితోపాటు గుడ్లకు బిల్లులు అందక గ్రామాల్లో వ్యాపారులు తమకు ఉద్దెరగా సామాను ఇవ్వడం లేదని అంటున్నారు. బిల్లులు అందక వంట చేయలేక, మధ్యలో మానుకోలేక అవస్థలు పడాల్సి వస్తుందని మహిళలు వాపోతున్నారు. ఎప్పుడు బిల్లు అడిగినా ఎస్టీఓకు వెళ్లిందని, బ్యాంకు వెళ్లిందని చెబుతున్నారని వారు వాపోతున్నారు. కొన్ని చోట్ల వంట గదులు లేవు మండలంలో 31 పాఠశాలలకు మాత్రమే వంట గదులు ఉన్నాయి. ఇంకా 20 పాఠశాలలకు వంట గదుల అవసరం ఉంది. వంట గదులకు గతంతో మండల పరిషత్ నిధుల నుంచి, ప్రస్తుతం ఉపాధిహామీ నిధుల నుంచి మంజూరు చేస్తున్నా అసంపూర్తి నిర్మాణాలతోనే ఉన్నాయి. కొన్ని బేస్మెంట్ స్థాయిలో, మరికొన్ని స్లాబ్ లెవెల్లో ఉన్నాయి. గతంతో నిర్మించిన వంట గదులు ఇరుకుగా ఉండి ఆరుబయటే వండాల్సి వస్తుందని, ఉన్నత పాఠశాలల్లో వంట గది నిర్మాణం విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా విశాలంగా లేవు. కొన్ని చోట్ల ఇంటివద్దనే వండుకుని తీసుకుని వస్తున్నారు. ఏజెన్సీలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. వర్షాకాలంలో వంట చెరుకు తడిసి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ విషయమై ఎంఈఓ నోముల యాదగిరిని ప్రశ్నించగా జూలై, ఆగస్టు బిల్లు ఎస్టీఓ నుంచి బ్యాంకుకు వెళ్లిందని, ఒకటి, రెండు రోజుల్లో ఏజెన్సీల ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. బిల్లులు ప్రతినెలా అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బిల్లులు అందక తిప్పలు మధ్యాహ్న భోజన బిల్లులు ప్రతినెలా అందించాలి. నాలుగు నెలలుగా బిల్లులు అందక ఇప్పటికే ఎన్నో అప్పులు చేశాం. బిల్లు అందక సకాలంలో డబ్బులు ఇవ్వక అప్పు కూడా పుట్టడం లేదు. బిల్లు రానిదానికి వారానికి మూడు గుడ్లు పెట్టాలంటే ఇబ్బందిగా ఉంది. – పెరిగ జంగమ్మ, పిట్టలగూడెం -
మండల పరిషత్ వద్ద ఉద్రిక్తత
తొండంగి :మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణం సోమవారం వైఎస్సార్ సీపీ, టీడీపీ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదంతో దద్దరిల్లింది. సోమవారం మధ్యాహ్నం మండల పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం జరుగుతుందని ఎంపీడీఓ నిర్ణయించిన నేపథ్యంలో, అందులో పాల్గొనేందుకు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మండల పరిషత్ కార్యాలయానికి వచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం ప్రారంభించాల్సి ఉండగా, ఎమ్మెల్యే అరగంట ముందుగానే కార్యాలయానికి వచ్చారు. ఆయనకు అక్కడున్న వివిధ గ్రామాలకు చెందిన వృద్ధులు తమకు పింఛను అందడంలేదని గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై ఎంపీడీఓ భమిడి శివమూర్తిని పింఛనుదారులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నించారు. ఎంపీడీఓ స్పందిస్తూ జన్మభూమి కమిటీ నిర్ణయం మేరకే పింఛన్లు మంజూరు చేస్తున్నామనడంతో, అక్కడివారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మండల పరిషత్ సమావేశంలో చర్చిస్తానంటూ ఎమ్మెల్యే రాజా చెప్పడంతో వారు శాంతించారు. ఎమ్మెల్యే కోరిక మేరకు సభ నిర్వహణకు ఎంపీడీఓ ఏర్పాట్లు చేశారు. ఎంపీపీ చిట్టిమూరి సంధ్య, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లను సమావేశానికి హాజరుకావాలని కోరారు. ఈలోగా టీడీపీకి చెందిన కొందరు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లకు బదులు అనధికార వ్యక్తులు సమావేశానికి వచ్చారని, వారిని బయటకు రప్పించాలంటూ వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఎంపీడీఓను పట్టుబట్టారు. ఈ క్రమలో అక్కడున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. వైఎస్సార్ సీపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అదికాస్తా తోపులాటకు దారితీసింది. ఎస్సై బి.కృష్ణమాచారి, ఏఎస్సై భగీరథుడు ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. సమావేశ హాలులో ఉన్న ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు బయటకు వచ్చి, ఎంపీపీ కార్యాలయంలోకి వెళ్లారు. అనంతరం ఏవీ నగరం, ఎ.కొత్తపల్లి, బెండపూడి తదితర గ్రామాలకు చెందిన పింఛనుదారులు మండల పరిషత్ భవన ప్రాంగణంలో బైఠాయించారు. అర్హత ఉన్నా తమకెందుకు పింఛన్లు ఇవ్వడంలేదంటూ ఎంపీడీఓ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈలోగా ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు బయటకు వెళ్లిపోయారు. సభను నిర్వహిస్తే ఆయా సమస్యలపై చర్చించేందుకు ఎమ్మెల్యే రాజా దాదాపు రెండు గంటల సేపు అక్కడే వేచి ఉన్నారు. అనంతరం సభ నిర్వహణ విషయమై ఎంపీడీఓను ఎమ్మెల్యే రాజా వివరణ కోరారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో వాగ్వాదం నేపథ్యంలో సభను ఎంపీపీ వాయిదా వేసినట్టు ఎంపీడీఓ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. త్వరలో సభను సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. సర్వసభ్య సమావేశ నిర్వహణలో ఎంపీడీఓ తీరుపై ఎమ్మెల్యే రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పథకాల అమలు, పింఛన్లు, ఇతర పనులపై తనకు సమగ్ర నివేదిక అందజేయాలన్నారు. పథకం ప్రకారమే! మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో వైఎస్సార్ సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తిన నేపథ్యంలో.. టీడీపీ వర్గీయులు దాడి చేసేందుకు ముందుగానే కర్రలు, వికెట్లు, క్రికెట్ బ్యాట్లు సిద్ధం చేసుకున్నారని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించారు. మండల పరిషత్ భవనం వెనుక ఉన్న బ్యాట్లు, వికెట్లు, కర్రలను పోలీసులకు చూపించారు. ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావులేకుండా ఇరువర్గాల వారిని పోలీసులు నియంత్రించారు. -
మండల పరిషత్‌లు ఖాళీ...!
నల్లగొండ : మండల పరిషత్ కార్యాలయాలకు శాశ్వత అధికారులు లేక ఇన్చార్జిల ఏలుబడిలో మగ్గుతున్నాయి. స్థానికంగా గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఎంపీడీఓలు సొంత శాఖ సేవలపైన మొహం చాటేశారు. రాజకీయ ఒత్తిళ్లు భరించలేని కొందరు ఎంపీడీఓలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోగా...మరికొంత మంది హైదరాబాద్ వదిలిరాలేక అక్కడే మకాం వేశారు. మరికొంత మంది పొరుగు శాఖల్లో పునరావాసం పొందుతున్నారు. దీంతో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలు, దీపం కనెక్షన్లు, ఆసరా పెన్షన్లు సామాన్య ప్రజలకు చేరకుండానే మధ్యవర్తులు ఎగురేసుకుపోతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫారెన్ సర్వీసు పేరుతో ఎంపీడీఓలు మండలాలు వదిలి పట్టణాల బాట పట్టడంతో వారి బాధ్యతలు సమీప మండలాల్లోని ఎంపీడీఓలు, సూపరింటెండెంట్లు, ఈఓఆర్డీలకు అప్పగించారు. చం డూరు ఎంపీడీఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు పీఏగా వెళ్లడ ంతో సంస్థాన్ నారాయణ్పురం ఎంపీడీఓకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. జిల్లాలోనే ఉం టూ మండలాల్లో పనిచేయడం కష్టమని భావించిన కొందరు జిల్లా నీటి యాజమాన్య సంస్థకు వచ్చి చేరారు. ఇప్పటికే జిల్లా పరిషత్ బదిలీలు లేక సిబ్బంది కొరతతో సతమతమవుతంటే పనిచేయాల్సిన ఎంపీడీఓలు మండలాలు వదిలి రావడంతో ఆ మండలాల్లో ప్రభుత్వ పరంగా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. అభివృద్ధికి ఆటంకం... ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ హరితహారం పథకానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఎంపీడీఓలు లేకపోవడంతో ఇన్‌చార్జ్‌లపై అదనపు భారం పడింది. నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యానికి ప్రతిబంధకం గా మారింది. ఈ మండలాల్లో ప్రత్యేక ంగా అదనపు అధికారులకు నియమిస్తే తప్ప మొక్కలు నాటే కార్యక్రమం ఆశించినత స్థాయిలో ముందుకు సాగదనిపిస్తోంది. దీపం కనెక్షన్లు, సంక్షేమ పథకాలకు లబ్ధిదారులు ఎంపిక చేసే క్రమంలో కూడా ఇన్‌చార్జ్‌లు అనే క సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. మారుమూల ప్రాంతాలైన డిండి, చింతపల్లి,మోతె, నాంపల్లి, నూ తనకల్ మండలాల్లో ప్రభుత్వ పథకాల అమలు అ యోమయంగా తయారైంది. ఈ మండలాల్లో ఎంపీడీఓలు లేకపోవడంతో ప్రభుత్వ పథకాల సమచారం కూడా ప్రజాప్రతినిధులకు తెలియని పరిస్థితి ఉంది. జిల్లా పరిషత్‌లో.. ఇక జిల్లా పరిషత్ కార్యాలయంలో సీఈఓ, డిప్యూటీ సీఈవో, ఏఓ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పించకపోవడంతో రెవెన్యూ విభాగానికి చెందిన వారిని సీఈఓగా నియమించారు. కట్టంగూరు ఎంపీడీఓకు అదనంగా డిప్యూటీ సీఈఓ, తిప్పర్తి ఎంపీడీఓకు ఏఓ బాధ్యతలు అప్పగించారు. కాగా తిప్పర్తి ఎంపీడీఓ ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేస్తున్నందున ఏఓ పోస్టు కూడా ఖాళీ కానుంది. రాజకీయ యుద్ధాలు... ఇప్పుడున్న ఎంపీడీఓలు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో నియమించారు. దీంతో ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ నేతల నుంచి అనేక ఒత్తిళ్లు వస్తుండడంతో మండలా కార్యాలయాల్లో రాజకీయ యు ద్ధాలు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు ఉన్న మండలాల్లో ఎంపీడీఓలకు, ఎంపీపీలకు మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. పీఏపల్లి ఎంపీపీ అక్క డి ఎంపీడీఓపై అనేక సమావేశాల్లో ఫిర్యాదు చేశారు. అలాగే గుర్రంపోడు, మోత్కూరు, గరిడేపల్లి, పోచంపల్లి మండలాల్లో ఎంపీడీఓలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు మధ్య ఘర్షణలు పెచ్చుమీరాయి. ఇదిలా ఉంటే అధికార పార్టీలో రెండు గ్రూపులు ఉన్న మండలాల్లో అయితే అధికారులు విధులు వదిలి పారి పోయే పరిస్థితి ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఎంపీడీఓలను మార్చాలని గతంలో అనేక ప్రయత్నాలు చేశారు. కానీ అది సాధ్యం కాకపోవడంతో రాజకీయ ఒత్తిళ్లు ద్వారా ఏలాగైన సరే వారిని బయటకు పం పించేందుకు ఎత్తుగడలు వేస్తున్నట్లు సమాచారం. ఎంపీడీఓలు లేని మండలాలు అనుముల, చింతపల్లి, డిండి, మోతె, నాంపల్లి, నిడమనూరు, నూత నకల్, రామన్నపేట, తుంగతుర్తి, యాదగిరిగుట్ట, మునుగోడు. ఈ నెలఖారుకు పదివీ విరమణ కారణంగా ఖాళీగా అయ్యే మండలాల్లో బొ మ్మలరామారం,మునగాల, తిప్పర్తి, ఆత్మకూరు (ఎం). ఫారెన్ సర్వీసు పేరుతో పొరుగు శాఖల్లో ఉన్న వారు.. ఎం.నాగేశ్వరారవు (సెర్ప్ హైదరాబాద్), పి.శైలజారెడ్డి (జీహెచ్ఎంసీ, హైదరాబాద్ ), ఎం.కాళిందిని (డ్వామా, నల్లగొండ), శర్మద (డ్వామా, పశ్చిమ గోదావరి), పి.ఉమాదేవి (డీఆర్ డీఏ రంగారెడ్డి), ఏ.సునీత (స్టేట్ ఎలక్షన్ కమిషన్, హైదరాబాద్), రఘు రాం (జీహెచ్ఎంసీ, హైదరాబాద్), ఇందిర (డ్వామా, నల్లగొండ), చండూరు ఎంపీడీఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు, సూర్యాపేట ఎంపీడీఓ మంత్రి పీఏగా వెళ్లారు. దీంతో పదవీ విరమణ అయ్యే మండలాలతో కలుపుకుని జిల్లా వ్యాప్తంగా 59 మండలాలకు గాను 17 మండలాలు ఇన్‌చార్జ్‌ల ఏలుబడిలో ఉన్నాయి. -
సర్కార్ నిర్ణయంపై హర్షం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రాష్ట్ర సర్కారు బంపర్ఆఫర్ ఇచ్చింది. ఏళ్లుగా వేతన పోరాటాలు చేస్తున్న వారికి భారీ నజరానా ప్రకటించింది. గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, మండల పరిషత్, జిల్లా పరిషత్ సభ్యులు, మున్సిపాలిటీ, నగర పంచాయతీ చైర్మన్లు, కౌన్సిలర్ల వేతనాలను పెద్ద మొత్తంలో పెంచింది. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాసనసభలో వేతన పెంపు ప్రకటన చేయడంతో ప్రజాప్రతినిధుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. భారం రూ.7.67 కోట్లు ప్రజాప్రతినిధుల వేతన పెంపుతో సర్కారుపై భారం తీవ్రం కానుంది. ప్రస్తుతం జిల్లాలోని ప్రజాప్రతినిధులకు యేటా రూ.1.46కోట్లు గౌరవవేతన రూపంలో పంపిణీ చేస్తున్నారు. తాజాగా వారి వేతనాలు పెంచడంతో.. ఇకపై ఏటా రూ.9.141 కోట్లు వేతనాల రూపంలో పంపిణీ చేయాలి. ఈ లెక్కన ఏటా రూ.7.67కోట్ల భారం జిల్లాపై పడుతుంది. నరేందర్ చొరవ..! స్థానిక సంస్థల ప్రతినిధుల గౌరవవేతనాల సవరణలో ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. వేతనాల పెంపుపైపంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఒప్పించేందుకు చొరవచూపారు. స్థానిక సంస్థల ప్రతినిధి బృందాలను ఐక్యం చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా చేయడంలో సఫలమయ్యారు. డైనమిక్ సీఎం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాలు పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. స్థానిక సంస్థల పట్ల ఆయనకున్న అభిమానాన్ని వేతన పెంపు రూపంలో చూపించారు. ఇరవై ఏళ్లుగా వేతనాల పెంపుకోసం ఉద్యమిస్తుండగా.. ప్రస్తుత సీఎం నిర్ణయాన్ని ప్రకటించడం ఆనందకరం. గతంలో సీఎంలకంటే కేసీఆర్ డైనమిక్ సీఎం కాబట్టి.. ఆయన సాహసోపేతంగా వేతనాల పెంపు ప్రకటన చేశారు. అదేవిధంగా స్థానిక సంస్థలకు నిధులు, విధులు, అధికారాలు కూడా ఇస్తారు. - పి.సునీతారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాకు ఇంకాస్త పెంచాల్సింది.. వేతనాల పెంపును మేము స్వాగతిస్తూ కేసీఆర్‌ను అభినందిస్తున్నాం. కానీ జెడ్పీటీసీల వేతనాన్ని రూ.10వేలకు మాత్రమే పెంచారు. కనిష్టంగా రూ.25వేలు పెంచితే బాగుండేది. ఎమ్మెల్యే వేతనంలో కనీసం పావువంతైనా జెడ్పీటీసీకి ఇవ్వాలి. జెడ్పీటీసీలకు మరింత పెంచాలని డిమాండ్ చేస్తున్నా. - జంగారెడ్డి, కాంగ్రెస్ జెడ్పీటీసీల ఫ్లోర్‌లీడర్ -
పింఛన్ల కోసం ఆందోళనలు
కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ధర్నాలు కరీంనగర్: పింఛన్లు తొలగించి మా నోట్లో మట్టికొట్టొద్దంటూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల పరిషత్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. 90% వైకల్యం ఉన్నట్లు సదరం సర్టిఫికేట్ ఉన్నప్పటికీ పింఛన్లు తొలగించారని వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అర్హతలున్నప్పటికీ వృద్ధాప్య, వితంతు పింఛన్లు రద్దు చేశారని మరికొందరు వాపోయారు. ఎంపీపీ గుడిసె ఐలయ్య అర్హులందరికీ పింఛన్లు వచ్చేలా చూస్తామని హా మీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ముస్తాబాద్‌లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు రాజీవ్‌చౌక్‌లో రాస్తారోకో నిర్వహించారు. వయ సు నిండిన, అరవై శాతానికి పైగా అంగవైకల్యం కలిగిన, భర్త చనిపోయిన వారికి పింఛన్లు ఇవ్వ డం లేదన్నారు. మండలానికి మరో వెయ్యికిపైగా పింఛన్లు వస్తాయని ఎంపీడీవో ఓబులేసు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు ఆ ధ్వర్యంలో కాల్వశ్రీరాంపూర్‌లో ధర్నా చేశారు. మాదాసు సతీష్(28) అనే సర్పంచ్‌ను చేనేత కార్మికుడిగా గుర్తిస్తూ పింఛన్ ఎలా మంజూరు చేశారంటూ అధికారులను నిలదీశారు. గతంలో ఉన్న పింఛన్లను తొలగించి తమకు అన్యాయం చేశారంటూ వెల్గటూరు మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించారు. -
మాకు ‘ఆసరా’ ఏదీ!
ధర్పల్లి: మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన అర్హులైన వారికి పింఛన్లు రద్దు చేశారని సోమవారం మండల పరిషత్ కార్యాలయానికి మూడు ట్రాక్టర్లలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వందల సంఖ్యలో తరలి వచ్చారు. కార్యాలయం ఎదుట రెండు గంటల పాటు ధర్నా చేశారు. పండుటాకులమైన తమకు పింఛన్ ఎం దుకు రద్దు చేశారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వృద్ధులు నినాదాలు చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు. అర్హులైన వారికి పింఛన్ మంజూరు అయ్యేంత వరకు గ్రామంలో పింఛన్ పంపిణీ చేయనివ్వబోమని వారు తీర్మానించారు. అనంతరం వారందరు ఎంపీడీఓకు వినతిపత్రం అందించారు. అర్హులైన వారిని గుర్తించి జాబితాను అందించాలని ప్రజాప్రతినిధులకు ఎంపీడీఓ సూచించారు. పింఛన్ రాని వారందరు మళ్లీ దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ధర్నాలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మఠముల శేఖర్, ప్రతినిధి కర్క గంగారెడ్డి, వైస్ ఎంపీపీ నాయిడి విజయ రాజన్న, ఉపసర్పంచ్ బాపురావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామకమిటీ ప్రతినిధులు, వృద్ధులు, వింతతువులు, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీపీల గుర్రు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :మండల పరిషత్ కార్యాలయాల్లో జిల్లా పరిషత్ సభ్యులకు సీట్లు కేటాయించాలనే నిర్ణయం ఇప్పటికే వివాదాస్పమై.. రానున్న రోజుల్లో ఎన్ని సమస్యలకు దారితీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ‘మండల పరిషత్‌లలో ఉన్న గదులు అధికారుల విధుల నిర్వహణకే సరిపోవడం లేదు. ఇప్పుడు కొత్తగా జడ్పీటీసీ సభ్యులకు కూడా చాంబర్, సీట్లు కేటాయించాలంటే తాము ఖాళీ చేసి బయటకు పోవాల్సిందే’నని మండల పరిషత్ అధ్యక్షులు మండిపడుతున్నారు. వాస్తవానికి జడ్పీటీసీలు గతం నుంచే మండల పరిషత్‌లలో సీటు కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇదే జరిగితే మండల పరిషత్‌లకు సమాంతరంగా జడ్పీటీసీలు పాలన సాగిస్తారని, దాని వల్ల అనవసర వివాదాలు తలెత్తుతాయనే ముందుచూపుతో ప్రభుత్వం ఇందుకు సమ్మతించలేదని అంటున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా గత నెల 24న జరిగిన జిల్లా పరిషత్ తొలి సర్వసభ్య సమావేశంలో మండల పరిషత్ కార్యాలయాల్లో జడ్పీటీసీలకు సీటు కేటాయించాలని తీర్మానించారు. దీంతో పాటు జిల్లాలోని టోల్‌ప్లాజాల ద్వారా ఉచితంగా ప్రయాణం డిమాండ్ కూడా లేవనెత్తారు. ఈ డిమాండ్ చేసింది సహచర సభ్యులే కావడం, వారి సహకారంతోనే చైర్పర్సన్ పీఠం అధిరోహించడంతో నామన రాంబాబు కాదనలేకపోయారు. ఇందుకు ప్రతిగా జెడ్పీటీసీలు పెద్ద ఎత్తున చప్పట్లతో సభలో స్వాగతం పలికి నామనకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తీరా ‘సీటు’ నిర్ణయం అమలులోకి వచ్చేసరికి ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యుల మధ్య ఆధిపత్య పోరుకు తెరతీసింది. జిల్లాలో ఈ వివాదానికి అంకురార్పణ తుని రూరల్ మండల పరిషత్‌లో జరిగింది. తుని ఎంపీపీ పల్లేటి నీరజకు కనీస సమాచారం లేకుండా జడ్పీటీసీ సభ్యురాలు జె.వెంకటలక్ష్మికి సోమవారం అడ్డగోలుగా చాంబర్ కేటాయించడం వివాదాస్పదమై పోలీసు కేసుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇన్‌ఛార్జి ఎండీవో, ఈవోపీఆర్డీ కె.శేషారత్నం ఆత్యుత్సాహం ఫలితంగానే ఈ వివాదం తలెత్తిందని జిల్లావ్యాప్తంగా ఎంపీపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీపీ కార్యాలయంలో జడ్పీటీసీకి సీటు కేటాయించే అవకాశాన్ని అటుంచితే.. తునిలో ఈవోపీఆర్డీ దుందుడుకుగా కేటాయించే పద్ధతి కారణంతో వివాదం ముదురుపాకాన పడిందని పలువురు ఎంపీపీలు అభిప్రాయపడుతున్నారు. జడ్పీలో తీర్మానం చేశారనే ఏకైక కారణంతో ముందస్తు సమాచారం లేకుండా ఒక ఎంపీపీని అవమానించే రీతిలో తునిలో సీటు కేటాయించారని జిల్లాలోని మిగతా ఎంపీపీలు గుర్రుగా ఉన్నారు. ఇవాళ తునిలో అయ్యింది రేపు మరో మండల పరిషత్‌లో పునరావృతం కాదనే గ్యారెంటీ ఏమిటనే ప్రశ్న అధికార పార్టీకి చెందిన ఎంపీపీలు కూడా లేవనెత్తుతున్నారు. పార్టీ ఏదైనా ఎంపీపీలంతా ఒకే మాటమీద ఉండేందుకు సిద్ధపడుతున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కాజులూరు మండల పరిషత్ అధ్యక్షుడు యాళ్ల కృష్ణారావు మంగళవారం తీవ్రంగా స్పందించారు. తునిలో జరిగిన వివాదాన్ని తక్షణం పరిష్కరించాలని ఆయన ఒక పత్రికా ప్రకటనలో డిమాండ్ చేశారు. అవగాహన లేని పంచాయతీరాజ్ అధికారులతోనే ఎంపీపీలు, జడ్పీటీసీల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ విషయంలో ఇకనైనా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలంటున్నారు. జడ్పీలో తీర్మానం, వారికి చాంబర్ల కేటాయింపు తదితర అంశాలపై పార్టీరహితంగా ఎంపీపీలంతా ఒకటి, రెండు రోజుల్లో సమావేశం అవుతున్నారు. అ సమావేశంలోనే దీనిపై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించాలనుకుంటున్నారు. జడ్పీ నిర్ణయం ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే. -
ఎట్టకేలకు...
నీలగిరి :వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. కొంతకాలంగా వివిధ కారణాల దృష్ట్యా వాయిదాపడుతూ వస్తున్న జిల్లా ప్రణాళిక కమిటీ సమావేశం(డీపీసీ) బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 10గంట లకు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బీఆర్జీఎఫ్లకు సంబంధించి గ్రామ, మండల, జిల్లాస్థాయిలో గుర్తించి పంపిన ప్రతి పాదనలపై సభ్యులు చర్చించి ఆమోదిస్తారు. జెడ్పీచెర్మన్ నేనావత్ బాలునాయక్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరుకానున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను బీఆర్జీఎఫ్ కింద జిల్లాకు 33 కోట్ల రూపాయలు కేటాయించారు. అభివృద్ధికి పెద్దపీట బీఆర్జీఎఫ్ పథకం ఏడేళ్లుగా అమలవుతోంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు జిల్లాకు రూ. 190 కోట్లు కేటాయించారు. అయినా ప్రభుత్వం అనుకున్న లక్ష్యం పూర్తికాకపోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా రూ.33 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో గ్రామ, మండల పరిషత్, జెడ్పీల నుంచి అంగన్వాడీ భవనాలు, మురికికాల్వలు, అంతర్గత రోడ్లు, తాగునీటి సౌకర్యం, పశువైద్యశాలల మిగులు పనులు, పాఠశాలల అదనపు తరగతి గదులు, మండల పరిషత్ భవనాల మిగులు పనులు, గ్రామ పంచాయతీ భవనాల మిగులు పనులుతో కలిపి ప్రణాళిక రూపొందించారు. అంతేగాక మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు చెందిన సొంత నిధులు రూ.3.50 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. ఈ విషయమై జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘‘బీఆర్జీఎఫ్ పనులకు డీపీసీ ఆమోదం పొందిన తర్వాత రాష్ర్టస్థాయిలో జరిగే సమావేశానికి కూడా పంపిస్తాం. అక్కడా ఆమోదం లాంఛనమే. అదే రోజున 14 స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ కూడా ఉంది. ఈ సమావేశానికి జెడ్పీచైర్మన్ హాజరవుతారు. జిల్లాకు సంబంధించి సీపీడబ్ల్యూఎస్ పథకాలపై చైర్మన్ సలహాలు, సూచనలు ఇస్తారు.’’ నిధుల పంపకం.. బీఆర్‌జీఎఫ్‌లో భాగంగా జిల్లాపరిషత్ కోటా రూ.6 కోట్ల నుంచి ప్రజాప్రతినిధులకు వాటాలు కేటాయించారు. ఎంపీలకు 10 లక్షల రూపాయలు, ఎమ్మెల్యేలకు 5 లక్షల రూపాయలు, జెడ్పీటీసీలకు 7 లక్షల రూపాయలు, మాజీ ప్రజాప్రతినిధులందరికీ 20 లక్షల రూపాయల నిధులు పంపిణీ చేస్తారు. ఈ నిధులను ఆయా ప్రజాప్రజానిధులు తమ ప్రాంతాల పరిధిలో అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
ఎంపీడీవోలు vs కార్యదర్శులు ప్రచ్ఛన్నయుద్ధం!
