నిధుల కుమ్మరింపు | Kummarimpu funds | Sakshi
Sakshi News home page

నిధుల కుమ్మరింపు

Published Sun, Nov 17 2013 5:06 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

Kummarimpu funds

=ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎర
 =మొన్న పంచాయతీ, మండలాలకు..
 =ఇప్పుడు మున్సిపాల్టీలకు ఎస్సీ,ఎస్టీ నిధులు

 
 సాక్షి, విశాఖపట్నం : ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కుమ్మరిస్తోంది. పోయిన ప్రతిష్టను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. అభివృద్ధి పనులంటూ ఓటర్లను ఆకట్టుకోవాలని యోచి స్తోంది. ఏళ్ల తరబడి ఇవ్వని నిధుల్ని ఇప్పుడు విడుదల చేస్తోంది. మొన్నటికి మొన్న పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లకు ఆఘమేఘాల మీద 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులిచ్చిన సర్కార్ తాజాగా మున్సిపాల్టీలకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేసింది.
 
 షార్ట్ టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించింది. ఎంత వేగంగా జనాల్లోకి వెళితే అంత మంచిదని అధికారులకు సూచించింది. పెరిగిన ధరలు, మోయలేని చార్జీల భారంతో కాంగ్రెస్ ప్రభుత్వమంటేనే జనం విసిగిపోతున్నారు. దీనికితోడు రాష్ట్ర విభజన నిర్ణయం ప్రభుత్వానికి పిడుగుపాటైంది. రోజురోజుకు ప్రజల్లో కాంగ్రెస్ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో పార్టీ ప్రతిష్టను కాపాడుకునేందుకు ‘చేతి’లో ఉన్న అస్త్రాలన్నింటిని ప్రభుత్వం ప్రయోగిస్తోంది. ఏళ్ల తరబడి ఉంచుకున్న నిధులను ఎకాయెకిన విడుదల చేస్తోంది.
 
 ఇటీవల పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం కింద రూ.12.21కోట్లు విడుదల చేసింది. అలాగే మండల పరిషత్‌లకు రూ.1.94కోట్లు, జిల్లా పరిషత్‌కు రూ.5.25కోట్లు విడుల చేసింది. అలాగే తలసరి గ్రాంటు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు, సీనరేజి గ్రాంట్  విడుదల చేసింది. ఇప్పుడు మున్సిపాల్టీల వంతు వచ్చింది. సబ్ ప్లాన్ చట్టం ఆమోదం పొందిన ఏడాది తర్వాత ఆ పద్దు కింద నిధులు విడుదల చేసింది. జిల్లాలోని మున్సిపాల్టీలన్నింటికీ స్టేట్ ఫైనాన్స్ కమిషన్(ఎస్సీ, ఎస్టీ) స్లబ్ ప్లాన్ కింద రూ.8.07కోట్లు, అంతర రహదారులకు రూ.7.54కోట్లు విడుదలయ్యాయి.
 
 వీటితో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోనే రహదారులు, కమ్యూనిటీ టాయిలెట్లు, తాగునీటి పైపులైన్లు, వీధిలైట్లు పనులు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. త్వరితగతిన టెండర్లు పిలిచి, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో అభివృద్ధి పనులకు మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. కానీ మంత్రులు, ఎమ్మెల్యేల లోపాయికారీ ఆదేశాల మేరకు ఆయా పనులకు షార్ట్ టెండర్లు పిలిచి, కాంగ్రెస్ నేతలకే దక్కేలా వ్యూహరచన చేస్తున్నాన్న ఆరోపణలు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement