Storage reservoirs
-
కర్నూలు జిల్లాలో కడుతున్న పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును నిలిపేయండి
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా పాణ్యం మండలం పిన్నాపూరంలో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ) నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా జలాల ఆధారంగా పంప్డ్ స్టోరేజీ కాన్సెప్‌్టతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు అనుమతిస్తూ జారీ చేసిన జీవో రాష్ట్ర పునరి్వభజన చట్టంలోని సెక్షన్ 84, 85లకు విరుద్ధమని స్పష్టం చేసింది. అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు పొందాకే ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంటుందని పేర్కొంది. కేఆర్ఎంబీ/అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా చేపట్టిన అన్ని కొత్త ప్రాజెక్టులు, పాత ప్రాజెక్టులు, కాల్వల విస్తరణ పనులను తక్షణమే నిలుపుదల చేయించాలంటూ కృష్ణా బోర్డు చైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఇటీవల లేఖ రాశారు. నీటి కొరత ఉన్న కృష్ణా బేసిన్ నుంచి నీళ్లను వెలుపల ప్రాంతానికి తరలించి జల విద్యుదుత్పత్తికి వినియోగించడం తీవ్ర అభ్యంతకరమని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు టెండర్లు, నిర్మాణ పనులను నిలుపుదల చేయించాలని కోరుతూ గతంలో రెండుసార్లు లేఖ రాశామని గుర్తు చేశారు. ఈ నెల 17న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారని ప్రస్తావించారు. గతంలో పలు పర్యాయాలు ఫిర్యాదు చేసినా కృష్ణా బోర్డు చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు. గాలేరు–నగరికి అనుమతి ఉంది: ఏపీ అధికారులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి హంద్రీ నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) కాల్వ ద్వారా గోరకల్లు రిజర్వాయర్‌కు వచ్చే నీళ్లను మిగులు విద్యుత్ ఉండే సమయాల్లో మరో రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. ఇందుకోసం కొత్త రిజర్వాయర్‌ను ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు. విద్యుత్ కొరత ఉండే వేళల్లో ఈ కొత్త జలాశయం నుంచి నీళ్లను జలవిద్యుదుత్పత్తి ద్వారా దిగువన ఉండే గోరకల్లు రిజర్వాయర్‌కు మళ్లీ విడుదల చేస్తారు. కొత్త రిజర్వాయర్‌పై జలవిద్యుత్ కేంద్రం సైతం నిర్మిస్తున్నారు. పంప్డ్ స్టోరేజీ పద్ధతిలో విద్యుత్‌ను నిల్వ చేయాలన్న లక్ష్యంతో ఈ వినూత్న ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. వరద జలాల ఆధారంగా హంద్రీ నీవా సు జల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులున్న నేపథ్యం లో ఈ పంప్డ్ స్టోరేజీ హైడ్రో ఎలక్రి్టక్ ప్రాజెక్టుపై అభ్యంతరాలకు తావు లేదని ఏపీ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. -
తాగునీటి ఇక్కట్లకు చెక్!
భారీ స్టోరేజి రిజర్వాయర్లకు డీపీఆర్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశం సిటీబ్యూరో: గ్రేటర్ దాహార్తిని సమూలంగా తీర్చేందుకు నగర శివార్లలోని కేశవాపూర్(రంగారెడ్డిజిల్లా), మల్కాపురం(నల్లగొండ జిల్లా)ల వద్ద భారీ స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం జలమండలి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ప్రస్తుతం జంటజలాశయాలు, సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటినిల్వలు త్వరితంగా అడుగంటుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా వీటి నిర్మాణం అత్యవసరమని సీఎం స్పష్టంచేసినట్లు తెలిసింది. కాగా కేశవాపూర్ రిజర్వాయర్‌కు మెదక్‌జిల్లా మల్లన్నసాగర్ లేదా పాముల పర్తి రిజర్వాయర్ల నుంచి గోదావరి జలాలను తరలించాలని, మల్కాపురం రిజర్వాయర్‌కు డిండి ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణా జలాలను తరలించాలని సూచించినట్లు సమాచారం. రిజర్వాయర్లకు రూట్‌మ్యాప్ ఇదే.. కరీంనగర్ జిల్లా కాలేశ్వరం-మిడ్‌మానేరు-కొమురెల్లిమల్లన్న సాగర్(మెదక్) మీదుగా కేశవాపూర్‌కు నీటిని తరలించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నూతనంగా నిర్మించ తలపెట్టిన కొమురెల్లి మల్లన్న సాగర్(కుక్నూరుపల్లి-మెదక్)లో సుమారు 50 టీఎంసీల మేర గోదావరి జలాలను నింపడం ద్వారా అక్కడి నుంచి 42 కి.మీ దూరంలో ఉన్న కేశవాపూర్ రిజర్వాయర్‌కు 25 కిలోమీటర్ల మేర గ్రావి టీ(భూమ్యాకర్షణశక్తి), మరో 17 కి.మీ మార్గంలో పంపింగ్ ద్వారా నీటిని తరలించి నింపవచ్చని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇక పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా డిండి (నల్లగొండ జిల్లా)కి అక్కడి నుంచి మల్కాపురం(నల్లగొండ) వరకు భారీ పైప్‌లైన్ ఏర్పాటు చేసి ఈ స్టోరేజి రిజర్వాయర్‌లో 20 టీఎంసీల కృష్ణా జలాలను నింపే అవకాశం ఉంటుందని జలమండలి అధికారులు తెలిపారు. రూ.1500 కోట్లతో దేవులమ్మనాగారం రిజర్వాయర్.. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపూర్ సరిహద్దుల్లో రూ.1500 కోట్ల అంచనా వ్యయంతో భారీ స్టోరేజి రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన రెండువేల ఎకరాల మేర ప్రభుత్వ, అటవీ, అసైన్డ్భూములు అందుబాటులో ఉన్నాయి. ఈ జలాశయాన్ని కాంక్రీటుతో భూమట్టానికి 70-80మీటర్ల ఎత్తులో నిర్మిస్తారు. ఈ జలాశయంలో పాలమూరు ఎత్తిపోతల, డిండి పథకం ద్వారా కొంత మార్గం లో పంపింగ్, మరి కొంత మార్గంలో గ్రావిటీ ద్వారా 20 టీఎంసీల జలాలను తరలించి నింపనున్నారు. వర్షాకాలం లో నీటిలభ్యత అధికంగా ఉన్నప్పుడే ఈ భారీ జలాశయాన్ని పూర్తిస్థాయిలో నింపే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రూ.1200 కోట్లతో కేశవాపురం రిజర్వాయర్ .. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం కేశవాపురం వద్ద రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో 15 టీఎంసీల గోదావరి జలాల నిల్వకు అవసరమైన భారీ స్టోరేజి రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన 3600 ఎకరాల మేర ప్రభుత్వ, అటవీ భూములు అందుబాటులో ఉన్నట్లు క్షేత్రస్థాయి నివేదికలో పేర్కొన్నారు. ఈ జలాశయాన్ని భూమట్టం నుంచి 60 మీటర్ల ఎత్తులో కాంక్రీట్ డ్యామ్ నిర్మించనున్నారు. ఈ జలాశయంలో గోదావరి మంచినీటి పథకం మొదటి, రెండు, మూడో దశల్లో తరలించనున్న నీటితో ఈ జలాశయాన్ని నింపే అవకాశం ఉంటుందని, గోదావరి నదిలో సమృద్ధిగా వరద ప్రవాహం ఉన్నప్పుడే ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి జలకళ సంతరించుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. -
సికింద్రాబాద్ అభివృద్ధికి రూ.300 కోట్లు
మంత్రి పద్మారావు సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్, కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రూ.300 కోట్ల అంచనా వ్యయంతో మంచినీటి పైప్లైన్ల విస్తరణ, స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం, డ్రైనేజీ వంటి వసతులు కల్పిస్తామని ఆబ్కారీశాఖమంత్రి పద్మారావు తెలిపారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో జలమండలి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గతంలో ఈప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించి సిద్ధంచేసిన మాస్టర్‌ప్లాన్‌ను సమగ్రంగా అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా మారేడ్‌పల్లి, తార్నాక, లాలాపేట్ ప్రాంతాల్లో భారీ మంచినీటి స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణానికి అంచనాలు సిద్ధంచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సీతాఫల్మండి ప్రాంతంలో స్టోరేజి రిజర్వాయర్‌కు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. కంటోన్మెంట్ పరిధిలో తాగునీరు, డ్రైనేజి వసతుల కల్పనపై నెలకొన్న వివాదాలను త్వరితంగా పరిష్కరించాలన్నారు. సికింద్రాబాద్ పరిధిలో మురుగునీటి పారుదల వ్యవస్థను ఆధునికీకరించేందుకు భారీ ట్రంక్‌మెయిన్స్, లేటరల్స్ నిర్మించాలని సూచించారు. అడ్డగుట్ట, మారేడ్‌పల్లి, లాలాపేట్, తార్నాక పరిధిలోని అన్ని కాలనీలు, బస్తీల్లో మంచినీరు, డ్రైనేజీ వసతులు కల్పించాలన్నారు. మూడోదశపై సమీక్ష కృష్ణా మూడోదశ ప్రాజెక్టును త్వరితంగా పూర్తిచేసి, నగరానికి అదనంగా 90 మిలియన్ గ్యాలన్ల కృష్ణాజలాలను తరలించి నగరం నలుమూలలకు సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జలమండలి ఆపరేషన్స్ విభాగం డెరైక్టర్ రామేశ్వర్రావు, జీఎం ఆనంద్‌స్వరూప్, డీజీఎం హర్నాకర్ తదితరులు పాల్గొన్నారు. -
విలీన గ్రామాలకు క‘న్నే’ళ్లే’!
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్లో తాజాగా విలీనమైన 35 గ్రామ పంచాయతీలకు పానీపరేషాన్ తథ్యమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మంచినీటి వనరుల లభ్యత, స్టోరేజి రిజర్వాయర్లు, సరఫరా నెట్వర్క్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం విలీనానికి శ్రీకారం చుట్టడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. కనీసం ఈ విషయంలో జలమండలిని మాటమాత్రంగానైనా సంప్రదించకపోవడం సర్కారు అనాలోచిత చర్యలకు అద్దంపడుతోంది. జీహెచ్ఎంసీలో 2007లో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీలకే తాగునీరు, డ్రైనేజీ తదితర సదుపాయాలు కల్పించలేని దుస్థితి. ఆయా మున్సిపాల్టీల పరిధిలోని 870 కాలనీలు, బస్తీలకు స్టోరేజి రిజర్వాయర్లు, మంచినీటి సరఫరా నెట్వర్క్, భూగర్భ డ్రైనేజి వసతులు ఇప్పటివరకు ఏర్పాటు కాలేదు. దీంతో సుమారు 35 లక్షలమంది శివారు ప్రజలు మంచినీటి కొనుగోలుకు నెలకు రూ.100 కోట్లు ఖర్చు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. వారి మురుగు నీరు సైతం ఇళ్లలోని సెప్టిక్ ట్యాంకుల్లోనే మగ్గుతోంది. ఆరేళ్ల కిందట విలీనమైన వాటి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక తాజాగా కలిసిన 35 పంచాయతీల పరిస్థితి ఎలా ఉంటుందో సులభంగా అర్థంచేసుకోవచ్చు. ఈ పంచాయతీల్లోని సుమారు 12 లక్షల మందికి కొన్నేళ్లపాటు కన్నీళ్లుతప్పవని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల పరిధిలోని జనం బోరుబావులను ఆశ్రయించి బావురు మనక తప్పదని స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు మురుగు నీటిపారుదల వ్యవస్థ (డ్రైనేజి నెట్వర్క్) ఏర్పాటుపైనా ప్రభుత్వానికి స్పష్టత లేదని చెబుతున్నారు. తాగునీటి లభ్యత అరకొరే జలమండలి ప్రస్తుతం గ్రేటర్ నగరానికి కృష్ణా, మంజీరా, సింగూరు జలాశయాల నుంచి నిత్యం 300 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుంది. ఇందులో సరఫరా నష్టాలు 33 శాతం పోను వాస్తవ సరఫరా 200 మిలియన్ గ్యాలన్లు మించడం లేదు. కానీ డిమాండ్ 459 మిలియన్ గ్యాలన్లుగా ఉంది. అంటే డిమాండ్, సరఫరా మధ్య ఇప్పటికే 259 మిలియన్ గ్యాలన్ల అంతరం కొనసాగుతోంది. వచ్చే ఏడాది నాటికి కృష్ణా మూడో దశ ద్వారా 90 మిలియన్ గ్యాలన్లు, గోదావరి నీటి పథకం మొదటి దశ ద్వారా మరో 90 మిలియన్ గ్యాలన్ల నీరు గ్రేటర్‌కు తరలించే అవకాశాలున్నాయి. అయినా 79 మిలియన్ గ్యాలన్ల నీటి కొరత తప్పదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విలీనమైన 35 శివారు పంచాయతీలకు తాగునీటి కల్పన కలగానే మారుతుందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కాగితాల్లోనే ప్రతిపాదనలు గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల్లో మంచినీటి స్టోరేజి రిజర్వాయర్లు, పైప్‌లైన్ నెట్వర్క్ విస్తరణకు రూ.3200 కోట్లతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఆయన మరణానంతరం ఏర్పడిన ప్రభుత్వాలు ఈ పథకాలకు చిల్లిగవ్వ విదల్చకపోవడంతో ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరమితమయ్యాయి. అంతేకాదు శివారు మున్సిపాల్టీల పరిధిలో డ్రైనేజి వసతుల కల్పనకు రూ.2500 కోట్లతో 2007లోనే అంచనాలు సిద్ధమయ్యాయి. ఈ పథకాలకూ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో శివార్లు మురుగు కష్టాలతో సతమతమౌతున్నాయి. గోదావరి ఎప్పటికో.. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివార్లలోని శామీర్‌పేట్ వరకు 186 కిలోమీటర్ల మేర తాగునీటిని తరలించాల్సిన గోదావరి మంచినీటి పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. పైప్‌లైన్ పనులు వంద కిలోమీటర్ల మేర పూర్తయినా.. నీటి శుద్ధి కేంద్రాలు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం పనుల్లో 50 శాతమే పూర్తయ్యాయి. సుమారు రూ.3800 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పథకానికి ఇప్పటివరకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేదు. ఈ పథకం మొదటి దశ వచ్చే ఏడా ది చివరినాటికి పూర్తవుతుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నత్తనడకన కృష్ణా మూడోదశ నల్లగొండ జిల్లా కోదండాపూర్ నుంచి నగర శివార్లలోని సాహెబ్‌నగర్ వరకు 110 కిలోమీటర్ల మేర తాగునీటిని తరలించాల్సిన కృష్ణా మూడోదశ పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి. ఆరు నెలలుగా కేవలం పది కిలోమీటర్ల మేర మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఈ పనులను వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి పూర్తిచేసి నగరానికి 90 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తామని జలమండలి వర్గాలు చెబుతున్నా.. పనుల తీరు చూస్తే ఆ నమ్మకం కలగడం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.