Increased costs
-
కోడిగుడ్డు కుతకుత..
గుడ్డు ధర రూ.5.50 ‘టమాటా’ కోసం రైతుబజార్లో క్యూ అమాంతం పెరిగిన ధరలు సిటీబ్యూరో/ గాజులరామారం/సనత్‌నగర్: పోషకాలు పుష్కలంగా ఉండే కోడిగుడ్డు గొంతు దిగనంటోంది. కూరలోని టమాటా వంటింటికి రానంటోంది. వీటిని కొనాలంటే సామాన్యుడు ఒకటికి పదిసార్లు జేబు తడుముకుని లెక్కలు వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కోడిగుడ్డు ధర పప్పులతో సమానంగా పెకైక్కుతూ ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.5.50కు చేరి బెంబేలెత్తిస్తోంది. మొన్నటి దాకా భయపెట్టిన టమాటా ధర వారం క్రితం దిగివచ్చింది. ఈ వారం మాత్రం రైతు బజార్లకు సరఫరా తక్కువ కావడంతో జనం టమాటా కోసం క్యూకట్టారు. దీంతో అమ్మకందార్లు ధరను పెంచేశారు. కోడిగుడ్డు ఇలా పైపైకి.. కోడి గుడ్డు ధర జూన్ 21 నుంచి కొద్దికొద్దిగా పెరుగుతూ వస్తున్న ధర ఆదివారం ఏకంగా రూ. 5.50 పైసలకు దుకాణాదారులు విక్రయించడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ఆదివారం నాటికి ఫామ్ ధర ఒక గుడ్డు రూ.4.14గా ఉంది. విక్రయ కేంద్రాలను బట్టి దుకాణదారులకు అది రూ. 4.34 నుంచి 4.80 కి లభిస్తుండగా.. రిటైల్ ధర రూ.5.50కు చేరింది. పప్పులు, కూరగాయల ధరలతో కోడిగుడ్డు పోటీ పడుతుండడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు గుడ్డు కొనాలంటే గుడ్లు తేలేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని రేటు.. ఈ ఏడాది గుడ్డు ధర ఫారం రేటు రూ. 4.14గా నమోదవడం ఇది రెండోసారి. 2015 జూన్ 3న గుడ్డు ఒకటికి ఫారం ధర రూ.3.20గా ఉంది. 2009 నుంచి 2015 వరకు జూన్ నెలలో ఒక గుడ్డు ధర ఇంతగా పెరిగిన దాఖలా లేదు. ఉత్ప త్తి తక్కువగా ఉండడం, నిర్వహణ భారంతో ఫామ్‌లు మూతపడుతుండడంతో ఇంతగా రేటు పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. టమాటా కోసం పడిగాపులు మరోవైపు టమాటా కూడా మాట విననంటోంది. బహిరంగ మార్కెట్లో కిలో టమాటాలు రూ.50 వరకు విక్రయిస్తుండటంతో జనం రైతుబజార్ బాట పట్టారు. అయితే బోర్డుపై నిర్దేశించిన ధర ప్రకారం టమాటా రూ.27కు విక్రయించాలి. ఎర్రగడ్డ రైతుబజార్‌లోని స్టాళ్ల నిర్వాహకులు కొనుగోళ్లకు రద్దీ పెరగడంతో ధరను ఏకంగా రూ.35కు పెంచేశారు. అయినప్పటికీ బయట ధరలతో పోలిస్తే తక్కువనే భావనతో చెప్పిన ధరకు వినియోగదారులు కొనుగోలు చేశారు. కొంతమంది బోర్డుపై ఉన్న ధర కంటే ఎక్కువగా అమ్ముతుండడంపై ప్రశ్నించినా లాభం లేకపోయింది. సరుకు తక్కువగా ఉండడంతో ఎర్రగడ్డ రైతుబజార్‌లోని టమాటా స్టాళ్ల వద్ద కొనుగోలుదారులు గంటల తరబడి బారులు తీరారు. -
బెధరహో
పేద, మధ్య తరగతికి ధరల మంట అప్పులపాలవుతున్న చిరుద్యోగులు ఇంకొందరికి అప్పు పుట్టని వైనం జీవన ప్రమాణాలు దెబ్బతింటాయంటున్న నిపుణులు వన్‌టౌన్‌కు చెందిన కుమార్ పాతబస్తీలోని ఒక హోల్‌సేల్ దుకాణంలో గుమాస్తాగా పని చేస్తున్నాడు. అతడికి నెలకు సుమారు పది వేల వరకూ జీతం వస్తుంది. గత ఏడాది సరాసరిగా జీతం ఖర్చులకు సరిపోయేది. ఏడాదిగా పెరిగిన ధరలతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొద్ది మాసాలుగా అప్పులు కూడా దొరకకపోవడంతో కుటుంబ సభ్యులందరూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామంటూ కుమార్ వాపోతున్నాడు. నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. సగటు మానవుడికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. పప్పుచారు కాదు కదా కనీసం పచ్చడి మెతుకుల్ని కూడా తినలేని పరిస్థితి. మొన్న సన్నబియ్యం.. నిన్న ఉల్లిగడ్డ.. నేడు కందిపప్పు.. ఇలా ఒకటేమిటి! దేన్నీ కొనేట్లు లేదు.. దేన్నీ తినేట్లు లేదు. మార్కెట్లో రోజురోజుకీ పెరిగిపోతున్న ధరల మంటకు పేద, మధ్యతరగతి జీవులు అల్లాడుతున్నారు. చాలీచాలని జీతాలతో జీవితాలను గడిపేదెలా అని సర్కారును ప్రశ్నిస్తున్నారు. వన్‌టౌన్ : వచ్చే జీతాలు సరిపోక పెరిగిన ఖర్చులతో ఉద్యోగులు అప్పులపాలవుతున్నారు. ఇంటి అద్దె, సరుకులు, పిల్లల ఫీజులు.. ఇలా ఒకదానికొకటి పోటీ పడుతూ పెరిగిపోతుంటే అప్పులు చేయక తప్పడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇక ప్రైవేట్ ఉద్యోగులకు పెరిగిన ఖర్చులకు సరిపడా ఆదాయం లభించక, అప్పు పుట్టే పరిస్థితులు లేకుండా పోయాయి. ఏడాది కాలంగా పరిస్థితి దుర్భరంగా మారిందంటూ కార్మికులు, చిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతింటున్న జీవన ప్రమాణాలు పెరిగిన ధరలు ప్రజల జీవన ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే జీతాల్లో ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు, కరెంటు చార్జీలు, పెట్రోల్ ఇలా నిర్దిష్టంగా ఉండే ఖర్చులను తగ్గించుకునే పరిస్థితి ఉండదు. ఇక తినే తిండి, వైద్యం, ఇతర వినోదం వంటి అంశాలను అనివార్యంగా తగ్గించుకోవాల్సిందే. తత్ఫలితంగా మానవ జీవితం ఇబ్బందులపాలుకాక తప్పదు. ధరల పెరుగుదలతో పాటు సరిపడినంత ఆదాయం లభించకుంటే సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. -
కొబ్బరి ‘ధర’హాసం!
భారీగా పెరిగిన ధరలు రిటైల్ మార్కెట్లో రూ.20 పైమాటే నగరానికి తగ్గిన సరఫరా గ్రేటర్‌లోని దేవుళ్లు కొబ్బరికాయలు కొట్టే భక్తుల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. నిన్న మొన్నటి వరకూ ఆలయాల్లోని దేవుళ్లకు భారీ ఎత్తున కొబ్బరి నీటితో అభిషేకం చేసి...ఆ ముక్కలను నైవేద్యంగా పెట్టే భక్తులు... ప్రస్తుతం అరటి పండ్లనో... మరో రూపంలోనో ప్రసాదం పెట్టి మమ అనిపించేస్తున్నారు. సామాన్యులైతే ‘ఈసారికి దండంతో సరిపెట్టుకో’మంటూ దేవుళ్లకు సర్ది చెప్పే పనిలో పడ్డారు. ఇదంతా అతిశయోక్తిలా అనిపించినా... దీని వెనుకనున్న వాస్తవం విస్మరించలేనిది. కొబ్బరి ధరల పెరుగుదల తీవ్రతను చాటిచెప్పేది. సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో కొబ్బరి కాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇవి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి సరఫరా తగ్గిపోవడంతో వీటికి కొరత ఏర్పడింది. డిమాండ్-సరఫరాల మధ్య అంతరంతో గత 15 రోజులుగా కొబ్బరి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ నాడు రూ.10 ఉన్న కొబ్బరికా య ధర ఇప్పుడు రెట్టింపైంది. నగరంలోని హోల్‌సేల్ దుకాణాల్లో గురువారం 100 కొబ్బరికాయలు రూ.1500 వంతున ప్రకారం విక్రయించారు. రిటైల్ మార్కెట్లోఒక్కో కొబ్బరికాయ (చిన్న సైజ్) ధర రూ.20... మీడియం సైజ్ కాయ రూ.22కు పైగా పలికింది. ఇక పెద్ద కొబ్బరి కాయల ధర ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ధరలు నగరమంతటా ఒకేలా లేవు. గిరాకీ, భక్తుల రద్దీని బట్టి ఒక్కో ఆలయం వద్ద ఒక్కో రకంగా వ్యాపారులు వసూలు చేస్తున్నారు. వీరి దోపిడీని అరికట్టే వారే ఉండడం లేదు. పెరిగిన ధరలను చూసి భక్తులు దేవునికి పండ్లు, పూలతో సరిపెడుతున్నారు. గుడికె ళ్లి కొబ్బరికాయ కొట్టకపోతే ఏదో వెలితిగా ఉందంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొన్ని రకాల వంటకాలకు ఎంత ధరైనా పెట్టి కొబ్బరి కాయలను కొనుగోలు చేయాల్సి వస్తోందని క్యాటరింగ్ సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. హోటళ్ల మెనూల్లో కొబ్బరి చెట్నీకి ప్రత్యామ్నాయంగా అల్లం, చింతపండు తదితర పచ్చళ్లను మార్పు చేశారు. ఇళ్లలోనూ కొబ్బరి చెట్నీకి కరువొస్తోంది. ఎందుకిలా? హైదరాబాద్ నగరానికి ఉభ య గోదావరి, విశాఖ జిల్లాలు, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి కొబ్బరికాయలు దిగుమతి అవుతుంటాయి. అత్యధికంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచే వస్తాయి. అక్కడ వాతావరణం అనుకూలించకపోవడం... నల్లి తెగులు సోకడంతో పంట దిగుబడి దారుణంగా పడిపోయినట్టు సమాచారం. దీనికి తోడు కొబ్బరి బోండాలకు మంచి డిమాండ్ ఉండటం... గిట్టుబాటు ధర వస్తుండటంతో చాలామంది రైతులు మధ్యలోనే పంట దించుతుండటంతో కొబ్బరికాయల ఉత్పత్తి తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే విశాఖ జిల్లాలో ఇటీవల సంభవించిన హుద్‌హుద్ తుపాన్ ప్రభావంతో కొబ్బరి తోటలు తుడిచిపెట్టుకు పోయాయి. ఆమేరకు నగరానికి కొంతమేర సరఫరా తగ్గిపోయింది. తూర్పు గోదావరి జిల్లాలోని అంబాజీపేట, రాజోలు, రావులపాలెంలలోనే కొబ్బరికాయలకు మంచి రేటు పలుకుతుండటంతో స్థానిక రైతులు, వ్యాపారులు నగరం వైపు చూడడం లేదు. ఇక తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో టన్ను కొబ్బరికాయల ధర రూ.33 వేలు పలుకుతోంది. అక్కడ 100 కాయల ధర రూ.1800 వరకు ఉండటంతో నగరానికి దిగుమతి చేసుకొనేందుకు వ్యాపారులు ఇష్టపడట్లేదు. ఒకవేళ కొనుగోలు చేసినా సరుకు రవాణా, లోడింగ్/అన్లోడింగ్ వంటి వాటికి లారీకి రూ.5వేల వరకూ అదనంగా ఖర్చవుతుండడంతో వారు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల పైనే నగర కొబ్బరి మార్కెట్ ఆధారపడుతోంది. అక్కడి నుంచి సరఫరా తగ్గిపోవడంతో ఇక్కడ డిమాండ్... ధరలపై ప్రభావం పడుతోంది. -
పసిడి పరుగులు
అక్షయ తృతీయ ఎఫెక్ట్.. ఆర్బీఐ నిబంధనలతో బెంగళూరుకు గణనీయంగా తగ్గిన సరఫరా వస్తున్న కొద్దిపాటి బంగారానికి డిమాండ్ అమాంతం పెరిగిన ధరలు 70 శాతం పడిపోయిన అమ్మకాలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అక్షయ తృతీయ సమీపిస్తున్న తరుణంలో బంగారం ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. వివిధ కారణాల వల్ల నగరానికి రోజూ రావాల్సిన బంగారం పరిమాణం గణనీయంగా పడిపోయింది. సాధారణ రోజుల్లో 500 కిలోలు వస్తుండగా, ప్రస్తుతం వంద కిలోలకు మించడం లేదు. ఉన్నట్లుండి ధర పెరుగుతుండడంతో ప్రస్తుతం కొనుగోళ్లకు సైతం వినియోగదారులు విరామం ఇచ్చారు. ధరలు ఎప్పుడెప్పుడు దివి నుంచి భువికి దిగుతాయా అని ఎదురు చూస్తున్నారు. బంగారం ధర పెరుగుతుండడం వర్తకులకు సంతోషం కలిగిస్తున్నా, అమ్మకాలు సుమారు 70 శాతం వరకు పడిపోవడం వారిని కలవర పరుస్తోంది. గతంలో నగరంలో రోజుకు వెయ్యి కిలోల వరకు బంగారం అమ్ముడు పోయేది. ఆర్బీఐ నిబంధనల వల్ల నగరంలోకి బంగారం రాక గణనీయంగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో గ్రాము ధర రూ.1,350 నుంచి రూ.1,283కు పడిపోగా, బెంగళూరులో దాని ధర రూ.2,835 నుంచి రూ.2,700కు ఎగబాకింది. డాలర్ ముందు రూపాయి పటిష్టం కావడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో వ్యాపారులు తాము కొనుగోలు చేసిన ధర కంటే తక్కువకు వినియోగదారులకు విక్రయించాల్సి ఉంటుంది. మే 2న అక్షయ తృతీయ అక్షయ తృతీయకు వినియోగదారులు బంగారు ఆభరణాలను ఎగబడి కొనుగోలు చేస్తారు. ఆ రోజు బంగారాన్ని కొనుగోలు చేస్తే సౌభాగ్యం చేకూరుతుందని పలువురి విశ్వాసం. ఈ సందర్భంలో వ్యాపారులు కూడా భారీ ఎత్తున డిస్కౌంట్లను ప్రకటిస్తుంటారు. ఈసారి అలాంటి ఆస్కారం ఉండబోదని వ్యాపారులు చెబుతున్నారు. ముందుగా నిర్ణయించిన ధర కంటే తక్కువకు అమ్మలేమని పేర్కొంటున్నారు. బంగారం సరఫరా తక్కువ కావడం, రూపాయి విలువ పెరగడం దీనికి కారణాలని వివరిస్తున్నారు. బ్యాంకులకు పండుగ బంగారానికి కొరత ఏర్పడిన ప్రస్తుత తరుణంలో కుదవలో ‘మునిగిపోయిన’ ఆభరణాలను పెద్ద మొత్తంలో లాభాలకు అమ్ముకోవడానికి బ్యాంకర్లు, ప్రైవేట్ ఫైనాన్షియర్లు ఉత్సాహం చూపుతున్నారు. బ్యాంకులతో పాటు ప్రైవేట్ వ్యక్తులు గ్రాముకు రూ.వంద చొప్పున అధికంగా విక్రయిస్తున్నారు. బంగారం సరఫరా బాగా తగ్గిపోవడంతో స్మగ్లర్లు కూడా విజృంభిస్తున్నారు. కోస్తా జిల్లాల నుంచి స్వల్ప పరిమాణాల్లో బంగారం భారీగా తరలి వస్తోంది. బంగారం దిగుమతులపై రిజర్వు బ్యాంకు ఆంక్షలు విధించడంతో స్మగ్లర్ల ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. ప్రతి పది రోజులోకోసారి ఇంతే పరిమాణంలో బంగారాన్ని కొనుగోలు చేయాలి. నిర్ణీత పరిమాణం కంటే ఎక్కువ కొనుగోలు చేయాలనుకుంటే బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఇందులో ఏవైనా పొరపాట్లు దొర్లితే బంగారాన్ని దిగుమతి చేసుకోకూడదు...లాంటి ఆంక్షలు వర్తకుల చేతులు కట్టి పడేశాయి. దరిమిలా చిల్లర వర్తకులకు కావాల్సినంత బంగారం లభ్యం కావడం లేదు. -
నిధుల కుమ్మరింపు
=ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎర =మొన్న పంచాయతీ, మండలాలకు.. =ఇప్పుడు మున్సిపాల్టీలకు ఎస్సీ,ఎస్టీ నిధులు సాక్షి, విశాఖపట్నం : ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కుమ్మరిస్తోంది. పోయిన ప్రతిష్టను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. అభివృద్ధి పనులంటూ ఓటర్లను ఆకట్టుకోవాలని యోచి స్తోంది. ఏళ్ల తరబడి ఇవ్వని నిధుల్ని ఇప్పుడు విడుదల చేస్తోంది. మొన్నటికి మొన్న పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లకు ఆఘమేఘాల మీద 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులిచ్చిన సర్కార్ తాజాగా మున్సిపాల్టీలకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేసింది. షార్ట్ టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించింది. ఎంత వేగంగా జనాల్లోకి వెళితే అంత మంచిదని అధికారులకు సూచించింది. పెరిగిన ధరలు, మోయలేని చార్జీల భారంతో కాంగ్రెస్ ప్రభుత్వమంటేనే జనం విసిగిపోతున్నారు. దీనికితోడు రాష్ట్ర విభజన నిర్ణయం ప్రభుత్వానికి పిడుగుపాటైంది. రోజురోజుకు ప్రజల్లో కాంగ్రెస్ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో పార్టీ ప్రతిష్టను కాపాడుకునేందుకు ‘చేతి’లో ఉన్న అస్త్రాలన్నింటిని ప్రభుత్వం ప్రయోగిస్తోంది. ఏళ్ల తరబడి ఉంచుకున్న నిధులను ఎకాయెకిన విడుదల చేస్తోంది. ఇటీవల పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం కింద రూ.12.21కోట్లు విడుదల చేసింది. అలాగే మండల పరిషత్‌లకు రూ.1.94కోట్లు, జిల్లా పరిషత్‌కు రూ.5.25కోట్లు విడుల చేసింది. అలాగే తలసరి గ్రాంటు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు, సీనరేజి గ్రాంట్ విడుదల చేసింది. ఇప్పుడు మున్సిపాల్టీల వంతు వచ్చింది. సబ్ ప్లాన్ చట్టం ఆమోదం పొందిన ఏడాది తర్వాత ఆ పద్దు కింద నిధులు విడుదల చేసింది. జిల్లాలోని మున్సిపాల్టీలన్నింటికీ స్టేట్ ఫైనాన్స్ కమిషన్(ఎస్సీ, ఎస్టీ) స్లబ్ ప్లాన్ కింద రూ.8.07కోట్లు, అంతర రహదారులకు రూ.7.54కోట్లు విడుదలయ్యాయి. వీటితో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోనే రహదారులు, కమ్యూనిటీ టాయిలెట్లు, తాగునీటి పైపులైన్లు, వీధిలైట్లు పనులు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. త్వరితగతిన టెండర్లు పిలిచి, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో అభివృద్ధి పనులకు మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. కానీ మంత్రులు, ఎమ్మెల్యేల లోపాయికారీ ఆదేశాల మేరకు ఆయా పనులకు షార్ట్ టెండర్లు పిలిచి, కాంగ్రెస్ నేతలకే దక్కేలా వ్యూహరచన చేస్తున్నాన్న ఆరోపణలు ఉన్నాయి.