తాగునీటి ఇక్కట్లకు చెక్!
భారీ స్టోరేజి రిజర్వాయర్లకు డీపీఆర్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశం
సిటీబ్యూరో: గ్రేటర్ దాహార్తిని సమూలంగా తీర్చేందుకు నగర శివార్లలోని కేశవాపూర్(రంగారెడ్డిజిల్లా), మల్కాపురం(నల్లగొండ జిల్లా)ల వద్ద భారీ స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం జలమండలి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ప్రస్తుతం జంటజలాశయాలు, సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటినిల్వలు త్వరితంగా అడుగంటుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా వీటి నిర్మాణం అత్యవసరమని సీఎం స్పష్టంచేసినట్లు తెలిసింది. కాగా కేశవాపూర్ రిజర్వాయర్‌కు మెదక్‌జిల్లా మల్లన్నసాగర్ లేదా పాముల పర్తి రిజర్వాయర్ల నుంచి గోదావరి జలాలను తరలించాలని, మల్కాపురం రిజర్వాయర్‌కు డిండి ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణా జలాలను తరలించాలని సూచించినట్లు సమాచారం.
రిజర్వాయర్లకు రూట్‌మ్యాప్ ఇదే..
కరీంనగర్ జిల్లా కాలేశ్వరం-మిడ్‌మానేరు-కొమురెల్లిమల్లన్న సాగర్(మెదక్) మీదుగా కేశవాపూర్‌కు నీటిని తరలించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నూతనంగా నిర్మించ తలపెట్టిన కొమురెల్లి మల్లన్న సాగర్(కుక్నూరుపల్లి-మెదక్)లో సుమారు 50 టీఎంసీల మేర గోదావరి జలాలను నింపడం ద్వారా అక్కడి నుంచి 42 కి.మీ దూరంలో ఉన్న కేశవాపూర్ రిజర్వాయర్‌కు 25 కిలోమీటర్ల మేర గ్రావి టీ(భూమ్యాకర్షణశక్తి), మరో 17 కి.మీ మార్గంలో పంపింగ్ ద్వారా నీటిని తరలించి నింపవచ్చని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇక పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా డిండి (నల్లగొండ జిల్లా)కి అక్కడి నుంచి మల్కాపురం(నల్లగొండ) వరకు భారీ పైప్‌లైన్ ఏర్పాటు చేసి ఈ స్టోరేజి రిజర్వాయర్‌లో 20 టీఎంసీల కృష్ణా జలాలను నింపే అవకాశం ఉంటుందని జలమండలి అధికారులు తెలిపారు.
రూ.1500 కోట్లతో దేవులమ్మనాగారం రిజర్వాయర్..
నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపూర్ సరిహద్దుల్లో రూ.1500 కోట్ల అంచనా వ్యయంతో భారీ స్టోరేజి రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన రెండువేల ఎకరాల మేర ప్రభుత్వ, అటవీ, అసైన్డ్‌భూములు అందుబాటులో ఉన్నాయి. ఈ జలాశయాన్ని కాంక్రీటుతో భూమట్టానికి 70-80మీటర్ల ఎత్తులో నిర్మిస్తారు. ఈ జలాశయంలో పాలమూరు ఎత్తిపోతల, డిండి పథకం ద్వారా కొంత మార్గం లో పంపింగ్, మరి కొంత మార్గంలో గ్రావిటీ ద్వారా 20 టీఎంసీల జలాలను తరలించి నింపనున్నారు. వర్షాకాలం లో నీటిలభ్యత అధికంగా ఉన్నప్పుడే ఈ భారీ జలాశయాన్ని పూర్తిస్థాయిలో నింపే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
రూ.1200 కోట్లతో కేశవాపురం రిజర్వాయర్ ..
రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం కేశవాపురం వద్ద రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో 15 టీఎంసీల గోదావరి జలాల నిల్వకు అవసరమైన భారీ స్టోరేజి రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన 3600 ఎకరాల మేర ప్రభుత్వ, అటవీ భూములు అందుబాటులో ఉన్నట్లు క్షేత్రస్థాయి నివేదికలో పేర్కొన్నారు. ఈ జలాశయాన్ని భూమట్టం నుంచి 60 మీటర్ల ఎత్తులో కాంక్రీట్ డ్యామ్ నిర్మించనున్నారు. ఈ జలాశయంలో గోదావరి మంచినీటి పథకం మొదటి, రెండు, మూడో దశల్లో తరలించనున్న నీటితో ఈ జలాశయాన్ని నింపే అవకాశం ఉంటుందని, గోదావరి నదిలో సమృద్ధిగా వరద ప్రవాహం ఉన్నప్పుడే ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి జలకళ సంతరించుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.