
రుణం తీసుకునేందుకు ఏపీఎండీసీకి ప్రభుత్వం అనుమతి
ఇప్పటికే ఏపీఎండీసీ ద్వారా రూ.5,000 కోట్ల అప్పు
కార్పొరేషన్ల పేరుతో బడ్జెట్ బయట అప్పులు రూ.23,700 కోట్లకు చేరిక
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం ప్రతి మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ద్వారా మరో రూ.9,000 కోట్ల అప్పు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిoది. ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన డిబెంచర్లు లేదా బాండ్ల జారీతో రూ.9,000 కోట్ల వరకు సమీకరించేందుకు ఏపీఎండీసీకి అనుమతి ఇస్తూ గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటికే ఏపీఎండీసీ ద్వారా రూ.5,000 కోట్ల అప్పు చేసేందుకు గతేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నిధులను వేగంగా సమీకరించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు.. సలహాదారు అండ్ మర్చంట్ బ్యాంకర్‌ను కూడా ఏపీఎండీసీ నియమించింది.
అప్పు చేసిన నిధులను కొత్త మైనింగ్ ప్రాజెక్టులను కొనుగోలు చేయడానికి, అభివృద్ధి చేయడానికి, ఏదైనా ఇతర లాభదాయక వెంచర్లలో పెట్టుబడి పెట్టడానికి వినియోగించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పుడు చేసే ఈ రూ.9,000 కోట్ల అప్పుతో కూటమి ప్రభుత్వంలో ఏపీఎండీసీ ద్వారా చేసిన అప్పులు రూ.14,000 కోట్లకు చేరుతాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు వివిధ కార్పొరేషన్ల ద్వారా మొత్తం రూ.23,700 కోట్ల అప్పు చేసింది. ఈ అప్పులన్నీ బడ్జెట్ బయట చేస్తున్నవే.

Comments
Please login to add a commentAdd a comment