munsipalti
-
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు గ్రహీతలకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: స్వచ్ఛ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్– 2022లో ఆంధ్రప్రదేశ్‌కు వివిధ కేటగిరీల్లో 11 అవార్డులు వచ్చాయి. ఈ క్రమంలో అవార్డులు అందుకున్న కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్మన్లు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ► గార్బెజ్ ఫ్రీ సిటీస్ అవార్టు కేటగిరీలో 5 స్టార్ రేటింగ్ అవార్డుతో పాటు, సఫాయి మిత్ర సురక్షిత్ షెహర్ కేటగిరీలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అవార్డు గెల్చుకుంది. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ ఆర్ శిరీష, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, తిరుపతి కమిషనర్ అనుపమ అంజలిని అభినందించారు సీఎం వైఎస్ జగన్. ► గార్బెజ్ ఫ్రీ సిటీస్ అవార్టు కేటగిరీలో 5 స్టార్ రేటింగ్ అవార్డుతో పాటు బిగ్ క్లీన్ సిటీ కేటగిరీలో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అవార్డు సాధించింది. డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, సతీష్, కమిషనర్ రాజబాబు, అడిషనల్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ సన్యాసిరావు, జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాస్త్రీలను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ► క్లీన్ స్టేట్ క్యాపిటల్ కేటగిరీలో విజయవాడ అవార్డు గెల్చుకుంది. ఈ క్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్, అడిషనల్ కమిషనర్ కె వి సత్యవతిలను అభినందించారు సీఎం వైఎస్ జగన్. ► 50 వేల నుంచి 1 లక్ష లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించి ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ కేటగిరీలో పులివెందుల మున్సిపాలిటీకి అవార్డు వచ్చింది. అవార్డు అందుకున్న పులివెందులు మున్సిపాలిటీ ఛైర్మన్ వి వరప్రసాద్, వైస్ ఛైర్మన్లు వైయస్.మనోహర్‌రెడ్డి, హఫీజుల్లా, కమిషనర్ వి వి నరసింహారెడ్డిలను అభినందించారు సీఎం వైఎస్.జగన్. ► 50 వేల నుంచి 1 లక్ష లోపు జనాభా ఉన్న మున్సిపాల్టీలకు సంబంధించి సిటిజన్ ఫీడ్ బ్యాక్ కేటగిరీలో పుంగనూరు మున్సిపాలిటీ అవార్డు గెల్చుకుంది. ఈ సందర్భంగా ఛైర్మన్ అలీమ్ భాషా, కమిషనర్ నరసింహ ప్రసాద్‌లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశంసించారు. ► ఇండియన్ స్వచ్ఛతా లీగ్ కేటగిరీలో(15వేలలోపు జనాభా) స్పెషల్ మెన్షన్ అవార్డు సాధించిన పొదిలి మున్సిపల్ కమిషనర్ కె డేనియల్ జోసఫ్, మున్సిపల్ మేనేజర్ ఎస్ వి శ్రీకాంత్‌రెడ్డిలను అభినందించారు సీఎం వైఎస్ జగన్. ► ఇండియన్ స్వచ్ఛతా లీగ్ కేటగిరీ(లక్ష నుంచి 3 లక్షలలోపు జనాభా)లో స్పెషల్ మెన్షన్ అవార్డు సాధించిన శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేశు, మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జి వెంకటరావులను అభినందించారు సీఎం వైఎస్ జగన్. ► 25 వేల నుంచి 50 వేలులోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించి ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ కేటగిరీలో సాలూరు మున్సిపాలిటీకి అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఛైర్పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ, కమిషనర్ హనుమంతు శంకరరావులను అభినందించారు సీఎం వైయస్.జగన్. కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, ఏపీయూఎఫ్ఐడీసీ ఎండీ లక్ష్మీషా, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ డాక్టర్ పి సంపత్ కుమార్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఛైర్పర్సన్ పి దేవసేన, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ సీఓఓ కిరణ్ కుమార్, టీం లీడర్ పాతూరు సునందలు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన 2021 బ్యాచ్ ఐఏఎస్ ప్రొబేషనర్స్ -
పెద్దపల్లిలో.. ఇక పురపోరు
సాక్షి, పెద్దపల్లి: అసెంబ్లీతో మొదలైన ఓట్ల జాతర ఆరు నెలలుగా కొనసాగుతునే ఉంది. సర్పంచ్ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీపీటీసీ పోలింగ్, కౌంటింగ్ సైతం ముగిసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీలు తమ ఉనికి చాటుకునేందుకు ఎన్నికల్లో పోటీకి దిగాయి. ప్రాదేశిక ఫలితాల్లో కారు హవా కనిపించింది. జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాల్లో రెండు టీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. మంథని మాత్రం కాంగ్రెస్ ఖాతాలో కొనసాగుతుంది. ఆ తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఇకమిగిలిన మున్సిపాలిటీ గురించి రాజకీయ సమీకరణలకు అధికారపార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెరతీశాయి. నాలుగు మున్సిపాలిటీలు జిల్లాలోని రామగుండం మున్సిపల్కార్పొరేషన్తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బలం పుంజుకోవడంతో పట్టణాలు, నగరాల్లోపాగా వేసేందుకు ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహం చూపుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకపోయిననా ఎన్నికల కోసం ఆయా పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. పట్టణాల పైనే ఎక్కువ దృష్టిసారిస్తున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో నిన్నటి రాజకీయ బలాబలాలు పరిశీలిస్తే రామగుండంలో ప్రస్తుతం టీఆర్ఎస్ మేయర్ రాజమణి కొనసాగుతున్నారు. పెద్దపల్లిలో టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ ఎల్.రాజయ్య ఉన్నారు. మంథనిలో నిన్నటివరకు పుట్టమధు భార్య పుట్ట శైలజ మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా పనిచేశారు. మున్సిపాలిటీ ఏర్పాటుతో మంథనిలో ఎన్నికలు నిలిచిపోయాయి. సుల్తానాబాద్‌లో మాత్రం కాంగ్రెస్ నాయకులు అంతటి అన్నయ్యగౌడ్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన కాలంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడింది. ప్రస్తుతం జిల్లాలో నాలుగుచోట్ల మున్సిపల్ ఎన్నికలు జరుగనుండడంతో రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించారు. ప్రభుత్వం నుంచి ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల కావచ్చని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఖరారుపై అన్ని రాజకీయ పార్టీలు ఒక్కొ స్థానంలో ఇద్దరు, ముగ్గురు చొప్పున నాయకుల పేర్లను పరిశీలనకు తీసుకుని వారికి సంబంధించిన వ్యక్తిగత, ఆర్థిక బలాలపై లెక్కలు కడుతున్నారు. వార్డుల విభజనకు కసరత్తు మున్సిపల్‌వార్డుల విభజన, రిజర్వేషన్లకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందడమే తరువాయిగా రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు మున్సిపల్ అధికారులు ఎదురు చూస్తున్నారు. పెద్దపల్లి నగరపంచాయతీ నుంచి పూర్తిస్థాయి మున్సిపాలిటీగా ఏడాది క్రితమే అవతరించింది. 29,604 ఓటర్లు, 41,171 జనాభా కలిగిన పెద్దపల్లిలో రంగంపల్లి, బందంపల్లి, చందపల్లి గ్రామాలను ఏడాదిక్రితం ప్రభుత్వం విలీనం చేసింది. దీంతో వార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రామగుండం కార్పొరేషన్లో సైతం సమీప గ్రామాలను విలీనం చేశారు. ఇక్కడ కూడా డివిజన్ల సంఖ్య పెరుగనుంది. కొత్త చట్టంపై సందిగ్ధం మున్సిపాలిటీల గడువు జూన్ మొదటివారంతో ముగుస్తుంది. ఇప్పటికే జిల్లాలో మంథని, సుల్తానాబాద్ స్పెషల్ ఆఫీసర్లపాలనలో ఉన్నాయి. ఇక పెద్దపల్లి, రామగుండంలో జూన్మొదటివారంతో మున్సిపాలిటీ పదవీకాలం ముగుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీ చట్టాన్ని మార్చేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విధానం ప్రత్యక్షమా.. పరోక్షమా.. మున్సిపల్ చట్టాల్లో చేయాల్సిన మార్పులపై తర్జనబర్జన పడుతున్నారు. దీంతో గడువులోగా ఎన్నికలు జరుగకపోవచ్చని అంటున్నారు. మున్సిపల్ గడువు ముగిసి స్పెషల్ ఆఫీసర్ల చేతిలో మరో మూడు, నాలుగు నెలలు పాలన ఉండవచ్చని అప్పటిలోగా కొత్త చట్టాన్ని రూపొందించి దాని ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు 20.. విభజనతో 34.. పెద్దపల్లిలోని మున్సిపాలిటీలో రోడ్లను, వీధులను బట్టి వార్డులను నిర్ణయించారు. కొన్ని వార్డుల్లో 1300 ఓటర్లు, కొన్ని వార్డులో 1800 ఓటర్లు ఉన్నారు. అయితే ఈసారి అన్ని వార్డులకు సమాన ఓటర్లు సూత్రంగా వార్డులను నిర్ణయించనున్నారు. ప్రస్తుతం ప్రతీ పోలింగ్ స్టేషన్‌కు 1200ల నుంచి 800 ఓటర్లకు తగ్గించి వార్డులను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. పెద్దపల్లిలో ప్రస్తుతం 20 వార్డులు ఉండగా పెరిగిన ఓటర్లు.. పునర్విభజనతో సంఖ్య 34కు పెరిగే అవకాశం ఉంది. రామగుండం కార్పొరేషన్లో ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లనే కొనసాగించడానికి అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. అంతకు మించి డివిజన్‌ను పెంచే అవకాశం లేదంటున్నారు. సుల్తానాబాద్, మంథనిలో ప్రస్తుతం ఉన్న వార్డులను కొనసాగించనున్నారు. -
మున్సిపాల్టీల్లో సోలార్ విద్యుత్
విజయనగరం మున్సిపాలిటీ: విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గల విజయనగరం, బొబ్బిలి, రాజాం మున్సిపాలిటీల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నట్లు కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. గురువారం విజయనగరం మున్సిపాలిటీకి సంబంధించి ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్‌పై నెడ్‌క్యాప్ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌ను పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో రూ.52 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్‌కు ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేయగా.. మిగిలిన రూ.42 లక్షలను మున్సిపాలిటీ పెట్టుకుందన్నారు. తద్వారా నెలకు రూ.67, 500 విద్యుత్ బిల్లు ఆదా అవుతుందని, ఇప్పటికే వేసిన ఎల్ఈడీల వినియోగం ద్వారా 54శాతం విద్యుత్ ఆదా అవుతున్నట్లు చెప్పారు. ఓ వైపు అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తూనే మరో వైపు సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించడంపై కేంద్రమంత్రిని ప్రశ్నించగా.. జర్మనీ మినహా మిగిలిన అన్ని దేశాలు అణువిద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. అలాగే భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయంటూ అడిగిన మరో ప్రశ్నకు ఆయన మాటదాటవేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, కమిషనర్ జి.నాగరాజు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
మాచర్ల టీడీపీలో ఆధిపత్య పోరు !
► పట్టణ మున్సిపాల్టీలో యుద్ధవాతావరణం ► కత్తులు దూసుకుంటున్న చైర్మన్, వైస్‌చైర్మన్ వర్గాలు ► మాట వినని అధికారులపై ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయింపు అధికార పార్టీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఉన్నతాధికారులకు శాపంగా మారాయి. జిల్లాలోని మాచర్ల మున్సిపాల్టీలో ఉద్యోగం అంటేనే అధికారులు హడలిపోతున్నారు. మా కొద్దు బాబోయ్ మాచర్ల అంటూ పరారవుతున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ వర్గాల మధ్య వైరానికి అధికారులు బలవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో జైలు ఊసలు లెక్కిస్తున్నారు. మున్సిపాల్టీలో రూ. 4 కోట్లకు పైగా నిధులు ఉన్నా ప్రజల గొంతు తడవని దుస్థితి నెలకొనడం ఇక్కడి దారుణాలకు దర్పణం పడుతోంది. టీడీపీ నేతలే అభివృద్ధి నిరోధకులుగా మారారని మాచర్ల పట్టణం కోడై కూస్తోంది. సాక్షి, గుంటూరు : మాచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ వర్గాల మధ్య నెలకొన్న అంతర్యుద్ధానికి ఇప్పటికే అనేక మంది అధికారులు అన్యాయానికి గురయ్యారు. మాట వినని అధికారులపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురిజేస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ముగ్గురు కమిషనర్లు, ఒక డీఈఈపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కావడం ఇక్కడి దారుణ పరిస్థితిని కళ్లకు కడుతోంది. రెండు గ్రూపులుగా కౌన్సిలర్లు... మాచర్లలో జరిగిన ఉప ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోటీ చేసి ఓటమిపాలైన మధుబాబు, చలమారెడ్డిలను ఇన్చార్జిలుగా నియమిస్తూ టీడీపీ నిర్ణయించింది. దీంతో ఇద్దరు ఇన్చార్జిలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ మున్సిపల్ కౌన్సిలర్లను రెండు గ్రూపులుగా చీల్చేశారు. అంతటితో ఆగకుండా తమ ప్రతాపాన్ని మున్సిపల్ అధికారులపై చూపుతూ వస్తున్నారు. రెండేళ్ళ వ్యవధిలో మున్సిపాలిటీకి ఐదుగురు కమిషనర్లు మారడం ఇక్కడి దారుణ పరిస్థితిని తెలియజేస్తోంది. కమిషనర్‌ను నియమించడం ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. మున్సిపాల్టీలో రూ. 4 కోట్లకు పైగా నిధులున్నా అభివృద్ధికి అధికారపార్టీ నేతలే అడ్డంకిగా మారారు. కేసులు నమోదైన అధికారులు వీరే.. కయ్యానికి కాలు దువ్వుతున్న చైర్మన్, వైస్‌చైర్మన్ వర్గాలు తమ మాట వినని అధికారులపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు దిగుతున్నాయి. ఎన్నికలు ముగిసిన తరువాత కమిషనర్‌గా ఉన్న మురళీకృష్ణను బదిలీ చేయించిన చైర్మన్ వర్గం అజయ్కిషోర్కు పోస్టింగ్ వేయించారు. ఆయన చైర్మన్ వర్గానికి కొమ్ముకాస్తున్నారనే కోపంతో వైస్ చైర్మన్ వర్గం ఆయనపై ఓ ఎస్సీ కౌన్సిలర్ చేత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు. దీంతో కమిషనర్ అజయ్‌కిషోర్ జైలుపాలై అక్కడ నుంచి వెళ్లిపోయారు. తమకు అనుకూలంగా వ్యవహరించే కమిషనర్‌ను జైలుకు పంపారనే కక్షతో ఇన్చార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్న డీఈ సీతారామారావుపై చైర్మన్ వర్గం ఎస్సీ మహిళతో ఫిర్యాదు చేయించారు. ఆయనపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అనంతరం వైస్ చైర్మన్ వర్గం డీఈ కొండారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి ఆయన్నూ బదిలీ చేయించారు. తామేమీ తక్కువ తినలేదన్నట్లు చైర్మన్ వర్గం సైతం కమిషనర్ శ్రీనివాసులుపై శానిటరీ వర్కర్ చేత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి సాగనంపారు. ప్రస్తుతం రెవెన్యూ అధికారి ప్రభాకర్ ఇన్చార్జి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరో వైపు అధికారపార్టీ నేతల వేధింపులు తాళలేక ఏడాది కిందట మేనేజర్ మురళీ బదిలీపై వెళ్ళడంతో ఇక్కడకు వచ్చేందుకు ఎవరూ సుముఖత చూపడం లేదు. దీంతో ఆ పోస్టుకు ఎవరూ రాక ఇప్పటికీ ఖాళీగానే ఉంది. పోస్టింగ్‌ల కోసం ఎదురుచేసే అధికారులు సైతం మాచర్ల మున్సిపాలిటీకి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. -
జన్మభూమి సమన్వయ కమిటీలు
కాకినాడ సిటీ : జిల్లాలో ఈనెల 2 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించేందుకు జిల్లా, మండల, డివిజన్, పంచాయతీ, మున్సిపాల్టీ, కార్పొరేషన్ స్థాయిల్లో ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ నీతూ ప్రసాద్ మంగళవారం ప్రకటించారు. జిల్లాస్థాయి కమిటీకి జిల్లా మంత్రులు అధ్యక్షులుగాను, కలెక్టర్, డ్వామా, డీఆర్డీఏ, మెప్మా ప్రాజెక్ట్ డెరైక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, పశుసంవర్థకశాఖ జేడీ సభ్యులుగా ఉంటారని, జేడ్పీ సీఈఓ కన్వీనర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. మండల స్థాయి కమిటీలో ఎంపీపీ, మున్సిపాల్టీ స్థాయిలో మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్‌స్థాయి కమిటీలో మేయర్ అధ్యక్షులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌నుంచి కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 2 నుంచి 20వ తేదీ జన్మభూమి- మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఇందులో పేదరికంపై గెలుపు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, నీరు-చెట్టు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే ఐదు అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి రంపచోడవరం ఎంపీడీఓ టిఎస్.విశ్వనాద్ సామాజిక భద్రతా పింఛను పథకానికి ‘ఎన్టీఆర్ భరోసా’ పేరును ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనిపై ముఖ్యమంత్రి ఎంపీడీఓను అభినందించి పథకానికి ఆపేరును ప్రకటించారు. మరో మూడు మాసాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలన్నిటినీ ఆన్లైన్ చేసేందుకు ఐటిని పూర్తిగా వినియోగించుకునే చర్యల్లో బాగంగా మొదటి దశ కింద జిల్లా అధికారులు మొదలు, ఎండీఓ, తహశీల్దార్ తదితర 10వేల మంది అధికారులకు టాబ్లెట్ పీసీలు, ఐప్యాడ్లను అందించనున్నట్టు సీఎం వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ నీతూ ప్రసాద్, జేసీ ఆర్.ముత్యాలరాజు, డీఆర్వో బి.యాదగిరి, జెడ్పీసీఈవో ఎంఎస్ భగవాన్‌దాస్ తదితరులు పాల్గొన్నారు. -
నిధుల కుమ్మరింపు
=ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎర =మొన్న పంచాయతీ, మండలాలకు.. =ఇప్పుడు మున్సిపాల్టీలకు ఎస్సీ,ఎస్టీ నిధులు సాక్షి, విశాఖపట్నం : ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కుమ్మరిస్తోంది. పోయిన ప్రతిష్టను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. అభివృద్ధి పనులంటూ ఓటర్లను ఆకట్టుకోవాలని యోచి స్తోంది. ఏళ్ల తరబడి ఇవ్వని నిధుల్ని ఇప్పుడు విడుదల చేస్తోంది. మొన్నటికి మొన్న పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లకు ఆఘమేఘాల మీద 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులిచ్చిన సర్కార్ తాజాగా మున్సిపాల్టీలకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేసింది. షార్ట్ టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించింది. ఎంత వేగంగా జనాల్లోకి వెళితే అంత మంచిదని అధికారులకు సూచించింది. పెరిగిన ధరలు, మోయలేని చార్జీల భారంతో కాంగ్రెస్ ప్రభుత్వమంటేనే జనం విసిగిపోతున్నారు. దీనికితోడు రాష్ట్ర విభజన నిర్ణయం ప్రభుత్వానికి పిడుగుపాటైంది. రోజురోజుకు ప్రజల్లో కాంగ్రెస్ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో పార్టీ ప్రతిష్టను కాపాడుకునేందుకు ‘చేతి’లో ఉన్న అస్త్రాలన్నింటిని ప్రభుత్వం ప్రయోగిస్తోంది. ఏళ్ల తరబడి ఉంచుకున్న నిధులను ఎకాయెకిన విడుదల చేస్తోంది. ఇటీవల పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం కింద రూ.12.21కోట్లు విడుదల చేసింది. అలాగే మండల పరిషత్‌లకు రూ.1.94కోట్లు, జిల్లా పరిషత్‌కు రూ.5.25కోట్లు విడుల చేసింది. అలాగే తలసరి గ్రాంటు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు, సీనరేజి గ్రాంట్ విడుదల చేసింది. ఇప్పుడు మున్సిపాల్టీల వంతు వచ్చింది. సబ్ ప్లాన్ చట్టం ఆమోదం పొందిన ఏడాది తర్వాత ఆ పద్దు కింద నిధులు విడుదల చేసింది. జిల్లాలోని మున్సిపాల్టీలన్నింటికీ స్టేట్ ఫైనాన్స్ కమిషన్(ఎస్సీ, ఎస్టీ) స్లబ్ ప్లాన్ కింద రూ.8.07కోట్లు, అంతర రహదారులకు రూ.7.54కోట్లు విడుదలయ్యాయి. వీటితో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోనే రహదారులు, కమ్యూనిటీ టాయిలెట్లు, తాగునీటి పైపులైన్లు, వీధిలైట్లు పనులు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. త్వరితగతిన టెండర్లు పిలిచి, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో అభివృద్ధి పనులకు మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. కానీ మంత్రులు, ఎమ్మెల్యేల లోపాయికారీ ఆదేశాల మేరకు ఆయా పనులకు షార్ట్ టెండర్లు పిలిచి, కాంగ్రెస్ నేతలకే దక్కేలా వ్యూహరచన చేస్తున్నాన్న ఆరోపణలు ఉన్నాయి. -
ఎంపీటీసీల పునర్విభజన రీషెడ్యూల్ ఖరారు
=ఈ నెల 28న నోటిఫికేషన్ =నవంబర్ 3 వరకు అభ్యంతరాల స్వీకరణ =12న తుది జాబితా ప్రచురణ సాక్షి, విశాఖపట్నం : మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మళ్లీ కదిలింది. తాజాగా ప్రభుత్వం రీషెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం నవంబర్ 12న తుది జాబితా ప్రచురించాల్సి ఉంది. ఈ మేరకు కసరత్తు ఊపందుకుంది. 2011 జనా భా గణాంకాల ప్రకారం ఇప్పటికే ఎంపీటీసీ స్థానాల లెక్క తేల్చారు. గతంలో 649 ఎంపీటీసీ స్థానాలుండగా తాజాగా రెండు పెరిగి 651కి చేరాయి. వాస్తవానికి ఎంపీటీసీల పునర్విభన నోటిఫికేషన్ ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇంతలో ఉద్యోగులంతా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమ్మెకు దిగడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా ఉద్యోగులు విధుల్లోకి చేరడంతో పునర్విభజనకు ప్రభుత్వం మళ్లీ షెడ్యూల్ ఖరారు చేసింది. ఇందులోభాగంగా ఈ నెల 28న డ్రాఫ్టు పబ్లికేషన్ ఇవ్వనున్నారు. ఆ రోజు నుంచి నవంబర్ 3 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. నవంబర్ 4 నుంచి 11 వరకు అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం చేయనున్నారు. అదే నెల 12న తుది జాబితా ఖరారు చేస్తారు. ఎంపీటీసీల గణన ఇలా.. 2001 జనాభా ఆధారంగా 2006లో జరిగిన ఎన్నికల్లో ఎంపీటీసీల పునర్విభజన చేయగా త్వరలో జరిగే ఎన్నికలకు 2011 జనాభా ఆధారంగా పునర్విభజన చేశారు. జనాభా మూడు వేలు తగ్గకుండా నాలుగు వేలకు మించకుండా ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు. ఒక ఎంపీటీసీ ఒక పంచాయతీకి పరిమితమయ్యేలా విభజించారు. ఈ లెక్కన 22.81 లక్షలకు జనాభాకు జిల్లాలో 651 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి కొత్తగా 27 స్థానాలు ఏర్పడ్డాయి. కానీ యలమంచిలి, నర్సీపట్నం పరిసర ప్రాంతాలు మున్సిపాల్టీల్లోకి విలీనం కావడం, పరవాడ, అనకాపల్లి, భీమిలికి చెందిన పలు గ్రామాలు జీవీఎంసీలో విలీనం కావడంతో ఆయా ఎంపీటీసీ స్థానాలన్నీ రద్దయ్యాయి. విలీన పంచాయతీల కారణంగా తగ్గిన లోటును పెరిగిన జనాభా భర్తీ చేసింది. లేదంటే గతం కన్న ఎంపీటీసీ స్థానాలు తగ్గిపోయేవి. -
విలీన గ్రామాలకు క‘న్నే’ళ్లే’!
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్లో తాజాగా విలీనమైన 35 గ్రామ పంచాయతీలకు పానీపరేషాన్ తథ్యమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మంచినీటి వనరుల లభ్యత, స్టోరేజి రిజర్వాయర్లు, సరఫరా నెట్వర్క్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం విలీనానికి శ్రీకారం చుట్టడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. కనీసం ఈ విషయంలో జలమండలిని మాటమాత్రంగానైనా సంప్రదించకపోవడం సర్కారు అనాలోచిత చర్యలకు అద్దంపడుతోంది. జీహెచ్ఎంసీలో 2007లో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీలకే తాగునీరు, డ్రైనేజీ తదితర సదుపాయాలు కల్పించలేని దుస్థితి. ఆయా మున్సిపాల్టీల పరిధిలోని 870 కాలనీలు, బస్తీలకు స్టోరేజి రిజర్వాయర్లు, మంచినీటి సరఫరా నెట్వర్క్, భూగర్భ డ్రైనేజి వసతులు ఇప్పటివరకు ఏర్పాటు కాలేదు. దీంతో సుమారు 35 లక్షలమంది శివారు ప్రజలు మంచినీటి కొనుగోలుకు నెలకు రూ.100 కోట్లు ఖర్చు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. వారి మురుగు నీరు సైతం ఇళ్లలోని సెప్టిక్ ట్యాంకుల్లోనే మగ్గుతోంది. ఆరేళ్ల కిందట విలీనమైన వాటి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక తాజాగా కలిసిన 35 పంచాయతీల పరిస్థితి ఎలా ఉంటుందో సులభంగా అర్థంచేసుకోవచ్చు. ఈ పంచాయతీల్లోని సుమారు 12 లక్షల మందికి కొన్నేళ్లపాటు కన్నీళ్లుతప్పవని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల పరిధిలోని జనం బోరుబావులను ఆశ్రయించి బావురు మనక తప్పదని స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు మురుగు నీటిపారుదల వ్యవస్థ (డ్రైనేజి నెట్వర్క్) ఏర్పాటుపైనా ప్రభుత్వానికి స్పష్టత లేదని చెబుతున్నారు. తాగునీటి లభ్యత అరకొరే జలమండలి ప్రస్తుతం గ్రేటర్ నగరానికి కృష్ణా, మంజీరా, సింగూరు జలాశయాల నుంచి నిత్యం 300 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుంది. ఇందులో సరఫరా నష్టాలు 33 శాతం పోను వాస్తవ సరఫరా 200 మిలియన్ గ్యాలన్లు మించడం లేదు. కానీ డిమాండ్ 459 మిలియన్ గ్యాలన్లుగా ఉంది. అంటే డిమాండ్, సరఫరా మధ్య ఇప్పటికే 259 మిలియన్ గ్యాలన్ల అంతరం కొనసాగుతోంది. వచ్చే ఏడాది నాటికి కృష్ణా మూడో దశ ద్వారా 90 మిలియన్ గ్యాలన్లు, గోదావరి నీటి పథకం మొదటి దశ ద్వారా మరో 90 మిలియన్ గ్యాలన్ల నీరు గ్రేటర్‌కు తరలించే అవకాశాలున్నాయి. అయినా 79 మిలియన్ గ్యాలన్ల నీటి కొరత తప్పదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విలీనమైన 35 శివారు పంచాయతీలకు తాగునీటి కల్పన కలగానే మారుతుందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కాగితాల్లోనే ప్రతిపాదనలు గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల్లో మంచినీటి స్టోరేజి రిజర్వాయర్లు, పైప్‌లైన్ నెట్వర్క్ విస్తరణకు రూ.3200 కోట్లతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఆయన మరణానంతరం ఏర్పడిన ప్రభుత్వాలు ఈ పథకాలకు చిల్లిగవ్వ విదల్చకపోవడంతో ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరమితమయ్యాయి. అంతేకాదు శివారు మున్సిపాల్టీల పరిధిలో డ్రైనేజి వసతుల కల్పనకు రూ.2500 కోట్లతో 2007లోనే అంచనాలు సిద్ధమయ్యాయి. ఈ పథకాలకూ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో శివార్లు మురుగు కష్టాలతో సతమతమౌతున్నాయి. గోదావరి ఎప్పటికో.. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివార్లలోని శామీర్‌పేట్ వరకు 186 కిలోమీటర్ల మేర తాగునీటిని తరలించాల్సిన గోదావరి మంచినీటి పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. పైప్‌లైన్ పనులు వంద కిలోమీటర్ల మేర పూర్తయినా.. నీటి శుద్ధి కేంద్రాలు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం పనుల్లో 50 శాతమే పూర్తయ్యాయి. సుమారు రూ.3800 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పథకానికి ఇప్పటివరకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేదు. ఈ పథకం మొదటి దశ వచ్చే ఏడా ది చివరినాటికి పూర్తవుతుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నత్తనడకన కృష్ణా మూడోదశ నల్లగొండ జిల్లా కోదండాపూర్ నుంచి నగర శివార్లలోని సాహెబ్‌నగర్ వరకు 110 కిలోమీటర్ల మేర తాగునీటిని తరలించాల్సిన కృష్ణా మూడోదశ పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి. ఆరు నెలలుగా కేవలం పది కిలోమీటర్ల మేర మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఈ పనులను వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి పూర్తిచేసి నగరానికి 90 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తామని జలమండలి వర్గాలు చెబుతున్నా.. పనుల తీరు చూస్తే ఆ నమ్మకం కలగడం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.