‘ఉపాధి’పై పర్యవేక్షణ కావాలంటున్న ఎంపీడీవోలు మాకొద్దంటున్న కార్యదర్శులు మచిలీపట్నం : జిల్లాలో మండల పరిషత్ అధికారులు, పంచాయతీ కార్యదర్శుల మధ్య ప్రచ్ఛన్నం యుద్ధం కొనసాగుతోంది. ఉపాధి హామీ పథకం పర్యవేక్షణ బాధ్యతలను తమకు అప్పగించాలని ఎంపీడీవోలు ఇటీవల పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని కోరడమే ఇందుకు కారణం. ఉపాధి హామీ పథకం పర్యవేక్షణ బాధ్యతలను ఎంపీడీవోలకు అప్పగిస్తే క్షేత్ర స్థాయిలో తమపై అదనపు భారం పడుతుందని కార్యదర్శులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఉపాధి హామీ పనులపై ఎంపీడీవోలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తే వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు అలవెన్సుల రూపంలో అందే అవకాశం ఉంది. అందువల్లే ఎంపీడీవోలు ఉపాధి హామీ పనులకు సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించాలని పట్టుబడుతున్నారని పంచాయతీ కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. కార్యదర్శులతో ఫీల్డ్ అసిస్టెంట్ పనులు! ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించేందుకు నూతన ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కొంత మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఎందుకు తొలగించకూడదంటూ నోటీసులు కూడా జారీ చేసింది. మరికొందరికి రెండు నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించినా, ఆ పనులను పంచాయతీ కార్యదర్శులతో చేయిస్తామని ఎంపీడీవోలు మంత్రికి వివరించారని సమాచారం. జిల్లాలో 156 పంచాయతీలకు కార్యదర్శులే లేరని ఒక్కో కార్యదర్శి రెండు, మూడు పంచాయతీలను పర్యవేక్షించాల్సి వస్తోందని కార్యదర్శులు వాపోతున్నారు. అసలే పనిభారం అధికంగా ఉండగా ఉపాధి హామీ పనులను తామెలా పర్యవేక్షించగలమని వారు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులను బాధ్యులను చేస్తారా? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పంచాయతీల్లో పనిభారం పెరిగింది. వంద రోజుల ప్రణాళిక అమలు, పంచాయతీలో రోజువారీ చేపట్టిన కార్యక్రమాలను వివిధ ఫార్మాట్లలో నివేదికలను కార్యదర్శులు పంపాల్సి వస్తోంది. వీటితోపాటు గ్రామాల్లో పారిశుద్ధ్యం, ప్రభుత్వం నుంచి అప్పటికప్పుడు వచ్చే ఉత్తర్వులను అమలు చేయటం తదితర పనులతో సతమతమవుతన్నామని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. మరోవైపు సెప్టెంబరు నాటికి ఇంటి పన్నులు వసూలు చేయాలని పంచాయతీ శాఖ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు. జిల్లాలో 516 క్లస్టర్ పంచాయతీలు ఉండగా, వీటిలో 156 క్లస్టర్ పంచాయతీలకు కార్యదర్శులే లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం పర్యవేక్షణ బాధ్యతలు తమకు అప్పగిస్తే మరింత భారం పడుతుందని కార్యదర్శులు వాదిస్తున్నారు. ఎంపీడీవోలు తమ ప్రయోజనాల కోసం ఉపాధి హామీ పనులపై పర్యవేక్షణ బాధ్యతలను తీసుకున్నా, క్షేత్రస్థాయిలో ఈ పనులను చేయించే బాధ్యతలను తమకు అప్పగిస్తారని చెబుతున్నారు. ఉపాధి హామీ పథకంలో ఏమైనా అవకతవకలు జరిగితే తమను బాధ్యులు చేస్తారని కార్యదర్శులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. టీఏ, డీఏలు ఇవ్వటం లేదు ఒక్కో కార్యదర్శి రెండు, మూడు పంచాయతీల్లో విధులు నిర్వహిస్తుండగా టీఏ, డీఏ బిల్లులు ఇవ్వడంలేదని తెలుస్తోంది. తమకు ఇవ్వాల్సిన టీఏ, డీఏ బిల్లులు పక్కదారి పడుతున్నాయని పలువురు పంచాయతీ కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. 010 పద్దు ద్వారా పంచాయతీ కార్యదర్శులకు వేతనాలు అందుతుండటంతో తమకు రావాల్సిన టీఏ, డీఏ బిల్లులు ఏమవుతున్నాయో అర్థం కావటం లేదని వారు చెబుతున్నారు. ఇప్పటికే పనిభారంతో సతమతమవుతున్నామని, ఉపాధి హామీ పనులను తమకు అప్పగించకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని పలువురు పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు. -
మోగిన నగారా
►ఈ నెల 7న జడ్పీ చైర్పర్సన్, వైస్చైర్మన్ల ఎన్నిక ►6న ఎంపీపీలు, వైస్ ఎంపీపీలకు.. ►ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ►ఆ ‘ఏడు’ మండలాల జడ్పీటీసీలకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేదు ►అక్కడ ఎంపీపీ ఎన్నిక కూడా లేనట్టే ►39 మండలాలకే ఎన్నిక నిర్వహించాలని కలెక్టర్‌కు ఆదేశాలు ► కూనవరం, చింతూరు, వీఆర్‌పురం ఎన్నికల బాధ్యత తూర్పుగోదావరి కలెక్టర్‌కు అప్పగింత ►భద్రాచలం, బూర్గంపాడు ఎంపీపీలు పెండింగ్ ►జడ్పీలో మారనున్న పార్టీల బలాబలాలు ►రిజర్వేషన్ యథాతథం ►రసకందాయంలో జిల్లా రాజకీయం సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ఎట్టకేలకు జిల్లా, మండల పరిషత్‌ల పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడిన రెండున్నర నెలల తర్వాత జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీపీలు, వైస్ ఎంపీపీల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈనెల 7న జడ్పీ పాలకవర్గానికి (జడ్పీ చైర్మన్, వైస్‌చైర్మన్, కో ఆప్షన్ సభ్యులు), 6న జిల్లాలోని 39 మండల పరిషత్‌ల పాలకవర్గాలకు (ఎంపీపీ, వైస్‌చైర్మన్, కో- ఆప్షన్ సభ్యులు) ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి పేరిట గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, ఈ ఎన్నికల నుంచి పోలవరం ముంపు ప్రాంతం కింద ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన ఏడు మండలాలను మినహాయించారు. ఈ మండలాల జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలలో పాల్గొనే అవకాశం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకే జిల్లాలోని పూర్తి మండలాన్ని మాత్రమే జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గంగా పరిగణిస్తామని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 ప్రకారం ఆ ఏడు మండలాల్లో కొన్ని పూర్తిగా, కొన్ని పాక్షికంగా ఉభయగోదావరి జిల్లాల్లో కలిసినందున సెక్షన్ 178 ప్రకారం ఈ మండలాలను ఎన్నికల నుంచి మినహాయిస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా ఎంపీపీ ఎన్నికల కోసం వెలువరించిన ఉత్తర్వుల్లో జిల్లాలోని 39 మండలాలకు మాత్రమే నోటిఫికేషన్ జారీ అయింది. మిగిలిన ఏడు మండలాల్లో కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు ఎంపీటీసీ ఎన్నికలు జరగలేదు. ఇక మిగిలిన వాటిలో చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో పూర్తిగా కలిసినందున ఆయా మండల పరిషత్‌ల పాలకవర్గాలకు ఎన్నిక జరిపే బాధ్యతను ఆ జిల్లా కలెక్టర్‌కు అప్పగిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పాక్షికంగా గోదావరి జిల్లాల్లో కలిసి మిగిలిన భాగం మన జిల్లాలో ఉండే భద్రాచలం, బూర్గంపాడు మండలాల పాలకవర్గాల ఎన్నిక ప్రక్రియను పెండింగ్‌లో ఉంచారు. కోర్టు కేసుల ఉపసంహరణ.. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలకవర్గాలు కొలువుదీరినా, జిల్లాలో మాత్రం ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఈ ఏడాది మార్చి 10న నోటిఫికేషన్ విడుదల కాగా, ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల ఫలితా లు మే 13న వెలువడ్డాయి. అనంతరం జూన్ 26న తెలంగాణ వ్యాప్తంగా జడ్పీ చైర్మన్లు, ఎంపీపీల ఎన్నిక జరగగా, మన జిల్లాలో మాత్రం నిర్వహించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి, జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలిపినందున జిల్లా పరిషత్, మండలపరిషత్ ఎన్నికలకు మళ్లీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ విజయగాంధీ తదితరులు కోర్టును ఆశ్ర యించడంతో జూన్13న హైకోర్టు స్టే విధించింది. దీంతో ఎన్నిక నిలిచిపోయింది. ఆ తర్వాత కేసు ఉపసంహరించుకోవడంతో, మిగిలిన పిటిషన్లను కూడా జూలై 24న కోర్టు కొట్టివేసింది. దీంతో జడ్పీ చైర్పర్సన్, ఎంపీపీల ఎన్నికకు మార్గం సుగమం అయింది. -
ఇక... మన మండలం/జిల్లా
* ప్రణాళికలు రూపొందించాలంటూ ఆదేశాలు జారీ * మండల స్థాయిలో ఇలా... మండల స్థాయిలో 16 అంశాలకు సంబంధించిన వివరాలు పొందుపరచాలి. మండల పరిషత్ పరిధిలోని ప్రజాప్రతినిధుల వివరాలు, సిబ్బంది వివరాలు (రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్), వివిధ ప్రభుత్వ కార్యాలయాల మౌలిక సదుపాయాల వివరాలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆస్తులు, నిధులు, వ్యయం, ఆదాయ వనరులు, స్వయం సహాయక సంఘాల వివరాలు, మండల పరిషత్‌లోని మొదటి పది ప్రాధాన్యత పనులు, మండల స్థాయిలో శాఖల వారీగా 2013-14, 2014-15 సంవత్సరంలో చేపట్టిన పనుల వివరాలతో ప్రణాళికలు సిద్ధం చేయాలి. మండల స్థాయి సమావేశాలు 21వ తేదీన ప్రారంభించి, 24లోగా పూర్తి చేయాలి. ఇక్కడ రూపొందించిన ప్రణాళికలను మండల సర్వసభ్యసమావేశంలో ఆమోదించాలి. నీలగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘మనఊరు-మన ప్రణాళిక’’ గ్రామసభలు ముగింపు దశకు చేరుకున్నాయి. దీంతో ‘‘మన మండలం- మన జిల్లా’’ ప్రణాళికలు తయారు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. మనఊరు-ప్రణాళిక గ్రామసభలు ఈ నెల 13వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ సభలు ఆదివారంతో ముగియనున్నాయి. రెండు, మూడు మండలాలు మినహా దాదాపు అన్ని గ్రామాల్లో గ్రామసభలు పూర్తిచేశారు. ఈ సభల్లో ప్రజల నుంచి పెద్దఎత్తున విన్నపాలు వెల్లువెత్తాయి. వీటిని అధికారులు క్రోడీకరించి అంచనాలు సిద్ధం చేస్తారు. షెడ్యూల్ ప్రకారం గ్రామస్థాయి ప్రణాళికలను రెండు, మూడురోజుల్లో ఆన్లైన్లో నమోదు చేస్తారు. కాగా గ్రామ ప్రణాళిక ముగింపు దశకు చేరుకోవడంతో ‘మన మండలం-మన జిల్లా ప్రణాళిక’ సిద్ధం చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి జిల్లాకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఓవైపు గ్రామ ప్రణాళికల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తూనే...మరోవైపు మండల, జిల్లా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి శనివారం రాష్ట్రస్థాయి అధికారులు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల్లో, జిల్లా స్థాయిలో ఏవిధంగా వివరాలు సేకరించాలనే అంశంపై అన్ని మండలాలకు నమూనా (ఫార్మాట్) పత్రాలను పంపారు. ఇంటెలీజెన్స్ ఆరా... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంపై ఇంటెలీజెన్స్ సైతం ఆరా తీస్తోంది. ఇంటెలీజెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు, సిబ్బందితో ఫోన్లో మాట్లాడుతున్నారు. నేరుగా గ్రామసభలకు వెళ్లి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గ్రామసభలు ఏ విధంగా జరుతున్నాయి..? అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారా..? ప్రజల స్పందన ఏవిధంగా ఉంది..? ప్రణాళికలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారా..? అనే అంశాలపై సమాచారం సేకరిస్తున్నారు. -
హోరాహోరీగా ఎంపీపీ ఎన్నికలు
జిల్లా పరిషత్ : మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు రెండో విడత ఆదివారం ఆరు మండలాలకు జరిగిన ఎన్నికల్లో మళ్లీ రెండు మండలాలు వాయిదా పడ్డాయి. జిల్లాలో 50 మండలాలకు గాను కోర్టు విచారణలో ఉన్న మంగపేట మినహా 49 మండలాల్లో ఈనెల 4న ఎంపీపీల ఎన్నిక నిర్వహించారు. ఇందులో వివిధ కారణాలతో ఆరు మండలాలు వాయిదా పడ్డాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయా మండలాలకు ఆదివారం ఎన్నిక లు నిర్వహించగా హన్మకొండ, మహబూబాబాద్ ఎంపీపీల ఎన్నిక కోరం లేని కారణంగా మళ్లీ వాయిదా పడ్డాయి. మానుకోటతోపాటు స్టేషన్‌ఘన్‌పూర్‌లో తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఎన్నికలు జరిగాయి. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నా ఎంపీపీ పదవికి రెండు వర్గాలు పోటీ పడడంతో గొడవ జరిగి ఉద్రిక్త పరిస్థితు లు నెలకొన్నాయి. మానుకోటలో కాంగ్రెస్‌కు చెందిన ఎంపీటీసీలను టీఆర్ఎస్ నాయకులు ఎత్తుకెళ్లడం.. ఒక ఎంపీటీసీ సభ్యురాలి కారు ధ్వంసం చేయడం.. పోలీసుల లాఠీచార్జ్‌తో గందరగోళ పరిస్థితి ఎదురైంది. చివరకు కోరం లేకపోవడంతో ఎంపీపీ ఎన్నిక వాయిదా పం డింది. ఇప్పటి ఎన్నికలు పూర్తయిన మండల పరిషత్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్-16, కాంగ్రెస్-20, టీడీపీ-7, స్వతంత్రులు-3, న్యూడెమోక్రసీ-1 ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల కాంగ్రెస్, టీడీపీలు ఎంపీపీ పదవులకు మద్దతు ఇచ్చి ఉపాధ్యక్ష పదవులను కైవసం చేసుకున్నాయి. దీంతో పూర్తి మెజార్టీ లేకున్నా అదనంగా కొన్ని మండలాలు టీఆర్ఎస్ ఖాతాలోకి చేరాయి. తాజాగా వాయిదా పడిన హన్మకొండ, మహబూబాబాద్ మండలాల్లో ఎంపీపీల ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. నల్లబెల్లిలో.. నల్లబెల్లి మండలంలో పార్టీలన్నీ ఏకమై ఎంపీ పీ, ఉపాధ్యక్షుడు, కోఆప్షన్ సభ్యులను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన టీఆర్ఎస్లో చేరిన ఎంపీటీసీ సభ్యుడు బానోతు సారంగపాణి, టీఆర్ఎస్కు చెందిన పాలెపు రాజేశ్వర్‌రావు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వెంకటాపూర్‌లో.. వెంకటాపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఉండడంతో ఆదే పార్టీకి చెందిన మేకల పద్మ ఎంపీపీగా, ఉపాధ్యక్షుడిగా చక్రారపు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. జనగామలో.. జనగామ మండలంలో కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు టీఆర్ఎస్ రెబల్ బైరగోని యాదగిరిగౌడ్‌కు మద్దతు ఇవ్వడంతో ఆయన ఎంపీపీగా గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన దాసరి రవి ఓటమి పాలయ్యారు. వైఎస్ ఎంపీపీగా కాంగ్రెస్‌కు చెందిన బడికె ఇందిర ఎన్నికయ్యారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉత్కంఠ.. స్టేషన్ఘనపూర్ మండలంలో టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ ఎంపీపీ పదవికి ఆ పార్టీలోని ఇద్దరు నాయకులు పోటీ పడ్డారు. పార్టీ వారికి బీ-ఫాం ఇవ్వకపోవడంతో ఇరువు రూ ఇతర పార్టీల మద్దతులో రంగంలోకి దిగా రు. ఒకే పార్టీకి చెందిన వారు కావడంతో అందులో ఎంపీపీగా వంగాల జగన్మోహన్రెడ్డి, ఉపాధ్యక్షురాలిగా బూర్ల లత ఎన్నికయ్యారు. వీరు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారైనప్పటికీ అధికారులు ఇండిపెండెంట్లుగా గుర్తించారు. హన్మకొండలో.. హన్మకొండ మండలంలో కేవలం రెండు ఎంపీటీసీ స్థానాలే ఉన్నాయి. ఇద్దరూ వేర్వేరు పార్టీల వారుకావడం.. ఇరువురూ ఎంపీపీ పదవికి పోటీ పడుతుండడంతో ఎన్నికల ప్రక్రియ జరి పేందుకు వీలు కాకుండా పోయింది. ఎంపీపీగా పోటీ చేస్తున్న అభ్యర్థికి ఒకరు ప్రతిపాదించాలి, మరోకరు బలపర్చల్సి ఉంటుంది. కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక జరిపేందుకు అధికారులు ప్ర యత్నించినా కుదరలేదు. కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక జరగకపోవడంతో మరోసారి ఎంపీపీ ఎన్నిక వాయిదా వేశారు. కోరం లేని కారణంగా ఎన్నికల నిర్వహణకు మార్గదర్శకాలు ఇవ్వాల ని జెడ్పీ అధికారులు ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. అక్కడ నుంచి స్పష్టత వస్తేనే ఎంపీపీ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. మానుకోటలో ఉద్రిక్తత మహబూబాబాద్ ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పోటీ పడడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మండలంలో 17 ఎంపీ టీసీ స్థానాలుండగా కాంగ్రెస్-9, టీఆర్ఎస్-5, టీడీపీ-3 గెలుచుకున్నాయి. ఆదివారం ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీటీసీలను టీఆర్ఎస్ నాయకులు ఎత్తుకెళ్లడంతోపాటు ఒకరిని కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేశారు. శనిగపురం ఎంపీటీసీ ఉపేంద్రమ్మ (టీఆర్ ఎస్) రాకతో మొదలైన గొడవ, ఆమె కారు ధ్వంసంతో తీవ్రస్థాయికి చేరుకుంది. తోపులాట, వాగ్వాదాలతో ఆ ప్రాతం అట్టుడికి పోయింది. పోలీసులు లాఠీలకు పనిచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చిం ది. ఈ నేపథ్యంలో కోరం లేక కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక జరగలేదు. దీంతో ఎంపీపీ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. -
ఎంపీపీలు టీఆర్ఎస్కే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో శుక్రవారం జరిగిన మండల పరి షత్ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. మొత్తం 36 మండలాలకుగాను 24 ఎంపీపీలను కైవసం చేసుకున్న టీఆర్ఎస్ మరోసారి సత్తా చాటింది. కాగా కాంగ్రెస్ పార్టీ 10 మండలాలను హస్తగతం చేసుకోగా... టీడీపీ ఈ ఎన్నికల్లో పత్తా లేకుండా పోయిం ది. ధర్పల్లిలో ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకోగా చివరకు ఇండిపెండెంట్ అభ్యర్థి టాస్ ద్వారా ఎన్నికయ్యారు. భిక్కనూర్ మండల పరిషత్ ఎన్నికలకు మొత్తం 17 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను 8 మందే హాజరు కావడంతో కోరం లేని కారణంగా అధికారులు ఎన్నిక వాయిదా వేశారు. ఎన్నికల సంఘం ఆదేశం ప్రకా రం తదుపరి ఎన్నికల తేదీని ప్రకటిస్తామని చెప్పా రు. జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లో ఎంపీపీల ఎన్నిక ప్రక్రి య జరగ్గా.. చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలుచోట్ల పోలీసులు లాఠీలను ఝుళి పించి ఆందోళనకారులను చెదరగొట్టారు.ఎంపీపీ ఎన్నికల సందర్భంగా పలు మండలాల్లో తమ పార్టీకి సీటు దక్కే అవకాశం లేదని భావించిన పలువురు బీజేపీ, టీడీపీ, స్వతంత్ర అభ్యర్థులు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మద్ద తు తెలిపారు. కాగా మంత్రి పోచారం , టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్‌షిందేలు ప్రాతి నిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మొ త్తానికి మొత్తం మండలాలను స్వీప్ చేశారు.బాల్కొండ నియోజకవర్గం లో మొత్తం ఐదు మండలాలకు ఎమ్మెల్యే వేముల ప్రశాం త్‌రెడ్డి నాలుగు మండలాల్లో తమ అభ్యర్థులను గెలిపిం చారు. పీసీసీ మాజీ చీఫ్, శాసనమండలి పక్షనేత డీఎస్ ఐదింటికీ నాలుగు మండలాల్లో ఎంపీపీలను దక్కించుకున్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిం చిన బోధన్‌లో నాలుగు మండలాలకు నాలుగు కాంగ్రెస్‌కు దక్కించుకోగా.. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే షకీల్ ప్రయత్నాలు ఫలించలేదు.జిల్లావ్యాప్తంగా గులాబీ జెండా ఎగిరింది. ఒక్క బోధన్‌లో ఆ పార్టీకి చుక్కెదురైంది. రెంజల్లో పోలీసుల లాఠీచార్జి ఎంపీపీల సందర్భంగా జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రెంజల్ మండల ఎన్నికలకు బీజేపీ పార్టీకి చెందిన దీప కాంగ్రెస్ ఎంపీటీసీలతో కలిసి హాజరు కావడంతో ఆ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పరస్పర దాడులకు సిద్ధం కావడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. డిచ్పల్లి ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి దాసరి ఇందిర (యానంపల్లి), కో-ఆప్షన్ సభ్యుడిగా శ్యాంసన్(నడిపల్లి) ఎన్నిక కాగా, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థులు ఏడుగురు తీవ్ర నిరసనలు తెలపడంతో ఉపాధ్యక్షుడి ఎన్నిక శనివారానికి వాయిదా వేశారు. ధర్పల్లి ఎంపీపీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి కో-ఆప్షన్ మెంబర్‌గా అబ్దుల్ మజీద్ (టీఆర్ఎస్)ను ఎన్నికున్న అనంతరం ఎన్నికల అధికారి నియమ నిబంధనలు చెబుతున్న సమయంలో దుబ్బాక ఎంపీటీసీ సభ్యుడు కోతి నర్సయ్య (కాంగ్రెస్)ను కిడ్నాప్ చేశారని అతడి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడని, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఫిర్యాదు పత్రాన్ని ఎన్నికల అధికారికి పోలీసులు అందజేశారు. దీంతో టీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యులు నిరసన ప్రారంభించారు. కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు సైతం ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయం బయట టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పోటాపోటీగా ఆందోళన ప్రారంభించారు.ఆందోళన కారులు రాళ్లు రువ్వడంతో సీఐ వాహనం ధ్వంసమైంది. గౌరారం స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి ఇమ్మడి గోపిని అరెస్ట్ చేయాలని ఇద్దరు టీఆర్ఎస్ కార్యకర్తలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రాత్రి 8.30 గంటలకు నిర్వహించిన ఎన్నికల్లో టాస్ ద్వారా గోపి ఎంపీపీగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. టీఆర్ఎస్ స్వీప్... డీఎస్, సుదర్శన్‌రెడ్డిలకు ఊరట... టీఆర్ఎస్ మూడు నియోజకవర్గాల్లో మొత్తానికి మొత్తం ఎంపీపీలను గెలిచి స్వీప్ చేసింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో-ఆప్షన్ సభ్యులను టీఆర్ఎస్ గెలుచుకుంది. బాన్సువాడ నియోజకవర్గంలో నాలుగు మండ ల పరిషత్‌లపై గులాబీ జెండా రెపరెపలాడింది. జుక్కల్‌లో ఐదు మండలాలు టీఆర్ఎస్ పరం అయ్యాయి. కాగా బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ, భీమ్‌గల్, వేల్పూరు, కమ్మర్పల్లి మండలాలను టీఆర్ఎస్ దక్కించుకోగా, మోర్తాడ్ కాంగ్రెస్ ఖాతాలో చేరింది. కాగా పిట్లం మండ లం వైస్ ఎంపీపీ ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. పదవి కోసం టీఆర్ఎస్ నుంచి నర్సాగౌడ్, జేఏసీ నుంచి జగదీష్ మధ్య పోటీ నెలకొనగా చివరకు టీఆర్ఎస్కు చెందిన నర్సాగౌడ్‌ను పదవి వరించింది. జుక్కల్ మండల అధ్యక్ష పదవికి కాంగ్రెస్‌కు చెందిన ఎంపీటీసీ సభ్యుడు హన్మాగౌడ్ మద్దతివ్వడంతో టీఆర్ఎస్ జెండా ఎగిరింది. కాగా శాసనమండలి పక్షనేత డీఎస్, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ రూరల్, బోధన్‌లలో ఎంపీపీ పదవులు దక్కించుకున్నారు. నిజామాబాద్ రూరల్‌లో ఐదు మండలాలకు గాను ధర్పల్లిలో స్వతంత్ర అభ్యర్థికి ఎంపీపీ పీఠం దక్కగా... నాలుగు కాంగ్రెస్‌నే వరించాయి. బోధన్‌లో నాలుగింటికి నాలుగు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దీంతో ఈ ఎన్నికల్లో లభించిన విజయం వారికి ఊరట కలిగించే అంశం. -
నేడు ఎంపీపీల ఎన్నిక
కర్నూలు(అర్బన్): సుదీర్ఘ విరామం తరువాత శుక్రవారం మండలాధ్యక్షుల ఎన్నిక జరగనుంది. మండల పరిషత్ పాలకవర్గాలు 2011 జూలై 11వ తేదీ నుంచి రద్దయ్యాయి. నాటి నుంచి నేటి వరకు మండలాల్లో ప్రత్యేకాధికారుల పాలన సాగింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఎన్నికలు నిర్వహించగా మే నెలలో ఫలితాలు వచ్చాయి. జిల్లాలో 53 మండలాలు ఉండగా ఇందులో ఇరవై రెండింటిలో వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ 21 మండలాల్లో పట్టు సాధించగా మిగిలిన పదింటిలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించలేదు. వైఎస్సార్సీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఇతరులు కూడా ఆయా మండలాల్లోని పలు ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నారు. దీంతో ఆ మండలాల్లో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయా స్థానాల్లో ఎలాగైన తమ అభ్యర్థులను మండలాధ్యక్షులుగా కూర్చోబెట్టేందుకు అధికార తెలుగుదేశం పార్టీ తన వద్ద ఉన్న అస్త్రాలన్నింటినీ సంధిస్తోంది. తమ ఖాతాలోకి ఆయా స్థానాలను వేసుకునేందుకు ఇప్పటికే వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ కూడా చేసింది. ఇదే విషయాన్ని కిడ్నాప్‌కు గురైన ఎంపీటీసీల బంధువులు జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో ఎంపీటీసీలకు డబ్బును ఎరగా వేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. టీడీపీకి మెజార్టీ ఉన్న మండలాలు: ఆలూరు, ఆస్పరి, చిప్పగిరి, దేవనకొండ, పత్తికొండ, క్రిష్ణగిరి, తుగ్గలి, మద్దికెర, నందవరం, కౌతాళం, పాణ్యం, డోన్, బనగానపల్లె, అవుకు, ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరివెళ్ల, గోస్పాడు, ఆత్మకూరు, మహానంది, వెలుగోడు. హంగ్‌కు అవకాశం ఉన్న మండలాలు: వెల్దుర్తి, ఎమ్మిగనూరు, కోడుమూరు, గూడూరు, సి. బెళగల్, కల్లూరు, గడివేముల, బండిఆత్మకూరు, పాములపాడు, పగిడ్యాల వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్న మండలాలు.. ఆదోని, హాలహర్వి, హోళగుంద, గోనెగండ్ల, మంత్రాలయం, కోసిగి, పెద్దకడుబూరు, కర్నూలు, ఓర్వకల్లు, బేతంచెర్ల, ప్యాపిలి, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల, సంజామల, చాగలమర్రి, ఉయ్యాలవాడ, దొర్నిపాడు, నంద్యాల, నందికొట్కూరు, కొత్తపల్లి, జూపాడుబంగ్లా, మిడ్తూరు. -
మండల పరిషత్ సారథుల ఎంపిక విధి విధానాలు..
మంచిర్యాల రూరల్ : ఈ నెల 4వ తేదీన మండల ప్రజా పరిషత్ సారథుల ఎన్నికకు రంగం సిద్ధమైంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలతోపాటు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎంపీటీసీలు మండలాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కో-ఆప్షన్ సభ్యుడి ఎంపిక కోసం ఎన్నికల సంఘం సూచించిన నియమాలు పాటించాలి. గుర్తింపు పొందిన పార్టీల గుర్తులపై పోటీ చేసి గెలుపొందిన ఎంపీటీసీలు ఆయా పార్టీలు జారీ చేసిన విప్‌కు అనుగుణంగా నడుచుకోవాలి. విప్‌ను దిక్కరించే వారిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఎంపికైన ఎంపీటీసీలు చాలా మంది రిజర్వేషన్లు అనుకూలించి కొత్తగా ఎంపికైన వారే ఉండడంతో వారిలో పలు రకాల అనుమానాలను నివృత్తి చేసేందుకు విధి విధానాలు అందిస్తున్నాం. ముందుగా కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక మండల పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల రోజునే కో-ఆప్షన్ సభ్యుడిని ఎన్నుకుంటారు. ఒక్కో మండలానికి ఒక్కో కో-ఆప్షన్ సభ్యుడు ఉంటాడు. కో-ఆప్షన్ సభ్యుడిగా పోటీ చేసే వారు మైనార్టీకి చెందిన వారై ఉండాలి. ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బుద్ధిస్టు, జొరాస్ట్రియన్ మైనార్టీ వర్గాలకు చెందిన వారు, మన రాష్ట్ర భాషలు కాకుండా ఇతర రాష్ట్రాల భాషలు మాట్లాడే వయోజనులు కో-ఆప్షన్ సభ్యుడిగా పోటీ చేసేందుకు అర్హులు. వీరు ఆయా మండలానికి చెందిన వారై ఉండాలి. జూలై 4వ తేదీన ఉదయం 10 గంటలలోపు మండల పరిషత్ కార్యాలయంలో కో-ఆప్షన్ సభ్యులుగా పోటీ చేసేవారు నామినేషన్లు దాఖలు చేయాలి. 10 గంటల నుంచి 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, అనంతరం పోటీలో ఉన్నవారి పేర్ల ప్రచురణ ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు నామినేషన్ ఉపసంహరణ ఉంటుంది. అనంతరం వెంటనే కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నిక కోసం తక్షణ సమావేశం ఉంటుంది. ఒకరికంటే ఎక్కువ మంది సభ్యులు పోటీలో ఉంటే, తెలుగు అక్షరమాల ప్రకారం జాబితాను సిద్ధం చేసి క్రమసంఖ్యలో నంబర్లను కేటాయించి, ఎన్నిక చేస్తారు. వీరిని ఎంపిక చేసేందుకు ఎంపీటీసీలు చేతులెత్తి ఓటు వేస్తారు. సమావేశంలో కో-ఆప్షన్ సభ్యుడిని ఎన్నుకునేందుకు ఎంపీటీసీలకు విప్ నియమాలు వర్తించవు. కోరం ఉంటేనే అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక మండల పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక కోసం జూలై 4వ తేదీ మధ్యాహ్నం 1 గంటలకు తక్షణ సమావేశాన్ని ప్రిసైడింగ్ అధికారి ఏర్పాటు చేస్తారు. ఎంపిక నిర్వహణకు అరగంటలోగా ఎంపీటీసీల్లో సగం మంది తప్పనిసరిగా హాజరు కావాలి. ఆయా మండలంలోని ఎంపీటీసీల్లో సగంగానీ, అంత కంటే ఎక్కువ మందిహాజరైతే కోరం ఉన్నట్లు, సగం కంటే తక్కువ మంది సమావేశానికి హాజరైతే కోరం లేనట్లు, ఇలా కోరం లేకున్నా, కోరం ఉండి ఎన్నిక జరగని పక్షంలో ప్రిసైడింగ్ అధికారి మరుసటి రోజున అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహణకు సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. పనిదినమైనా, సెలవు రోజైన సమావేశం ఉం టుంది. ఒకవేళ ఎన్నికకు కోరం లేక, ఇతరత్రా కారణాలతో మరోసారి ఎన్నిక జరగకపోతే, విషయాన్ని ఎన్నికల కమీషన్‌కు తదుపరి ఆదేశాల కోసం నివేదిస్తారు. అధ్యక్ష పదవికి పోటీ చేసేవారి పేరును ఒక సభ్యుడు సూచించాలి. మరో సభ్యుడు సమర్ధించాలి. ఒకరికంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే, చేతులెత్తే పద్ధతి ద్వారా తమ ఓటు వేయాలి. ఈ తతంగాన్ని అంతా ప్రిసైడింగ్ అధికారి వీడియో ద్వారా రికార్డు చేస్తారు. ఎవరికి ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉంటే వారిని అధ్యక్షులుగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడినప్పుడు, వారికి సమాన ఓట్లు వచ్చిన పక్షంలో ప్రిసైడింగ్ అధికారి ‘డ్రా’ పద్ధతిలో ఎన్నికైన వారిని ప్రకటిస్తారు. విప్ ధిక్కరిస్తే అనర్హతే.. మండల పరిషత్తు ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన జరిగినందున, ఆయా పార్టీల గుర్తులపై గెలిచిన వారు, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ సూచించిన నిర్ణయాలకు కట్టుబడాలి. దీన్నే విప్ అంటారు. పార్టీ ఆదేశాలను ఏమాత్రం ధిక్కరించినా, ఆయా పార్టీలు వారి అభ్యర్థులపై కొరఢా ఝుళిపించే అవకాశం ఉంటుంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని అమలయ్యేలా చూసేందుకు పార్టీ పక్షాన ఒక విప్‌ను నియమించుకోవచ్చు. పార్టీ విప్ ఎవరనే విషయాన్ని నిర్దేశిత ప్రొఫార్మలో ప్రత్యేక సమావేశానికి ముందే ఎన్నికల అధికారికి అందజేయాలి. స్థానిక సంస్థలకు ఎన్నికైన తమ పార్టీ సభ్యుడిని గానీ, పార్టీ ఇతర నాయకుడిని గానీ విప్‌గా నియమించవచ్చు. స్థానిక సభ్యుడికి సమావేశం మందిరంలోకి ప్రవేశించే అవకాశం, అధికారం ఉంటుంది. ఇతర సభ్యుడైతే లోనికి ప్రవేశించేందుకు అనుమతించరు. పార్టీ నిర్ణయం, అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేసిన సభ్యుడు, పార్టీ పక్షాన ఎన్నికైన సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎవరికి ఓటు వేయాలనే పూర్తి సమాచారంతో కూడిన పత్రాలను సమావేశానికి కనీసం గంట ముందు ఎన్నికల అధికారికి అందించాలి. అయితే విప్ జారీ అయినా, ఒకవేళ ఏ సభ్యుడైనా సదరు పత్రాలపై సంతకాలు చేయకపోతే విప్ వర్తించదు. ఏ పార్టీ సభ్యుడైనా విప్‌ను అందుకుని, ఎన్నిక సందర్భంగా దిక్కరించి, ఇతరులకు ఓటు వేస్తే ఆ ఓటు చెల్లుతుంది. విప్ ఉల్లంఘనపై పార్టీ విప్ మూడు రోజుల్లోపు ఎన్నికల అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ఆయన సదరు సభ్యుడిని ఎందుకు అనర్హుడిగా ప్రకటించరాదో వివరించాలని నోటీసు జారీ చేస్తారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేయడంతో, ఆ సభ్యుడు అర్హత కోల్పోయే అవకాశం ఏర్పడుతుంది. -
తమ్ముళ్ల దౌర్జన్యం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార బలంతో టీడీపీ శ్రేణులు పేట్రేగిపోతున్నాయి. మునిసిపల్, జెడ్పీ, మండల పరిషత్ పీఠాలను దక్కించుకునేందుకు ఆ పార్టీ నాయకులు దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. ప్రజలు ఒక రకంగా తీర్పు ఇస్తే.. వీరు మరో రకంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. బలం లేకపోయినా ‘స్థానిక’ పీఠాలను కైవసం చేసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. టీడీపీకి ఓటు వేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచిన వారిపై ఒత్తిడి తెస్తున్నారు. మాట వినకపోతే అక్రమ కేసులు పెట్టి.. పోలీస్‌స్టేషన్‌లో మక్కెలు ఇరగదీయిస్తాం అంటూ బెదిరిస్తున్నారు. చేసేదేమీలేక వారు చెప్పినట్లు చేయాల్సి వస్తోందని వైఎస్సార్సీపీ సభ్యులు వాపోతున్నారు. జిల్లాలో మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సార్వత్రిక ఎన్నికల్లో అత్యధికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. జిల్లాలో రెండు ఎంపీ, 11 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్నారు. జెడ్పీ పీఠం దక్కించుకునేందుకు అవసరమైన 30 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే 22 మండల పరిషత్‌లు, ఐదు మున్సిపాలిటీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అధికంగా గెలిచారు. ప్రజాస్వామ్యబద్దంగా పూర్తి మెజారిటీ ఉన్న పార్టీకే జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్ చైర్మన్ స్థానాలు దక్కుతాయి. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో.. జిల్లాలో ఆ పార్టీ నాయకులు బరితెగించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. బెదిరింపులు.. బలవంతపు చేరికలు.. ఎలాగైనా మునిసిపిల్, జెడ్పీ, మండల పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోవాలని టీడీపీ నాయకులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిని దాచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ సభ్యులు పలువురు కనిపించకపోవడం ఈ విమర్శలకు బలాన్ని చేకూరుస్తోంది. నందికొట్కూరుకు చెందిన వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులను.. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం బలవంతంగా తీసుకెళ్లి టీడీపీ కండువా కప్పించారనే ఆరోపణలున్నాయి. అదే విధంగా కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజక వర్గానికి చెందిన జెడ్పీటీసీ సభ్యులను బెదిరించి తీసుకెళ్లినట్లు తెలిసింది. డోన్ నియోజకవర్గ పరిధిలో కొందరు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను బలవంతంగా తీసుకెళ్లి.. టీడీపీ కండువా వేసి పార్టీలో చేరినట్లు ప్రకటించారు. బలవంతం చేశామని ఎక్కడైనా చెబితే అంతుచూస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు సమాచారం. గూడూరు మునిసిపాలిటీలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ ఉంది. అయితే మాజీ ఎంపీపీ ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి టీడీపీలో చేరి.. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచిన కౌన్సిలర్లను కొందరిని రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలిసింది. బుధవారం రాత్రి వరకు ఆ కౌన్సిలర్లు ఎక్కడ ఉండేది వారి బంధువులకు కూడా తెలియలేదు. ‘విప్’తో పదవి పోతుందన్నా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసిందని.. వ్యతిరేకంగా ఓటు వేస్తే తమ పదవి పోతుందని కొందరు సభ్యులు వాపోతున్నా టీడీపీ నాయకులు పట్టించుకోవడం లేదు. తప్పనిసరిగా తమ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇదే విషయమై టీడీపీ క్యాంప్‌లో ఉన్న కొందరు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు వారి బంధువుల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా టీడీపీలో కొత్తగా పార్టీలో చేరిన వారు సైతం పదవుల కోసం పోటీ పడుతున్నారు. అయితే ఒకరి ఇచ్చి.. ఇంకొకరికి ఇవ్వకపోతే మొదటికే మోసం వస్తుందని టీడీపీ నేతలు ఫిఫ్టీ.. ఫిఫ్టీ ప్రయోగం ఉపయోగిస్తున్నారు. రెండున్నరేళ్లు ఒకరికి.. మరో రెండున్నరేళ్లు ఇంకొకరికి అని ఒప్పిస్తున్నారు. అయితే కొందరు తమకే మొట్టమొదటి అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారి కోసం.. ఆది నుంచి ఉన్న వారిని విస్మరించటాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. -
స్థానిక సంస్థల సారథుల ఎంపిక...
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎట్టకేలకు స్థానిక సంస్థల సారథుల ఎంపికకు ముహుర్తం ఖరారైంది. నగర పంచాయతీలు/మున్సిపాలిటీలు, మండల, జిల్లా ప్రాదేశిక సంస్థలకు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 3న నగర పంచాయతీ/మున్సిపాలిటీలు, 4న మండల పరిషత్, 5న జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. అదే రోజు కోఆప్షన్ సభ్యుల ఎంపిక కూడా ఉంటుందని పేర్కొంది. ఇదిలావుండగా, సార థుల సమరానికి తెరలేవడంతో జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు సరిపడా సంఖ్యాబలాన్ని సమకూర్చుకునేందుకు చైర్మన్ అభ్యర్థులు వ్యూహాలకు పదునుపెట్టారు. ఆర్థిక భారం తడిసిమోపెడు కావడంతో క్యాంపులను ఎత్తేసిన ఆశావ హులు.. తాజాగా నోటిఫికేషన్ రావడంతో మరోసారి యాత్రలకు పయనమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోవడంతో పలు చోట్ల ఫలితాలు కూడా తారుమారయ్యే పరిస్థితి తలెత్తింది. విప్ ఉల్లంఘిస్తే పార్టీ ధిక్కరణ కింద అనర్హత వేటు పడుతుందని తెలిసినప్పటికీ, చాలా మంది వేరే పార్టీ కండువా కప్పుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అధికారపార్టీ అండదండలుంటే విప్ ఉల్లంఘిం చినా ఏమీ కాదనే ధీమాతో ఉన్నారు. ‘గోపి’లతో తంటా! పురపోరులో వికారాబాద్‌లో కాంగ్రెస్‌కు స్పష్టమైన అధిక్యత లభించింది. అయితే, మారిన రాజకీయ సమీకరణలు ఆ మున్సిపాలిటీపై ప్రభావం చూపుతున్నాయి. అనూహ్యంగా టీడీపీ, టీఆర్ఎస్లు జతకట్టాలని నిర్ణయించుకోగా, కాంగ్రెస్ నుంచి నలుగురు కౌన్సిలర్లు గోడదూకాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇక్కడ రాజకీయ రసవత్తరంగా మారింది. అలాగే తాండూరులో మజ్లిస్, టీఆర్ఎస్ మధ్య పరస్పర అంగీకారం కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఇరుపార్టీలు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను సర్దుబాటు చేసుకునే వీలుంది. ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్‌పేట నగర పంచాయతీల్లో టీడీపీ- బీజేపీ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉంది. ఇందులో పెద్దఅంబర్‌పేట మున్సిపల్ పగ్గాలను మహిళకు అప్పగించాలని టీడీపీ యోచిస్తున్నట్లు తెలు స్తోంది. బడంగ్‌పేట నగర పంచాయతీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లనుంది. రోజుకో మలుపు! ఏ పార్టీకి స్పష్టమైన అధిక్యత రాకపోవడంతో జెడ్పీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. 33 జిల్లా ప్రాదేశిక స్థానాల్లో కాంగ్రెస్ 14, టీఆర్ఎస్ 12, టీడీపీకి 7 జెడ్పీటీసీలు దక్కాయి. జిల్లా పరిషత్ పీఠానికి అవసరమైన 17 మంది సభ్యులను కూడగట్టడానికి కాంగ్రెస్, టీ ఆర్ఎస్లు పోటాపోటీగా క్యాంపులు నిర్వహించాయి. టీఆర్ఎస్ ఇప్పటికీ శిబిరాలను నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ మాత్రం క్యాంపుకు రాంరాం పలికింది. జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి తన సతీమణి సునీతను (యాలాల జెడ్పీటీసీ)మరోసారి ైచైర్పర్సన్ చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక భారానికి వెరవకుండా క్యాంపును నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలకు కూడా గాలం వేశారు. దీంట్లో కొంత మేర విజయం సాధించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్‌లో అస్పష్టత నెలకొంది. ఖర్చుకు భయపడి యాదవరెడ్డి క్యాంపు ఎత్తివేయడం ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపింది. ఇంకోవైపు ఆయన కూడా టీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. యాదవరెడ్డి స్థానే కందుకూరు జెడ్పీటీసీ ఎనుగు జంగారెడ్డి పేరును పరిశీలిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో శుక్రవారం తమ పార్టీ సభ్యులతో శంషాబాద్‌లో కాంగ్రెస్ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఈ సమావేశం అనంతరం క్యాంపులకు బయలుదేరే అవకాశముందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. యాదవరెడ్డి అభ్యర్థిత్వంపై అనుమానాలున్నందున జంగారెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు ఆయన చెప్పారు. ఇదిలావుండగా, కాంగ్రెస్, టీ ఆర్ఎస్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్న టీడీపీ.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. టీఆర్ఎస్ను నిలువరించేందుకు కాంగ్రెస్‌కు బహిరంగ మద్దతు ప్రకటిస్తూనే.. లోపాయికారిగా టీఆర్ఎస్ తో జతకట్టేందుకు సంకేతాలు పంపింది. కాంగ్రెస్ లో అనైక్యతను సాకుగా చూపి.. టీఆర్ఎస్ పంచన చేరడానికి సన్నాహాలు చేసుకుంటోంది. వైస్ చైర్మన్‌పై ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ.. అవసరానికి అనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయించుకుంది. విలక్షణ తీర్పు మండల, జిల్లా ప్రాదేశిక పోరులో ఈసారి ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. అనూహ్యంగా టీఆర్ఎస్ పుంజుకోవడంతో కొన్నిచోట్ల ప్రధాన పార్టీల అడ్రస్ గల్లంతైంది. ముఖ్యంగా పశ్చిమ రంగారెడ్డిలో గులాబీ జోరుకు టీడీపీ మట్టికరిచింది. శివారు మండలాల్లో టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోటీ సాగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజకీయ సమీకరణలు మారిపోవడంతో చాలా మండలాల్లో త్రిశంకు ఫలితాలు వెలువడ్డాయి. దీంతో చైర్మన్ పగ్గాలపై కన్నేసిన ఆశావహులు.. ఎంపీటీసీలను శిబిరాలకు తరలించారు. విహారయాత్రలకు తీసుకెళ్లడమేకాకుండా.. ప్యాకేజీలు, నజరానాలను ప్రకటించారు. వారం రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడుతుందని భావించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు కొలువుదీరడంలో జరిగిన ఆలస్యం ఈ ఎన్నికల జాప్యానికి దారితీసింది. దీంతో క్యాంపులకు తీసుకెళ్లిన నేతల జేబులు ఖాళీ అయ్యాయి. ఎంపీటీసీ సభ్యుల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేమని భావించిన చైర్మన్ అభ్యర్థులు ఇంటి ముఖం పట్టారు. కాగా, ఎన్నికల ప్రక్రియ ఆలస్యం కావడంతో పలు మండలాల్లో బలాబ లాల్లో తేడా వచ్చింది. కొన్ని చోట్ల ఫిరాయింపు రాజకీయాలకు తెరలేచింది. ఆపరేషన్ ఆకర్ష్‌తో ప్రత్యర్థుల శిబిరాల్లో చేరిపోయారు. మండల పరిషత్‌లో ఆయా పార్టీల బలాబలాలు! హంగ్: మంచాల, మొయినాబాద్, కుల్కచర్ల, పూడూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, షాబాద్, చేవెళ్ల, కందుకూరు, ఘట్కేసర్, కీసర, మోమిన్‌పేట, రాజేంద్రనగర్, మర్పల్లి టీఆర్ఎస్: దోమ, గండేడ్, బషీరాబాద్, తాండూరు, యాలాల, పరిగి, వికారాబాద్ కాంగ్రెస్: శామీర్‌పేట, ధారూరు, బంట్వారం, శంకర్పల్లి, పెద్దేముల్, నవాబ్‌పేట, మహేశ్వరం బీజేపీ-టీడీపీ: హయత్‌నగర్, మేడ్చల్, కీసర, శంషాబాద్, కుత్బుల్లాపూర్