సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 20–25 తేదీల మధ్య పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో తొలి విడత లోక్‌సభ ఎన్నికలు ముగిసిన కొన్ని రోజులకే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ జారీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ఎస్‌ఈసీ ఇప్పటికే ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు వేగవంతం చేసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాల్సిందిగా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, సీఈవోలు, డీపీవోలు, ఎండీపీవోలకు ఎస్‌ఈసీ ఆదేశాలిచ్చింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాలను ఆదివారం సిద్ధం చేయాలని సూచించింది. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి ఏవైనా మార్పుచేర్పులు, అభ్యంతరాలు ఇతర అంశాలు పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఈ నెల 20న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించాక ఆ వెంటనే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎస్‌ఈసీ విడుదల చేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే పూర్తయిన ప్రక్రియలు...
మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలకమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను ముందుగానే పూర్తి చేశారు. రాష్ట్రంలోని 32 జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పీపీ) చైర్మన్లు, మిగతా మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ) అధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేసి ప్రకటించింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కేటాయించింది. ఈ జాబితాను ఎస్‌ఈసీకి కూడా పీఆర్‌శాఖ అందజేసింది. దీంతో పరిషత్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తిచేయడంపై ఎస్‌ఈసీ దృష్టి పెట్టింది. జిల్లాలు, మండలాలవారీగా ఎన్నికలకు అవసరమైన సిబ్బంది కేటాయింపును పూర్తి చేశారు. ఈ నెల 15–20లోగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ప్రక్రియను పూర్తి చేసేందుకు కలెక్టర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గత జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో అదే తరహాలో ఈ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, అవసరమైన అధికారులు, సిబ్బంది నియామకం, ఇతరత్రా కసరత్తు పూర్తి చేసేందుకు ఎస్‌ఈసీ సిద్ధమవుతోంది.
పేపర్ బ్యాలెట్‌తోనే ఎన్నికలు
స్థానిక సంస్థల ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)తో నిర్వహించాలని ఎస్‌ఈసీ తొలుత భావించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు కూడా పంపించింది. అయితే పలు విడతలుగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఈవీఎంలు తగిన సంఖ్యలో అందుబాటులో లేక పరిషత్ ఎన్నికల నిర్వహణను గతంలో నిర్వహించినట్లుగా పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 20 తర్వాత నోటిఫికేషన్ వెలువడితే మే 8వ తేదీలోగా మొదటి విడత, మే 16లోగా రెండో విడత ఎన్నికలు జరుగుతాయి.
మే 27 వరకు ఎన్నికల కోడ్
లోక్‌సభ ఎన్నికల కోడ్ వచ్చే నెల 27 వరకు ఉండటంతో ఆ లోగానే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 11న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తయినా వచ్చే నెల 23నే ఫలితాలు వెలువడనున్నాయి. స్థానిక సంస్థలకు మరో కోడ్ అడ్డంకి లేకుండా ఉండేందుకే ప్రభుత్వం వెంటనే ఈ ఎన్నికలు నిర్వహించనుంది. జూలై 3, 4 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీపీ, ఎంపీపీల పదవీకాలం ముగిసిన వెంటనే కొత్త జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీ అధ్యక్షులతో కూడిన పాలకవర్గాలు జిల్లాలు, మండలస్థాయిల్లో పగ్గాలు చేపట్టనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment