విలీన గ్రామాలకు క‘న్నే’ళ్లే’!
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్‌లో తాజాగా విలీనమైన 35 గ్రామ పంచాయతీలకు పానీపరేషాన్ తథ్యమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మంచినీటి వనరుల లభ్యత, స్టోరేజి రిజర్వాయర్లు, సరఫరా నెట్‌వర్క్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం విలీనానికి శ్రీకారం చుట్టడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. కనీసం ఈ విషయంలో జలమండలిని మాటమాత్రంగానైనా సంప్రదించకపోవడం సర్కారు అనాలోచిత చర్యలకు అద్దంపడుతోంది.
జీహెచ్‌ఎంసీలో 2007లో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీలకే తాగునీరు, డ్రైనేజీ తదితర సదుపాయాలు కల్పించలేని దుస్థితి. ఆయా మున్సిపాల్టీల పరిధిలోని 870 కాలనీలు, బస్తీలకు స్టోరేజి రిజర్వాయర్లు, మంచినీటి సరఫరా నెట్‌వర్క్, భూగర్భ డ్రైనేజి వసతులు ఇప్పటివరకు ఏర్పాటు కాలేదు. దీంతో సుమారు 35 లక్షలమంది శివారు ప్రజలు మంచినీటి కొనుగోలుకు నెలకు రూ.100 కోట్లు ఖర్చు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. వారి మురుగు నీరు సైతం ఇళ్లలోని సెప్టిక్ ట్యాంకుల్లోనే మగ్గుతోంది.
ఆరేళ్ల కిందట విలీనమైన వాటి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక తాజాగా కలిసిన 35 పంచాయతీల పరిస్థితి ఎలా ఉంటుందో సులభంగా అర్థంచేసుకోవచ్చు. ఈ పంచాయతీల్లోని సుమారు 12 లక్షల మందికి కొన్నేళ్లపాటు కన్నీళ్లుతప్పవని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల పరిధిలోని జనం బోరుబావులను ఆశ్రయించి బావురు మనక తప్పదని స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు మురుగు నీటిపారుదల వ్యవస్థ (డ్రైనేజి నెట్‌వర్క్) ఏర్పాటుపైనా ప్రభుత్వానికి స్పష్టత లేదని చెబుతున్నారు.
తాగునీటి లభ్యత అరకొరే
జలమండలి ప్రస్తుతం గ్రేటర్ నగరానికి కృష్ణా, మంజీరా, సింగూరు జలాశయాల నుంచి నిత్యం 300 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుంది. ఇందులో సరఫరా నష్టాలు 33 శాతం పోను వాస్తవ సరఫరా 200 మిలియన్ గ్యాలన్లు మించడం లేదు. కానీ డిమాండ్ 459 మిలియన్ గ్యాలన్లుగా ఉంది. అంటే డిమాండ్, సరఫరా మధ్య ఇప్పటికే 259 మిలియన్ గ్యాలన్ల అంతరం కొనసాగుతోంది. వచ్చే ఏడాది నాటికి కృష్ణా మూడో దశ ద్వారా 90 మిలియన్ గ్యాలన్లు, గోదావరి నీటి పథకం మొదటి దశ ద్వారా మరో 90 మిలియన్ గ్యాలన్ల నీరు గ్రేటర్‌కు తరలించే అవకాశాలున్నాయి. అయినా 79 మిలియన్ గ్యాలన్ల నీటి కొరత తప్పదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విలీనమైన 35 శివారు పంచాయతీలకు తాగునీటి కల్పన కలగానే మారుతుందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
కాగితాల్లోనే ప్రతిపాదనలు
గ్రేటర్‌లో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల్లో మంచినీటి స్టోరేజి రిజర్వాయర్లు, పైప్‌లైన్ నెట్‌వర్క్ విస్తరణకు రూ.3200 కోట్లతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఆయన మరణానంతరం ఏర్పడిన ప్రభుత్వాలు ఈ పథకాలకు చిల్లిగవ్వ విదల్చకపోవడంతో ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరమితమయ్యాయి. అంతేకాదు శివారు మున్సిపాల్టీల పరిధిలో డ్రైనేజి వసతుల కల్పనకు రూ.2500 కోట్లతో 2007లోనే అంచనాలు సిద్ధమయ్యాయి. ఈ పథకాలకూ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో శివార్లు మురుగు కష్టాలతో సతమతమౌతున్నాయి.
గోదావరి ఎప్పటికో..
కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివార్లలోని శామీర్‌పేట్ వరకు 186 కిలోమీటర్ల మేర తాగునీటిని తరలించాల్సిన గోదావరి మంచినీటి పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. పైప్‌లైన్ పనులు వంద కిలోమీటర్ల మేర పూర్తయినా.. నీటి శుద్ధి కేంద్రాలు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం పనుల్లో 50 శాతమే పూర్తయ్యాయి. సుమారు రూ.3800 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పథకానికి ఇప్పటివరకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేదు. ఈ పథకం మొదటి దశ వచ్చే ఏడా ది చివరినాటికి పూర్తవుతుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నత్తనడకన కృష్ణా మూడోదశ
నల్లగొండ జిల్లా కోదండాపూర్ నుంచి నగర శివార్లలోని సాహెబ్‌నగర్ వరకు 110 కిలోమీటర్ల మేర తాగునీటిని తరలించాల్సిన కృష్ణా మూడోదశ పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి. ఆరు నెలలుగా కేవలం పది కిలోమీటర్ల మేర మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఈ పనులను వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి పూర్తిచేసి నగరానికి 90 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తామని జలమండలి వర్గాలు చెబుతున్నా.. పనుల తీరు చూస్తే ఆ నమ్మకం కలగడం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.