తొండంగి :మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణం సోమవారం వైఎస్సార్ సీపీ, టీడీపీ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదంతో దద్దరిల్లింది. సోమవారం మధ్యాహ్నం మండల పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం జరుగుతుందని ఎంపీడీఓ నిర్ణయించిన నేపథ్యంలో, అందులో పాల్గొనేందుకు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మండల పరిషత్ కార్యాలయానికి వచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం ప్రారంభించాల్సి ఉండగా, ఎమ్మెల్యే అరగంట ముందుగానే కార్యాలయానికి వచ్చారు.
ఆయనకు అక్కడున్న వివిధ గ్రామాలకు చెందిన వృద్ధులు తమకు పింఛను అందడంలేదని గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై ఎంపీడీఓ భమిడి శివమూర్తిని పింఛనుదారులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నించారు. ఎంపీడీఓ స్పందిస్తూ జన్మభూమి కమిటీ నిర్ణయం మేరకే పింఛన్లు మంజూరు చేస్తున్నామనడంతో, అక్కడివారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మండల పరిషత్ సమావేశంలో చర్చిస్తానంటూ ఎమ్మెల్యే రాజా చెప్పడంతో వారు శాంతించారు. ఎమ్మెల్యే కోరిక మేరకు సభ నిర్వహణకు ఎంపీడీఓ ఏర్పాట్లు చేశారు. ఎంపీపీ చిట్టిమూరి సంధ్య, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లను సమావేశానికి హాజరుకావాలని కోరారు.
ఈలోగా టీడీపీకి చెందిన కొందరు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లకు బదులు అనధికార వ్యక్తులు సమావేశానికి వచ్చారని, వారిని బయటకు రప్పించాలంటూ వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఎంపీడీఓను పట్టుబట్టారు. ఈ క్రమలో అక్కడున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. వైఎస్సార్ సీపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అదికాస్తా తోపులాటకు దారితీసింది. ఎస్సై బి.కృష్ణమాచారి, ఏఎస్సై భగీరథుడు ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. సమావేశ హాలులో ఉన్న ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు బయటకు వచ్చి, ఎంపీపీ కార్యాలయంలోకి వెళ్లారు. అనంతరం ఏవీ నగరం, ఎ.కొత్తపల్లి, బెండపూడి తదితర గ్రామాలకు చెందిన పింఛనుదారులు మండల పరిషత్ భవన ప్రాంగణంలో బైఠాయించారు. అర్హత ఉన్నా తమకెందుకు పింఛన్లు ఇవ్వడంలేదంటూ ఎంపీడీఓ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈలోగా ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు బయటకు వెళ్లిపోయారు. సభను నిర్వహిస్తే ఆయా సమస్యలపై చర్చించేందుకు ఎమ్మెల్యే రాజా దాదాపు రెండు గంటల సేపు అక్కడే వేచి ఉన్నారు. అనంతరం సభ నిర్వహణ విషయమై ఎంపీడీఓను ఎమ్మెల్యే రాజా వివరణ కోరారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో వాగ్వాదం నేపథ్యంలో సభను ఎంపీపీ వాయిదా వేసినట్టు ఎంపీడీఓ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. త్వరలో సభను సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. సర్వసభ్య సమావేశ నిర్వహణలో ఎంపీడీఓ తీరుపై ఎమ్మెల్యే రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పథకాల అమలు, పింఛన్లు, ఇతర పనులపై తనకు సమగ్ర నివేదిక అందజేయాలన్నారు.
పథకం ప్రకారమే!
మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో వైఎస్సార్ సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తిన నేపథ్యంలో.. టీడీపీ వర్గీయులు దాడి చేసేందుకు ముందుగానే కర్రలు, వికెట్లు, క్రికెట్ బ్యాట్లు సిద్ధం చేసుకున్నారని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించారు. మండల పరిషత్ భవనం వెనుక ఉన్న బ్యాట్లు, వికెట్లు, కర్రలను పోలీసులకు చూపించారు. ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావులేకుండా ఇరువర్గాల వారిని పోలీసులు నియంత్రించారు.
మండల పరిషత్ వద్ద ఉద్రిక్తత
Published Tue, Jul 28 2015 1:58 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement