=ఈ నెల 28న నోటిఫికేషన్
=నవంబర్ 3 వరకు అభ్యంతరాల స్వీకరణ
=12న తుది జాబితా ప్రచురణ
సాక్షి, విశాఖపట్నం : మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మళ్లీ కదిలింది. తాజాగా ప్రభుత్వం రీషెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం నవంబర్ 12న తుది జాబితా ప్రచురించాల్సి ఉంది. ఈ మేరకు కసరత్తు ఊపందుకుంది. 2011 జనా భా గణాంకాల ప్రకారం ఇప్పటికే ఎంపీటీసీ స్థానాల లెక్క తేల్చారు. గతంలో 649 ఎంపీటీసీ స్థానాలుండగా తాజాగా రెండు పెరిగి 651కి చేరాయి. వాస్తవానికి ఎంపీటీసీల పునర్విభన నోటిఫికేషన్ ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల చేయాల్సి ఉంది.
కానీ ఇంతలో ఉద్యోగులంతా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమ్మెకు దిగడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా ఉద్యోగులు విధుల్లోకి చేరడంతో పునర్విభజనకు ప్రభుత్వం మళ్లీ షెడ్యూల్ ఖరారు చేసింది. ఇందులోభాగంగా ఈ నెల 28న డ్రాఫ్టు పబ్లికేషన్ ఇవ్వనున్నారు. ఆ రోజు నుంచి నవంబర్ 3 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. నవంబర్ 4 నుంచి 11 వరకు అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం చేయనున్నారు. అదే నెల 12న తుది జాబితా ఖరారు చేస్తారు.
ఎంపీటీసీల గణన ఇలా..
2001 జనాభా ఆధారంగా 2006లో జరిగిన ఎన్నికల్లో ఎంపీటీసీల పునర్విభజన చేయగా త్వరలో జరిగే ఎన్నికలకు 2011 జనాభా ఆధారంగా పునర్విభజన చేశారు. జనాభా మూడు వేలు తగ్గకుండా నాలుగు వేలకు మించకుండా ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు. ఒక ఎంపీటీసీ ఒక పంచాయతీకి పరిమితమయ్యేలా విభజించారు. ఈ లెక్కన 22.81 లక్షలకు జనాభాకు జిల్లాలో 651 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి కొత్తగా 27 స్థానాలు ఏర్పడ్డాయి.
కానీ యలమంచిలి, నర్సీపట్నం పరిసర ప్రాంతాలు మున్సిపాల్టీల్లోకి విలీనం కావడం, పరవాడ, అనకాపల్లి, భీమిలికి చెందిన పలు గ్రామాలు జీవీఎంసీలో విలీనం కావడంతో ఆయా ఎంపీటీసీ స్థానాలన్నీ రద్దయ్యాయి. విలీన పంచాయతీల కారణంగా తగ్గిన లోటును పెరిగిన జనాభా భర్తీ చేసింది. లేదంటే గతం కన్న ఎంపీటీసీ స్థానాలు తగ్గిపోయేవి.