
సౌత్ వేల్స్ లోని పోర్ట్ టాల్‌బోట్‌లోని టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేత తర్వాత అక్కడి వారి జీవితాలు దుర్భరంగా మారాయి. 2,800 మంది కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ షీన్.. తమ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు ముందుకువచ్చారు. సుమారు 900 మందికి చెందిన 1 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.8 కోట్లు) రుణాలను తాను చెల్లించారు.
ది క్వీన్, గుడ్ ఓమెన్స్, ట్విలైట్ చిత్రాల్లో నటించిన మైఖేల్ షీన్ బాధితుల ఆర్థిక భారాన్ని తగ్గించే బాధ్యతను తనపై వేసుకున్నాడు. షీన్ తన వ్యక్తిగత సంపాదన లోంచి 1,00,000 పౌండ్లు వెచ్చించి 900 మందికి సంబంధించిన రుణాలను తీర్చడం కోసం ఒక సంస్థను స్థాపించాడు. రుణ పరిశ్రమ ఎలా పనిచేస్తుందనే దానిపై మొదట్లో తనకు అవగాహన లేదని, కానీ మార్పు తీసుకురావాలని నిశ్చయించుకున్నానని షీన్ చెప్పాడు. మైఖేల్ షీన్ సీక్రెట్ మిలియన్ పౌండ్ గిఫ్ట్ గురించి త్వరలో ప్రసారం కానున్న ఛానెల్ 4 షోలో డాక్యుమెంట్ చేశారు.
టాటా స్టీల్ మూసివేత ప్రభావం
పోర్ట్ టాల్‌బోట్‌లోని టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేత ఈ ప్రాంతంలో సాంప్రదాయ ఉక్కు తయారీ ముగింపును సూచిస్తోంది. పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు స్థానికులకు సైతం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. పోర్ట్ టాల్‌బోట్‌కు చెందిన షీన్.. కార్మికులు, వారి కుటుంబాల దుస్థితిని చూసి చలించిపోయారు. స్థానిక కేఫ్ ను సందర్శించిన సందర్భంగా ఆయన ఉద్యోగుల తొలగింపు భావోద్వేగాలను కళ్లారా చూశారు. ఉక్కు కార్మికులు తమ అనిశ్చిత భవిష్యత్తుపై కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో వారిని ఆదుకునేందుకు ఏదైనా చేయాలని సంకల్పించారు.
ఎవరీ మైఖేల్ షీన్?
మైఖేల్ షీన్ బహుముఖ ప్రజ్ఞతోపాటు సామాజిక కారణాల పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన నటుడు. 1969లో వేల్స్ లోని న్యూపోర్ట్ లో జన్మించిన షీన్ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ (రాడా)లో శిక్షణ పొంది నాటకరంగంలో తన కెరీర్ ను ప్రారంభించారు. ది క్వీన్ అండ్ ది స్పెషల్ రిలేషన్ షిప్ లో బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్ పాత్రలకు అంతర్జాతీయ ప్రశంసలు పొందాడు. తన నటజీవితానికి మించి, సామాజిక పోరాటకారుడైన షీన్.. తనను తాను "లాభాపేక్ష లేని నటుడిగా" ప్రకటించుకున్నాడు. తన సంపాదనను సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నాడు. ఇప్పుడే కాదు.. 2021లోనే అతను తన సంపదను ధార్మిక కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment