బెధరహో
పేద, మధ్య తరగతికి ధరల మంట
అప్పులపాలవుతున్న చిరుద్యోగులు
ఇంకొందరికి అప్పు పుట్టని వైనం
జీవన ప్రమాణాలు దెబ్బతింటాయంటున్న నిపుణులు
వన్‌టౌన్‌కు చెందిన కుమార్ పాతబస్తీలోని ఒక హోల్‌సేల్ దుకాణంలో గుమాస్తాగా పని చేస్తున్నాడు. అతడికి నెలకు సుమారు పది వేల వరకూ జీతం వస్తుంది. గత ఏడాది సరాసరిగా జీతం ఖర్చులకు సరిపోయేది. ఏడాదిగా పెరిగిన ధరలతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొద్ది మాసాలుగా అప్పులు కూడా దొరకకపోవడంతో కుటుంబ సభ్యులందరూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామంటూ కుమార్ వాపోతున్నాడు.
నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. సగటు మానవుడికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. పప్పుచారు కాదు కదా కనీసం పచ్చడి మెతుకుల్ని కూడా తినలేని పరిస్థితి. మొన్న సన్నబియ్యం.. నిన్న ఉల్లిగడ్డ.. నేడు కందిపప్పు.. ఇలా ఒకటేమిటి! దేన్నీ కొనేట్లు లేదు.. దేన్నీ తినేట్లు లేదు. మార్కెట్‌లో రోజురోజుకీ పెరిగిపోతున్న ధరల మంటకు పేద, మధ్యతరగతి జీవులు అల్లాడుతున్నారు. చాలీచాలని జీతాలతో జీవితాలను గడిపేదెలా అని సర్కారును ప్రశ్నిస్తున్నారు.
వన్‌టౌన్ : వచ్చే జీతాలు సరిపోక పెరిగిన ఖర్చులతో ఉద్యోగులు అప్పులపాలవుతున్నారు. ఇంటి అద్దె, సరుకులు, పిల్లల ఫీజులు.. ఇలా ఒకదానికొకటి పోటీ పడుతూ పెరిగిపోతుంటే అప్పులు చేయక తప్పడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇక ప్రైవేట్ ఉద్యోగులకు పెరిగిన ఖర్చులకు సరిపడా ఆదాయం లభించక, అప్పు పుట్టే పరిస్థితులు లేకుండా పోయాయి. ఏడాది కాలంగా పరిస్థితి దుర్భరంగా మారిందంటూ కార్మికులు, చిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దెబ్బతింటున్న జీవన ప్రమాణాలు
పెరిగిన ధరలు ప్రజల జీవన ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే జీతాల్లో ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు, కరెంటు చార్జీలు, పెట్రోల్ ఇలా నిర్దిష్టంగా ఉండే ఖర్చులను తగ్గించుకునే పరిస్థితి ఉండదు. ఇక తినే తిండి, వైద్యం, ఇతర వినోదం వంటి అంశాలను అనివార్యంగా తగ్గించుకోవాల్సిందే. తత్ఫలితంగా మానవ జీవితం ఇబ్బందులపాలుకాక తప్పదు. ధరల పెరుగుదలతో పాటు సరిపడినంత ఆదాయం లభించకుంటే సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.