కోడిగుడ్డు కుతకుత..
గుడ్డు ధర రూ.5.50
‘టమాటా’ కోసం రైతుబజార్‌లో క్యూ
అమాంతం పెరిగిన ధరలు
సిటీబ్యూరో/ గాజులరామారం/సనత్‌నగర్: పోషకాలు పుష్కలంగా ఉండే కోడిగుడ్డు గొంతు దిగనంటోంది. కూరలోని టమాటా వంటింటికి రానంటోంది. వీటిని కొనాలంటే సామాన్యుడు ఒకటికి పదిసార్లు జేబు తడుముకుని లెక్కలు వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కోడిగుడ్డు ధర పప్పులతో సమానంగా పెకైక్కుతూ ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో రూ.5.50కు చేరి బెంబేలెత్తిస్తోంది. మొన్నటి దాకా భయపెట్టిన టమాటా ధర వారం క్రితం దిగివచ్చింది. ఈ వారం మాత్రం రైతు బజార్లకు సరఫరా తక్కువ కావడంతో జనం టమాటా కోసం క్యూకట్టారు. దీంతో అమ్మకందార్లు ధరను పెంచేశారు.
కోడిగుడ్డు ఇలా పైపైకి..
కోడి గుడ్డు ధర జూన్ 21 నుంచి కొద్దికొద్దిగా పెరుగుతూ వస్తున్న ధర ఆదివారం ఏకంగా రూ. 5.50 పైసలకు దుకాణాదారులు విక్రయించడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ఆదివారం నాటికి ఫామ్ ధర ఒక గుడ్డు రూ.4.14గా ఉంది. విక్రయ కేంద్రాలను బట్టి దుకాణదారులకు అది రూ. 4.34 నుంచి 4.80 కి లభిస్తుండగా.. రిటైల్ ధర రూ.5.50కు చేరింది. పప్పులు, కూరగాయల ధరలతో కోడిగుడ్డు పోటీ పడుతుండడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు గుడ్డు కొనాలంటే గుడ్లు తేలేస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేని రేటు..
ఈ ఏడాది గుడ్డు ధర ఫారం రేటు రూ. 4.14గా నమోదవడం ఇది రెండోసారి. 2015 జూన్ 3న గుడ్డు ఒకటికి ఫారం ధర రూ.3.20గా ఉంది. 2009 నుంచి 2015 వరకు జూన్ నెలలో ఒక గుడ్డు ధర ఇంతగా పెరిగిన దాఖలా లేదు. ఉత్ప త్తి తక్కువగా ఉండడం, నిర్వహణ భారంతో ఫామ్‌లు మూతపడుతుండడంతో ఇంతగా రేటు పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు.
టమాటా కోసం పడిగాపులు
మరోవైపు టమాటా కూడా మాట విననంటోంది. బహిరంగ మార్కెట్లో కిలో టమాటాలు రూ.50 వరకు విక్రయిస్తుండటంతో జనం రైతుబజార్ బాట పట్టారు. అయితే బోర్డుపై నిర్దేశించిన ధర ప్రకారం టమాటా రూ.27కు విక్రయించాలి. ఎర్రగడ్డ రైతుబజార్‌లోని స్టాళ్ల నిర్వాహకులు కొనుగోళ్లకు రద్దీ పెరగడంతో ధరను ఏకంగా రూ.35కు పెంచేశారు. అయినప్పటికీ బయట ధరలతో పోలిస్తే తక్కువనే భావనతో చెప్పిన ధరకు వినియోగదారులు కొనుగోలు చేశారు. కొంతమంది బోర్డుపై ఉన్న ధర కంటే ఎక్కువగా అమ్ముతుండడంపై ప్రశ్నించినా లాభం లేకపోయింది. సరుకు తక్కువగా ఉండడంతో ఎర్రగడ్డ రైతుబజార్‌లోని టమాటా స్టాళ్ల వద్ద కొనుగోలుదారులు గంటల తరబడి బారులు తీరారు.