సికింద్రాబాద్ అభివృద్ధికి రూ.300 కోట్లు
మంత్రి పద్మారావు
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్, కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రూ.300 కోట్ల అంచనా వ్యయంతో మంచినీటి పైప్‌లైన్ల విస్తరణ, స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం, డ్రైనేజీ వంటి వసతులు కల్పిస్తామని ఆబ్కారీశాఖమంత్రి పద్మారావు తెలిపారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో జలమండలి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
గతంలో ఈప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించి సిద్ధంచేసిన మాస్టర్‌ప్లాన్‌ను సమగ్రంగా అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా మారేడ్‌పల్లి, తార్నాక, లాలాపేట్ ప్రాంతాల్లో భారీ మంచినీటి స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణానికి అంచనాలు సిద్ధంచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
సీతాఫల్‌మండి ప్రాంతంలో స్టోరేజి రిజర్వాయర్‌కు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. కంటోన్మెంట్ పరిధిలో తాగునీరు, డ్రైనేజి వసతుల కల్పనపై నెలకొన్న వివాదాలను త్వరితంగా పరిష్కరించాలన్నారు. సికింద్రాబాద్ పరిధిలో మురుగునీటి పారుదల వ్యవస్థను ఆధునికీకరించేందుకు భారీ ట్రంక్‌మెయిన్స్, లేటరల్స్ నిర్మించాలని సూచించారు. అడ్డగుట్ట, మారేడ్‌పల్లి, లాలాపేట్, తార్నాక పరిధిలోని అన్ని కాలనీలు, బస్తీల్లో మంచినీరు, డ్రైనేజీ వసతులు కల్పించాలన్నారు.
మూడోదశపై సమీక్ష
కృష్ణా మూడోదశ ప్రాజెక్టును త్వరితంగా పూర్తిచేసి, నగరానికి అదనంగా 90 మిలియన్ గ్యాలన్ల కృష్ణాజలాలను తరలించి నగరం నలుమూలలకు సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జలమండలి ఆపరేషన్స్ విభాగం డెరైక్టర్ రామేశ్వర్‌రావు, జీఎం ఆనంద్‌స్వరూప్, డీజీఎం హర్నాకర్ తదితరులు పాల్గొన్నారు.